Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-5 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

ఉయ్యాల జంపాల - చిత్ర సమీక్ష

Movie Review - Uyyala Jampala

రివ్యూ: ఉయ్యాల జంపాల
తారాగణం: రాజ్‌ తరుణ్‌, అవికా గోర్‌, పునర్నవి, గంగాధర్‌, అనితా చౌదరి తదితరులు
ఛాయాగ్రహణం: డి.బి. విశ్వా
సంగీతం: ఎం.ఆర్‌. సన్నీ
నిర్మాణం: అన్నపూర్ణా స్టూడియోస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాతలు: నాగార్జున, రామ్‌మోహన్‌, దగ్గుబాటి సురేష్‌
దర్శకత్వం: విరించి వర్మ
విడుదల తేదీ: 25 డిసెంబర్‌ 2013

క్లుప్తంగా చెప్పాలంటే:
ఒకర్ని ఒకరు ఆటపట్టించుకునే బావా మరదళ్ళు సూరి (తరుణ్‌), ఉమా (అవిక). మరదలి మీద ప్రాక్టికల్‌ జోక్స్‌ వేస్తుంటాడు సూరి. బావని ఆటపట్టించడంలో తక్కువేమీ కాదు మరదలు ఉమా. ఇద్దరి మధ్యా గిల్లికజ్జాలు నడుస్తుంటాయి. ఉమ, పార్దుతో ప్రేమలో పడ్తుంది. అయితే పార్దు మంచోడు కాదని తెలుస్తుంది ఉమకి. ఉమ కష్టంతో ఉన్నప్పుడు బావ ఆమెను ఆదుకుంటాడు. అప్పుడు బావపై  ప్రేమ కలుగుతుంది ఉమకి. సూరి మాత్రం తన మరదలిపై తనకున్న ప్రేమను తెలుసుకోడు. కథ కంచికి చేరాలంటే బావా, మరదలు ఒక్కటవ్వాల్సిందే. మరి, ఉమపై ఉన్న ప్రేమను సూరి తెలుసుకుంటాడా? ఇద్దరూ ఒక్కటయ్యారా? అనేది తెరపై చూడాల్సిన అంశం.

మొత్తంగా చెప్పాలంటే:
పల్లెటూరి కథ కావడంతో నటీనటులే సినిమాకి కీలకం. హీరో పాత్రలో రాజ్‌ తరుణ్‌ ఒదిగిపోయాడు. హీరో అనడం కన్నా, సూరి పాత్రలో జీవించేయడానికి తనవంతు కృషి చేశాడు. బుల్లితెరపై బాల నటి అయిన అవిక, ఉమ పాత్రలో మంచి నటనా ప్రతిభను ప్రదర్శించింది. నటిగా ఆమెకూ మంచి మార్కులు పడ్తాయి. బావ, మరదలు మధ్య వుండే చిలిపి తగాదాలకు రాజ్‌తరుణ్‌, అవికల ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ చక్కగా అతికిపోయి, సినిమాకి అందం తెచ్చింది. పునర్నవికి మంచి పాత్ర దక్కింది. పాత్రకు తగిన న్యాయం చేసింది కూడా. అనితా చౌదరి తన పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రధారులంతా కథకు అవసరమైన మేర తమ ప్రతిభను ప్రదర్శించారు.
మంచి కథ, ఆ కథ చెప్పిన విధానం అన్నీ సరిగ్గా సరిపోతే మంచి సినిమా వస్తుంది. అదే జరిగింది ఈ సినిమా విషయంలో. నటీనటులు, టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ అన్నీ దర్శకుడికి సరిగ్గా సహకరించడంతో దర్శకుడి పని సులువైంది. దర్శకుడూ చాలా చాకచక్యంగా సినిమాని తెరకెక్కించాడు. స్క్రీన్‌ప్లే బావుంది. మాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. మూడు పాటలు గుర్తుండిపోతాయి. సినిమాటోగ్రఫీ సినిమా కథకు తగ్గట్టుగా వుంది. నేటివిటీకి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ తదితర విభాగాలు వ్యవహరించాయి. 
ఇలాంటి కథలు ఇదివరకు చాలా వచ్చినా, బావామరదళ్ళ మధ్య ప్రేమాయణం అంటే ఎప్పుడూ ఆసక్తి వుంటుంది ఆడియన్స్‌లో. కొంచెం కొత్తగా చూపించగలిగితే, ఎంటర్‌టైన్‌మెంట్‌ తగుపాళ్ళలో జోడిరచగలిగితే విజయం సాధించినట్టే. ఆ పాయింట్‌ దర్శకుడు బాగా పట్టుకున్నాడు. హడావిడి జోలికి వెళ్ళకపోవడం ప్లస్‌ పాయింట్‌. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. సెకెండాఫ్‌ కొంచెం మందగించినా, ఓవరాల్‌గా మంచి ఫీల్‌ మిగుల్చుతుంది థియేటర్ల నుంచి బయటకొచ్చే ప్రేక్షకులకి. బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరు విజయం సాధించే అవకాశం వుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే: క్లాస్‌ ప్రేక్షకులు మెచ్చే అందమైన పల్లెటూరి కథ

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - D for Dopidi