Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda biography

వివేకానంద స్వామి ఉపదేశాలు
నీతిమంతుడవై - ధైర్యశాలివై త్రికరణ శుద్ధి కలిగి వుండు. ఆనీతి నిర్దిష్టమైనదిగా - ఆ ధైర్యం ఎటువంటి సాహసానికైనా వెనుదీయనిదిగా వుండాలి. మత సిద్ధాంతాలు ఏమి బోధిస్తున్నాయని ఆలోచించవద్దు. వీరూ - వారూ అనే భేద భావం లేకుండా సర్వజనుల్ని ప్రేమించాలి.

ప్రేమవల్లనూ - సత్యదీక్ష వల్లనూ - తీవ్ర కృషి వల్లనూ ఎటువంటి మహత్కారమైనా చేయవచ్చు కానీ కపట పరివర్తన వల్ల ఏదీ జరగదు.

భారతదేశమంతా నేడు మృత ప్రాయమై వున్నది. కనుక మనకవసరమైనది రాజసిక శక్తి. దేశ ప్రజాకోటికి అన్న వస్త్రాలు సమకూర్చాలి. వారిని మేల్కొల్పాలి. లేకపోతే వారు రాతిబండల వలే స్తబ్ధులుగా ఉండిపోతారు.

ఆదర్శాలు కల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఆదర్శాలు లేనివాడు ఏభై వేల తప్పులు చేస్తాడు. అందువల్ల ఆదర్శాలు కలిగివుండటం మంచిది.

ఈలోకంలో పిరికిపందలకు స్థానం లేదు. పారిపోవాలని ప్రయత్నించకు. జయించగలనా? లేదా? అని ఆలోచించకు.

పగ తీర్చుకోమని నేనెన్నడూ బోధించలేదు. నేను చెప్పేది బలాన్ని సంపాదించు కొమ్మని మాత్రమే.

ఈ లోకంలో జన్మించినందుకు గుర్తుగా ఏదో ఒక ఘనకార్యాన్ని చేసి మరీ వెళ్ళండి. లేకపోతే మీకూ, రాళ్ళకూ తేడా ఏమిటి?

ప్రతి వస్తువును - ప్రతి సంఘటనను పరిశీలించి గుణ గుణాలను తెల్సుకోండి. ఒకచోట కూర్చుని మన శరీరంలో గల లోపాలను వెతుక్కుంటూ, ఏడవటం వల్ల ప్రయోజనమేముంటుంది? ప్రతికూల వాతావరణాన్ని లొంగదీసి విజయాన్ని సాధించే శక్తి సంపాదించాలి.

ఆస్తిక ధర్మ జీవనమంటే యజ్ఞ యాగాదులు చేయటమూ - సాష్టాంగ నమస్కారాలు చెయ్యటమూ - మంత్రాలు జపించడమూ కాదు. వాటిలో కూడా మంచి గుణం లేకపోలేదు. కానీ ధైర్యంతో సాహసకార్యాలను చేయడానికి మనల్ని పురిగొల్పి పరిపూర్ణత్వాన్ని గ్రహించే శక్తిని కల్పిస్తే అవన్నీ మంచిగుణాలే.

నీవు మొదట దైవ స్థితికి వచ్చి, ఆ తరువాత యితరుల్ని ఆ స్థితికి తీసుకురావటానికి ప్రయత్నించు.

మానవులందరినీ నీవు దేవతా మూర్తిగా భావించు. ఎవరికైనా నీవు సేవ చేయగలవు గాని సహాయం చెయ్యలేవు. తన బిడ్డలలో ఎవరికైనా సహాయం చేయగల శక్తిని పరమేశ్వరుడు నీకు ప్రసాదిస్తే నీవు చాలా అదృష్టవంతుడవు. ఆ సహాయాన్ని ఆరాధనా భావంతో చెయ్యి. వ్యాధిగ్రస్తుని రూపంలోనూ - వెర్రివాని రూపంలోనూ - పాపి రూపంలోనూ పరమేశ్వరుడు మనసేవను పొందడానికి రాగలడు కనుక దరిద్రులూ - దీనులూ ఈలోకంలో మోక్షం కొరకే వున్నారని తెలుసుకోండి.

మానవశరీరంలో వున్న జీవాత్మ ఒక్కటే. మనం పూజించవలసిన దైవము, అన్ని జంతువుల శరీరాలూ అటువంటి దేవాలయాలే గాని అన్నిటిలోనూ మానవునిది అత్యున్నతమైనది. అది కట్టడములలో తాజ్ మహల్ వంటిది. ఆ ఆలయంలో మనం పూజలు చేయలేకపోతే మిగిలిన ఆలయాలన్నీ నిరుపయోగాలే. ఈ సత్యాన్ని మీరు విశ్వసించిన రోజు నానాటికీ అధోగతి పాలవుతున్న ముఫ్ఫయి కోట్ల భారతీయులనూ ఉద్ధరించడానికి మీ సర్వస్వాన్నీ వినియోగించగలమని ప్రతిజ్ఞ చెయ్యండి. ఎవరి హృదయం పేదల కోసం పరితపిస్తుందో వానినే నేను మహాత్ముడంటాను. కానివాడు నిశ్చయంగా దురాత్ముడే. కోట్లాది ప్రజలు అక్షర జ్ఞాన శూన్యులై తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్టలు, నిలువనీడలేక అల్లాడి పోతుండగా వారి మూలాన విద్యావంతుడై కూడా వారి ప్రసక్తినే తలపెట్టని ప్రతి ఒక్కరినీ నేను ద్రోహిగా భావిస్తాను.

సోదర మానవులపై నిజంగా మీకు ప్రేమాభిమానాలుంటే, పరమేశ్వర సందర్శనం కోసం ఎక్కడికో వెళ్ళడమెందుకు? నిర్భాగ్యులందరిలోనూ, దుర్భులు అందరిలోనూ భగవంతుడున్నాడు. వారినెందువల్ల ఆరాధించరు? గంగా మహానదీ తీరాన నూతులు త్రవ్వడమెందుకు? ప్రేమ అనేది సర్వ శక్తివంతమని విశ్వసించండి. పేరు - ప్రతిష్టలనేవి క్షణ భంగురాలు. అవి ఎవరికి కావాలి? మీలో ప్రేమకు స్థానముంటే మీరు సర్వశక్తి సంపన్నులు. దురహంకారాన్నీ, ఓర్వలేని తనాన్నీ విడిచిపెట్టండి.
                                                                                                      

(... వచ్చేవారం మరిన్ని ఉపదేశాలు)

మరిన్ని శీర్షికలు
Tenneti Viswanatham Biography by TVS Sastry