Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ముఫ్ఫయ్ మూడవ భాగం

anubandhalu telugu serial thirty third Part

"మాకు పెళ్లిళ్లు కాకపోయినా బాధలేదు డాడీ! కానీ మాకు బయట సంబంధాలు మాత్రం చూడకండి. నేను మాటిచ్చాను మహేశ్వరిని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. ఐ లవ్ హర్" అని అరిచాడు అనంత్.

"షటప్!" కోపాన్నంతా కళ్ళల్లో చూపిస్తూ పెద్దగా అరిచాడు గోపాల్.

"అమెరికా నుంచి వచ్చి మూడు మాసాలు కాలేదు. ఆ అన్నాచెల్లెళ్ళంటే మీకు నచ్చదు. ఇంతలోనే మీ మధ్య ప్రేమా గీమా అంటే నమ్మేస్తాననుకున్నారా? ఒకవేళ అదే నిజమైనా ఎలా పెళ్లి చేస్తామనుకుంటున్నారు? ఆమె నా చెల్లెలే కావచ్చు. కానీ ఎన్ని మాటలంది? ఎంతగా అవమానించింది? అంతకు ముందు సంబంధం కలిస్తే చాలని ఆశపడింది.

షేర్లలో దివాలా తీసామని తెలియగానే మనల్ని పురుగుల్ని చూసినట్టు చూసింది. మర్చిపొండి. నవీన్, మహేశ్వరిలను మీరు మర్చిపోవాలి. మీ పెళ్ళిళ్ళు డాక్టర్ నిర్మలాదేవి పిల్లలతోనే జరుగుతాయి."

"సారీ డాడ్... మీతో మేం గన్నవరం రావడం లేదు..." అంటూ టై వదులు చేసుకొని సోఫాలో కూలబడిపోయాడు అనంత్.

"వస్తున్నారు. దిసీజ్ మై ఆర్డర్. పిచ్చి వేషాలేస్తే ఊరుకోను. నే వెళ్లి కారు తీసుకొస్తాను. వెయిట్ చేయండి" అంటూ హెచ్చరించి కిందకు వెళ్లిపోయాడు గోపాల్.

ఆయనలా వెళ్లిపోగానే - చివ్వున లేచింది శివానీ.

"అన్నయ్యా! పద వెళ్లిపోదాం" అంది అనంత్ ని.

"ఎక్కడికీ?" అమాయకంగా అడిగాడు అనంత్.

"అయ్యో అన్నయ్యా! ఇంకా అర్ధం కాలేదా? పార్టీ వంకతో గన్నవరంలో మనకి పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు డాడి. ఇక్కడే ఉంటే బలవంతంగా మనల్ని తీసుకుపోతారు. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మనం మున్నలూరు వెళ్లిపోవడం మంచిది. పద. అత్తయ్య గొడవ చేస్తే మనం పెదనాన్న దగ్గర ఉందాం. పెద్దమ్మకి మనమంటే ఇష్టమే కదా... అన్నింటికీ మించి బావ నవీన్ ఏదో ఒకటి ఆలోచిస్తాడు. మనం వెళ్లిపోదాం పద అన్నయ్యా!" అంటూ తొందర చేసింది శివానీ.

ప్రస్తుత పరిస్థితిలో మున్నలూరు పారిపోవడమే అనంత్ కి మంచిదన్పించింది. అంతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు అన్నాచెల్లెళ్లు.

ఇద్దరూ కలిసి వెనక పక్క మెట్ల గుండా అపార్ట్ మెంట్ నుండి బయటపడి వీధిలోకి రాగానే అటుగా వచ్చిన టాక్సీని ఎక్కేసారు. అపార్ట్ మెంట్ వెనుక వీధిలో ఈ టాక్సీ అటు వెళుతుండగానే అటు అపార్ట్ మెంట్ ముందు భాగం గేట్ లోకి తిరిగింది డాక్టర్ గోపాల్ తీసుకువచ్చిన ఏ.సి. కారు.

మనిషి జీవితమే విచిత్రాల సంఘమం. ఒక్కోసారి అనుకున్నదొక్కటి జరిగింది వేరొకటిగా జీవితం మనల్ని తికమకపెట్టి కంగారు పుట్టిస్తుంది. సుఖదుఃఖాలు కావచ్చు, మంచిచెడులు కావచ్చు, ఉల్లాస భరితమైన ఆనందాలు కావచ్చు, కడుపుబ్బ నవ్వించే చమత్కారాలు కావచ్చు. అన్నిటినీ ఉగాది పచ్చడిలా షడ్రుచులు సమ్మేళనంతో మనకి అందించేదే జీవితం. ఇలా జరిగిందేమిటా అని ఒక్కోసారి మనకి మనమే ఆశ్చర్యపోయే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

అక్కడ విజయవాడలో - తండ్రి గోపాల్ తమకు వేరే సంబంధాలు చూడబోతున్న విషయం తెలీగానే అన్నాచెల్లెళ్లిద్దరూ తమ ప్లాట్ నుండి బయటపడి మున్నలూరు వస్తుంటే....

అదే సమయంలో ఇక్కడ మున్నలూరులో.

"ఎక్కడికో బయల్దేరినట్టున్నారు?" హడావుడిగా ప్రయాణమవుతున్న భర్త రామలింగేశ్వర్రావుని అనుమానంగా చూస్తూ అడిగింది మహాలక్ష్మీ.

"ఏం? వెళ్లకూడదా?" తల దువ్వుకుంటూ అద్దంలోంచే భార్యను చూసి కళ్లెగరేస్తూ అడిగాడు రామలింగేశ్వర్రావు, "కూడదని కాదు... ఈ మధ్య కాస్త సోకులు ఎక్కువ
చేస్తున్నారు. అదే అర్ధం కావడం లేదు" అంది ముసిముసిగా నవ్వుతూ.

"నీకు అర్ధం కాకుండా ఉంటేనే మంచిదిలే..." ఆమెను కవ్వించడం కోసం ఒక మాట వదిలాడాయన.

అంతే! సడన్ గా ఆవిడ ముఖంలో రంగులు మారిపోయాయి. చటుక్కున ఆయన భుజం పుచ్చుకొని తనవైపు లాగింది.

"ఏమిటర్ధం కాకూడదు? ఎవరది? నాకిప్పుడే తెలియాలి. అత్తయ్య అమెరికా వెళ్ళడంతో మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఎవరా వగలాడి?" కరుగ్గా నిలదీసింది.

తనేదో వినకూడని మాట విన్నట్టుగా - అమాయకంగా చూసాడాయన.

"ఏమిటి? నువ్వలా అర్ధం చేసుకున్నావా? ఛఛ... నేను రాముడినైతే నా సీత నువ్వే కదా... రంభలా నువ్వు నా పక్కనుండగా ఏ వగలాడైతే నాకెందుకోయ్ భార్యామణి" అంటూ
దగ్గరకు తీసుకోబోయాడు.

ఆ చేతిని విసిరి కొడుతూ - రుసరుసలాడుతూ చూసింది.

"ఈ సరసాలకేం లెండి? ముందీ సంగతి ఇప్పుడే తేలాల్సిందే! నాకు అర్ధం కాకూడని విషయం ఏమిటది?" నిలదీసింది పట్టుదలగా.

"అంతా తెలిసి అడుగుతున్నావు చూడు... అందుకే అలా అన్నాను. ఆ చెవిటికల్లు పొలం పదెకరాలు బేరానికొచ్చిందని రాత్రి నీతో చెప్పానా లేదా?"
"చెప్పారు"

"మన పొలాలను చేర్చిఉన్న పొలం అది. వాడు అమ్మితే కొని మన పొలాల్లో కలుపుకోవాలని అమ్మకు ఎప్పట్నుంచో కోరిక. అదిప్పుడు నెరవేరబోతోంది. మా అమ్మ అమెరికా నుంచి వచ్చేలోగా రిజిష్ట్రేషన్ చేసెయ్యాలి. ఆ బేరసారాలు మాట్లాడడానికే ఇప్పుడు చెవిటికల్లు వెళుతున్నాను."
"అవును. నా మాటలు మీకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టున్నాయి. ఇప్పుడా పొలం ముఖ్యమా మనకి? ముందు బెజవాడ వెళ్లి అక్కడ మరిదిగారు, పిల్లలు ఎలా ఉన్నారో ఓ సారి చూసిరానక్కర్లేదా?"

"వాళ్లకేమిటి? బాగానే ఉన్నారు. అయినా మనం వెళ్ళిపొమ్మని చెప్పామా? వాళ్లేగా వెళ్లిపోయారు. మనం కావాలనుకుంటే వాళ్లే వస్తారులే." ఆ మాటలతో మహాలక్ష్మి కి కోపం ముంచుకొచ్చింది. "ఏమిటి వాళ్లు వచ్చేది? కొంచెం కూడా బాధ్యత లేకుండా... మీరిలా మాట్లాడతారనుకోలేదు.

కనీసం శివానీ గురించైనా ఆలోచించరా? ఆడపిల్ల... అమ్మా, నాయనమ్మ ఎక్కడో దూరాన ఉన్నారు. ఇటు చూస్తే డబ్బు పోయిన బెంగ నుంచి మరిదిగారు ఇంకా కోలుకోలేదు. పిల్లల్ని మనం కాకపోతే ఎవరు చూస్తారు? మీ చెల్లెలేమో అసలు పట్టించుకోవడం మానేసింది. నాకు అనంత్ ను, శివానీని చూడాలని ఉంది. చెవిటికల్లు తర్వాత వెళ్లవచ్చు. ముందు విజయవాడ వెళ్దాం పదండి" అంది పట్టుదలగా.

కానీ రామలింగేశ్వర్రావుకి బెజవాడ వెళ్లే మూడే లేదు. కొంచెం విసుగ్గా చూసాడు.

"చూడు మహాలక్ష్మీ! నువ్విలా లేడికి లేచిందే ప్రయాణమంటే కుదరదు. నేను వస్తున్నట్టు ఫోన్ చేశాను. బేరం కుదిరితే రేపు వారం రిజిష్ట్రేషన్ చేయించేస్తాను. డబ్బు సమస్య లేదు. అవకాశం చేయిదాటితే తిరిగి రాదు. అర్ధం చేసుకోవేమిటి? ఈ ఒక్కరోజు వదిలెయ్ రేపు ఉదయమే ఇద్దరం బెజవాడ వెళదాం. సరేనా...?

"అయినా మీ మాట మీదేగాని నా మాట ఎప్పుడు విన్నారని, రేపైనా తీసుకెళ్తారని నమ్మొచ్చా"

"నూటికి నూరుపాళ్లు నమ్మొచ్చు. సరేనా" అంటూ బయటకు నడిచాడు.

అతడు కారును షెడ్ లోంచి తీసుకొచ్చి - తమ మండువా లోగిలి ముందు ఆపాడు.

అతనికో అలవాటు ఉంది. అతనే కాదు సాధారణంగా చాలామందికి ఉండే అలవాటే ఇది. బయటకు బయల్దేరితే భార్య ఎదురురావాల్సిందే. ఎప్పటిలాగే కారుకి ఎదురు రావడం కోసం అంతదూరం వెళ్లి ఆగి, ఇటు తిరిగింది.

అతను కార్ స్టార్ట్ చేయబోతూ చివరి క్షణంలో ఆగాడు. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో ఎగువ నుంచి ఒక కారు రివ్వున ఇటే దూసుకొస్తూ కన్పించింది. ఆ వీధిలో తమ ఇంటికి తప్ప వేరే ఎవరింటికీ కారు రావడం చాలా అరుదైన విషయం.

బెజవాడ నుంచి తమ్ముడు గోపాల్ వస్తున్నట్టున్నాడు అంటూ కారు దిగాడు. వస్తున్న కారుని చూసి ఇదే అభిప్రాయంతో మహాలక్ష్మీ కూడా వెనక్కి వచ్చి భర్త పక్కన నిలబడింది.

అంతలో రివ్వున వచ్చి సడన్ బ్రేక్ తో వారిముందు ఆగిందా కారు.

అయితే వారు ఊహించినట్టుగా ఆ కార్లో వచ్చింది బెజవాడ నుంచి గోపాల్ కాదు. అమెరికా నుంచి అన్నపూర్ణేశ్వరి, కోడలు సత్యవతి అకస్మాత్తుగా వచ్చిన వాళ్ళిద్దర్నీ చూసి తమ కళ్ళని నమ్మలేకపోయారిద్దరూ. రామలింగేశ్వర్రావుకి కాలు, చెయ్యీ ఆడలేదు.

"అమ్మా! వస్తున్నట్టు ఫోన్ చేయొచ్చు కదా... ఏమ్మా సత్యవతీ! బాగున్నారా?" అంటూ పలకరించారు పొడిగా.

సత్యవతి మౌనంగా తలవూపి, చెమర్చిన కళ్ళు తుడుచుకుంది. మహాలక్ష్మి తోడి కోడల్ని ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరకు తీసుకుంది. కానీ అన్నపూర్ణేశ్వరి కోపంగా కొడుకుని
చూసింది.

"ఏరా! పెద్దోడా... అసలేమనుకుంటున్నావురా నువ్వూ..." అంటూ కళ్ళెర్రజేసింది.

"అమ్మా! వస్తూనే ఏమిటీ గొడవ? ఇప్పుడేమైందని... లోనకు పదండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. అంటూ సర్దిచెప్పాలని చూసాడు.

అంతే - ఆ మాటతో ఆవిడ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

"ఏమైందా?... ఇప్పుడేమైందని అడుగుతావా? నీకు తెలీకుండానే అంతా జరిగిందా? అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావురా? గోపాల్ వచ్చి ఇన్నిరోజులైనా వాడిక్కడికి రాలేదని మీరంతా ఎందుకు అబద్ధాలు చెప్పారు? జర్మనీ వెళ్లినవాడు ఇంటికి రాలేదు. ఫోన్ చేయలేదు. ఏమైపోయాడోనని మేం అక్కడ తిండీ తిప్పలు మాని కంగారు పడుతుంటే నువ్వు కూడా ఇక్కడ తీరిగ్గా కూర్చుని అబద్ధాలు చెప్తావా?..."

"అది కాదమ్మా...! నా మాట విను..."

"వినను. నాకొస్తున్న కోపానికి నిన్నూ... ఆగు చెప్తా..." అంటూ ఆపుకోలేని కోపంతో అటు ఇటు చూసి పక్కనుంచి బోతున్న రైతు చేతిలోంచి చేతి కర్ర లాక్కుంది.

అది చూసి కంగారు పడిపోయి - వేగంగా వెనక్కి తప్పుకుంటూ - "అయ్యబాబోయ్...! వీధిలో పరువు తియ్యకే అమ్మా! ఇందులో నా తప్పే లేదు." అంటూ అతను అరుస్తూనే
ఉన్నాడు.

"తప్పు లేదంటావా? ఇంకా తప్పు లేదంటావా?" అంటూ అన్నపూర్ణేశ్వరి చేతికర్రతో కొడుకును రెండు పీకింది.

అంతటి రామలింగేశ్వర్రావు కూడా తల్లికి భయపడి, వెనక్కి దూకి ఇంట్లోకి పరుగు తీశాడు.

"వదలకండి అత్తయ్యా! మీరు అమెరికా వెళ్ళినప్పట్నుంచి అసలు మాట వినడంలేదు. అబద్ధాలు బాగానే చెప్తున్నారు. మీరు భయం చెప్పాల్సిందే" అంటూ నవ్వుతూనే అత్తగారిని సపోర్ట్ చేసింది మహాలక్ష్మి.

"నేనెందుకు వదులుతానే అమ్మాయి? వీళ్ల నాటకాలేమిటో బయటపెట్టందే అసలు వదలను చూడు" అంటూ కర్ర పుచ్చుకొని కొడుకు వెంటపడింది.

"అమ్మా! చెట్టంత కొడుకుని మీరేం కొడతారు గానీ నా కర్ర ఇలా పడేయండి. నే పోతా" అని అరిచాడు రైతు.

"నా టాక్సీ డబ్బులిస్తే... వెళ్ళిపోతా బామ్మగారూ" అంటూ టాక్సీవాలా అరిచాడు.

తమ లగేజ్ కిందకు దించడంతో టాక్సీ వాడికి డబ్బులిచ్చి పంపించేసింది సత్యవతి. ఈ లోపల విషయం తెలిసి భ్రమరాంబ, రఘునాథ్, నవీన్, మహేశ్వరి అంతా మండువా లోగిట్లోకి పరుగెత్తుకు వచ్చారు.

రావడం రావడం రఘునాథ్ వెనక్కుపోయి - అతన్ని ముందుకు నెట్టాడు రామలింగేశ్వర్రావు.

"ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు ఇదెక్కడి న్యాయం బావా?"

"అమ్మతో నువ్వైనా చెప్పు ఇందులో  మన తప్పేం ఉంది? గోపాల్ చెప్తేనే గదా అబద్ధం చెప్పాం. ఆ మాట చెప్పు" అనరిచాడు.

"అవునత్తయ్యా! ఇందులో మా తప్పులేదు. పాపం పెదబావ నెందుకు కోప్పడతారు. తానిక్కడకు వచ్చినట్టు చెప్పొద్దని చినబావే మమ్మల్ని కట్టడి చేశారు" అన్నాడు రఘునాథ్.

"అవునమ్మా! అన్నయ్య చెప్పొద్దన్నాడు" అంది భ్రమరాంబ.

ఆ మాటలకు మరింత మండిపడిందావిడ.

 

(... ముగింపు వచ్చేవారం)

 

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
duradrustapu dongalu