Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope

ఈ సంచికలో >> శీర్షికలు >>

అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

001.నమో నారాయణాయ

నారాయణాయ సగుణ బ్రహ్మణే  సర్వ
పారాయణాయ శోభన మూర్తయే నమో

నారాయణునికి నమస్కారం. గుణములు కలిగిన బ్రహ్మమునకు ,సర్వ సృష్టియందు శ్రద్ధ కలవానికి, అందమైన రూపము కలవానికి నమస్కారం.

నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధి
పత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం
గత్యాయ జగదవనకృత్యాయ తే నమో

ఎప్పుడునూ  ఉండువాడా! పండితుల పొగడ్తలందుకొనేవాడా! ఎప్పుడూ అధికారము కలవాడా!  ముని జనములందు ఖ్యాతి కలవాడా! సత్యవంతుడా!, కనులు మొదలైన ఇంద్రియములకు కనబడువాడా!,  మంచి మనస్సులతో స్నేహము కలవాడా!, ప్రపంచాన్ని రక్షించే  క్రియ కలవాడా! ఓ నారాయణా! నీకు నమస్కారము.

ఆక్రమోద్ధత బాహు విక్రమాతిక్రాంత
శుక్ర శిష్యోన్మూలన క్రమాయ
శక్రాది గీర్వాణ వక్ర భయ భంగ ని
ర్వక్రాయ నిహతారి చక్రాయ తే నమో

ఆక్రమణ గర్వంతో, బాహు పరాక్రమంతో హద్దు మీరిన శుక్రాచార్యుల శిష్యులైన రాక్షసులను నిర్మూలించిన బలము కలవాడా!, ఇంద్రాది దేవతల భయాన్ని, అవమానాన్ని పోగొట్టిన వాడా! శత్రువులను చంపిన చక్రము కలిగిన వాడా! ఓ  నారాయణా! నీకు నమస్కారము.

అక్షరాయాతి నిరపేక్షాయ  పుండరీ
కాక్షాయ  శ్రీ వత్స లక్షణాయ
అక్షీణ విజ్ఞాన దక్ష యోగీంద్ర సం
రక్షాను కంపా కటాక్షాయ తే నమో

సర్వోత్తమమైన, నాశరహితమైన బ్రహ్మ స్వరూపుడా!  అందరియందు సమభావము కలవాడా!, తామరలవంటి కన్నులు కలవాడా!, రొమ్మునందు శ్రీ వత్సమను మచ్చ కలవాడా!, తరుగని విజ్ఞానముగలిగిన నేర్పరులైన యోగీశ్వరులను కాపాడి, కరుణతో అనుగ్రహించువాడా! ఓ నారాయణా! నీకు నమస్కారము.

కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ
మురవైరిణే జగన్మోహనాయ
తరుణేందుకోటీర తరుణీ మనస్స్తోత్ర
పరితోష చిత్తాయ పరమాయ తే నమో

గజేంద్రునికి వరమునిచ్చిన వాడా! కౌస్తుభమను మణిని ( కుస్తుభ=సముద్రమందు బుట్టినది) రొమ్ములోఆభరణముగా కలిగినవాడా! మురుడను రాక్షసుడు శత్రువుగా కలవాడా! ప్రపంచమును మోహింపచేసే ఆకారము కలిగిన వాడా! నెలవంకని కిరీటముగా ధరించిన శివుని భార్యయైన పార్వతీదేవి యొక్క మనస్సుతో కూడిన స్తోత్రముతో సంతోషించిన మనస్సు కలవాడా! పరమాత్ముడా! నీకు నమస్కారము.

పాత్ర దానోత్సవ ప్రథిత వేంకటరాయ
ధాత్రీశ కామితార్థ ప్రదాయ
గోత్రభిణ్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర
నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో నారాయణాయ (01-269)

యోగ్య దాన ఉత్సవాలతో ప్రసిద్ధమైన వేంకటేశుడా! నారాయణుడా! నీకు నమస్కారము. మహారాజులకు(గొప్ప అధికారులకు) కోరిన కోర్కెలు అనుగ్రహించేవాడా! ఇంద్రనీల మణి కాంతితో మనోహరమైన శరీరము కలవాడా! సూర్య చంద్రులు నేత్రములుగా కలవాడా! శేషాచలము నివాసముగా కలవాడా! యోగ్య దాన ఉత్సవాలతో ప్రసిద్ధమైన వేంకటేశుడా! నారాయణుడా! నీకు నమస్కారము.

----                                                         -----                                         -----

ఆంతర్యము
ఈ కీర్తనలో అన్నమయ్య నారాయణ స్వామికి నమస్తే అంటున్నాడు. నారాయణుడు ఎటువంటి వాడో అయిదు చరణాల్లోను వివరించాడు.
ఈ  కీర్తన అంతా సంస్కృత పదాలతో ఉంటుంది. సంస్కృతంలో ‘య’  అనేది  అకారాంత పదాల్లో సాధారణంగా చతుర్థీ విభక్తి  ప్రత్యయంగా చివరిగా వస్తుంటుంది. (ఉదా. శివాయ, రామాయ..ఇలా..) ఇప్పుడు తగ్గిపోతోందికాని, ఇదివరకటి రోజుల్లో అక్షరాభ్యాసం "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయసిద్ధంనమః” (శివునికొరకు నమస్కారం. విద్యారంగంలో సిద్ధులైన గురువుకి నమస్సులు) అని ప్రారంభమయ్యేది. అని అర్థం. గురువు తన శిష్యులని  సిద్ధులని(విద్యా ప్రయోజనం సిద్ధించినవారిగా)  చేయాలి. ఈ యకారం పదే పదే వస్తుంటే వినసొంపుగా మాత్రమే కాదు. తెలియని భక్తి భావం ఉదయిస్తుంది. అందుకే అన్నమయ్య ఈ యకారాంత పదాలతో కీర్తనని అందంగా నడిపించాడు. ప్రతి మంత్రానికి మొదట చివర  నమశ్శబ్దమున్న మంత్రసముదాయము నమకము (నమస్తే మన్యవ ఉతోత ఇషవే నమః). ఇది చాలా ప్రసిద్ధి పొందినది. అన్నమయ్య కీర్తనల్లో నమకము ఈ నారాయణాయ కీర్తన.

సగుణ బ్రహ్మణే
రామానుజులవారు భగవంతుని పరమ నిర్గుణ బ్రహ్మమన్నారు. మళ్ళీ అపర సగుణ బ్రహ్మమన్నారు. ఇద్దరి మధ్య తేడా లేదన్నారు. (బ్రహ్మ సూత్ర వ్యాఖ్యానము) సగుణుడై (సకల గుణశోభితుడై) భగవంతుడు పూర్ణుడై, కాలమునకు ఆకాశమునకు లోబడి మార్పుచెందు స్వభావము లేని వాడై స్థిరముగా ఉంటున్నాడు. ఈ కీర్తనలోని సగుణ బ్రహ్మము అతడే. రెండవ సంపుటములోని 412 కీర్తనలో కూడా ‘నిర్గుణాయ గుణాత్మనే’ అని అన్నమయ్య స్వామిని, సగుణునిగా, నిర్గుణునిగా  వర్ణించాడు.

అక్షరాయ
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మః స శివః స హరిః స ఇంద్రః సోక్షరః  పరమః స్వరాట్’  అని ప్రసిద్ధమైన మంత్రము.

మన శరీరంలో అగ్ని జ్వాల ఊర్ధ్వ ముఖంగా అమరి ఉంది. శరీరంలో ఆ అగ్నిశిఖ మధ్య పరమాత్మ ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, శివుడు, విష్ణువు. ఆయనే ఇంద్రుడు. ఆయన నాశనము లేని వాడు, స్వప్రకాశుడు. ఈ మంత్రంలో చెప్పిన అక్షరుడే అన్నమయ్య కీర్తనలోని అక్షరుడు.

అతి నిరపేక్షాయ
నిరపేక్ష  అనే శబ్దానికి  Neutrality (నిష్పక్షపాతము, సమభావము) అనే అర్థాలు బ్రౌణ్య ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులో ఉన్నాయి. అతి  అనే ఉపసర్గ అధికమైన అనే అర్థాన్ని ఇస్తుంది. కొందరు కొన్నింటిలోనే సమభావం చూపగలరు. స్వామి అన్నింటిలోను సమభావాన్ని చూపగలడని అతి శబ్ద ప్రయోగం.

తరుణేందుకోటీర తరుణీ మనస్స్తోత్ర
ఒక రోజు పార్వతీదేవి పరమశివుని  విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణకు  కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు,

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||'అని చెప్పాడు.

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ పారాయణ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో  మరణిస్తారో వారి చివరి దశలో శంకరుడు  ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి మోక్షం కలిగిస్తాడని పెద్దలు చెబుతారు. ఈ విషయాలన్నీ మనకు తరుణేందుకోటీర తరుణీ మనస్స్తోత్ర  పరితోష చిత్తాయ అను సమాసంలో అన్నమయ్య జ్ఞప్తి   చేసాడు.

గోత్రభిణ్మణి రుచిర గాత్రాయ
ఇంద్రనీల మణి కి అన్నమయ్య సృష్టించిన సంస్కృత పదం గోత్రభిణ్మణి. గోత్రమంటే పర్వతాలు. భిత్ అంటే వాటి రెక్కలను ఖండించినవాడు. ఇంద్ర నీలమణి   అని సమన్వయార్థం.

నమో
శంకర భగవత్పాదులు కనక ధారా స్తవంలో  ‘మామేవ మాతరనిశం  కలయంతు నాన్యే ' ఆంటారు. నిన్ను ఉద్దేశించి చేసే నమస్కారం మాత్రం ఎప్పుడు నాదగ్గర ఉండేట్టు చూడు తల్లీ ! మిగతావి నాకు అక్కర్లేదు ఆని నమస్కారానికి ఉన్న గొప్పతనాన్ని చెప్పారు. మన అన్నమయ్య కూడా ‘నమో’ అని ప్రతి చరణం చివర  అంటూ ఆ నమస్కార గొప్పతనాన్ని చెప్పకుండా చెప్పాడు.

నారాయణ
1. నర సంబంధమైన శరీరము  నారము. అవతారాలలో  నరశరీరాన్ని పొందిన వాడు నారాయణుడు.
2. నారమంటే జలం. అది స్థానంగా కలవాడు నారాయణుడు.
3. మానవుల సమూహము నివాసంగా కలవాడు  నారాయణుడు.
4. శబ్దం చేత తెలియ దగిన వాడు నారాయణుడు. (అమరకోశము).
దుఃఖాలలో ఉన్నవారు నారాయణ శబ్దాన్ని విన్నంత మాత్రమున సుఖం కలుగుతుందని విష్ణు సహస్ర నామ ఫల శ్రుతి. (ఆర్తా విషణ్ణా....)  ఇంతటి మహత్తరమైన మహిమ  కలది  నారాయణ శబ్దం.

తల మీద సాలగ్రామం పెట్టి  (విష్ణుమూర్తి గుర్తు కలిగిన ఒక  శిల.), నారాయణ స్మరణతో సన్యాసులకు  ఆ దీక్ష ఇస్తారు. అందుకే వారు నారాయణ స్వరూపులు. కనుక సన్యాసులకు  మనం  నమస్కారం చేస్తూ ఓం నమో నారాయణ అనాలి. వారు తిరిగి నారాయణ నారాయణ అంటారు. ఎందుకంటే ఆ నమస్కారం నారాయణునికే చెందుతుంది కాబట్టి. నామ నామినో రభేదః  నామానికి, నామికి (భగవంతునికి ) తేడాలేదు. అన్నమయ్య నారాయణ సంకీర్తనకు, నారాయణునికి తేడాలేదు. స్వస్తి.

మరిన్ని శీర్షికలు
Health Benefits of Figs or Anjeer