Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ముఫ్ఫయ్ నాల్గవ భాగం

anubandhalu telugu serial thirty fourth Part

"వాడు చెప్పొద్దంటే మీరు చెప్పరా? ఎక్కడ? వాడెక్కడ? గొప్ప డాక్టర్ గదా ఎన్ని అబద్ధాలు ఆడినా చెల్లిపోతుంది అని అనుకుంటున్నాడా? చిన్నప్పుడు చింత బెత్తంతో కొట్టిన దెబ్బలు వాడికి గుర్తుకు రావాలి. అన్నన్నా... మొగుడు ఏమైపోయాడో, పిల్లలు ఎలా ఉన్నారోనని ఓ పక్క కోడలు పిల్ల దిగులు పెట్టుకొని, ఏం చేయాలో తెలియక నేను కుమిలిపోయి... వదలను... ఇవాళ వాడు కూడా నా చేతిలో దెబ్బలు తినాల్సిందే... ఎక్కడరా వాడూ...? చేతికర్ర పుచ్చుకొని పూనకం వచ్చినట్లు" అరిచింది అన్నపూర్ణేశ్వరి.

"అమ్మా! నువ్వు కొంచెం కోపం తగ్గించుకొని చెప్తే మాకు అర్ధమవుతుంది. తమ్ముడు మీతో అబద్ధాలు చెప్పడమేమిటి?" అని అడిగాడు రామలింగేశ్వర్రావు.

"మీకు తెలీదా? ఒకటా... రెండా... ఒకసారి కెనడాకని చెప్పి ఇక్కడకు వచ్చాడా? తిరిగి అమెరికా రాగానే ఫోన్ నెంబర్లు మార్చేసాడా? ఇంకోసారి జర్మనీకని చెప్పి మళ్ళీ ఇక్కడకు వచ్చి ఉండిపోయాడు. ఓ కబురు లేదు కాకరకాయ లేదు. పైగా ఐదు వందలకోట్లు షేర్లలో నష్టం వచ్చిందని అబద్ధాలు చెప్పి అందర్నీ ఏడిపించాడు."

"అయ్యబాబోయ్... షేర్లలో నష్టం రావడం నిజం కాదా? జిన్ లేబోరేటరీ కుప్పకూలడం నిజం కాదా?" నమ్మలేనట్టు అడిగాడు రఘునాథ్.

"ఆ మాట నిజమే. కానీ వీడి షేర్లు ఉన్నది ఆ కంపెనీలో కాదు జెన్ ఫార్మా లాబొరేటరీస్ అనే వేరే కంపెనీ. ఆ డబ్బంతా నిక్షేపంగా ఉంది. వీడు అబద్ధాల పుట్టగా మారిపోయాడు
ఇంతకీ ఎక్కడవాడు? ముందు వాడిని పిలవండి? అనంత్, శివానీలు ఎక్కడ?"

"అంతా వస్తారు. మీరు స్థిమితంగా కూర్చోండి అత్తయ్యా!"

"భ్రమరా! వాళ్లను కూర్చోబెట్టి ఏం కావాలో చూడు. అరే నవీన్! బయటకెళ్లి లగేజ్ తీసుకురా..." అన్నాడు రఘునాథ్.

నవీన్ తో పాటు మహేశ్వరి కూడా లగేజ్ కోసం వీధిలో కొచ్చింది. అమ్మమ్మ చేతికర్రను రైతుకిచ్చి పంపించేసి, లగేజ్ అందుకున్నాడు నవీన్. అన్నాచెల్లెళ్ళు లగేజ్ ను లోనకు
తెచ్చి అలా దించారో లేదో వీధిలో ఏదో కారు రివ్వున వచ్చి ఆగిన చప్పుడైంది. నవీన్ తో పాటు మహేశ్వరి కూడా డోర్ లో కొచ్చి బయటకు చూసింది.

అదే సమయంలో - టాక్సీలోంచి దూకిన శివానీ ఎదురుగా డోర్ లో కన్పించిన నవీన్ ని చూడగానే లేడిపిల్లలా దూసుకువచ్చి అతన్ని వాటేసుకొని ఏడ్చేసింది. టాక్సీని పంపించేసి వస్తున్న అనంత్ ను చూడగానే బయటకు పరిగెత్తి అతని కౌగిట ఒదిగిపోయింది మహేశ్వరి.

శివానీ తనను కౌగలించుకోగానే కంగారు పడ్డాడు నవీన్. లోపలున్న వాళ్లకు తాము స్పష్టంగా కన్పిస్తారు.

"బావా! డాడీ మాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నువ్వేం చేస్తావో తెలీదు ఇక్కడి నుంచి వెళ్లను" అంది చిన్నగా ఏడుస్తూనే శివానీ.

"నువ్వు కొంచెం నన్ను వదిలేస్తే బాగుంటుంది. వాళ్లంతా మనల్ని చూస్తున్నారు" ఆమెని సముదాయిస్తూనే హెచ్చరించాడు.

"ఎవరు?"

"అమెరికా నుంచి అమ్మమ్మ, అత్తయ్యా వచ్చారు."

"ఏమిటి?"

"ఓసారటు చూడు".

అప్పుడు చూసింది. ఎదురుగా అందరి మధ్యన నానమ్మను, అమ్మను చూడగానే కంగారుపడి చటుక్కున అతన్ని వదిలేసింది.

తల్లిని చూడగానే దుఃఖం ఆగలేదు శివానీకి.

"అమ్మా!" అంటూ పరుగెత్తి సత్యవతి కౌగిట్లో వాలిపోయింది.

పిల్లల్ని చూసిన ఆనందంలో సత్యవతికి నోటమాట రాలేదు. కళ్ళు చెమర్చాయి. తల్లి పక్షి తన బిడ్డను అక్కున చేర్చుకున్నట్లు కూతుర్ని కౌగిట పొదువుకుంది. ఈలోపల అటు అనంత్, మహేశ్వరిలు కూడా లోపలకు వచ్చారు.

అన్నపూర్ణమ్మ తన కళ్ళను నమ్మలేకపోతోంది. మనవరాలు శివానీలో ఇంత మార్పు - ఆమె ఊహించని మార్పు.

చక్కగా వాలుజడ, నుదుట బొట్టు, చేతుల నిండా గాజులు, చెవులకు, మెడలోనూ సింపుల్ గా బంగారు ఆభరణాలు. నిండుగా చీర, జాకెట్, తలలో మల్లెపూలతో, పాదాలకు పట్టీలతో సాక్షాత్తూ మహాలక్షీలా ఉన్న మనవరాలిని చూడ్డానికి ఆవిడకి రెండు కళ్ళూ చాలడం లేదు. అమెరికాలో మిడ్డీలు, ఫ్రాక్ లు ధరించిన శివానీకి ఈ శివానీకి ఎక్కడా
పోలికలేదు.

"ఎవరూ... శివానీ నువ్వేనా... చీరకట్టి, గాజులు వేసి, ఈ ముసల్ది నన్ను జిప్సీలా మార్చాలని చూస్తోందంటూ నా మీదే మండిపడిన నా మనవరాలు శివానీయేనా ఇది?" అంటూ అన్నపూర్ణేశ్వరి అడుగుతుంటే సిగ్గుపడిపోతూ...

"పో నానమ్మ..." అంటూ తల్లిని వదిలి నాయనమ్మను కౌగిలించుకుంది సాయిశివానీ.

అంతేకాదు - "నాయనమ్మా! బావా, నేనూ ఇష్టపడుతున్నాం. ప్రేమించుకున్నాం. పెళ్లిచేసుకోవాలనుకున్నాం. కానీ అత్తయ్యా, మావయ్యా మారిపోయారు. నాన్నగారు షేర్లలో దివాళా తీశారని, బావకి మహేశ్వరికి వీళ్లు వేరే సంబంధాలు చూస్తున్నారు" అంటూ పిర్యాదు చేసింది.

"ఓసి... ఈ మాత్రం దానికే ఏడవాలా? మేం వచ్చేశాంగా. నువ్వు కంగారుపడకు. అంటూ మనవరాలికి ధైర్యం చెప్పింది ఆవిడ.

"అంతేకాదు నాయనమ్మా డాడీ కూడా మాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చూపులకి గన్నవరం తీసుకువెళ్లాలని చూస్తే తప్పించుకుని అన్నయ్యా, నేనూ పారిపోయి
వచ్చేశాం. అన్నయ్యకు మహేశ్వరి అంటే ప్రాణం. వీళ్లు మా పెళ్లిళ్లు చేయరు" అంది.

"చేయరా?... చేయకపోవడానికి వాళ్లెవరు? నువ్వాగు అసలేం జరుగుతోందిక్కడ? మీ నాన్న ఎక్కడ?"

"బెజవాడలో ప్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్నాం కదా. అన్నయ్యా, నేనూ ఉద్యోగాలు చేస్తున్నాం హోటల్లో."

"ఓరి దేవుడా మీరు ఉద్యోగాలు చెయ్యాల్సిన ఖర్మేమిటి? ఆగు..." అంటూ మనవరాలిని వదిలించుకొని.

అల్లుడిని, కూతుర్నీ కోపంగా చూసింది.

"ఏమె భ్రమరా... ఏమిటే ఇదంతా? నీ పిల్లలకి బయట సంబంధాలు చూస్తున్నావా?" అంటూ నిలదీసింది.

"అమ్మా... అదేం లేదే! ఇది కూడా అన్నయ్య ఆడించిన నాటకంలో భాగమే. మా తప్పులేదు. మీ అనుమానాలు తీరాలంటే చిన్నన్నయ్యనే అడుగు. నన్నడిగితే అన్నయ్య వీళ్లకి వేరే సంబంధాలు చూడ్డం కూడా అబద్ధమే. నా పిల్లల్ని చేసుకోకపోతే ఊరుకుంటానా ఏమిటి?" అంది.

"ఓసి మీ ఇల్లు బంగారం కాను. ఒక్కటీ అర్ధమై చావడం లేదు కదరా... ఒరేయ్ పెద్దోడా గోపాల్ కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. తొందరగా..." అని అరిచింది.

సరిగ్గా అదే సమయంలో బయట దుమ్ము తెరలు రేపుతూ వచ్చిన టాక్సీ ఏదో సడన్ బ్రేక్ తో ఆగింది. కారు దిగింది ఎవరో కాదు. డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ.

టాక్సీని పంపించేసి, హడావుడిగా లోనకు వస్తూనే ఎదురుగా... మొత్తం కుటుంబాన్ని చూడగానే ఆగిపోయాడు.

ఆయన్ని చూడగానే "ఏమండీ..." అంటూ ఆనందంగా పరిగెత్తబోతున్న కోడలు సత్యవతిని కోపంగా వెనక్కి లాగింది అన్నపూర్ణేశ్వరి.

"వాడు కనబడగానే పరిగెత్తడమేనా? నువ్వాగు... ఒరేయ్... రారా లోపలికి రా..." అని అరిచింది.

"అమ్మా... ఎప్పుడొచ్చారు మీరు... అంత కోపం దేనికి?" అంటూ లోనకోచ్చాడాయన.

"కోపం దేనికో... నీకు తెలియదా? అసలేమనుకుంటున్నావురా నువ్వు? ఇన్ని అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావు? ఇప్పుడు నిజాలు చెప్పకపోతే నిన్ను వదలను. పెద్దోడికి
తగిలినట్టే నీకూ నాలుగు తగిలితే గానీ బుద్ధి రాదంటూ..." ఆయన ఒక పెద్ద డాక్టర్ అని కూడా చూడకుండా భుజం మీద నాలుగు చరిచింది.

బిడ్డ ఎంత పెద్దవాడైనా, గొప్పవాడైనా అమ్మకు ఎప్పుడూ పసివాడేగా. తల్లీబిడ్డల అనుబంధంలో, మమకారంలో గొప్పతనం అలాంటిది. తల్లి చేతిలో దెబ్బలు తిని కూడా నవ్వుతూ ఆమెను వారించి, కన్నీళ్లు తుడిచాడు.

"అమ్మా... ఇంకా నీకు అర్ధం కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది! నీ మనవడు, మనవరాలు ఎంతగా మారిపోయారో చూసావుగా? వాళ్లలో ఈ మార్పు తీసుకురావడం కోసమే ఇన్ని
అబద్ధాలు, నాటకాలు. ఇప్పుడు వాళ్లు అమెరికా పిల్లలు కారు. అచ్చమైన ఆంధ్రా పిల్లలు. తెలుగింటి బిడ్డలు" అంటూ సగర్వంగా చెప్పాడు.

"అయితే వేరే సంబంధాలు చూడ్డం?" నమ్మలేనట్టు అడిగింది.

"సర్లే... అలాంటి పనిచేస్తే నా చెల్లెలు ఊరుకుంటుందా?... వీళ్లందరి సహకారం వల్లే అది సాధ్యపడింది. పిల్లల విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది నా పరిస్థితి. వీళ్లని మన సంస్కృతికి మార్చాలంటే కొంచెం కఠినంగా ఏదన్నా చెయ్యాలన్పించింది. చేసాను. దీనికోసం మిమ్మల్ని కష్టపెట్టాను. క్షమించండి. నేను తెలుగు వాడిని. ఏ దేశంలో ఉన్నా నా బిడ్డలు తెలుగు వాళ్లుగానే ఉంటారు. ముందు తరాలు తెలుగు తనంలోనే ప్రకాశిస్తాయి.

అమ్మా! నీ ఆశయం నెరవేరుతుంది.

కుండ మార్పిడి పద్ధతిలో రెండు జంటలకు పెళ్ళిళ్ళు చేసి, కోడల్ని, అల్లుడిని కూడా మాతో పాటు అమెరికా తీసుకుపోతాం. సరిగ్గా రెండేళ్ల తరువాత ముందుగా నవీన్, శివానీలను ఇక్కడకు పంపిస్తాను. హాస్పిటల్ నిర్మాణం బాధ్యతలు వాళ్లు చూసుకుంటారు. మీరు వాళ్లకు సహకరిస్తారు. సరిగ్గా నాలుగేళ్ల తరువాత అనంత్, మహేశ్వరిలను ఇండియా పంపిస్తాను. వాళ్లతో పాటే హాస్పిటల్ కి కావాల్సిన ఆధునాతన పరికరాలు అన్నీ వస్తాయి. ఆపై సంవత్సరం అంటే ఐదేళ్ళ తరువాత అమెరికాలోని ఆస్థులన్నీ అమ్మేసి ఆ డబ్బుతో నేనూ, సత్యా ఇండియా తిరిగి వచ్చేసి ఆస్పత్రిని ఆరంభిస్తాము. విజయవాడ, హైద్రాబాద్, తిరుపతి, వైజాగ్ నాలుగుచోట్ల నీ పేరు మీద అన్నపూర్ణేశ్వరి హాస్పిటల్స్ ప్రారంభమౌతాయి. నువ్వు కోరుకున్నట్టే అరుదైన గుండె ఆపరేషన్లు కూడా పేదవాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ఇంతకన్నా ఏం కావాలి?" అంటూ మనసులో మాట వివరించాడు డాక్టర్ గోపాల్.

అతడు చెప్పింది విని అంతా సంతోషించారు.

ముఖ్యంగా నవీన్, సాయిశివానీ, మహేశ్వరి, అనంతసాయిల ఆనందానికి హద్దులేదు.

తమలో మార్పు తీసుకురావడం కోసం తండ్రిపడిన తపన అర్ధంకాగానే శివానీ, అనంత్ లు ఆయన్ని కౌగిలించుకొని సారీ చెప్పారు.

ఆపై మున్నలూరులోనే మునుపెన్నడూ ఎవరింటా జరగనంత వైభవంగా అన్నపూర్ణేశ్వరి ఇంట రెండు జంటలకు వైభవోపేతంగా వివాహాలు జరిగాయి. ఏలూరు నుంచి రామశాస్త్రులు, అమరావతి నుంచి శంకుశాస్త్రి వచ్చి దగ్గరుండి ఘనంగా పెళ్లిళ్లు జరిపించారు.

ఆపై నెల్లోనే డాక్టర్ గోపాల్ తన భార్యాబిడ్డలతో పాటు కూతుర్ని, అల్లుడుని, కొడుకుని కోడల్ని తీసుకొని తిరిగి అమెరికా బయల్దేరాడు.
 

- శుభం -

 

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
duradrustapu dongalu