Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
iruku jeevithalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఓంకార మహత్యం - ఆదూరి హైమవతి

omkara mahathyam

'మనహృదయంలోనూ, విశ్వమంతటానూ మారు మ్రోగుతున్నఅనాది ప్రణవనాదము ‘ఓం ‘కారము’. హిందువులకు ఓంకారము పరమ పవిత్రమైనది. ఓంకారము పరమాత్మకు పర్యాయపదము. మనం దైవాన్నిఓంకార రూపంగా భావిస్తాం. ఓంకారమే భగవంతునికి ప్రతీక. భగవంతుని టెలిఫోన్నెంబ ర్ఓంకారం అని చెప్పవచ్చు.

సృష్టికంటేముందు అనాదిలో బ్రహ్మమొక్కటే ఉండేదని చెప్తారు. అప్పుడది మహానిశ్శబ్దంగా ఉండేదిట! అట్టి మహానిశ్శబ్దం నుండి నాదబ్రహ్మము ఉదయించిందిట!  అదియే ఓంకారము. దాని నుండీ పంచభూతాత్మకమైన సృష్టీ వెలువడిందిట! ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి.(పృధి వ్యాపస్తే జోవాయురాకాశములు.) ఓంకారము సృష్టిఅంతా అంతర్లీనమై ఉంటుంది. అందుకే ఓంకారము ప్రణవము.

ప్రణవమనగా ప్రాణములన్నింటిలోనూ, ప్రాణులన్నిట్లోనూ వ్యాపించి ఉన్నదని అర్ధం చెప్పవచ్చు.

వేదమునందు ఇలా ఉంది. "ప్రజాపతివై ఇదం అగ్రఆసీత్ - తస్యవాఃక్ద్వితీయఆసీత్ - వాగ్వైపరమంబ్రహ్మ. - అనగా ఆదియందు ప్రజాపతి ఉండగా అతనితో కల్సి అతని వాఃక్కు ఉండేది, ఆవాఃక్కే పరబ్రహ్మము.

తైత్తిరీయోపనిషత్నందు ఇలా ఉంది. - "బ్రహ్మణఃకోశోసి" అంటే 'ఓంకారమా! నీవు బ్రహ్మమునకు కోశమువంటిదానవు' అని భావము.
ప్రశ్నోపనిషత్లో "ఓం ఇతిఏకాక్షరంబ్రహ్మ" అని ఉంది. అనగా 'ఓం'కారము అనే ఒక్క అక్షరమే 'బ్రహ్మము' అని. ఓంకార ధ్యానమువలన పరమాత్మను పొందనగును. ఋగ్వేదంనుండి ‘అ’కారము, యజుర్వేదంనుండి ‘ఉ’కారము, సామవేదంనుండి ‘మ’కారము పుట్టి, వాటికలయికతో నుండి ఓంకారరూపం ఉద్భవించిందని చెప్తారు.

" యఃపునరేతంత్రి మాత్రేణోమిత్యేతే నైవాక్షరేణపరం పురుషమభిధ్యాయీతస తేజసి సూర్యేసంపన్నః " మాత్రాత్రయ విశిష్టమూ, సూర్యాంతర్గతమూ ఐన పురుషునిగా ఈఓంకారమును ఎవరుధ్యానిస్తారో వారు తేజస్వులై సూర్యుని చేరగలరు' అని అర్ధం.
ముండకోపనిషత్నందుకూడా ఓంకార ప్రాశస్త్యాన్ని గురించిన ప్రస్తావన ఉంది. పతంజలిమహర్షి 'యోగసూత్రము' నందు 'తస్యవాచకఃప్రణవః' అనగా భగవంతునిపేరు  తెలుపునదే ఓంకారము.

అకార, ఉకార, మకారములను మూడు బీజాక్షరముల త్రిపుటియే ఓంకారం. ‘అ’కారము బ్రహ్మము ,‘ఉ’కారము విష్ణువు, ‘మ’కారము మహేశ్వరుని వ్యంజింపజేయు బీజాక్షరములు. ఓంకారము శబ్దప్రపంచమునకు విస్పోటము. శబ్దశాస్త్రమునకు మూలము. ధ్వనిశాస్త్రమునకు సారము. ధ్వనులన్నింటికీ, శబ్దములన్నింటికీ మూలము.

ఓంకారము నాల్గు మానసికావస్థలకు ప్రాతినిధ్యము వహిస్తున్నది. ఓంకారము ఆత్మకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని ఉపనిషత్తులు కీర్తిసున్నాయి. ఆత్మకు 1. జాగ్రదావస్త(మేలుకునిఉన్నస్థితి),2. స్వప్నావస్థ(నిద్రలోకలలుకంటున్నస్థితి) 3. సుషుప్తావస్థ(కలలులేనిగాఢనిద్రావస్థ) ఉంటాయి. ప్రతి మానవుడూ ఈమూడు అవస్థలనూ నిత్యజీవితంలో అనుభవిస్తూనే ఉంటాడు. కానీ యోగులుమాత్రం వీటన్నింటికీ ఉత్తమమైన ,'తురీయావస్థను'  పొందుతారు. ఇది ఇంద్రియాలకు అతీతమైన ఆధ్యాత్మికస్థితి. తురీయావస్థలో యోగులు తమ ఆత్మనిజస్థితిఐన 'సమాధి' అనే ఆత్మానందస్థితిని పొందుతారు. సత్చిత్ ఆనందరూపమైన పరమాత్మస్థితిలో నిల్చిఉండటమే తురీయావస్థ.

ఓంకారమును ఉచ్చరించవలసిన విధానం - ఓంకారమును సాధ్యమైనంత నెమ్మదిగా ఉచ్చరించాలి. నాభిస్థానమునుండీ అకారమును ప్రారంభించి, కంఠస్థానమువరకూ వచ్చి ఉకారము నాలుకపైకి వచ్చి నోటికొసకుచేరి, మకారము పెదవుల కలయికతో ముగిసేలా ఉచ్చరించాలి.

ఓంకారముతో ప్రారంభముకాని మంత్రానికి పూర్ణత్వచేకూరదు. మనం నిత్యజీవితంలో చేసే పూజల్లో మన ఇష్టదైవాన్నికానీ ఏఇతరపూజలూ వ్రతాలూ ఆచరించేప్పుడు కానీ, ఇతరదైవాలనుకానీ పూజించేసమయంలో చేసే అహ్టోత్తర శతనామాలకుముందు ఓంకారం చేర్చనిదే ఆమంత్రోఛ్ఛారణ ఫలించదు, అదివృధా. -'ఓంశ్రీగణేశాయనమః, ఓంశ్రీకృష్ణాయనమః, ఓంనమఃశ్శివాయ, ఓంనమోనారాయణాయ, ఇలా ఓంకారముతో చేరిన నామాలకేఫలం లభ్యమవుతుంది.

మనం ఎలా శ్వాసిస్తామో అంతసహజంగా ఓంకారముతో కూడిన భగవన్నామాన్ని జపించడం అభ్యాసం చేసుకోవాలి. ద్రౌపది, రాధ, భక్తమీరా - వారిహృదయాల్లో జాగ్రద్స్వప్నావస్తల్లోనూ నిరంతరం శ్రీకృష్ణనామాన్ని జపించేవారు. హనుమంతుని రోమరోమానారామనామం వినిపిస్తుందని మనకు తెల్సుకదా!

ఓంకారము మోక్షాన్నికలిగజేస్తుంది. - అమృతత్వాన్నికలిగిస్తుంది. భగవంతునిలో ఐక్యం చేస్తుంది.
భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయమైన 'అక్షరపరబ్రహ్మయోయం' లో శ్రీకృష్ణభగవానుడు ఇలాచెప్పారు కదా!
"ఓంఇత్యేకాషరంబ్రహ్మబ్యాహరన్మామనుస్మరన్యః ప్రయాతిత్యజన్దేహంసయాతిపరమాంగతిం - ఓంఅనూక్షర మొక్కటే బ్రహ్మము. దానిని స్మరించుటనన్ను స్మరించుటయే! ఓంకారమును స్మరించుచూ ఎవరుదేహమును విడుతురో వారుపరమగతియైననన్ను పొందుదురు."
చివరిశ్వాస ఓంకారముతో విడచినవారు తిరిగిచావుపుట్టుకల చక్రభ్రమణంలో చేరరు. మోక్షమును పొందెదరని భగవద్వాణి.

ఓంకారము ఆధ్యాత్మికతతోపాటుగా శ్వాసకోశమును పవిత్రమూ, పరిశుభ్రమూ చేస్తుంది. - ఓంకార మంత్రోఛ్ఛారణవలన మన ఉఛ్వాసనిశ్వాసలతో సమాంతరత ఏర్పడుతుంది. ఓంకారము ప్రారంభించేముందు గుండెనిండా గాలిపీల్చి, క్రమేపీ మెల్లిగా వదలడంవలన ఒకనిర్ధిష్టప్రమాణంతో గాలిపీల్చివదిలే అభ్యాసం ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల నిండా మంచిగాలివెళ్ళి నిదానంగా వదలడంవలన రక్తశుధ్ధి సజావుగా జరుగుతుంది. శరీరారోగ్యం పెంపొంది మనస్సు పవిత్రమై , బుధ్ధివికసిస్తుంది. కనుక ఇట్టి ఓంకారమును మనం నిత్యంధ్యానిస్తూ ఆధ్యాత్మికతతో పాటుగా ఆరోగ్యాన్నీ పొందే ప్రయత్నంచేదాం.

'ఓంకారంబిందుసంయుక్తంనిత్యంధ్యాయంతియోగినః
కామదంమోక్షదంచైవఓంకారాయనమోనమః'.

మరిన్ని శీర్షికలు
Sahajeevanam