Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
aaditya hrudayam - vn adithya

ఈ సంచికలో >> సినిమా >>

రాజా మ్యూజిక్ ముచ్చట్లు

అఖిల్ రికార్డ్ ని బ్రేక్ చేసిన నాగార్జున
ఇప్పటికీ ఈ స్టిల్స్ చూడగానే చెప్పేసే వారున్నారు - 'వెలుగు నీడలు' సినిమాలోని 'చల్లని వెన్నెల సోనలు' పాటల్లోనివి అని. అలాగే వీటిల్లో వున్నది సావిత్రి, గిరిజ అని ఈ తరంలో కూడా పోల్చుకునే వాళ్ళున్నారు. కానీ ఎవరూ విప్పి చెప్పలేని ఓ తమాషా రహస్యం ఒకటుంది ఈ పాటలో. అదేమిటంటే ... ఈ పాటలో నెలల పిల్లవాడు గా కనిపిస్తున్నది ... అక్కినేని నాగార్జున. నిజం... ఈ సంగతి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏయన్నార్ గారికి కూడా తెలీదు. అదెలా జరిగిందంటే ...

'వెలుగు నీడలు' సినిమాలోని ఈ పాటలో - మొదట ఓ చిన్నబాబు, ఆ తర్వాత కొంచెం పెరిగిన ఓ అబ్బాయి - ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. సమయానికి నెలల పిల్లవాడు దొరకలేదు. "అదేంటర్రా ... మన పాప రెండో కొడుకున్నాడుగా .. తీసుకురండి" అన్నారు చిత్ర నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారు.

పాప అంటే అక్కినేని నాగేశ్వర రావు గారి సతీమణి అన్నపూర్ణ. ఆమెను ఇంట్లో అలాగే పిలిచేవారు. ఏయన్నార్ ఎదుగుదలకు సంబంధించి ఆయన చలన చిత్ర జీవితం లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ దుక్కిపాటి మధుసూదన రావు గారి పాత్ర ఎంతుందో అందరికీ తెలుసు. "నేనెవ్వరితోనైనా వాదించగలనేమో గాని ఆయన దగ్గిర నోరెత్తే ప్రసక్తే లేదు. చాలాసార్లు పాత్రకి సంబంధించి ఇలావుంటే బాగుండుననిపిస్తే సావిత్రి తో అడిగించే వాణ్ణి" అంటారు అక్కినేని - దుక్కిపాటి వారి గురించి.

అటువంటి దుక్కిపాటి వారు ఆర్డరేస్తే తిరుగేముంది? ఎయన్నార్ గారింటికి వెళ్లి  నాగార్జున ని తీసుకువచ్చారు. షూటింగ్ చేసి పంపించేశారు. ఈ సంగతి తర్వాతెప్పుడో కొన్నాళ్ళకి తెలిసింది అక్కినేనికి. అలా అఖిల్ కన్నా చిన్న వయసులో నటించి తనకు తెలియకుండానే అతని రికార్డ్ బ్రేక్ చేశారు నాగార్జున.

"నాగార్జున మొదటి చిత్రం ఏది .. ?", "నాగార్జున నటించిన తొలి గీతం ఏది ...?", " నాగార్జున తో మొదట నటించిన హీరోయిన్ ఎవరు...?", "ఏయన్నార్ కి తెలియకుండా నాగార్జున నటించిన చిత్రం ఏది... ?" లాంటి ప్రశ్నలు ఓ ఫిలిం క్విజ్ లాగ మీ ఫ్రెండ్స్ మధ్య అడిగిచూడండి. సమాధానంగా ఈ పాట వీడియో చూపించండి (యూ ట్యూబ్ లో దొరుకుతుంది). మార్కులు వాళ్ళకు రాకుండా మొత్తం మీరే కొట్టెయ్యొచ్చు.

పకడో పకడో
ఈ ఇన్ లే కవర్ 'డాక్టర్ చక్రవర్తి' సినిమా డీవీడి ది. ఇందులోని ఫొటోలు మూడిటిలో వున్న తప్పులు వరసగా ఇవీ :
(1) 'డాక్టర్ చక్రవర్తి' సినిమాలో నాగేశ్వరరావు, సావిత్రి లది అన్నాచెల్లెళ్ళ బంధం. రొమాంటిక్ గా కనపించే అవకాశమే లేదు. ఇప్పటి సినిమాల్లో లా డ్రీమ్ సాంగులు పెట్టేసి కాస్సేపు రొమాంటిక్ గా చూపించాలన్న 'తెలివితేటలు' లేని పవిత్రమైన  రోజులవి. నిజానికి ఈ ఫొటో 'సిరిసంపదలు' సినిమాలోది. ఆ సినిమాలో నాగేశ్వరరావు, సావిత్రి బావా మరదళ్ళు. వాళ్ళిద్దరూ పాడుకునే 'ఎందుకో సిగ్గెందుకో' పాటలోదా ఫొటో. (కావాలంటే యూ ట్యూబ్ లో ఈ పాట దొరుకుతుంది. వెరిఫై చేసుకోవచ్చు).
(2) ఈ ఫొటో 'సుమంగళి' సినిమాలోది. ఈ సినిమాలో నాగేశ్వరరావు, సావిత్రి భార్యాభర్తలు. 'వలపు వలే తియ్యగా - వచ్చినావు నిండుగా' అనే పాటలోదీ స్టిల్. (ఈ పాట కూడా యూ ట్యూబ్ లో దొరుకుతుంది).
(3) రాజ్ బాబు, రమాప్రభ వున్న ఈ స్టిల్ 'అమాయకురాలు' సినిమాలోనిది. ఈ స్టిల్ కు వాళ్ళు అభినయిస్తున్న పాట 'చిలక లాంటి చిన్నదానా' . ఈ పాట వీడియో , నెట్ లో దొరకదు. 'అమాయకురాలు' సినిమా సీడియో, డీవీడీయో చూసుకుంటే దొరుకుతుంది. 'డాక్టర్ చక్రవర్తి' సినిమాలో ఎంత వెతికినా దొరికే చాన్సే లేదు. ఎందుకంటే ఈ సినిమాలో రాజ్ బాబు, రమాప్రభ నటించలేదు కనుక.


ఆ కంఠం ఎవరిది ?
సునీల్ హీరోగా నటించిన 'మర్యాద రామన్న' సినిమా గుర్తుందా !? ఉంటే అందులో 'తెలుగమ్మాయి' పాట కూడా గుర్తుండే వుంటుంది. ఆ పాట మధ్యలో " ఎ.. ఆపండెదవ గోల ... రోజూ పిచ్చిగీతలు గీసుకుంటూ కూచుంటుంది .. దాన్ని నేను చేసుకోవాలా !?" అనే డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ చెప్పిందెవరో తెలుసా ... ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పటికీ ఆ వాయిస్ అక్కడ నటించిన బ్రహ్మాజీ దే అనుకుంటున్నారంటే రాజమౌళి అంత బాగా పలికారన్నమాట.

ఇక్కడ చెప్పుకోవలసిన విషయం మరొకటి కూడా వుంది. ఈ పాటని 'రాయలసీమ మురిసి పడేలా ' అంటూ రాశారు. సాధారణం గా 'మురిసి పోవడం' వుంటుంది. 'మిడిసి పడడం' వుంటుంది. కానీ 'మురిసి పడడం' అనే పదాన్ని అనంత శ్రీరామ్ రాయడం కొత్తగా వుంది. దురదృష్టవశాత్తూ మనవాళ్ళెవరూ పట్టించుకోలేదు. అదీ సంగతి.

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka