Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

'రచయితలే' దర్శకులు

writers became directors

సంవత్సరానికి 120 కి పైగా సినిమాలు విడుదలయ్యే తెలుగు చిత్రసీమలో విజయం సాధించేవి పట్టుమని పదిశాతం కూడా ఉండవు. ఈ సంవత్సరం విడుదలయిన సినిమాల్లో విజయం సాధించిన సినిమాలు - 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చట్టు, అత్తారింటికి దారేది, బలుపు, నాయక్, మిర్చి, గుండెజారి గల్లంతయ్యిందే, స్వామిరారా, దూసుకెళ్తా, తడాఖా, అంతకుముందు ఆ తర్వాత, ప్రేమ కథా చిత్రమ్', మొదలైనవి వున్నాయి. వీటిలో 'మిర్చి' సినిమాను తీసింది 'కొరటాల శివ'. 'భద్ర, బృందావనం, మున్నా, ఊసరవెల్లి, ఒక్కడున్నాడు' సినిమాలకు రచయితగా పనిచేసిన కొరటాల శివ 'మిర్చి' సినిమా ద్వారా దర్శకుడయ్యాడు. అలాగే 'బలుపు' సినిమా రచయితగా పనిచేసిన 'బాబీ' ఇప్పుడు రవితేజతో తీయబోయే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇలా రచయితలు (అనగా పాటల, మాటల, నవలా రచయితలు) దర్శకులుగా మారడం తెలుగు చిత్రసీమలో చాలా ఏళ్లుగా జరుగుతున్న విషయమే. రచయితలుగా ఉండి, దర్శకులయిన వారు ఎవరంటే -

* దాసరి నారాయణరావు : 'తాతా మనవడు' సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు దాసరి. ఈ సినిమాకు ముందు చాలా సినిమాలకు మాటలు రాశారు ఆయన. ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎన్నో ఆణిముత్యాల లాంటి సినిమాలు తీశారు.

* జంధ్యాల : 'దేవుడు చేసిన బొమ్మలు' సినిమా ద్వారా రచయితగా పరిచయమయిన జంధ్యాల దాదాపు 200 సినిమాలకు రచయితగా పనిచేశారు. వీటిలో 'సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, సీతామాలక్ష్మి, అడవి రాముడు, వేటగాడు, జగదేకవీరుడు అతిలోక సుందరి', మొదలయిన సినిమాలు ఉన్నాయి. 'ముద్ద మందారం' సినిమా ద్వారా దర్శకుడై 'అహనా పెళ్ళంట, వివాహ భోజనంబు, శ్రీవారికి ప్రేమలేఖ, చూపులు కలిసిన శుభవేళ, రెండు రెళ్ళు ఆరు' లాంటి హాస్య చిత్రాలే కాక 'అమరజీవి, సీతారామ కళ్యాణం, పడమటి సంధ్యారాగం, ఆనంద భైరవి' లాంటి విభిన్నమైన సినిమాలు తీసారు.

* వంశీ : సీనియర్ దర్శకుడు 'వంశీ' అనగానే మనకు 'సితార, అన్వేషణ, లేడీస్ టైలర్' లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. వంశీ చిన్నవయస్సులోనే కథలు, నవలలు రాశారు. 'నల్ల సుశీల, సత్యసుందరి నవ్వింది' లాంటి కథలు, 'మంచు పల్లకి, కర్మభూమి' నవలలు రాశారు. 'స్వాతి, జ్యోతి, యువ' పత్రికలకు చాలా కథలు రాశారు. 'విక్టరీ' మధుసూదనరావు, కె. విశ్వనాథ్, భారతీ రాజా' గార్ల దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసి 'మంచుపల్లకి' సినిమా ద్వారా దర్శకుడై మంచి సినిమాలు కొన్ని తీసాడు.

* ఎం. బాలయ్య : 'బాలయ్య' అనగానే మనకు హీరో, సీనియర్ నటుడు, క్యారెక్టర్ నటుడుగా గుర్తుకు వస్తారు. ఈయన నిర్మాతగా తీసిన 'చెల్లెలి కాపురం, నేరము శిక్ష' సినిమాలకు రచయితగా పనిచేశారు. దర్శకుడిగా మారి 'నిజం చెపితే నేరమా, పోలీస్ అల్లుడు, పసుపుతాడు' సినిమాలు తీశారు.

* గొల్లపూడి మారుతీరావు : కె. విశ్వనాథ్ గారి తొలిచిత్రం 'ఆత్మ గౌరవం' సినిమా ద్వారా రచయితగా ప్రవేశించిన గొల్లపూడి ఎన్నో సినిమాలకు రచన చేశారు. దర్శకుడిగా 'ప్రేమ పుస్తకం' సినిమా తీశారు. నిజానికి ఈ సినిమాకు దర్శకుడు గొల్లపూడి వారబ్బాయి శ్రీనివాస్. ఆ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో శ్రీనివాస్ మరణించడంతో గొల్లపూడి మారుతీరావు ఆ సినిమాకు దర్శకత్వం వహించి సినిమాను పూర్తి చేశారు. ఈ 'ప్రేమ పుస్తకం' సినిమా ద్వారానే తమిళ నటుడు 'అజిత్' చిత్రరంగ ప్రవేశం చేసాడు.

* యండమూరి వీరేంద్రనాథ్ : 'యండమూరి' అనగానే మనకు నవలా రచయితగా ఎన్నో నవలలు రాసిన వ్యక్తిగా గుర్తుకు వస్తారు. ఈయన రాసిన నవలల్లో కొన్ని అభిలాష, చాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు, దొంగ మొగుడు' సినిమాలుగా వచ్చాయి. 'మంచుపల్లకి, ప్రియరాగాలు' మొదలైన సినిమాలకు రచన చేశారు. దర్శకుడిగా మారి 'అగ్ని ప్రవేశం, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్' సినిమాలు తీసారు.

* పరుచూరి బ్రదర్స్ : పరుచూరి బ్రదర్స్ గా పిలువబడే 'పరుచూరి వెంకటేశ్వర్రావు, పరుచూరి గోపాలకృష్ణ' లు రచయితలుగా దాదాపు 300 సినిమాలకు పనిచేశారు. వాటిలో 'బొబ్బిలి బ్రహ్మన్న, అసెంబ్లీ రౌడీ, ఖైదీ, వర్షం, మాస్, బొబ్బిరి రాజా, ఒక్కడు, ఆది కర్తవ్యం, అగ్నిపర్వతం', ఎలా ఎన్నో సూపర్ హిట్ లు ఉన్నాయి. వీరు దర్శకులుగా మారి కొన్ని సినిమాలు తీసారు. వాటిలో 'సర్పయాగం, రేపటి స్వరాజ్యం, ప్రజాస్వామ్యం' సినిమాలు కొన్ని.

* త్రివిక్రమ్ శ్రీనివాస్ : 'నువ్వే కావాలి, స్వయం వరం, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు' మొదలైన సినిమాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ 'నువ్వే నువ్వే; సినిమా ద్వారా దర్శకుడిగా మారి 'అతడు, జల్సా, ఖలేజా, జులాయి', ఈ సంవత్సరం సూపర్ హిట్టయిన 'అత్తారింటికి దారేది' సినిమాలు చేసారు. రవితేజ నటించిన 'ఒక రాజు ఒక రాణి' సినిమాకు పాటలు కూడా రాశారు.

* పోసాని కృష్ణమురళి : పరుచూరి బ్రదర్స్ దగ్గర సహాయ రచయితగా పనిచేసిన పోసాని కృష్ణమురళి 'పోలీస్ బ్రదర్స్, గాయం, రక్షణ, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, మాస్టర్, సీతయ్య, ప్రేమించుకుందాం రా' మొదలైన ఎన్నో హిట్ సినిమాలకు రచయితగా పనిచేశాడు. 'శ్రావణమాసం' ద్వారా దర్శకుడిగా మారి 'ఆపరేషన్ ధుర్యోదన, దుశ్శాసన. ఆపద మొక్కులవాడు, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు,పోసాని జెంటిల్ మెన్' సినిమాలు తీసారు.

* తనికెళ్ళ భరణి : 'కంచు కవచం' సినిమా ద్వారా రచయితగా పరిచయమయిన తనికెళ్ళభరణి వంశీ తీసిన 'లేడీస్ టైలర్, మహర్షి, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టు కింద ఫ్లీడర్, వారసుడొచ్చాడు' మొదలైన సినిమాలు చేసాడు. దర్శకుడిగా మారి ఈ మధ్యనే 'మిధునం' సినిమాను s.p. బాలు, లక్ష్మి లతో తీసి ఎన్నో ప్రశంశలు పొందారు.

* జె.కె. భారవి : 'అన్నమయ్య, శ్రీమంజునాథ, శ్రీ రామదాసు, పాండు రంగడు' సినిమాలకు రచనా సహకారం చేసిన జె.కె.భారవి దర్శకుడిగా 'శ్రీ జగద్గురు ఆదిశంకర' సినిమాను చేసారు.

* దశరథ్ : 'చిత్రం, ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను, శుభవేళ', చిత్రాలకు రచయితగా పనిచేసిన దశరథ్ 'సంతోషం' సినిమా ద్వారా దర్శకుడై 'సంబరం, శ్రీ, స్వాగతం, మిస్టర్ పర్ ఫెక్ట్, గ్రీకు వీరుడు' సినిమాలు తీసారు.

* జనార్ధన మహర్షి : 'వన్ బై టూ, మా అల్లుడు వెరీ గుడ్, ఎవడి గోల వాడిది, హంగామా, బురిడి, మాయాజాలం', మొదలైన తొంభై సినిమాలకు రచయితగా చేసిన జనార్ధన మహర్షి దర్శకుడిగా మారి గోపి(గోడ మీద పిల్లి), దేవస్థానం, పవిత్ర' సినిమాలు తీశారు.

* మరుధూరి రాజా : 'సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, ఖతర్నాక్, ఆది, లక్ష్మి, ఏమండోయ్ శ్రీవారు', సినిమాలకు మాటల రచయితగా ఉండిన మరుధూరి రాజా దర్శకుడిగా 'అద్యక్షా' సినిమాను చేసారు.

* జొన్నవిత్తుల రామలింగేశ్వర్రావు : పాటల రచయితగా ఎన్నో పాటలు రాసిన జొన్నవిత్తుల ఈ మధ్యనే వచ్చిన బాపు 'శ్రీ రామరాజ్యం' సినిమాకు ఆణిముత్యాల లాంటి పాటలు రాసారు. ఆలీ హీరోగా వచ్చిన 'సోంబేరీ' సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ 'సోంబేరీ' సినిమాకు గాయకుడు మనో సంగీతం అందించారు.

* వీరు పోట్ల : 'వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సూపర్ హిట్ సినిమాలకు కథా రచన చేసిన రచయిత వీరుపోట్ల, 'బిందాస్, రగడ, దూసుకెళ్తా' సినిమాలకు దర్శకత్వం చేశారు.

* కులశేఖర్ : 'చిత్రం, నువ్వు నేను, జయం' మొదలైన సినిమాలకు ఎన్నో హిట్ పాటలను అందించిన కులశేఖర్ దర్శకుడిగా 'ప్రేమలేఖ రాశా' సినిమా తీశారు.

* ఎమ్.ఎస్. నారాయణ : హాస్యనటుడిగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న ఎమ్.ఎస్. నారాయణ హాస్య నటుడిగా చేయకముందు ఏడెనిమిది సినిమాలకు మాటల రచయితగా చేసారు. అందులో సుమన్ నటించిన 'అలెగ్జాండర్' సినిమా ఒకటి. దర్శకుడిగా మారి 'భజంత్రీలు, కొడుకు', సినిమాలు చేసారు.

మరిన్ని సినిమా కబుర్లు
Mohanbabu without Makeup