Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'గ్రీకు వీరుడు' - చిత్ర సమీక్ష

greeku veerudu - movie review
చిత్రం: గ్రీకు వీరుడు
తారాగణం: నాగార్జున, నయనతార, మీరా చోప్రా, విశ్వనాథ్, బ్రహ్మానందం, కోట, ఎం ఎస్, శరత్ బాబు, ఆలి, వెన్నెల కిషోర్ నాగినీడు తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: శివ ప్రసాద రెడ్డీ
దర్శకత్వం: కొండపల్లి దశరథ్ కుమార్
 
దాదాపు దశాబ్దం క్రితం నాగార్జునతో 'సంతోషం' తీసి, మొన్నీమధ్య రెండేళ్ళ క్రితం 'మిస్టర్ పర్ఫెక్ట్' తీసి సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలు తీస్తాడనే పేరున్న దశరథ్ మళ్ళీ నాగర్జున తో జట్టు కట్టి 'గ్రీకు వీరుడు' చిత్రం తో ఈ రోజు మన ముందుకొచ్చారు. ఈ చిత్రం కథా, కమామిషు వ్యవహారాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 
క్లుప్తంగా చెప్పాలంటే:
బంధాలు, బాంధవ్యాలు వంటి వాటి మీద అస్సలు నమ్మకం లేకుండా కేవలం సంపాదనే సర్వస్వం అనుకుంటూ అమెరికాలో ఉంటూంటాడు చందు (నాగార్జున). ఆ పధ్ధతికి భిన్నంగా ఉండే వ్యక్తి సంధ్య (నయన తార). వీరద్దరు ఎలా కలుస్తారు, ఎవరి ప్రభావం ఎవరి మీద పడి ఎవరు ఎలా మారతారు అనేది ఈ చిత్ర కథా గమనం.
 
మొత్తంగా చెప్పాలంటే:
చందు కి వ్యాపారం లో పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. వారంలో పాతిక కోట్లు అవసరం అవుతాయి. ఎలా సమకూర్చుకోవాలో తర్జన భర్జన పడుతుంటాడు. అనుకోకుండా ఇండియాలో తన తాతకు  ఆస్తి వేయి కోట్లు ఉందని, దానిని తన మేనత్తలకి రాసేసాడని అందుకు తాను సంతకం పెడితే తప్ప ఆ విల్లు చెల్లదని తెలుస్తుంది చందుకి. దాంతో ఏదో విధంగా తనకి కావల్సిన ఆ పాతిక కోట్లైనా తెచ్చుకోవాలని ఆ ఊరు వస్తాడు. ఇదిలా ఉంటే "మేక్ ఎ విష్" పేరుతో జబ్బుతో చనిపోబోయే పిల్లల కోర్కెలు తీర్చేందుకు సంధ్య కూడా ఇండియా వస్తుంది. ఆ తర్వాత కథంతా దశరథ్ మార్కులో సాగుతుంది.

నాగార్జున మొత్తానికి ఆహార్యంలో యువకుడిగా కనిపించే ప్రయత్నం చేసారు. పాస్ అయ్యారు. పక్కన నయనతార కూడా కంటికింపుగా ఉంది. ఇతర తారాగణమంతా కథకు తగ్గట్టుగా చేసుకుపోయారు.

సంతోషం లో దశరథ్ చూపిన లోతు కాని, మిస్టర్ పర్ఫెక్ట్ లో చూపించిన మాస్ అప్పీల్ కాని ఈ గ్రీకు వీరుడు లో కనపడవు. అలాగని ఎక్కడా వేలెత్తి చూపేలాగ కూడా లేదు. అదే పనిగా నలుగురికీ "ఈ సినిమా బాగుంది తప్పకుండా చూసెయ్యండి " అని బాకా ఊదడానికి కూడా విశేషం లేదు. ఏ అంచనాలతో థియేటర్లోకి వెళ్ళినా బయటకు వచ్చేటప్పటికి డబ్బు, సమయం వృధా అయ్యాయన్న ఫీలింగ్ మాత్రం రాదు.

కథనం, సన్నివేశ కల్పన చాలా చోట్ల పాత చింతకాయలాగ అనిపిస్తూంది. ఎన్నో సినిమాల్లో బ్రహ్మానందం, కోవై సరళల మధ్య చూసిన ముతక కామెడీ ఇందులో ఎం ఎస్ నారాయణ- కోవై సరళల మీద సాగుతుంది. 'సార్ ఒస్తారా' పాట బిట్ కూడ వీళ్ళ మీద పెట్టారు. ఎప్పుడో  తేజ  లాంటివాళ్ళు పదేళ్ళ క్రితం ఇలాంటి ప్రయోగాలు చేసాడు. ఇప్పుడు అవన్నీ ఔట్ డేటెడ్.

నిర్మాణం విషయంలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఖర్చును చాలా కంట్రోల్ లో పెట్టి తీశారు. నాగార్జున మార్కెట్ వాల్యూ ని దృష్టిలో పెట్టుకుని చాలా పకడ్బందీగా తీసిన సినిమా అనిపిస్తుంది. దానివల్ల ఈ సినిమా ఆర్ధికంగా నష్టపోయే సూచన అసలు లేదు. ఖర్చుతో కూడుకునే సన్నివేశాలు చాలా వరకు గ్రాఫిక్స్ తో లాగించేసారు.

మొదటి సగం మెల్లిగా సాగుతూ జోల పాడినట్టు ఉన్నా, రెండవ సగం స్పీడందుకుంటుంది. చివరికి వచ్చే సరికి జంధ్యాల గారి అహనా పెళ్ళంట గుర్తొస్తొంది. అంటే పొట్ట చెక్కలయ్యే నవ్వులు ఉన్నాయని కాదు....ఆఖరి సన్నివేశం లో అహనా పెళ్ళంటలో చెవిటి పాత్రలో ఉండే గుండు హనుమంత రావుని గుర్తు చేస్తూ ఇక్కడ జయ ప్రకాశ్ రెడ్డి, హీరోయిన్ ని పెళ్ళి చేసుకునేందుకు అక్కడ అమాయక పెళ్ళికొడుకులు వచ్చినట్టు ఇక్కడ వెన్నెల కిశోర్ రావడం మొదలైనవన్నమాట.

పాటలు వినడానికి బాగున్నంతగా చూడడానికి బాలేవు. నేపధ్య సంగీతం ఫర్వాలేదు..ఎక్కడా ఇబ్బంది పెట్టదు.

ఎలాగో వేసవి సెలవుల సీజన్ అవడం, ఆ పైన ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే నాగార్జున హీరో కావడం వల్ల 'గ్రీకు వీరుడు' పాస్ అయిపోవడంలో సందేహాలు లేవు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే: గ్రీకు వీరుడు గెలిచాడు.

అంకెల్లో చెప్పాలంటే: 3/5
మరిన్ని సినిమా కబుర్లు
aaditya hrudayam - vn adithya