Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda biography

వివేకానంద స్వామి ఉపదేశాలు
మనదేశానికి సాహస పరాక్రమ సంపన్నులైన శూరులు కావలసివున్నారు. కనుక మీరంతా శూరులుగా తయారుకావాలి. మహా పర్వతానికి కల స్థైర్యంతో నిలవండి. సత్యానికి ఎల్లప్పుడూ విజయం లభించితీరగలదు. భారతావనికిప్పుడు కావలసినది జాతీయ రక్తనాళాలలో యితోధిక శక్తిని కలిగింపచేసే నూతన విద్యుత్తేజమే. మరణమనేది ఒక్కసారి మాత్రమే వస్తుంది. పిరికితనమంటే నాకు పరమ అసహ్యం. నా శిష్యులు పిరికి పందలుగా వుండరాదు. మహా ఆటంకాల మధ్యనే మహాకార్యాలు సాధించబడతాయి.

విజయమెప్పుడూ ఆత్మదే గాని ప్రకృతిది కాదు. పాపమనేది ఒకటున్నది. వేదాంతం అంగీకరించదు. పొరపాట్లు ఉంటాయని మాత్రం అంగీకరిస్తుంది. ఆ పొరపాట్లన్నిటి లోనూహీనమైనది "నేను దుర్భలుడ్ని- పాపిని - నీచుడ్ని - అసమర్దుడ్ని" అని భావించుకోవడమే.

భగవంతుని ఉనికిపై విశ్వాసం లేనివాడు నాస్తికుడని ప్రాచీన మతాలు పేర్కొన్నాయి. నవీన మతాలు స్వశక్తిపై, విశ్వాసం లేనివాడు నాస్తికుడని చెపుతున్నాయి.

బలమే జీవం - బలహీనతే మరణం. బలమే సుఖం, బలహీనతే శ్రమ - దుఃఖం. సర్వ వ్యధలకూ బలహీనతయే మూలకారణం. మనం బలహీనులం కనుకనే కష్టాల పాలవుతున్నాము. అపరాధాలన్నీ అందువల్లనే చేస్తున్నాము.

ధనవంతులు పీడించేటప్పుడు దరిద్రుల కుండవలసినది బలం - విద్యావంతులు పీడించేటప్పుడు పామరులకు వుండవలసినది బలం. నీకు కావలసిన శక్తి అంతా నీలోనే వున్నది. నీ విధికి నీవే కారణభూతుడవని తెల్సుకొని బాధ్యత అంతా నీపైనే పెట్టుకో. నీ భవిష్యత్తును నీవే నిర్మించుకో.

మనం రోగులమని తలచుకుంటూ వుండటం వల్ల రోగనివారణ జరగదు. మందు తీసుకోవాలి. అలాగే బలహీనతను తల్చుకున్నంత మాత్రం చేత లాభం లేదు. బలాన్ని సమకూర్చుకొనడానికి ప్రయత్నించాలి.

భౌతిక ప్రపంచంలో గాని - పారమార్ధిక ప్రపంచంలో  గానీ, మనిషి పతనానికి భయమే దారి తీస్తుందనడంలో సందేహం లేదు. దుఃఖానికీ, మరణానికీ, కూడా భయమే మూలకారణం. ఈ భయానికి కారణమేమిటి? ఆత్మతత్వాన్ని తెలుసు కొనకపోవడమే.

అన్ని ఆశుభాలనూ - పాపాలనూ ఒక్క దౌర్బల్యమనే మాటలో ఇమడ్చవచ్చు. దుష్ప్రవర్తనకూ - స్వార్ధ పరత్వానికీ యీ దౌర్భాల్యమే కారణం. మనిషి, తోటి మనిషికి హాని కలిగించడానికి దౌర్భాల్యమే మూలం.

ప్రకృతిలో బాహ్య ప్రకృతి అనీ, అంతర ప్రకృతి అనీ రెండు రకాలున్నాయి. బాహ్య ప్రకృతిని జయించడం మంచిదే కానీ, అంతర ప్రకృతిని జయించడం అంతకంటే గొప్ప విషయం.

సర్వ జంతువుల కంటే - సర్వ దేవతల కంటే మానవుడే గొప్పవాడు. దేవతలు కూడా మళ్లీ మానవ శరీరంతో అవతరించి దాని మూలంగానే మోక్ష పథానికి చేరుకోవాలి. పరిపూర్ణతను పొందేది మానవుడొక్కడే.

ప్రపంచంలోని మర్మాలనూ, రహస్యాలనూ, ఛేదించే శక్తి కలిగి ఆ ఉద్యమాన్ని సాధించగల దీక్షా సంకల్పులు - ఇనుప కండరాలూ - ఉక్కు నరాలూ గలవారూ మనదేశాని కిపుడు కావాలి.

మనం ఇంతవరకూ విచారంతో కృంగి, కృశించి పోయాము. ఇకనైనా విచారాన్ని విడిచిపెట్టి యితర ఆధారాల నపేక్షించక పౌరుషాన్ని ప్రదర్శించాలి. మానవత్వాన్ని నిర్మించే మతమూ - సిద్ధాంతాలు - విద్య నేడు మనకు అవసరం.

మనం ఎన్నో విషయాలను గురించి చర్చించుకుంటాం. కానీ అవి కార్యరూపం దాల్చేవి కావు. చెప్పడమే కాని చేయడం మన కలవాటు లేకుండా పోయింది. దీనికి కారణం మనలోని బలహీనతయే. బలహీనంగా వున్న మెదడు ఏపనీ చెయ్యలేదు. దానికి మనం పుష్టిని చేకూర్చాలి. మన యువకులు బలిష్ట శరీరులు కావటం మొదటి కర్తవ్యం. మత జ్ఞానం తర్వాత వస్తుంది. పారమార్ధిక లోకాన్ని చేరడానికి గీతా పఠనం కంటే "పుట్ బాల్" ఆట బాగా ఉపయోగపడుతుంది. శరీరం బలంగా వున్న తర్వాత భగవద్గీత బాగా గ్రహించవచ్చు.

జీవించడానికి చలనమూ - అభివృద్ధే గుర్తులని జ్ఞాపకముంచుకోండి.
                                                                                                      

(... వచ్చేవారం మరిన్ని ఉపదేశాలు)

మరిన్ని శీర్షికలు
Teluguvaari Tyagayya - Nagayya