Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

తెలుగు వారి సీత-శ్రీమతి అంజలీ దేవి! - టీవీయస్. శాస్త్రి

Telugu vaari seeta - Anjali Devi

తెలుగు చలన చిత్రపు​​ స్వర్ణయుగానికి చెందిన నటీనటులు ఒక్కొక్కరూ దివికేగుతున్నారు.అలా దివికేగిన వారి జాబితాలో ప్రముఖ తార శ్రీమతి అంజలీదేవి గారు కూడా ఈ మధ్యనే చేరారు.ఈ నటీమణి 13-01-2014 న హృద్రోగ వ్యాధితో చెన్నైలోని ఆమె స్వగృహంలో మరణించారు. ఆ నటీమణికి స్మృత్యంజలి ఘటిస్తూ, ఆమెను గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం!​శ్రీమతి అంజలీదేవి పేరు తలచుకున్నప్పుడల్లా గుర్తుకొచ్చేది, 'లవకుశ' లో ఆమె నటించిన సీత పాత్ర. సీత పాత్రకు ప్రాణప్రతిష్ట చేసిన నటీశిరోమణి ఆమె.ఆ తర్వాత ఎంతమంది ఆ పాత్రలో నటించినప్పటికీ,తెలుగు సినిమా  ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది మాత్రం ఆమె ఒక్కతే. ‘లవకుశ’లో సీతమ్మవారి ​పాత్రకు ​ఎంతటి గుర్తింపు తెచ్చిందంటే, ఆమె ఎక్కడ కనిపించినా జనం ​ ఆమెకు ​పాదాభివందనం చేసేవారు.లవకుశ సినిమా 50 ఏండ్లు ​పూర్తి ​ చేసుకున్న సందర్భంలో ఒక పత్రికలో ఆమె వెలిబుచ్చిన భావాలను ఆమె మాటల్లోనే విందాం! "లవకుశ సినిమాకు తల్లీ,తండ్రీ అంతా దర్శకుడు సి.పుల్లయ్యగారే. ఈ సినిమా క్రెడిట్ ముందుగా ఆయనకే దక్కాలి. సినిమా విడుదలై యాభయ్యేళ్లయినా, ఇప్పటికీ తెలుగు ప్రజల నోళ్లలో నానుతున్నదంటే ​అందుకు ఆయనే కారణం.

నన్ను ‘గొల్లభామ’ సినిమా ద్వారా గ్లామర్ పాత్రలో పరిచయం చేసిన ఆయన, ఆ తరువాత రేలంగి  వెంకట్రామయ్య సరసన పెట్టి ‘పక్కింటి అమ్మాయి’ పేరుతో కామెడీ చిత్రం రూపొందించారు. సి.పుల్లయ్యగారితో నా మూడో సినిమా ‘లవకుశ’. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలు పోషించిన నన్ను పవిత్రమైన సీత పాత్రకు తీసుకోవడం పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఎంతోమంది ఆయన్ని వద్దంటూ వారించారు. రాజ్యం ఫిలింస్ నిర్వాహకురాలు లక్ష్మీరాజ్యం అయితే “డ్యాన్సులు చేసుకునే అమ్మాయిని ఇంత మంచి పాత్రకు ఎలా ఎంపిక ​చేసారు ?” అంటూ దర్శకుణ్ణి నిలదీసారట. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు.సీత పాత్ర చేసేటప్పుడు నేను ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అన్ని పాత్రల్లాగే ఆ పాత్రలో లీనమై నటించాను. ఎప్పటిలాగే ఉదయాన్నే భగవంతుడికి పూజలు చేసుకుని షూటింగ్‌కి వెళ్లేదాన్ని. వృత్తిని నేను పవిత్రంగా భావిస్తాను. ఆ పవిత్రతతో పని చేస్తే చాలు.

‘కీలుగుర్రం’ సినిమాలో రాక్షసి పాత్ర వేసాను. అందుకని రాక్షసంగా ఉండలేంగా. నిజానికి ఆ పాత్ర నేను చేయనని చెప్పాను. కానీ నా భర్త శ్రీ పెనుపాత్రుని ఆదినారాయణరావు గారు నచ్చచెప్పి నన్ను ఒప్పించారు.ఏ పాత్ర వేసినా, మనం మనసుపెట్టి నటించాలి, అంతే అన్నారు. సీత పాత్రను నేను ఎంతో ప్రేమతో, భక్తిభావంతో చేసాను." అంతే కాక, సువర్ణసుందరి , అనార్కలి, జయసింహ, పాండురంగ మహాత్మ్యం లాంటి పెక్కు చిత్రాలలో ఆమె నటించిన పాత్రలు సజీవంగా నిలిచిపోయాయి.తెలుగు సినిమా తొలితరం నటీమణుల్లో అగ్రతారగా, అత్యధిక కాలం హీరోయిన్‌గా చేసి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచారు అంజలీదేవి. విశేషమేమంటే, ఇంత మహానటి తొలినాళ్ళలో కీలుగుఱ్ఱం లాంటి సినిమాలలో వాంప్ పాత్రలను కూడా పోషించింది.

అన్నిటికంటే, ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఆమె సినీరంగ ప్రవేశం చేసేనాటికే వివాహిత మరియు ఇద్దరు పిల్లల తల్లి. భర్త శ్రీ ఆదినారాయణరావు గొప్ప సంగీత దర్శకుడు.ఇద్దరూ రంగస్థల అనుభవం ద్వారానే సినీ రంగ ప్రవేశం చేసారు. భర్త ప్రోత్సాహంతో సినీనటిగా మారింది. శ్రీమతి అంజలీదేవి 24 -08 -1927 న, తూర్పుగోదావరి జిల్లాకి చెందిన పెద్దాపురంలో జన్మించారు. అసలు పేరు అంజనీకుమారి. ఎనిమిదేళ్లకే రంగస్థలంపై నటించారు. ఆ తర్వాత కాకినాడ యంగ్‌మెన్ హ్యాపీక్లబ్‌లో చేరి నాటకాలు వేసారు. మొదటిసారిగా బాలనటిగా హరిశ్చంద్రలో 'లోహితుని' పాత్రలో 1940 లో నటించారు.1947లోశ్రీ పుల్లయ్య గారి దర్శకత్వంలో నిర్మించబడ్డ గొల్లభామ సినిమా ద్వారా డ్యాన్సర్‌గా వెండితెరకు పరిచయమై, ఎల్వీ ప్రసాద్ ‘కష్టజీవి’తో హీరోయిన్ అయ్యారు. 1940 నుండీ నటిగా ప్రయత్నాలు చేస్తూ,చిన్న చిన్న వేషాలు వేసినప్పటికీ, ప్రేక్షకుల, పరిశ్రమ దృష్టిలో నటిగా గుర్తింపు పొందినది మాత్రం 1947 నుండే.అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగు,తమిళ, కన్నడ సినిమాలలో ప్రముఖ నటుల సరసన కథానాయిక పాత్రలను పోషించి మెప్పించింది.అంజలీ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి సువర్ణసుందరి, అనార్కలి,భక్త తుకారాం లాంటి పలు చక్కని సినిమాలను నిర్మించారు.

వీరి సినిమాలలో సంగీతానికి మంచి ప్రాధాన్యముండేది. సువర్ణసుందరిలో 'హాయి హాయిగా ఆమని సాగే' అనే పాట నేటికీ సంగీతప్రియుల నాలుకపైన నాట్యం చేస్తుంది.అదే సినిమాను హిందీలోకి డబ్ చేసినప్పుడు,అవే ట్యూన్సును ఉంచారు.పైన ఉదహరించిన పాటకు తెలుగులో ఘంటసాల, జిక్కీలకు ఎంత పేరు వచ్చిందో అంతే పేరు హిందీలో రఫీ,లతామంగేష్కర్ లకు కూడా వచ్చింది. వీరి సొంత సినిమాలన్నీ సంగీత ప్రధానమైనవే! 1994లో ‘పోలీసు అల్లుడు’ తర్వాత ఇక నటించలేదు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2005 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చి సత్కరించింది. 2008 లో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును కూడా పొందారు. ఈమె పుట్టపర్తి సత్యసాయికి పరమ భక్తురాలు. ప్రస్తుతం ఆమె నట వారసురాలిగా ఆమె మనుమరాలు శైలారావు కూడా అడపా తడపా తెలుగు,తమిళ సినిమాలలో నటిస్తున్నారు.

నటీశిరోమణి శ్రీమతి అంజలీదేవికి కళాంజలిని సమర్పించుకుంటూ,
ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్ధించుదాం!

మరిన్ని శీర్షికలు
swami vivekananda biography