Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> వంశీకి నచ్చిన కథ - పురాగానం

puraagaanam telugu story

నగనగా ఒక అడవి.

ఆకాశానికి వింజామరలు వీచే వృక్షాలు, గుండెల నిండా పాటలు దాచుకుని పరిగెత్తే సెలయేళ్ళు, హోరుమంటూ నిరంతరం ఎవర్నో పిలిచే జలపాతాలు, రంగుల్లో స్నానం చేసి, రెక్కలతో చిత్రాలు గీసే పక్షులు, గాలి గుసగుసలను చెవొగ్గి విని చలించిపోయే పుష్పాలు అల్లిబిల్లిగా సంచరించే నానా రకాల జంతువులు.

ఆ అడవిలో ఒకానొక వర్షపు రాత్రి.

ఆకాశాన్ని చీల్చిన ఒక మెరుపు అడవినంతా వెలిగించింది. మేఘాలు గుండెలు పగిలేలా ఒక ఉరుమును వురిమాయి. మహా సైన్యంలా చినుకులు దాడి చేస్తున్నాయి. ఎండుటాకులపై పది పగిలిపోతున్నాయి. గాలి బొంగురుగా అరుస్తూ వుంది. అడివంతా వానకు తడుస్తూ వురుములకు జడుస్తూ వుంది. ఈ బీభత్స వాతావరణంలో ఒక చెట్టుకింద ఒక కోతి ప్రసవ వేదన పడుతోంది. గాలికి వణుకుతూ వానలోనూ, కన్నీళ్లలోనూ తడుస్తూ పిచ్చిగా మూలుగుతూ వుంది. సర్వశక్తుల్ని గుండెల్లోకి తెచ్చుకుని గోళ్ళతో చెట్టు మొదళ్ళను గట్టిగా, పిచ్చిగా రక్కుతూ గట్టిగా కేక పెట్టింది. బిడ్డ నేలను తాకింది. కోతి కాసేపు కళ్ళు మూసుకుంది. తెలియని ఆనందం. తెలుస్తున్న బాధ.

వాన కొంచెం తగ్గుతూ ఒక మెరుపును భూమ్మీదకి విసిరింది. ఆ వెలుతురులో తనలోంచి వచ్చిన చిన్ని ప్రాణాన్ని తల్లి చూసుకుంది. తన రక్తపు ముద్దను గట్టిగా హత్తుకుని ఒళ్లంతా నాకింది. పొట్టకు అతికించుకుంది. పసికూన కళ్ళు తెరవకుండానే తల్లిని గట్టిగా పట్టుకుంది. కడుపు నిండా పాలు తాగింది. తల్లీ బిడ్డా ఆదమరిచి నిద్రపోయారు.

తెల్లవారిందని పక్షులు కూస్తూ వుంటే తల్లి కళ్ళు తెరిచింది. పసికూన కూడా కళ్ళు తెరిచి తల్లిని చూసింది. ఇద్దరి కళ్ళు ప్రేమగా కలుసుకున్నాయి.

పసికూన తల్లివైపు చూస్తూ 'నేనెవర్ని. ఎక్కడ నుంచి వచ్చాను?' అడిగింది. తల్లి రవ్వంత ఆశ్చర్యపోయింది. బిడ్డ తొలిసారి మాట్లాడినందుకు ఆనందపడింది.

మనమంతా కోతులం బిడ్డా. నేను నీ అమ్మను' అని బిడ్డను పొట్టకు తగిలించుకుని చెట్టుకొమ్మపైకి ఎక్కసాగింది.

'అమ్మా! ఈ ప్రపంచం ఏటవాలుగా ఎందుకుంది?' మళ్లీ ప్రశ్నించింది బిడ్డ.

బిడ్డ మొహంలోకి అనుమానంగా చూసింది తల్లి. గాలేమైనా సోకిందా అని అనుకుంది. వెంటనే కోతిబాబా దగ్గరకు బయలుదేరింది.

ఆయన చిటారుకొమ్మన కూచుని ప్రపంచంలోని హెచ్చుతగ్గులను పరిశీలిస్తూ ఉన్నాడు. కోతిని చూడగానే బాబా సాదరంగా ఆహ్వానించి 'కొత్త అతిథికి స్వాగతం అంటూ పసికూనని నిమిరాడు.

బిడ్డ వేసిన ప్రశ్నల గురించి తల్లి చెప్పింది.

కూనని చేతిలోకి తీసుకుని ముద్దాడాడు బాబా.

'పుట్టుకతోనే ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడంటే వీడు గొప్పవాడయ్యే ప్రమాదం లేకపోలేదు' అన్నాడు.

'ప్రశ్నించడం తప్పంటావా స్వామీ' అడిగింది పిల్ల.

బాబా వులిక్కిపడ్డాడు.

'ఈ ప్రపంచంలో నోరు మూసుకుని వుండడమంత శ్రేయస్కరమైంది మరోటి లేదు. అందుకే అందరూ నన్ను పెద్దవాడిగా గౌరవిస్తారు. ఈ ప్రపంచం ఇంతకు మునుపు ఎట్లా వుందో ఇప్పుడూ అట్లే వుంటుంది. నీకు ఏటవాలుగా కనిపించింది. నాకు తలకిందులుగా కనిపిస్తూ వుంటుంది. అదేమిటని నేనెవర్నయినా అడిగానా? ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు అవివేకం. తర్కం వల్ల నాలుక పదునెక్కుతుందే గాని బుద్ధి వికసించదు. అడవి నిండా కమ్మటి పళ్ళున్నాయి. వెళ్లి తిను. తినడానికి మించిన ఆనందం ఇంకోటి లేదని గ్రహిస్తావు' అని చెప్పి కోతిబాబా ప్రపంచం పరిశీలనలో మునిగిపోయాడు.

పిల్లను తీసుకుని తల్లి వెళ్లిపోయింది.

పెరుగుతున్న కొద్దీ పిల్లకు ప్రశ్నలు ఎక్కువయ్యాయి.

స్నేహితులతో కలిసేది కాదు. ఒంటరిగా కూచునేది. చదువుకోడానికి వెళ్లేది కాదు. చెట్లు, ఆకులు, పళ్ళు, వర్షం, ఎండ, మంచు. అన్నీ దానికి కొత్తగా కనిపించేవి. జీవితంలో ఒక్క సత్యాన్నయినా పరిశోధించి తెలుసుకోవాలని దానికి జిజ్ఞాస.

ఒకరోజు అడవిలోకి ఒక వార్తాపత్రిక గాలికి కొట్టుకొచ్చింది. దాన్ని చంకన పెట్టుకుని బాబా దగ్గరకెళ్లింది కోతిపిల్ల.

'బాబా. నాకోసందేహం' అంది.

'ఒకే వాక్యంలో చెప్పు' అన్నాడు బాబా.

'కోతినుంచి మనిషి పుట్టాడని ఇందులో రాశారు నిజమేనా?' అని అడిగింది.

'ఎవరి జ్ఞానం కొద్దీ వాళ్లు రాసుకుంటూ వుంటారు. అవన్నీ మనం నమ్మాల్సిన పనిలేదు'

'నేను ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నాను'

'అంటే నీ ఉద్ధేశ్యం...'

'మనుషుల వద్దకు వెళ్లాలనుకుంటున్నాను'

'ప్రతిదీ అనుభవం మీదే తెలుసుకోవడం మూర్ఖత్వం. నీకు తెలియదు. మనుషులు చాలా దుర్మార్గులు' హితవచనాలు చెప్పాడు బాబా.

'నన్ను ఆశీర్వదించండి నేను వెళుతున్నాను'

'మంచిది. అన్వేషికి తోక అడ్డం పెడితే ఆగుతాడా' జాలిగా చూశాడు బాబా.

కోతి బయలుదేరింది. తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.

'నీకోసం కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఎదురుచూసే తల్లి వుందని మరవద్దు నాయనా' అని బిడ్డను ఆప్యాయంగా కౌగలించుకుని సాగనంపింది.

మనుషుల పొలిమేరల్లోకి అడుగు పెట్టగానే కోతి మెడకు ఉచ్చుపడింది.

ఎదురుగా ఒక మనిషి ప్రత్యక్షమై 'నేను నీ యజమానిని. పిల్లిమొగ్గలు వెయ్యి' అని దుడ్డుకర్రతో నాలుగు దెబ్బలు వేశాడు.

కోతికేమీ అర్ధం కాలేదు. 'అయ్యా. నేను కోతిని కదా. పిల్లిమొగ్గలు ఎలా వేసేది' అని అడిగింది.

'అయితే కోతి మొగ్గలేవెయ్' అని దుడ్డుకర్రతో ఈసారి రెండే కొట్టాడు. ఆ దెబ్బలు తప్పించుకోడానికి కోతి నాలుగుసార్లు పైకి కిందకి ఎగిరింది.

అతను కోతిని తీసుకుని వీధుల్లో మొగ్గలు వేయించి డబ్బులు వసూలు చేసుకుని ఇంటికి బయలుదేరాడు.

ఇంట్లో కోతికి కాస్త తిండి పెట్టాడు. తానూ తిని గుర్రుపెట్టి నిద్రపోయాడు. కోతి తప్పించుకోవాలని చూసింది కాని, దానివల్ల కాలేదు. తెల్లారింది కోతిని వీధిలోకి తీసుకొచ్చాడు. రకరకాల గెంతులేయించాడు. దవడలో డబ్బులు పెట్టుకోవడం నేర్పించాడు. రోజూ బతకడానికి సరిపడా తిండిపెట్టేవాడు. క్రమం తప్పకుండా దుడ్డుకర్రతో నాలుగు దెబ్బలు కొట్టేవాడు.

"ఎందుకయ్యా ఊరికే కొడతావు. మీలాగే నాది కూడా ప్రాణమే కదా. నొప్పి అందరికీ ఒకటే కదా' అని అడిగింది కోతి.

"ఈ ప్రపంచం దుడ్డుకర్రతో తప్ప మరోలా మాట వినదని అనుభవంతో తెలుసుకున్నాను. అయినా నీ మాటలను వింటూ ఉంటే నువ్వు దయకు పాత్రురాలిలా కనిపిస్తున్నావు" అంటూ రెండు దెబ్బలు మాత్రమే వేశాడు.

కొద్ది రోజులు గడిచాయి. కోతి ఎన్ని గంతులేసినా డబ్బులు రాలడం లేదు. బతకడానికి మనుషులే రకరకాల గంతులేస్తుంటే ఇక కోతినెవరు పట్టించుకుంటారు?

యజమానికి నీరసమొచ్చింది. కోతికి తిండి తగ్గించాడు. దెబ్బలు పెంచాడు.

ఒకరోజు ఎన్ని వీధులు తిరిగినా డబ్బులు రాలేదు. యజమాని కాసేపు ఆలోచనలో పడ్డాడు.

"ఇహ లాభం లేదు. జనంతో హాస్యం చచ్చిపోయింది. కాసింత కరుణ రసం ప్రదర్శించక తప్పదు" అన్నాడు. కోతి అనుమానంగా చూసింది.

"చూడు మిత్రమా! ఇది పాపిష్టిలోకం. కళ్ళున్నాయి కాబట్టి దీన్ని చూడక తప్పదు. నేనెలాగూ ఈ బాధని భరిస్తున్నాను. ఈ లోకాన్ని చూడ్డం నీకంత అవసరమంటావా?"
అన్నాడు యజమాని.

కోతి అయోమయంగా చూసింది.

"నా మాట అర్ధం చేసుకో. ఆకలితో చావడం కంటే అంధురాలిగా బతకడంలో తృప్తి వుంది. జనంది జాలి గుండె. గుడ్డికోతిని చూస్తే తెగ ధర్మం చేస్తారు. నీకు కళ్ళు తీసేస్తాను నొప్పిలేకుండా" మోహంలో ఎలాంటి భావం లేకుండా చెప్పాడు యజమాని.

కోతి అసహ్యంగా చూసింది.

"నువ్వసలు మనిషివేనా?"

"మనిషిని కాబట్టే ఇలాంటి ఆలోచన వచ్చింది. నువ్వు జంతువ్వి. నీ బుర్ర ఎప్పుడైనా ఇలా పనిచేసిందా?"

ఈలోగా పెద్ద శబ్దం వినిపించింది. జనమంతా పారిపోతున్నారు. హాహాకారాలు, ఆర్తనాదాలు.

యజమాని భయభ్రాంతుడై "మిత్రమా! ఈ లోకాన్ని చూసే అవకాశాన్ని నీకిస్తున్నాను. సెలవ్" అంటూ పారిపోయాడు.

కోతికి ఎటు పారిపోవాలో అర్ధం కాలేదు.

ఎటు చూసినా పరిగెత్తుతున్న జనం. పారిపోలేని పిల్లలు నలిగిపోతున్నారు. పెట్రోల్ కంపు, మనుషులు కాలుతున్న వాసన. ఆడవాళ్ళు చంటిపిల్లల్ని గుండెలకు హత్తుకుని పిచ్చెక్కినట్టు అరుస్తున్నారు. పడిపోతున్నారు. కాలిపోతున్నారు.

కోతిని నలుగురు వ్యక్తులు చుట్టుముట్టారు.

"ఎవర్నువ్వు? హిందువా? ముస్లిమా?"

కోతి వింతగా చూసింది.

"నేను కోతిని" వణుకుతూ చెప్పింది.

"ఎవరైతేనేం?" కర్రలు గాల్లోకి లేచాయి.

తలమీద పడుతున్న దెబ్బని తప్పించుకోడానికి పిల్లిమొగ్గలేసింది.

ఒక కాలిపై బలంగా దెబ్బ పడింది. 'ఫట్' మని ఎముక విరిగిన చప్పుడు.

అడవిలోని తల్లి గుర్తుకొచ్చింది. తరువాత ఏమీ గుర్తులేదు.

***

కోతి కళ్ళు తెరిచింది.

చుట్టూ మందుల వాసన. గాయాల వాసన.

బాధకు తట్టుకోలేక పసిపిల్లలు ఏడుస్తున్నారు. రెండేళ్ళ అమ్మాయి తలకు కట్టుతో 'అమ్మా' అని వెతుక్కుంటూ తిరుగుతూ వుంది.

కోతికి తలంతా పోటుగా ఉంది. ఒక కాలికి కట్టు కట్టి వుంది. భరించరాని నొప్పి.

ఒక నర్స్ వచ్చి "అదృష్టవంతురాలివి బతికావు. కాని..." అంటూ ఆగింది.

కోతి నిర్లిప్తంగా ఆమెవైపు చూసింది.

"జీవితంలో ఇంకెప్పుడూ రెండు కాళ్ళతో నువ్వు నడవలేవు" చెప్పింది నర్సు.

తన కాలుని చూసుకుని కోతి వెక్కి వెక్కి ఏడ్చింది.

కొద్దిరోజులు గడిచాక కోతికి ఒక ఊత కర్ర ఇచ్చి, ఇక వెళ్ళమన్నారు.

"ఎక్కడికి?" అని అడిగింది కోతి.

"నీ ఇష్టమొచ్చిన చోటికి స్వేచ్చగా వెళ్ళొచ్చు"

కోతి పెదాలపై ఒక విషాదమైన నవ్వు కదలాడింది.

ఇంతలో ఒకాయన కోతి దగ్గరకి వచ్చాడు.

"నేనొక సర్కస కంపెనీ యజమానిని. నిన్ను నేను తీసుకువెళుతున్నాను" అంటూ ఊతకర్రతో సహా దాన్ని తీసుకెళ్ళాడు.

"అయ్యా! అక్కడ నేనేం చేయాలి?"

"ప్రజల్ని రంజింపచేయాలి?"

"అయ్యా! దుక్కమొస్తే నేను ఏడవచ్చా?" అడిగింది కోతి.

"శబ్దం రాకుండా ఏడవచ్చు. ఆ మాత్రం స్వేచ్ఛ నీకెప్పుడూ వుంటుంది"

సర్కస్ లో దాన్ని బోన్ లో పెట్టారు.

తనలాగే చాలా జంతువులు అక్కడ ఆడటం చూసింది.

మీరెక్కడి నుంచి వచ్చారని వాటిని అడిగింది.

"ఎక్కడినుంచో ఎందుకొస్తాం. ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం" అన్నాయవి.

"మీకు ఇక్కడ బాగుందా?"

"ఎందుకు బాగుండదు. రోజూ నాలుగు ముక్కలు మాంసం పెడతారు. ఇంతకీ నువ్వెక్కడ నుంచి వచ్చావు?" అడిగాయి జంతువులు.

"అదో అద్భుత లోకం. చెట్లు, పక్షులు, సెలయేళ్ళు, సూర్యోదయాలు, మీరు కలనైనా ఊహించలేరు" చెదిరిపోయిన స్వప్నాన్ని గుర్తు తెచ్చుకుంది కోతి.

"మరి అక్కడ మాంసమెవరు పెడతారు" అని అడిగాయి జంతువులు.

సర్కస్ లో ఒంటికాలితో కోతి చేసే ఫీట్స్ కు జనం బాగానే చప్పట్లు కొట్టేవారు. ఒక కాలిని ఈడ్చుకుంటూ పరిగెత్తేది, ఫల్టీలు కొట్టేది.

కొద్ది రోజులకే జనానికి మొహం మొత్తింది. చప్పట్లు కొట్టడం మానేశారు. కోతికి తిండి దండగని యజమాని భావించాడు. దానికి ఒక పూట తిండి మాత్రమే దక్కేది.

ఒకరోజు వచ్చి కోతిని బోనులోంచి బయటికి తీశాడు.

"ఇప్పుడు గంతులు, మొగ్గలు ఎవరూ చూడటం లేదు. దీనికి వేణువూదడం నేర్పించాలి" అని చెప్పాడు అసిస్టెంట్ తో.

కోతి చేతికి వేణువునిచ్చారు. అది అయోమయంగా చూసింది. కొరడా చెళ్ళుమంది. దానికి ఏడుపొచ్చింది. వేణువులోంచి సంగీతం ప్రవహించింది. అవి తన కన్నీళ్ళని కోతికి
మాత్రమే తెలుసు.

వేణువులోంచి వచ్చే విషాద సంగీతానికి సర్కస్ లో కొత్తకళ వచ్చింది. జీవితం దుర్భరమయ్యే కొద్దీ వేణువులోంచి కొత్త కొత్త పాటలొచ్చేవి. తల్లి పాడే జోలపాట, అడవిపాడే గాలిపాట, జలపాతం పాడే ఏడుపుపాట.

పగిలిపోయిన జీవితాన్ని పాటల్లో వెతుక్కునేది.

సర్కస్ విరామం లేని పని. రాత్రి నిద్రపోతూ ఉండగా వచ్చి లాక్కెళ్ళేవారు.

కొంతకాలం గడిచింది. ఎన్నో ఊళ్ళు మారింది.

సర్కస్ లో కంపెనీ ఒకచోటు నుంచి మరో చోటికి వెళుతూ ఒక అడవిలో విడిది చేసింది.

ఆ అడవి గాలి సోకేసరికి కోతిలో ఎనెన్నో స్మృతులు నిద్రలేచాయి. అది తన మాతృభూమి. ఆ  దాని రక్తాన్ని తట్టిలేపింది. గట్టిగా అరవాలనిపించింది, ఏడవాలనిపించింది. సర్వశక్తుల్ని ఒక్కచోటికి చేర్చి కాలికి కట్టిన తాడుని తెంపుకుంది. కుంటుకుంటూనే పరిగెత్తింది. ఒక కాలిని ఈడుస్తూ, ఆయాసపడుతూ, చెమటలు కక్కుతూ, కన్నీళ్లు తుడుచుకుంటూ, గీరుకుపోతున్న ఒంటిని, కారుతున్న రక్తాన్ని లెక్కచేయకుండా పడుతూ, లేస్తూ, దొర్లుతూ అడవి గుండెల్లోకి పరుగులు తీసింది.

తన అడవి, తన మట్టి, తన వాసన అన్నీ ఆప్యాయంగా చుట్టుముడుతున్నాయి. నేలను పదే పదే ముద్దుపెట్టుకుంది. తన తల్లి తిరుగాడిన నేల, మనుషులు లేని నేల.

ఒంటికాలితో ఆపసోపాలు పడుతూ వస్తున్న ఈ అపరిచితుడెవరా అని కోతులన్నీ ఆశ్చర్యంగా చూశాయి. అందరికంటే ముందు తల్లి గుర్తుపట్టింది. దూరం నుంచే బిడ్డను పసిగట్టింది. బిడ్డవాసన తగలగానే తల్లి గుండె చెరువైంది. ఇక ఎన్నటికీ కనిపించదనుకున్న బిడ్డ కనిపించేసరికి కళ్ళు కన్నీళ్ళతో మసకబారాయి. పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంది. వంకర తిరిగి వున్న కాలుని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. ఒళ్ళంతా తడిమింది. గాయాలను నాకింది. దుఃఖ నదిలా ఉన్న తల్లిని చూసి బిడ్డ ఆమె హృదయంలో మునకలేసింది.

మాటలు గడ్డకట్టిన విషాదం నుంచి తేరుకుని తల్లి కన్నీళ్ళను కొనగోటితో తుడిచి, ఎవ్వరితోనూ మాట్లాడకుండా నేరుగా బాబా వద్దకెళ్ళింది కోతి.
"బాబా" అని గట్టిగా అరిచింది.

బాబా ఒక్కదుటన చెట్టుదిగి వచ్చి కోతిని కౌగలించుకున్నాడు. అవిటి కాలిని చూసి విషాదంగా నవ్వాడు.

"అనుభవానికి మించిన గురువులేడు" అని గొణుక్కున్నాడు.

"బాబా నేనో సత్యాన్ని కనుగొన్నాను" అంది కోతి.

"దాని మూల్యం కూడా తెలుస్తూనే వుంది" అన్నాడు బాబా ఆప్యాయంగా నిమురుతూ. ఆయన గొంతులో దుఃఖపు జీరకదులుతూ వుంది.

కాసేపటి తరువాత కోతి మెల్లగా గంభీరంగా చెప్పింది. "బాబా! అథమ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి వెళ్ళడమే పరిణామక్రమమైతే, ఉన్నతమైన కోతుల నుంచి అథముడైన మానవుడు పుట్టాడనడం అబద్ధం. మనిషి నుంచే కోతి పుట్టడం సత్యం. ప్రపంచంలో సత్యాన్ని తెలుసుకోగోరిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మూల్యం చెల్లించక తప్పదు. నేను కూడా..." ఒక కన్నీటి బొట్టు జారి దాని అవిటి కాలిపై ఉన్న రోమాల మీద పడి ఇంకిపోయింది.

కోతి తన కాలిని ఈడ్చుకుంటూ నిశ్శబ్దంగా అడవిలోకి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత వేణునాదంతో అడివంతా ప్రతిధ్వనించింది.

భూమ్మీద ఉన్న మనుషులందరినీ ప్రశ్నిస్తున్నట్టుగా ఉందా గానం.

***

 

 

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు
Nijamaina Annadata Kids Story