Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-4 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

హీరోగా వుంటే టెన్షన్లు తప్పవు

Interview with karthi

చేసినవి అరడజనుకు పైగా సినిమాలే అయినా, తమిళ ప్రేక్షకులతో సమానంగా తెలుగువారికీ పరిచయమైపోయిన హీరో కార్తీ. అచ్చంగా మన మధ్య తిరిగే కుర్రాళ్ల మాదిరిగానే వుంటూ, అలాంటి పాత్రలే వేస్తూ,యువ ప్రేక్షకుల అభిమానం సంపాదించిన నటుడు. తాజగా బిరియాని సినిమాతో మరోసారి మన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరోజ లాంటి వైవిధ్యమైన సినిమా అందించిన వెంకట్ ప్రభు దీని దర్శకుడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన ఆయనతో 'గోతెలుగు' ఇంటర్వ్యూ.

హాయ్... ఎలా వున్నారు?
- బాగున్నాను.

తెలుగు బాగా ఇంప్రూవ్ చేసినట్లున్నారు.
- కొంచెం బాగా. నా డబ్బింగ్ నేనే చెప్పుకునేంతగా.

ఇప్పుడు రెండు భాషల హీరో అయిపోయారు. కథల ఎంపిక, సినిమా షూటింగ్ లు, ప్రమోషన్ లు, ఫలితాలపై అంచనాలు, ఇలా టెన్షన్లు బాగా పెరిగిపోయాయనుకుంటాను.
- తప్పదు. సినిమా అంటే రెండు వందల మంది పని. వారిలో ఒకరిగా వుంటే ఓకె. కానీ మనపై సినిమా ఆధారపడి వుంటుంది. కీలకం అని అనుకున్నపుడు, మనం ఓ స్థాయికి చేరుకున్నపుడు ఈ టెన్షన్లు తప్పవు.

మరి వాటి నుంచి బయటపడడానికి ఏం చేస్తారు.
- టెన్షన్లు తప్పవు. ఇంటికి వస్తూనే వాటిని మర్చిపోవాలి.అంటే స్విచాఫ్ చేసేయడమే. మొబైల్ ఆఫ్ చేసినట్లు.

సినిమా స్క్రిప్ట్ అంగీకరించే ముందు ఈ విషయాలన్నీ దృష్టి వుంచుకుంటారా? లేక కేవలం హీరోయిజమేనా?
- మంచి స్ర్కిప్ట్ అయి వుండాలి. నాకే కాదు, అందరికీ నచ్చుతుందని అనిపించాలి. అంటే ఓ ప్రేక్షకుడిగా ఆలోచించాలి. ఆ తరువాతే మిగిలినవి ఏమైనా.

లైన్ విని ఓకె అంటారా. బౌండ్ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తారా?
- బౌండ్ స్క్రిప్ట్ లేకుండా నేను ఏ సినిమా ఒప్పకోను. రెండున్నర గంటల డైలాగ్ వెర్షన్ తో సహా వింటేనే ఫీల్ తెలుస్తుంది.

మీరు విన్నది, విజవలైజ్ చేసుకున్నది స్క్రీన్ పైకి వస్తుందో లేదో గమనిస్తుంటారా.
- తప్పకుండా. అయితే ఒక్కోసారి షూటింగ్ టైమ్ లో తెలియదు. తీరా పూర్తయిన తరువాత తెలిసినా, ఏమీ చేయలేం.

శకుని సినిమా అలాంటి వాటిల్లో ఒకటా?
- అవును. నిజానికి ఆ సినిమా మంచి లైన్. కానీ కొత్త దర్శకుడు సరిగా స్క్రీన్ పైకి తేలేకపోయాడు.

రాను రాను ప్రేక్షకుల్లో విభజన పెరుగుతోంది. మల్టీఫ్లక్స్ అనే కొత్త తరగతి వచ్చింది. బిసి సెంటర్లు వుండనే వున్నాయి. పైగా మీరు తెలుగు తమిళంలో చేస్తున్నారు. తమిళ ప్రేక్షకుల అభిరుచి భిన్నంగా వుంటుంది.
- ఇన్ని బుర్రకు ఎక్కించుకోకూడదండీ. అలా అయితే సబ్జెక్ట్ ఎంపిక చేయలేం. నా మటుకు నేను స్క్రిప్ట్ ఎంపికకు రెండు విషయాలు కీలకంగా భావిస్తాను. ఒకటి ఫైట్లు, రెండు సంగీతం. ఈ రెండింటికీ బాగా చోటుండాలి. ఎందుకంటే ఈ రెండూ యూనివర్సల్ విషయాలు. ఏ తరగతి అయినా వాటి కోసమే.

మ్యారేజ్ లైఫ్ ఎలా వుంది. వృత్తికి దానికీ సింక్ కుదిరిందా?
- ఓకె. ఎవరికైనా పెళ్లయిన తరువాత అన్నీ సెట్ అవడానికి ఒకటి రెండేళ్లు పడతాయి. పిల్లలు, వాళ్ల కోసం మన ఓపికను, ఓర్పును పెంచుకోవడం ఇవన్నీ.

అందరూ మల్టీ స్టారర్లు అంటున్నారు. మరి మీరు?
- నాకు ఇష్టం లేదండీ. అన్నయ్య సూర్య తో మాత్రం ఓ సినిమా చేయాలని వుంది. అంటే కథ అలాంటిది రావాలి. కచ్చితంగా ఇద్దరం చేయాలి అనిపించేలా.

సిక్స్ ప్యాక్ మానియా.
- అస్సలు లేదు. నాకు వచ్చే పాత్రలకు ఆ అవసరమూ లేదు. కోరి సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం అంటే గిల్టీగా వుంటుంది.

బిరియాని ఎలా వుంటుంది?
- హైదరాబాద్ బిరియానీలా టేస్ట్ గా.

కథ కు టైటిల్ సరిపోయేదేనా?
- ఓ కుర్రవాడు బిరియానీ తినడానికి వెళ్లినపుడు అనుకోకుండా జరిగిన సంఘటన, దాని పర్యవసానంగా నడిచే వ్యవహారాలు. దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్ట్ సంగతి తెలుసుగా, చాలా గ్రిప్పింగ్ గా వుంటుంది.

ఈ సినిమా కోసమే హన్సిక పది కిలోలకు పైగా బరువు తగ్గిందా?
- తగ్గింది నిజం. అయితే ఈ సినిమా కోసమే అని కాదు. హీరోయిన్ గా చాలా సినిమాలు చేయాలిగా.

ఈ సినిమా కోసం మీరు పాటపాడినట్లుంది.
- అవును. ఓ క్యాజువల్ సాంగ్. ఏదో అలా అలా.

మ్యూజిక్ లో ప్రవేశం వుందా?
- ఇంట్రస్ట్ చిన్నప్పటి నుంచి, ఎస్పీబీ సార్ ప్రభావం వుంది. ఈ పాట కూడా ఎయిటీస్ మోడల్ రాజాగారి ట్యూన్ స్టయిల్. ఇనుస్ట్రుమెంటేషన్ కొత్త.

తరువాతి సినిమా?
- ఓ వెరైటీ సినిమా చేస్తున్నాను. మున్సిపాల్టీ వార్డు స్థాయిలో, ఓ కుర్రాడి జీవితం రాజకీయాల కారణంగా ఎలా మెలికలు తిరిగింది అని. ఓ విధంగా ప్రయోగాత్మక మూవీ. నార్త్ చెన్నై కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా. క్రైం రేట్ ఎక్కువ. ఆ నేపథ్యంలో తీస్తున్నాం. పైగా రియల్ లొకేషన్లలో అక్కడే తీస్తున్నాం.

తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు?
- అందరూ అడుగుతున్నారు. కానీ మంచి సబ్జెక్ట్ దొరకాలి. చేసేద్దాం అంటే చేసేద్దాం అనుకోను నేను. ఏడేళ్ల కెరియర్ లో ఏడు సినిమాల వరకే చేయగలిగాను అందుకే. చూద్దాం మంచి సబ్జెక్ట్ దొరికితే.

గత రెండు సినిమాలు అంతగా నడవలేదు.
- ఏం చేస్తాం... అన్నీ మన చేతిలో వుండవు కదా.

ఇంకేంటి సంగతులు?
- ఇంకేముంది. బిరియానీ బాగుండాలి. మీ అందరికీ నచ్చాలి. అదే అసలు సంగతి. బై.

- కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Dhoom 3