Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

'ఎక్స్ ప్రెస్' సినిమాలు

express movies

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'! ఈ మధ్యనే చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయం సాధించిన సినిమా. ట్రావెల్ నేపధ్యంలో సాగే ఈ సినిమాకు ఒక రైలు పేరును సినిమా టైటిల్ గా పెట్టారు. ఇలా రైలు నేపధ్యంలో సాగే సినిమాలు లేదా రైలు సన్నివేశాలు సినిమాలో కీలకపాత్ర వహించినవి చాలా వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి. అలాంటి 'ఎక్స్ ప్రెస్' సినిమాలు కొన్నిటి గురించి -

బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు, సమరసింహారెడ్డి' సినిమాలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో రైలు సన్నివేశాలు కీలకపాత్ర వహించాయి. అందుకే బాలకృష్ణ ఇప్పుడు తీస్తున్న 'లెజెండ్' సినిమాలో కొన్ని రైలు సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు.

'దూకుడు' మహేష్ బాబు సినీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం. దీంట్లో ఇంటర్వెల్ కు ముందు రైలు సన్నివేశం చాలా కీలకమైనది. ఆ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ నమ్మినబంటు ప్రత్యక్షమవడం, ప్రకాష్ రాజ్ కు జరిగింది ప్రమాదం కాదని, అది కావాలనే చేసిన కుట్ర అనే విషయం తెలుస్తుంది. 'బిజినెస్ మెన్' లో హీరో ఇంట్రడక్షన్ సీనే రైల్లోనుంచి దిగడం. 'అతడు' సినిమాలో రైల్లో మహేష్ కు రాజీవ్ కనకాల పరిచయం కావడం, పోలీసులు జరిపిన కాల్పుల్లో రాజీవ్ చనిపోవడం రాజీవ్ స్థానంలో మహేష్ నాజర్ మనవడిగా వెళ్ళడం జరుగుతుంది. ఇక 'పోకిరీ' లో లోకల్ ట్రైన్స్ లో మహేష్, ఇలియానా ల పరిచయం, ఇలియానాను అల్లరి పెట్టిన వారితో మహేష్ ఫైటింగ్ సన్నివేశాలున్నాయి. 'ఒక్కడు' లో మహేష్ కర్నూలుకు కబడ్డీ పోటీలకు వెళ్ళడం, అక్కడ రైల్వే స్టేషన్ లో ప్రకాష్ రాజ్ భూమిక అన్న అచ్యుత్ ను చంపడంతో విలన్ ఎంత కఠినుడో తెలుస్తుంది.

రవితేజ 'కిక్' లో పోలీసాఫీసర్ శ్యామ్ కు తన ప్రేమ విషయం ట్రైన్ లో వెళుతూ ఇలియానా చెప్పడం, అలాగే శ్యామ్ కూడా ఇలియానాకు ఓ క్రిమినల్ గురించి చెప్పడం జరుగుతుంది. 'ఖడ్గం' సినిమాలో క్లైమాక్స్ రైల్వేస్టేషన్ లో జరుగుతుంది. 'దుబాయ్ శీను' లో రవితేజ అండ్ కో ముంభై రైల్వేస్టేషన్ లో దిగడం, అక్కడ వేణుమాధవ్ వాళ్ళందరినీ మోసం చేసే సన్నివేశం ఉంది. 'వెంకీ' సినిమా సగభాగం ట్రైన్ లోనే కొనసాగుతూ ప్రేక్షకులను నవ్విస్తుంది. 'మర్యాద రామన్న' లో సునీల్, సలోనీల పరిచయ సన్నివేశాలు రైల్లోనే ఉంటాయి.

'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరో పరిచయ సన్నివేశం రైల్లో ఉంటుంది. క్లైమాక్స్ రైల్వేస్టేషన్ లో జరుగుతుంది. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' లో ఇంటర్వెల్ సన్నివేశం రైల్లో త్రిష ను వెంకటేష్ చూసినప్పుడు వస్తుంది. రైల్లో వెళుతున్నప్పుడే ముమైత్ ఖాన్ పాట వస్తుంది.

'మనసంతా నువ్వే' లో టైటిల్స్ ట్రైన్ వెలుతున్నప్పుడు వస్తాయి. 'చెప్పనా ప్రేమ' అనే పాట రైల్లోనే కాస్త ఉంటుంది. 'నువ్వు నేను' లో ఉదయ్ కిరణ్, అనితలు కలుసుకునే సన్నివేశం చాలా ఉత్కంఠగా సాగుతుంది. 'జయం' లో ఏకంగా రైలు పైనే ఒకపాట 'బండి బండి రైలు బండి' అనేది రైల్లోనే ఉంటుంది.

'వర్షం' సినిమాలో రైలు ఆగినప్పుడు 'ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా' అనే పాట, 'నీటి ముళ్ళై సాగిపోనా' అనే ఇంకో పాట రైలు వెళుతున్నప్పుడు వస్తాయి. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లో త్రిష పరీక్షలు రాయడానికి పట్నంకు వెళుతున్నప్పుడు రఘుబాబు మనుషులు అల్లరి పెడుతున్నప్పుడు శ్రీహరి ఫైటింగ్ చేసే సన్నివేశం ఉంది.

'ఆర్య' లో అల్లుఅర్జున్, శివబాలాజీ, అను మెహతా సుబ్బరాజు నుంచి తప్పించుకోవాలని రైళ్లో వెళ్ళడం, రైల్లోనే 'అ అంటే అమలాపురం' అనే సూపర్ హిట్ పాట ఉంటుంది.

'కొత్త బంగారు లోకం'లో క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ ను వరుణ్ సందేశ్ రైలెక్కించి వెనుతిరగడం, ఆ రైల్లో వెలుతున్నప్పుడే ప్రకాష్ రాజ్ కు ప్రమాదం జరిగి చనిపోయే సన్నివేశం ఉంది.

ఇంకా 'ఖుషి, రోబో, శివాజీ, అపరిచితుడు, అరుంధతి, ఠాగూర్, విక్రమార్కుడు తదితర సినిమాల్లో రైలు సన్నివేశాలు కీలకంగా, ఉత్కంఠగా కొనసాగుతాయి. 'కదిర్' అనగానే మనకు ఒక చక్కని భావుకత కలిగిన దర్శకుడిగా గుర్తుకు వస్తుంది. ఆయన తమిళ దర్శకుడైనా, ఆయన తీసిన చిత్రాలు తెలుగులో డబ్బింగై తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాయి. 'హృదయం' సినిమా ప్రారంభ సన్నివేశం రైల్లోనే, క్లైమాక్స్ రైల్లోనే ఉంటుంది. ఇక 'ప్రేమదేశం' లో టబూ రైల్వే ట్రాక్ పైన కాలు ఇరుక్కుపోవడం, వినీత్ ద్వారా అప్పుడు రక్షింపబడటం కాస్త టెన్షన్ గా సాగుతుంది. 'ప్రేమికులరోజు' లో హీరో, హీరోయిన్స్ లోకల్ ట్రైన్స్ లో కలుసుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇక అగస్త్యన్ 'ప్రేమలేఖ' లో దేవయాని సర్టిఫికెట్స్ రైల్లో మర్చిపోవడం, ఆ సర్టిఫికెట్స్ అజిత్ కు దొరకడం తిరిగి దేవయానికి పంపడం, వారిద్దరి మధ్య కలం స్నేహం కొనసాగడం, చిన్నాదానా ఓసి చిన్నాదానా' అనే పాట ఉండే సన్నివేశాలు ఉన్నాయి.

కె . సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
Tribute to Uday Kiran