Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ముఫ్ఫయ్ రెండవ భాగం

anubandhalu telugu serial thirty second Part

"లేరుగా?"

"వచ్చి వారం రోజులున్నాడేమో, తరువాత మరి ఏం జరిగిందో ఏమిటో తెలీదు. గోపాల్, అనంత్ శివానీలతో ఊరొదిలి వెళ్లిపోయాడు. బెజవాడలో ప్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడని, మనవడు, మనవరాలు ఏదో హోటల్లో ఉద్యోగాలు చేస్తున్నారని ఇక్కడంతా చెవులు కొరుక్కుంటున్నారు. అసలేం జరిగిందంటే ఎవరూ ఏం చెప్పలేకపోతున్నారు. ఈ విషయాలేం మీకు తెలీదా?"

"ఫోన్ చేసినా వాళ్లు చెప్పడం లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను. నేనిలా ఫోన్ చేశానని ఎవరికీ చెప్పకు. నాకిక్కడ ఏమీ తోచడం లేదు. వచ్చేద్దామనుకుంటున్నాను" అంటూ మూడు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది అన్నపూర్ణేశ్వరి.

అవతల రుక్మిణి చెప్పిన విషయాలు వినగానే - బుర్ర గిర్రున తిరిగినట్టయింది అన్నపూర్ణేశ్వరికి. తను విన్న విషయాలన్నీ కోడలికి సవివరంగా చెప్పింది. వింటూనే సత్యవతి కూడా కంగారు పడింది.

"అత్తయ్యా! ఇదంతా చూస్తే నాకేమిటో కంగారుగా ఉంది. ఏం చేద్దాం? మనం కూడా ఇండియా వెళ్లిపోదామా?" అని అడిగింది.

సమయం, సందర్భం లేకుండా - ఒక్కోసారి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతుంటాయి. అవి ఎందుకు వస్తున్నాయి, పరిష్కారం ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలో తెలీక కొందరు ఉక్కిరిబిక్కిరవుతుంటారు. ఇలాంటి వాటిలో కొన్ని స్వయంకృతాపరాధాలయితే, కొన్ని కాలం కలిసి రాని కష్టాలు అవన్నీ ఒక ఎత్తైతే ఇక ఉన్న సమస్యల నుంచి ఎలాగో నెట్టుకొస్తున్న వాళ్లకి ఉన్నట్టుండి మరో సమస్య వచ్చి పడితే ఇక వాళ్ల అవస్థ అంతా ఇంతా కాదు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆరోజు అనంతసాయి, సాయిశివానీలకు ఎదురయ్యింది.

ఎందుకో ఆరోజు ఉదయం ఆలస్యంగా లేచాడు డాక్టర్ గోపాల్. అప్పటికే అనంత్, శివానీలు డ్యూటీకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. శివానీ కాఫీ కప్పు తెచ్చి గోపాల్ కి అందించింది. ఒకప్పుడు వంట చేయడమే రాని అమ్మాయి శివానీ ఇప్పుడు ఇంట్లోనే వండుతోంది. చక్కగా కాఫీ, టీలు పెడుతోంది. చిన్న చిన్న కూరలు, వేపుళ్ళు వండగల్గుతోంది. హోటల్ తిండి తినలేకపోతున్నాను అంటూ మొదట తనే వంట ఆరంభించి క్రమంగా శివానీకి అలవాటు చేశాడు.

తండ్రికి సాయంగా కిచెన్లో అడుగుపెట్టడం మొదలుపెట్టిన శివానీకిప్పుడు కిచెన్ బాగా అలవాటైపోయింది.

"ఏమ్మా! హోటల్ కు బయలుదేరుతున్నారా" కాఫీ సిప్ చేస్తూ అడిగాడు గోపాల్.

"అవును డాడీ! టైమవుతోంది." అంది శివానీ.

"సారీరా! రాత్రి చెబుదామని మర్చిపోయాను. ఇవాళ మీరు వెళ్ళక్కర్లేదు. ఈరోజు సెలవు కావాలని, నిన్నే హోటల్ మేనేజర్ని అడిగాను. ఆయన ఓ.కె. చేశారు" చెప్పాడు.

ఆశ్చర్యంగా చూసింది శివానీ. ఆ మాటలు విని తన గదిలోంచి బయటకు వచ్చాడు అనంత్.

"సెలవు దేనికి డాడీ?" అని అడిగాడు.

చెప్తానంటూ కాఫీ తాగుతూ, కాసేపు న్యూస్ పేపర్ తిరగేశాడు గోపాల్.

ఏమిటి విషయం అన్నట్లు - చెల్లెలు ముఖంలోకి చూశాడు.

తెలీదన్నట్లుగా - పెదవి విరిచింది శివానీ.

'తీరిగ్గా కాఫీ తాగి, కప్పు టీపాయ్ మీద ఉంచి, కొడుకుని, కూతుర్ని సాదరంగా చూశాడు గోపాల్.

"మీ ఇద్దర్నీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అల్లరి చిల్లరగా తిరుగుతూ మీ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని ఇంతకు ముందు బాధపడేవాడిని. కోట్లు డబ్బు పోయినందుకు కూడా నాకు బాధలేదు. మీ గురించే నా బాధ. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. చాలావరకు పద్ధతిలోకి వచ్చారు. బాధ్యతగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కన్నతండ్రిగా నా మాటమీద గౌరవం ఉంచి, మీ సంపాదనతో నన్ను పోషిస్తున్నారు. నా అవసరాలు తీర్చి, నన్ను ఆదుకున్నారు. ఏ తండ్రికైనా ఇంతకన్నా ఏం కావాలి? అంటూ గర్వంగా చూశాడు.

శివానీ వచ్చి తండ్రి పక్కన కూర్చుంది.

"ప్లీజ్ డాడీ! అవన్నీ ఇప్పుడెందుకు? మీరు సంతోషంగా ఉన్నారు. అదిమాకు చాలు" అంది.

"నా సంతోషానికి మరో కారణం కూడా ఉంది తల్లీ! అమెరికాలో ఉన్నంతకాలం మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు ఇవేమీ మీకు నచ్చేవి కావు. ఇప్పుడు చూశావా? చీర కట్టడంలో నీ తర్వాతే ఎవరైనా... అన్నంత చక్కగా నువ్వే చీర కట్టుకోగల్గుతున్నావు. నిన్నిలా చీరా జాకెట్ లో చూస్తే మీ అమ్మ, నాయనమ్మ ఎంత సంతోషిస్తారో తెలుసా?" అన్నాడు ఆనందంగా.

"నేను మమ్మీతో మాట్లాడాలి. ఓ సారి ఫోన్ చెయ్ డాడీ... ప్లీజ్!" ఆర్తిగా చూసింది శివానీ.

"చేద్దాం! నే చెప్తాగా... అందుకు ఇంకా కొంత టైముంది గానీ మనమొక ముఖ్యమైన పార్టీకి వెళ్లాలి. నువ్వు మొన్న నేను తెచ్చిన పట్టుచీర, జాకెట్టుతో సింపుల్ గా రెడీ అవ్వు. అరే అనంత్ నువ్వు కూడా. ఇలా హోటల్ యూనిఫాం డ్రెస్ లో కాకుండా చక్కగా రెడీ కా... ఈలోపల నేను స్నానం చేసి, రెడీ అయ్యి వచ్చేస్తాను" అంటూ లేచాడాయన.

"నిజంగానే ఇవాళ లీవ్ అడిగారా మాకు?" అనుమానంగా అడిగాడు.

డౌటైతే మీ మేనేజర్ కి ఫోన్ చేసి అడుగు. తన గదిలోకి పోతూ చెప్పాడాయన.

ఇంతకీ పార్టీ ఎక్కడో చెప్పలేదు మీరు? వెనక నుంచి అరిచింది శివానీ.

"వచ్చి చెప్తాగా. మీరు త్వరగా రెడీ అవండి" అంటూ లోపలకెళ్లి తలుపు మూసుకున్నాడాయన.

"అన్నయ్యా! ఏమిటిదంతా? నాకేం అర్ధం కావడం లేదు" అంది శివానీ అనంత్ ని చూస్తూ.

"బాగుంది. నాకు మాత్రం అర్ధమయ్యిందేమిటి?"

"నాకో డౌటు"

"ఏమిటది?"

"మనం హోటల్ కెళ్లి లీవ్ పెడుతున్నట్టు డాడీకి తెలిసిపోయుంటుందా?"

"ఎలా తెలుస్తుంది? చాన్సేలేదు. ఇప్పుడేదో పార్టీ అంటున్నారు. మనం మధ్యాహ్నం బావతో లంచ్ చేసి సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాం. పన్నెండు లోపలే నవీన్, మహేశ్వరిలు వచ్చేస్తారు... ఇప్పుడేం చేద్దాం?"

"కంగారుపడకు. నేను నవీన్ కు ఫోన్ చేసి రావొద్దని చెప్తాను. నువ్వు త్వరగా రెడీకా. నేను కిందకెళ్ళి ఫోన్ చేసి ఇప్పుడే వచ్చేస్తాను" అంటూ వేగంగా బయటకెళ్లిపోయాడు అనంత్.

శివానీ బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్లి తలుపుమూసుకుంది.

సుమారు నలభై నిమిషాల తరువాత గోపాల్ గది తలుపులు తెరుచుకున్నాయి. నీట్ గా షేవ్ చేసుకొని, చక్కగా డ్రెస్ చేసుకొని, హుందాగా బయటకొస్తున్న తండ్రిని చూస్తుంటే ఎప్పటి డాక్టర్ గోపాల్ ను చూస్తున్నట్టుగా ఉంది ఇద్దరికీ. తండ్రిని చూస్తూ లేచి నిలబడ్డారు.

"డాడీ! మిమ్మల్ని ఎప్పటిలా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది" అంది ఉత్సాహంగా శివానీ.

"మీ ఆనందమే నా ఆనందం. ఈ పట్టు చీరలో అచ్చం పెళ్ళికూతురిలా ఉన్నావు తల్లీ! నా దిష్టే తగిలేలా ఉంది." అంటూ ఆప్యాయంగా కూతురి నుదుట ముద్దాడాడు గోపాల్.

"డాడీ! ఇంతకీ పార్టీ ఎక్కడ? ఎప్పుడు వెళ్ళాలి?" అడిగాడు అనంత్.

"చెప్తాను కూర్చోండి" అంటూ సోఫాలో కూర్చున్నాడు.

ఎదురుగా సోఫాలో అనంత్, శివానీలు కూర్చుని తండ్రి ఏం చెప్తాడోనని ఆసక్తిగా చూసారు.

గోపాల్ పెద్దగా నిట్టూర్చాడు.

"మనం గన్నవరం వెళుతున్నాం. ఎ.సి. కార్ బుక్ చేసాను. కాసేపట్లో వస్తుంది" చెప్పాడు.

ఉలిక్కిపడ్డాడు అనంత్.

"మైగాడ్! డాడీ ఏ.సి. కారంటే వెళ్లిరావడానికి ఎంతవుతుంది? ఇప్పుడంత అవసరమా? పైగా నెలాఖరు... చేతిలో డబ్బు కూడా లేదు." అని గుర్తు చేసాడు.

"మీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు. అందుకే నిన్న లీవ్ అడిగినప్పుడే మీ మేనేజర్  వద్ద ఐదు వేలు అడ్వాన్స్ గా తీసుకున్నాను. నో ప్రాబ్లమ్" అన్నాడు ధైర్యం చెప్తున్నట్టు.

జీతం డబ్బుల్లో ఐదువేలకు కొత్త పడిందని తెలియగానే అన్నాచెల్లెళ్ళు ఇద్దరికీ ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. అసలే ఎంత కష్టపడ్డా అంతంతమాత్రంగానే సరిపోతున్నాయి. ఇలా వేలకు వేలు ఖర్చు చేస్తే ఎక్కడి నుంచి తేవాలి.

"ఏమిట్రా డబ్బు తగలేస్తున్నానని తిట్టుకుంటున్నారా?" మనసులో మాట గ్రహించినట్టు సూటిగా అడిగాడు గోపాల్.

"అదే లేదు డాడీ! కానీ... ఇంతగా దుబారా చేసి మనమిప్పుడు గన్నవరం వెళ్లాలా?" నచ్చజెప్తున్నట్టు అడిగాడు అనంత్.

"దుబారా... ఇది దుబారాగా కనిపిస్తుందా మీకు? ఆశ్చర్యంగా ఉంది. మన స్టేటస్ కు తగ్గట్టు ఏ.సి. కారులో పార్టీకి వెళ్లడం దుబారా అయితే మరి నా డబ్బు... నా కష్టార్జితం... లక్షలకు లక్షలు మీరు తగలేశారు. దాన్ని ఏమనాలి? బెజవాడ, హైదరాబాద్, చెన్నై ఇలా ఊళ్లమ్మట తిరిగి ఎన్నో లక్షలు పాడు చేశారు. అప్పుడు దుబారా అన్పించలేదా? మీరు ఇండియా వచ్చిన ఈ మూడు మాసాల్లోనూ సుమారు పదిహేను లక్షలు హారతి కర్పూరంలా హరించుకుపోయింది. అలా ఖర్చు పెట్టినప్పుడు మీకు బాధన్పించలేదు. ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు కాబట్టి నా ఖర్చులు చూస్తే మీకు దుబారా అన్పిస్తోంది. అంతేనా?" కోపంగా ఆయన నిలదీస్తుంటే సమాధానం తెలియక అన్నాచెల్లెళ్లు ఇద్దరూ దిక్కులు చూస్తూ నిలబడిపోయారు.

"అయినా ఇది మీ తప్పు కాదు. మిమ్మల్ని నేను ఎంతబాగా చూసుకున్నానో మీరు కూడా నన్ను చూస్తారని ఆశపడ్డం నా తప్పు. ఓ.కె. ప్రయాణం కాన్సిల్ చేస్తాను మీరు డ్యూటీకి వెళ్లిపోండి" అన్నాడు తనే.

"సారీ డాడీ! డబ్బులేదు కాబట్టి అడిగాను. అలా అడిగి ఉండకూడదు. సారీ... మీరు ప్రయాణం మానక్కర్లేదు. మనం ఏ.సి. కార్లోనే వెళదాం" అన్నాడు చివరకు.

శివానీకి ఇదంతా నచ్చలేదు. అసలు గన్నవరం ప్రయాణం ఏమిటి? ఈ గొడవలేమిటి? అర్ధం కాలేదు. పైగా తండ్రి తమనుంచి ఏదో దాస్తున్నాడనే అనుమానం క్రమంగా బలపడసాగింది. అందుకే ధైర్యం చేసి "ఓ.కె. డాడీ! కార్ రాగానే బయల్దేరతాం. కానీ నాకు తెలిసి గన్నవరంలో మనకు ఎవరూ ఉన్నట్టు వినలేదు. పైగా పార్టీ అంటున్నారు. ఆ
వివరాలన్నా అడగవచ్చా? నోర్మూసుకుని మీతో రావాలా?" అంటూ అడిగింది.

"వెల్... మీలో సొంత ఆలోచనలు, స్వతంత్ర భావాలు కలగడం మంచిదే. అయితే వాటన్నింటికన్నా ముందు పెద్దవాళ్లు ఏం చేసినా అది మీ మంచి కోసమే అని గుర్తించుకోవడం మంచిది. మీతో విషయం చెప్పకుండా ఎక్కడకో తీసుకుపోతున్నాననే భయం మీకక్కర్లేదు. నోరు మూసుకుని నాతో రమ్మనడానికి నేను నియంతను కాదు.

గన్నవరంలో ఉంటున్న డాక్టర్ నిర్మలాదేవి, డాక్టర్ రాజేష్ లు నా ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. డిగ్రీ వరకు మేమంతా కలిసే చదువుకున్నాం. వాళ్ళిద్దరిదీ లవ్ మ్యారేజ్. మెడిసిన్ పూర్తి కాగానే పెళ్లి చేసుకున్నారు. వాళ్లకిద్దరు పిల్లలు. కొడుకు, కూతురూ అమెరికాలో చదువు పూర్తి చేసుకొని, ఇండియా వచ్చిన సందర్భంగా వాళ్ల ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నారు.

నిజానికి మూడ్రోజుల క్రితం డాక్టర్ నిర్మలాదేవి కన్పించి చెప్పే వరకూ ఈ విషయాలు అంటే వాళ్ల పిల్లలు అమెరికాలో చదువుతున్న సంగతి నాకు తెలీదు. మాటల సందర్భంలో మీ ప్రస్తావన వచ్చింది. మీ గురించి చాలా ఆసక్తి కనబర్చింది. పార్టీకి ఆహ్వానించారు.

మిమ్మల్ని తీసుకెళ్ళడంలో ప్రధాన ఉద్దేశం ఏమంటే... సంబంధం కలుపుకోవడం. అర్ధమైందిగా? ఒకరినొకరు చూసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళబ్బాయికి శివానీని, వాళ్లమ్మాయికి అనంత్ నిచ్చి, పెళ్లి చేద్దామని. ఇది నా ఉద్దేశమే కాదు. ఖాయం అయిపోయినట్టే. వారం రోజుల్లోనే ముహూర్తాలు చూసుకొని అమెరికా నించి మీ మమ్మీని, నాయనమ్మను రమ్మంటాను. మీ పెళ్లిల్లు కాగానే అందరం అమెరికా వెళ్లిపోతాం. ఇది నా నిర్ణయం." అంటూ మనసులో మాట బయటపెట్టాడు గోపాల్.

"అన్యాయం... డాడీ...! ఇది చాలా అన్యాయం" అని అరిచాడు అనంత్.

"అవును మీ చెల్లెలి మీది కోపంతో మా మీద ఇంత దారుణంగా కక్ష తీర్చుకుంటారనుకోలేదు. నేను బావను ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ జరిగితే నవీన్ బావతోనే..." అంది
ఉబుకుతున్న కన్నీటిని అణుచుకుంటూ శివానీ.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
duradrustapu dongalu