Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

ఆగిపోయిన నా మొదటి సినిమా అనుభవాలు :
ఈ కాలమ్ ఒకరిని విమర్శించడానికో, పొగడడానికో ఉద్దేశించినది కాదు. నా అనుభవాలలో అప్పటి పరిస్థితుల్ని బట్టి నేను తీసుకున్న నిర్ణయాలు మంచివైనా, చెడువైనా అవి ఇంకొకరికి పనికొస్తాయని నమ్మి రాస్తున్నాను. దయచేసి, నా రాతల్లో ఏ ఒక్కరినీ చెడ్డవారుగా చిత్రీకరించుకోవద్దని మనవి.

జయంత్ గారి దగ్గర ప్రేమంటే ఇదేరా... సినిమా (వెంకటేష్, ప్రీతీజింటా) షూటింగ్ కి న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు నిర్మాతల్లో ఒకరైన శ్రీ అశోక్ కుమార్ (ఈయన ఆర్టిస్ట్ కూడా) నన్ను చాలా ప్రోత్సహించి, నేను త్వరలో దర్శకుడినౌతానని నలుగురికీ చెప్పేవారు. దాంతో నేను అసోసియేట్ గా మానేసి కొన్ని కథలు తయారుచేసుకుని దర్శకుడిగా ప్రయత్నాలు ప్రారంభించాలని నిర్ణయానికొచ్చేశాను. జయంత్ గారు, తన దగ్గిర వర్క్ చేస్తూనే ఆఫర్ వచ్చాక వెళ్ళమన్నారు. ఫైనాన్షియల్ గా నాకు ఇబ్బంది ఉండకూడదని. ఫారెస్ట్ గంప్ లో టామ్ హారిక్స్ లాగా నేను చిన్నప్పట్నుంచి ఒక పని మొదలెడితే, మంచో, చెడో దాని ఫలితం అనుభవించేదాకా ఆపని తప్ప ఇంకేదీ చెయ్యలేను. జయంత్ గారి దగ్గర వర్కింగ్ ఫ్రీడమ్ చాలా బావుండేది. కాని, అలా సుఖపడితే నాకోసం నేను కష్టపడలేనని భయపడి గ్యాప్ తీసుకోవడానికే డిసైడ్ అయ్యాను.

పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా రచయిత జలదంకి సుధాకర్ గారు పనిచేస్తున్నారు. ఆయన చాలా మంచి మిత్రులు నాకు. అలాగే పరుచూరి వెంకటేశ్వరరావు గారి అల్లుడు డా. రాజగోపాల్ గారు ఆల్రెడీ మూడు సినిమాలు ఆయన నిర్మాతగా తీసి ఆర్ధికంగా కొంత నష్టపోయారు. నేను, జలదంకి సుధాకర్, రాజగోపాల్ గారు కలిసి ఒక చిన్న సినిమా(లవ్ స్టోరీ) తీసి సినిమా కంటే పబ్లిసిటీ కి ఎక్కువ ఖర్చుపెట్టి రిలీజ్ చేయాలని ఫ్లాన్ చేశాం. 50 లక్షల్లో సినిమా ఫస్ట్ కాఫీ తెచ్చి, 30 లక్షలు పబ్లిసిటీ చేస్తే సినిమా ఏ  మాత్రం బావున్నా రెండున్నర కోట్లు తెచ్చిపెడుతుందని అంచనా. ఇవాళ నడుస్తున్న ట్రెండ్ కి పునాది అప్పుడు మేమేసిందే. దానికి సంగీత దర్శకుడిగా ఆర్.పి. పట్నాయక్ ని ఫిక్స్ చేశాం. అది జరుగుంటే ఆర్.పి. కి అదే మొదటి సినిమా.

అప్పటికే మిత్రులు త్రివిక్రమ్, సునీల్, యోగి, నివాస్, దశరథ్, ఆర్.పి., చంద్రసిద్ధార్ధ, శోభన్ అంతా ఒకరొకరే స్వంతంగా పైకి రావడానికి కసిగా కృషి చేస్తున్న రోజులు. అందరం త్రివిక్రమ్ రూమ్ దగ్గిర అడపాదడపా కలుస్తుండే వాళ్ళం. ఆ జోష్ లో నా సినిమా మొదలైపోతుందని చాలా నమ్మకంగా ఉన్నాను. టైటిల్ 'నువ్వంటే నాకిష్టం'. రాజగోపాల్ గారి స్వంత ఊరెళ్ళి లోకేషన్లు చూసొచ్చేశాం. సుధాకర్ గారి స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వగానే పరుచూరి బ్రదర్స్ ని రిక్వెస్ట్ చేసి కరెక్షన్స్ చేయించేశాం. 'సీతారాముల కళ్యాణం చూతము రారండి' హీరో వెంకట్ గారిని, హీరోయిన్ గా తెలుగమ్మాయి మాన్యని ఫిక్స్ చేసి ఫోటో షూట్ చేశాం. రిలీజ్ కి వేసే వాల్ పోస్టర్లు ముహూర్తం రోజుకే వేసి జనానికి, పరిశ్రమకి థ్రిల్ ఇద్దామనుకుని పోస్టర్లు ఫ్రింట్ చేసేశాం. ఆర్.పి. పట్నాయక్, నేను వైజాగ్ వెళ్లి ఆశీర్వాద్ స్టూడియోలో రెండు పాటలు రికార్డ్ చేసేశాం. ఆ పాటల్లో ఒకటే మిత్రులు కాశీ గారి సినిమా 'నువ్వు లేక నేను లేను' లో 'నువ్వంటే నాకిష్టం' అని మొదలయ్యే పాట. సంగీతం ఆర్.పి. పట్నాయక్.

వైజాగ్ వెళ్ళేటప్పుడు ట్రెయిన్ లో నేను, ఆర్.పి. ఇద్దరం ఎదురెదురు బెర్త్ ల్లో కూర్చుని స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటుంటే విజయవాడ స్టేషన్ లో ఓ కుర్రాడు కంపార్ట్ మెంట్ తుడుస్తూ నా కొత్త షూస్ కొట్టుకెళ్ళిపోయాడు. అంతక్రితమే 'ప్రేమంటే ఇదేరా' షూటింగ్ కి న్యూజిలాండ్ నుంచి రిటర్న్ లో వస్తూ సింగపూర్ లో కొన్న రీబాక్ షూస్. సరే, మంచిదేలే కాలిజోడుపోవడం అని సరిపెట్టుకుని వైజాగ్ లో దిగగానే చెప్పులు కొనుక్కున్నాను. ఆడ, మగ గొంతులు రెండూ ఆర్పీయే పాడి సాంగ్ రికార్డింగ్ అద్భుతంగా చేశారు. అది చూడడానికి వచ్చిన మా మేనత్త రత్నం గారు, మావయ్య బసవరాజు గారు, పెద్ద పెదనాన్న శ్రీనివాసమూర్తి గారు, వేణి పెద్దమ్మ, నానీ పెదనాన్న గారు, కళ్యాణి పెద్దమ్మ, గొల్లపూడి రామకృష్ణ గారు అందరూ ఆర్.పీ ప్రతిభకి మంత్ర ముగ్ధులయ్యారు. వెనుక నుంచి ఆర్.పీ పాడుతుంటే చూసి, మగ గొంతు సరే, ఆడగొంతు ఎక్కణ్ణుంచి వస్తోందిరా అనడిగారు. అదీ ఆర్.పీ. యే అనేసరికి వాళ్ల షాకింగ్ ఫేసెస్ ఈ రోజుకీ నాకు గుర్తే.

సరే, రికార్డింగ్ అయ్యాక మా చిన్ను బావ కొత్త ఫ్లాట్ కొంటే, అది ఖాళీగా ఉందని మా అత్తయ్య నాతో గణపతిహోమం చేయించారు. సినిమా పేరు, నిర్మాత పేరు, బ్యానర్ పేరు సంకల్పంలో చెప్పి నేను, ఆర్. పీ. చేశాం.

ఆ రాత్రి హైదరాబాద్ నుంచి ఫోన్. మా ఇంట్లో పార్క్ చేసి ఉన్న మా మారుతి 800 కారు ఎవడో కొట్టేశాడని. పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవడం కోసం చిన్నప్పట్నుంచి "ఒక చెడు జరిగితే, దాని వెనకే ఇంకో మంచి జరుగుతుందని' చెప్పి పెంచారు నన్ను. కానీ జీవితంలో అలాంటి లాజిక్కేం లేదని, చెడు తర్వాత కూడా చెడు జరగొచ్చని, అసలెప్పుడైనా ఒక వ్యక్తికి మంచో, చెడో ఏదో ఒకటి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా జరగొచ్చని, మన రేంజ్ ని బట్టి, కెపాసిటీని బట్టి దాన్ని తట్టుకోవడమో, లేకపోవడమో జరుగుతుందని నాకర్థమైంది అప్పుడే.

కొన్నాళ్ళకి కారు దొరికింది గానీ, ఇంజను, సీట్లతో సహా పార్టులన్నీ పోయాయి. ఫింగర్ ఫ్రింట్స్ దొరక్కుండా కారు బాడీని కూడా మంటపెట్టి అంటించేశారెవరో. రిపేర్ కి రెండు లక్షలైంది. మళ్ళీ రెండేళ్ళ తర్వాత తిరుపతి నుంచి వస్తూ నేను, సతీష్, వివేక్, మూర్తి మావయ్య యాక్సిడెంట్ కి గురయ్యాక, ఇంకా ఆకారుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అమ్మేశాం. లేకపోతే దాని ఎకౌంట్ లో నా జీవితం బేకార్ అయిపోతుందని భయమేసింది.

సరే, ఈలోగా హైదరాబాద్ వచ్చాం. ముహూర్తానికి వారం రోజులుందనగా, రాజగోపాల్ గారు నన్ను గండిపేట వరకు లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లి, షార్ట్ మెసేజ్ ఇచ్చారు. ఫండ్స్ పూర్తిగా రెడీ కాలేదు కాబట్టి పదిరోజుల షెడ్యూల్ చేసి బ్రేక్ ఇచ్చి, రషెస్ ఎవరికన్నా చూపించి ఫైనాన్స్ ఎరేంజ్ చేసుకుంటానని. మొత్తం డబ్బులు రెడీగా లేకపోతే సినిమా మొదలు పెట్టద్దని, చిన్న సినిమా సింగిల్ షెడ్యూల్ లో చేసి వేడిగా రిలీజైపోవాలని లేకపోతే ల్యాబ్ లో ఆగిపోయే అవకాశాలే ఎక్కువని నేను ఆయనకి చెప్పి, సినిమా ఆపేశాను. నా ఉద్దేశం నిర్మాతగా ఆయనకి నష్టం రాకూడదని. ఆయన వల్ల నాకు పరుచూరి బ్రదర్స్ తో ఉన్న రిలేషన్ పాడవ్వకూడదని. తర్వాత ఆయన సినిమా ప్రయత్నాలు మాని రియల్ ఎస్టేట్ లో బాగా నిలదొక్కుకుని హ్యాపీగా ఉన్నారనుకోండి. ఇప్పటికీ మేం మంచి స్నేహితులమే.

ఆ తర్వాత రెండేళ్ళకి నేను 'మనసంతా నువ్వే' తీశాను. దానికి మళ్ళీ ఆర్.పీ. నే కావాలని పట్టుపట్టడానికి ఆ సినిమాయే కారణం. అల్లుడి చేతులు మరోసారి కాలకుండా ఆపినందుకు మా గురువులు పరుచూరి బ్రదర్స్ కూడా నన్ను మనసులో అభినందించారు. నేను అరసెకనులో ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంది.

సురేష్ ప్రొడక్షన్స్ లో తాతా మనవడు సినిమా ఫస్ట్ కాఫీ చూసి రామానాయుడు గారు, సురేష్ బాబు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. గుండెలకి హత్తుకునే సినిమా అని, సిల్వర్ జూబ్లీ ఆడుతుందని. రిలీజయ్యాక ప్రేక్షకుల తీర్పు చూసి మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారు అంచనా తప్పయిందని. అంత పెద్ద నిర్మాత, అంత అనుభవం ఉన్న వ్యక్తే ఫస్ట్ కాఫీ చూసి ఆడియెన్స్ ని అంచనా వేయలేకపోతే, సగం తీసిన సినిమా రషెస్ చూసి హిట్ అవుతుందని నమ్మి డబ్బు పెట్టే అంత నిష్ణాతుడెవరుంటారు? అందుకే పెద్ద నిర్మాతలు, దర్శకులు రచయితల్ని నమ్ముతారు. గౌరవిస్తారు.

కాగితం మీద తీసుకున్న నిర్ణయాలే ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి గాని, కరెన్సీ కొంత ఖర్చయ్యాక స్క్రీన్ మీద తీసుకునే నిర్ణయాలు ఫిఫ్టీ - ఫిఫ్టీయే. అది తెలిసే నేనూ రచయితల్ని గౌరవిస్తాను, నమ్ముతాను వాళ్లతోనే ఎక్కువ సమయం గడుపుతాను.

(వచ్చేవారం... వేచి చూడండి)

 

మీ
విఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
lady directors