Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగమ్మాయిలా పుట్టాల‌నిపిస్తోంది - అవికా గౌర్‌

Interview with Avika Gor

ఆనంది.. ఈ పేరు వింటే - ఇంటిల్లిపాదీ టీవీల‌కు అతుక్కుపోతారు. ఈ పాత్ర‌ ఎప్పుడొస్తుందా..?  అని క‌ళ్ల‌కు కాయ‌లుకాచేలా ఎదురుచూస్తారు. ఆనంది న‌వ్వితే.. న‌వ్వుతారు. ఏడిస్తే.. క‌న్నీళ్లుపెడ‌తారు. ఆమె క‌ష్టసుఖాల్లో పాలు పంచుకొంటారు. మ‌నింటి అమ్మాయిలానే చూసుకొంటారు. చిన్నారి పెళ్లి కూతురులో ఆనంది పాత్ర‌లో ఇంత‌టి మాయాజాలం చేసిన న‌టి... ఆవిక గౌర్‌!  ఇప్పుడు ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు తెర‌పై అడుగుపెట్టింది. తొలి చూపులోనే ఆక‌ట్టుకొంటోంది. ఈ సినిమాలో ఉమాదేవిగా చిర‌కాలం గుర్తిండిపోయే న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. ప‌ద‌హారేళ్ల ముంబై అమ్మాయి... ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయి అయిపోయింది. ఈ అందాల మ‌ర‌ద‌లు పిల్లతో చిన్న చిట్ చాట్‌..!

* హాయ్ ఆనంది..
- హాయ్‌..!

* ఎలా ఉంది తెలుగు ప‌రిశ్ర‌మ‌..?
- చాలా బాగుంది. నేనేం మాట వ‌ర‌స‌కు అన‌డం లేదు. నిజంగానే న‌న్ను చిన్న‌పిల్ల‌ని చూసుకొన్న‌ట్టు చూసుకొన్నారు. సెట్లో నాకిచ్చే మర్యాద చూస్తుంటే నాకే ఆశ్చ‌ర్యం వేసింది.

* సీరియ‌ల్‌లో న‌టించ‌డం వేరు, సినిమాల్లో న‌టించ‌డం వేరు.. నిజ‌మేనా..?
- అవును. కాక‌పోతే సినిమాల్లో న‌టించ‌డ‌మే తేలిక అనిపించింది. ఎందుకంటే సీరియ‌ల్‌లో డిటైల్స్ చాలా ముఖ్యం. ఎక్స్ ప్రెష‌న్స్ కీల‌కం. డైలాగు లేని చోట హావ‌భావాల‌తో మెప్పించాలి. రోజూ మ‌న‌ల్నే చూస్తుంటారు కాబ‌ట్టి మ‌నం చిన్న‌తప్పు చేసినా త‌ప్పించుకోలేం. సినిమాలో మాత్రం ఆ ప్ర‌మాదం లేదు. మ‌న ఎక్స్‌ప్రెష‌న్స్ ని గ‌మ‌నించేంత స‌మ‌యం ఉండ‌దు.

* సినిమా వాతావ‌ర‌ణం ఎలా అనిపించింది?
- ఇది వ‌ర‌కు రెండు హిందీ సినిమాలు చేశా. చిన్న పాత్ర‌లే. కథానాయిక‌గా ఇదే తొలిసారి. చెప్పాను క‌దా.. సెట్లో ఎంత బాగా చూసుకొన్నారో? సొంత మ‌నుషుల మ‌ధ్య ఉన్న‌ట్టే ఉంది.

* తెలుగు భాష ఇబ్బంది అనిపించ‌లేదా..?
- ఎందుకు అనిపించ‌లేదూ..?  సెట్లో న‌న్ను చూస్తే ఓ చేతిలో తెలుగు డైలాగ్ పేపర్‌, మ‌రో చేతిలో ఇంగ్లీష్ వెర్ష‌న్‌. రెండూ చూసుకొంటూ.. అర్థాలు తెలుసుకొంటూ తెగ క‌ష్ట‌ప‌డేదాన్ని. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు విరించి వర్శ అందించిన స‌హకారం మ‌ర్చిపోలేను. ఆయ‌న‌కు ఎంత ఓపికో. ప్ర‌తీ డైలాగ్‌కీ అర్థం విడ‌మ‌ర్చి చెప్పేవారు.

* ఉమాదేవికీ నిజ జీవితంలో మీకూ పోలిక‌లేంటి..?
- అల్ల‌రి విష‌యంలో సేమ్ టూ సేమ్‌. కాక‌పోతే నాకు చ‌దువంటే చాలా ఇష్టం. ఉమాదేవి అంత మొద్దు పిల్ల‌ని కాను.

* ప‌ల్లెటూర్లో షూటింగ్ ఎలా గ‌డిచింది..?
- నన్ను అంద‌రూ గుర్తుప‌ట్టేవారు. ద‌గ్గ‌ర‌కొచ్చి.. ఫొటోలూ ఆటోగ్రాఫ్‌లూ అడిగేవారు. నాకు చాలా సంతోష‌మేసేది. అదంతా టీవీ సిరియ‌ల్స్ వ‌ల్లే. ఇప్పుడు ఉయ్యాలా జంపాలా సినిమాతో మ‌రింత మంది అభిమానులు పెరుగుతార‌నే న‌మ్మ‌కం ఉంది.

* భ‌విష్య‌త్తులో ప్ర‌యాణం ఎటువైపు?  సినిమాలా?  సీరియ‌ళ్లా..?
- టీవీ సీరియ‌ల్స్ ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌దులుకోను. ప్ర‌స్తుతం మ‌రో ధారావాహిక ఒప్పుకొన్నా. నెల‌కు ఇర‌వై రోజులు నాకు సీరియ‌ల్స్ తోనే స‌రిపోతుంది. ఉమాదేవి లాంటి పాత్ర‌లు ఎప్పుడోగానీ త‌యారుకావు. చాలా అరుదుగా మాత్ర‌మే దొరుకుతుంటాయి. అలాంటి పాత్ర‌లొచ్చిన‌ప్పుడు సినిమా గురించి ఆలోచిస్తా.

* ముంబై అమ్మాయి క‌దా.. ప‌ల్లెటూరు, ప‌రికిణీ వోణీ ఎలా అనిపించాయి..?
- సూప‌ర్బ్‌. ఈ అవ‌తారంలో అద్దంలో చూసుకొంటున్న‌ప్పుడు నేనేనా..??  అనిపించింది. మ‌రో జ‌న్మ ఉంటే తెలుగ‌మ్మాయిలా పుట్టాల‌నిపిస్తోంది. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం, అక్క‌డి మ‌నుషులు నాకు బాగా న‌చ్చారు.

* తెలుగు సినిమాలు చూస్తుంటారా..?
- నిజం చెప్పాలంటే త‌క్కువే. కానీ ఇప్ప‌టి నుంచి నా దిన‌చ‌ర్య‌లో తెలుగు సినిమాలు చూడ్డం కూడా ఓ భాగం చేస్తా.

*  కొత్త‌గా సినిమాలేమైనా ఒప్పుకొన్నారా?
- కొన్ని క‌థ‌లు విన్నాను. కానీ నా నిర్ణ‌యం ఇంకా చెప్ప‌లేదు.

* ఎలాంటి పాత్ర‌లు చేయాల‌ని వుంది?
- నా వ‌య‌సుకు త‌గిన పాత్ర‌లు చేయాలి. నేనేం క‌థానాయిక‌ను కాదు. డాన్సులు, రొమాన్స్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబ‌ట్టి అలాంటి వాటికి దూరంగానే ఉంటా. ఆనంది పాత్ర‌లో అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యా. అంద‌రూ సొంత ఇంటి అమ్మాయిలా చూసుకొంటారు. వారికి నచ్చే పాత్ర‌లే చేస్తా.

* ఒకే ఆల్ ది బెస్ట్..
- థ్యాంక్యూ.

- కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
Patashala-5 by bhaskarabhatla