Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - 1 Nenokkadine

ఈ సంచికలో >> సినిమా >>

మ‌హేష్ బంగారంలాంటి హీరో! - సుకుమార్‌

Interview with Director Sukumar

ఫీల్ మై ల‌వ్ అంటూ ప్రేమ‌లో కొత్త కోణాన్ని వెలికి తీసిన ద‌ర్శ‌కుడు సుకుమార్‌. ఆ సినిమాలో సుకుమార్ చూపించిన‌ చిలిపిద‌నం, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం... ఇవ‌న్నీ ఓ స‌రికొత్త అనుభూతినిచ్చాయి. జ‌గ‌డం నిరాశ ప‌రిచినా... సుకుమార్ ఆలోచ‌న‌ల‌ను ఆ సినిమా కూడా ప్ర‌తిబింబించినదే. ఆర్య‌2ది మ‌రో క‌థ‌. 100% ల‌వ్‌తో తన ఆలోచ‌న‌ల్ని పొందుప‌రుస్తూనే ఓ క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాన్ని అందుకోగ‌లిగాడు. ఇప్పుడు మ‌హేష్ బాబుతో '1' సినిమా తెర‌కెక్కించాడు. ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఈ సంద‌ర్భంగా సుకుమార్‌తో జ‌రిపిన ప్ర‌త్యేక సంభాషణ...

* ఈ సినిమాని పండ‌క్కి తీసుకురావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టున్నారు.
- (న‌వ్వుతూ) అవునండీ. నెల రోజుల నుంచీ నిద్ర పోకుండా ఈ సినిమాపైనే క‌ష్ట‌ప‌డ్డాం. అయినా ఆనందంగానే ఉంది. ఎందుకంటే... ఆ క‌ష్టం మంచి సినిమా కోస‌మే క‌దా..? మొత్తానికి అనుకొన్న‌ట్టుగానే సినిమా సంక్రాంతికి సిద్ధ‌మైంది. ఐ యామ్ హ్యాపీ.

* అనుకొన్న టైమ్‌లోనే సినిమా పూర్తిచేశారా?
- ఏ సినిమానీ అలా చేయ‌లేమండి. టైమ్ అటూ ఇటూ అవుతుంది. ముఖ్యంగా '1' యాక్ష‌న్ డ్రామా. ఇలాంటి సినిమాల్ని అనుకొన్న స‌మయంలో తీయ‌డం సాధ్యం కాదు. ఓ పాతిక రోజులు ఎక్కువే అయ్యింది.

* బ‌డ్జెట్ కూడా దాటిన‌ట్టుంది?
- ఈ సినిమాకి ఇంత అవుతుంది అని ముందే లెక్క‌లేసుకొన్నాం. వాటి ప్ర‌కార‌మే ఖ‌ర్చు చేశాం. అయినా బ‌డ్జెట్ గురించి నిర్మాతలు ఆలోచించాలి. కానీ ఈ సినిమా వ‌ర‌కూ నేను ఆలోచించా. సార్‌... బ‌డ్జెట్ ఎక్కువ అయిపోతుందేమో, ఖ‌ర్చు త‌గ్గిద్దాం అనేవాడిని. వాళ్లు మాత్రం 'మ‌రేం ఫ‌ర్లేదు... ఆ మాత్రం ఉండాల్సిందే...' అని ఖ‌ర్చు పెడుతూ వెళ్లేవాళ్లు.

* మ‌హేష్‌తో సినిమా అనేస‌రికి ఎలాంటి క‌స‌ర‌త్తులు చేశారు?
- మ‌హేష్ బంగారంలాంటి హీరో. బంగారం ముద్ద‌ను ఎలాగైనా మ‌ల‌చుకోవ‌చ్చు. ఆయ‌నా అలాంటి క‌థానాయ‌కుడే. ఆయ‌న‌కు ఏ చొక్కా వేసినా బాగానే ఉంటుంది. క‌థ‌లూ అంతే. ఎలాంటి క‌థ‌లో అయినా ఇమిడిపోతారు. కాక‌పోతే నాకు మాత్రం ఆయ‌న్నికొత్త‌గా చూడాల‌ని, కొత్త‌గా చూపించాల‌ని అనిపించింది. అందుకే ఇలాంటి క‌థ త‌యారు చేసుకొన్నా.

* ఆయ‌న‌కు క‌థ చెప్పేట‌ప్పుడు టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌...
- నిజానికి నాకు క‌థ చెప్ప‌డం రాదండి. నేను గొప్ప నేరేట‌ర్‌నికాదు. మ‌హేష్‌కి ఈ క‌థ గోవాలో చెప్పా. మ‌హేష్ కి క‌థ చెప్ప‌డానికి వెళ్లే ముందు ఎలా చెప్పాలి, ఎక్క‌డ మొద‌లెట్టాలి... అనే విష‌యంపై చాలాసార్లు రిహార్స‌ల్స్ చేసుకొని వెళ్లా. అక్క‌డో కాఫీ షాప్ లో కూర్చున్నాం. ఓ పక్క పెద్ద సౌండ్‌తో పాట‌లు ర‌న్ అవుతున్నాయి. వాతావ‌ర‌ణం ప్ర‌శాంతంగా లేదు. అస‌లే టెన్ష‌న్, ఆపై ఈ పాట‌లు. క‌థ ఎలా చెప్పానో నాకే తెలీదు. మొత్తానికి చెప్పేశా. తిరిగి వ‌స్తుంటే మ‌హేష్ నుంచి ఫోన్ వ‌చ్చింది. మ‌నం సినిమా చేస్తున్నాం... అన్నారు. అప్పుడు చాలా సంతోషం వేసింది.

* ఓ స్టార్ హీరో ప‌క్కన స్టార్ హీరోయిన్ ఉంటే లెక్క స‌రిపోతుంది. మ‌రి మీరేమో... కొత్త‌మ్మాయిని తీసుకొన్నారు?
- ముందు కాజ‌ల్‌ని తీసుకొందాం అనుకొన్నాం. కానీ ఆమె ఎంపిక ఎందుకో క‌రెక్ట్ కాద‌ని అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాకి హీరోయిన్ డేట్స్ బ‌ల్క్ గా కావాలి. అవి కాజ‌ల్ ఇవ్వ‌లేదేమో అనిపించింది. పైగా ఈ సినిమాలో పూర్తిగా మ‌హేష్ కొత్త లుక్‌లో క‌నిపిస్తాడు. అలాంట‌ప్పుడు కొత్త‌మ్మాయి అయితేనే బాగుంటుంది అనిపించింది.

* మీ సినిమాల‌న్నీ సెన్స్‌బుల్‌గా, హ్యూమ‌ర్ ట‌చ్‌తో ఉంటాయి. మీ స్టైల్‌ని ప‌క్క‌న పెట్టి ఈ సినిమా తీశారా?
- (న‌వ్వుతూ) నాకంటూ ఓ స్టైల్ ఉందంటారా? ద‌ర్శ‌కుడ‌న్నాక అన్నీ చేయాలి క‌దండీ.

* గౌత‌మ్ ని తీసుకొని ఈ సినిమాని మ‌ల్టీస్టార‌ర్ గా మార్చేశారు...
- ఔనండీ. గౌత‌మ్ ఈ సినిమాకి అతి పెద్ద ప్ల‌స్. నిజంగా మ‌హేష్ బాబులానే త‌ను కూడా స్టార్ గా మార‌తాడు అనిపిస్తోంది. ఎందుకంటే న‌టించాలి అనే ఆటిట్యూడ్ అత‌నిలో ఇప్పుడే మొద‌లైపోయింది.

* తెర‌పై గౌత‌మ్‌ని చూసి... మ‌హేష్ రియాక్ష‌న్ ఏమిటి?
- ఆయ‌న క‌ళ్ల‌లో ఆనందం చూశా. ఓ పెద్ద స్టార్ అయినా... కొడుకుని తెర‌పై చూసి మురిసిపోతున్నారు. 'నిజంగా ఇవ‌న్నీ చేసింది గౌత‌మేనా?' అని అడిగారు.

* జ‌గ‌డం సినిమా మిమ్మ‌ల్ని నిరాశ ప‌రిచింది క‌దా?
- చాలా. ఒక విధంగా చెప్పాలంటే డిప్రెష‌న్‌కి వెళ్లిపోయా. అయితే ఆ సినిమాపై నాకు ఇప్ప‌టికీ ప్రేమ ఉంది. ఎందుకంటే ఆ సినిమా చాలా విష‌యాల్ని నేర్పింది.

* అప్పుడు 100 %ల‌వ్‌, ఇప్పుడు 1... అంకెలే సినిమా టైటిళ్లుగా పెట్టుకొంటున్నారు. లెక్క‌ల మాస్టార‌నా..?
- అలాంటిదేం లేదండీ. నా స‌హాయ‌క ద‌ర్శ‌కులు సూచించిన టైటిళ్లు ఇవి. నాకు బాగా న‌చ్చుతాయ‌ని వాళ్లూ ఇలాంటివే చెబుతున్నారేమో..?

* మీ నుంచి మ‌రో సెన్సిబుల్ స్టోరీ ఆశించొచ్చా..?
- త‌ప్ప‌కుండా. ఈసారి మ‌హేష్‌తో ఓ ల‌వ్ స్టోరీ చేయాల‌నివుంది.

* ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు?
- ప్ర‌స్తుతం ఆ ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నా. క‌థ రెడీ అవుతోంది.

* ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ.

కాత్యాయని

 

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu