Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Gandharva gayakudu - sree ghantasala venkateswara rao

ఈ సంచికలో >> శీర్షికలు >>

పుస్తక సమీక్ష - సీ ఎస్ రావు కథలు - సిరాశ్రీ

Book Review - CS Rao Stories
పుస్తకం: సీ ఎస్ రావు కథలు (రెండవ సంపుటి)
రచన: సీ ఎస్ రావు
వెల: 75/-
ప్రచురణ: విశాలాంధ్ర
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు

16 వ ఏటనే "అగ్నిపర్వతం" అనే నవల రాసి సాహిత్యవేత్తల తలలు తిప్పి తన వంక చూసేలా చేసుకోవడం, 22 వ ఏటనే తమ ఊరికి తొలి పంచాయితి బోర్డు ప్రెసిడెంట్ అయ్యి రాజకీయవేత్తల దృష్టి తనవైపుకు తిప్పుకోవడం రచయిత సీ ఎస్ రావు జీవితంలో జరిగిన తొలి నాటి ఘట్టాలు. ఆనాటి నుంచి నేటి వరకు...అంటే సుమారు 63 సంవత్సరాలుగా రచనా సేద్యం చేస్తూ 18 నవలలు, 80 కథలు, 25 నాటికలు, 25 నాటకాలు, 15 టీ వీ సీరియల్స్, 10 సినిమాలు రాసారు.

చిరంజీవి తొలి చిత్రం "ప్రాణం ఖరీదు" కథా, సంభాషణల సృష్టి వీరిదే. అలాగే జాతీయ అవార్డు పొందిన "ఊరుమ్మడి బథుకులు" చిత్ర రచనా వీరిదే.

బాల్యం, యౌవనం గ్రామీణ నేపద్యంలో సాగడంతో వీరి రచనల్లో మట్టి వాసన, పల్లె జీవనం గుబాళిస్తుంటాయి. మోతుబరుల బరితెగింపులు, కూలీల తిరుగుబాటు మొదలైన ఇతివృత్తాలు హృదయాన్ని ద్రవించే రీతిలో వీరి రచనలు ఉంటాయి.

గత పుష్కర కాలంగా వీరి రచనలు విరివిగా చదువుతున్నాను. తాజాగా ఈ కొత్త పుస్తకాన్ని చూసాను. ఇందులో మొత్తం 15 కథలున్నాయి. కొన్నేళ్లుగా వేరు వేరు పత్రికల్లో అచ్చయ్యి జనం గుండెలు కదిపిన ఈ కథలు ఇప్పుడు ఒక కథా గుచ్ఛంగా మన ముందుకొచ్చాయి.

"నీడలేని దేవుడు" ఈ సంపుటిలోని మొదటి కథ. ఒక శిల్పి, ఒక ఊరు, ఒక దేవుడు...ఈ మూడు వస్తువులచుట్టూ తిరిగే కథ పాఠకుడిని పరిగెట్టిస్తుంది. మనసుని పిండుతుంది. దైవం మౌనంగా ఇచ్చిన సమాధానంతో కథ ముగియడం కేవలం కొసమెరుపు కాదు, అదొక పిడుగుపాటు. ముగింపుతో కొట్టే ఆ చివరి మేకు ఈ కథను పాఠకుల మెదళ్ల మొదళ్లనుంచి బయటికి పోకుండా బందీ చేస్తుంది. ఈ గుణం ఒక్క ఈ కథలోనే కాదు, రావుగారి రచనలు చాలావాటిల్లో కనిపిస్తుంది.

"పరదా" కథ భావోద్వేగాల మధ్య, కట్టుబాట్ల మధ్య నలిగిన ముగ్గురి కథ. ఎవరి తప్పు వల్ల కథకి ఆ ముగింపు వచ్చిందా అని పాఠకుణ్ని ఆలొచనలో పడేస్తుంది.

"గుర్రం ఓడిపోయింది"- ఒక సగటు ఆశాజీవి(!) కథ. అవసరం మనిషిలో ఆశను ఎలా రేపుతుంది? ఆ ఆశ అతన్ని ఎలా మింగుతుంది..? అనేవి ఈ కథలోని అంశాలు. ఈ కథ రాసి నేటికి 40 ఏళ్లైనా ఇప్పటికీ వర్తిస్తుంది.

"కుసుమ యజ్ఞం" గుండెను పిండి ఆరేసే కథ. గోదావరి జిల్లా నేపధ్యంలో సాగిన జీవితంలాంటి కథ. ఇందులోని పాత్రలు, మరీ ముఖ్యంగా సూర్జాన్ కళ్ల ముందున్నట్టే ఉంటారు. కథ పూర్తయ్యే సరికి ఒకసారి సూర్జాన్ కనిపిస్తే బాగుండు.. దండం పెట్టాలనిపిస్తుంది పాఠకుడికి. ఇది కథ అని తెలుసుకుని, కథలోంచి బయటికి రావడానికి సమయం పడుతుంది.

"మనుషుల్లో దేవుడు"- విధ్యుక్త ధర్మంలో ఎందరికో ప్రాణాపాయం తప్పించి తన ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ కథ. పరమవీరచక్ర సైనికులకేనా? ఇటువంటి వీరుల సంగతేంటి?... అనిపిస్తుంది.

"ఆయన" కథ నిజానికి కథకాదు. కథ లాంటి ఒక అనుభవం. రచయిత అనుభవాన్నే ఒక కథగా మలచారు. ఆ కథలో హీరో ఎవరో చివరికి కానీ తెలీదు. ఆ ప్రముఖుడెవరో తెలిసే సరికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చదివి తీరాలి.

"నమ్మకం" కథ కూడ అలాంటిదే. స్వానుభవంలోంచి పుట్టిందే.

"మళ్లీ ఎప్పుడొస్తారు" కథ ఈ రచయిత చేతిలోనే నాటకంగా మారి ఉత్తమ నాటక రచనగా నంది అవార్డును కూడా గెలుచుకుంది. పాత్రల్లోని మెచ్యూరిటీ ఈ కథకు ఆయువుపట్టు.

ఇలా ఈ సంపుటిలో ప్రతి కథకి ఒక విశేషం ఉంది. కాలక్షేపానికని చదివినా ఈ కథలు చాలా కాలం వెంటాడుతాయి.

సీ ఎస్ రావు గారి జననం 20-12-1935. అంటే నేడు వీరి జన్మదినం. గతవారమే ఈ సంపుటి నేను చూడడం, సరిగ్గా ఇదే రోజు ఈ సమీక్ష రాయడం యాదృచ్ఛికం.

-సిరాశ్రీ. 
మరిన్ని శీర్షికలు
weekly horoscope December 20 - December 26