Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
bhagavaan shree ramana maharshi biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

సుశాస్త్రీయం - రాజీవలోచన రాజసులోచన! - టీవీయస్.శాస్త్రి

sushasthreeyam - Raja Sulochana

అలనాటి మేటి నటి,నాట్యకళాకారిణి  శ్రీమతి రాజసులోచన 05-03-2013న  చెన్నైలోతన 78 వ ఏట తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా ఈమె శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. పలు భాషా చిత్రాలలో నాటి మేటి కధానాయకులైన ANR,NTR,MGR ల వంటి వారి  సరసన కధానాయిక పాత్రలను పోషించిన ఈ అందాల తార నింగికేగింది. ఈమె జీవిత విశేషాలను క్లుప్తంగా వివరిస్తాను.

15 ఆగస్టు, 1935 న, విజయవాడలో జన్మించిన రాజసులోచన బాల్యం నుంచీ మద్రాసులోనే పెరిగారు. తల్లి, తండ్రులు దేవకమ్మ, భక్తవత్సలం గార్లు. ఆచార వ్యవహారాల ఇంట పెరిగిన ఆమెకు సంగీతం, ఫిడేలు వంటి వాటిల్లో ప్రవేశం ఉన్నా, నృత్యమంటేనే ఎంతో మక్కువ! తన పదవ ఏటనుంచే డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. తాను నేర్చుకున్నది చుట్టుపక్కల ఆడపిల్లలకు నేర్పేవారు. ఎక్కడ అవకాశం లభించినా నాట్య ప్రదర్శన లిచ్చేవారు. ప్రసిద్ధ కూచిపూడి నాట్యగురువులు వెంపటి పెద సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి, చినసత్యం, జగన్నాధ శర్మ మొదలైన వారి శిక్షణలో రాజసులోచన నాట్యం ఆమె నటించిన సినిమాకే కలికితురాయిలా ఉండేది. భరత నాట్యం, కూచిపూడి, కధక్, కధాకేళి వంటి నాట్య కళలో శిక్షణను పొందారు. దేశ విదేశాలలో పలు నృత్య ప్రదర్శనలను ఇచ్చారు. అమెరికా, చైనా, జపాన్, శ్రీలంక , రష్యా, సింగపూర్ వంటి దేశాలలో ప్రదర్శనలిచ్చారు.

రాజసులోచన ఇచ్చిన నాట్య ప్రదర్శనలతోనే ఆమెకు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. కన్నడ సినిమా 'గుణసాగరి'లో తొలి సారిగా నటించినా,  తమిళం చిత్రం ’సత్యశోధనై’ రెండవ  చిత్రం అయినా తెలుగులో 'కన్నతల్లి(1953)’  సినిమాతో తన నట జీవితం మొదలు పెట్టారు. అందులో చిన్న పాత్రలో కనిపించిన వీరు ’సొంతవూరు’ సినిమాతో కధానాయిక పాత్రలు వేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆమె ఎన్నో చిత్రాలలో కధానాయికగా నటించి ఆ చిత్ర విజయాలకి కారణమయ్యారు. ఎన్నో చిత్రాలు వందరోజులు ఆడాయి. నిర్మాతలకి కాసుల వర్షమూ కురిపించాయి.ఆమె నటించిన చిత్రాలలో 'రాజమకుటం' లోని సడిసేయకోగాలి... సడిసేయబోకే .. పాట నేటికీ సంగీతప్రియుల మనసులో మల్లెలు పూయిస్తుంది. జానపద ఇతి వృత్తంగల ఆ సినిమా ఆర్ధికంగా పెద్దగా విజయం సాధించక పోయినా రాజసులోచన గారి నటన, యన్. టి. రామారావు గారి నటన, బియన్ రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభ ఆ చిత్రాన్ని వెండితెరపై స్థిరస్థాయిగా నిలిచేలా చేసింది.

ప్రముఖ సినీ దర్శకులు సియస్.రావుతో 1963లో వివాహం జరిగింది. వీరికి సంతానం - ఇద్దరు అమ్మాయిలు(వాళ్ళూ నృత్యకారిణులే!), ఒక అబ్బాయి. దాదాపు 300 చిత్రాలలో నటించిన ఆమె, చివరగా నటించిన సినిమా, తోటికోడళ్ళు (కొత్తది). తమిళ , కన్నడ, మళయాళం, మరియూ మరికొన్నిఇతర భాషల సినిమాలలో కూడా నటించారు. సితారోంసే ఆగే, చోరీ చోరీ, నయా ఆద్మీ మొదలైన హిందీ సినిమాలలో కూడా నటించారు. ఆమె తెలుగులో నటించిన విజయవంతమైనవి, మరపురానివి కొన్ని--- కన్నతల్లి, సొంతవూరు, పెంకి పెళ్ళాం, తోడి కోడళ్ళు (పాతది), పాండవ వనవాసం, సారంగధర, పెళ్ళినాటి ప్రమాణాలు, మాంగల్యబలం, రాజమకుటం, శాంతినివాసం, టైగర్ రాముడు, జయభేరి, వాల్మీకి, వెలుగునీడలు, తిరుపతమ్మకధ, బభ్రువాహన, తాతామనవడు, తోడికోడళ్ళు (కొత్తది)...ఇలా చెప్పుకుంటూ పొతే ఈ జాబితాకు అంతే ఉండదు.

ఆమెతో నటించిన నటీనటులలోఐదుగురు ముఖ్యమంత్రులు ఉండటం విశేషం. అంతే కాకుండా అన్నాదురై, కరుణానిధి, యం.జి.ఆర్, జయలలిత, యన్.టి.రామారావు మొదలైన ముఖ్యమంత్రుల హయాంలో 'నృత్యరూపకాలను'  రూపొందించి, నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె నాట్యం చేసిన పాత్రలలో ,వెలుగునీడలు సినిమాలో 'పాడవోయి భారతీయుడా' అంటూ ఆమె చేసిన నృత్యం, అలానే పాండవ వనవాసంలో ఆమె నృత్యాభినయం నేటికీ నా కళ్ళముందు మెదులుతున్నాయి. 'పుష్పాంజలి'అనే నృత్య కళా కేంద్రాన్నిస్థాపించి అనేకమందికి నాట్యంలో శిక్షణను ఇచ్చారు.

దివికేగిన ఈ 'రాజీవలోచనకు' నా ఘనమైన నివాళి!

మరిన్ని శీర్షికలు
weekly horoscope