Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-8 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

ఏ రంగంలోనూ పూర్తి సంతృప్తి లభించలేదు - బి. జయ

Interview with director R. Jaya

ఓ అమ్మాయి.. గోదారి జిల్లాలోని పెద్దింట్లో పుట్టింది. బుద్ధిగా చదివేసుకుంటుంటే, డాక్టర్ సీటు కూడా వచ్చేసింది. రక్తం అంటేనే భయం అంటూ వదిలేసి, లిటరేచర్ వెంట పడింది. అదవుతుంటేనే, జర్నలిజం పరిచయమయింది. దాంతో ఆంధ్రజ్యోతిలోకి వచ్చేసింది. అప్పటికే ఈనాడు ఆదివారం, చందమామ, వనితాజ్యోతి, ఇలా ఎక్కడపడితే అక్కడ రాసేయడం మొదలెట్టేసింది. అక్కడితో ఆగలేదు. కాళీపట్నం, రావిశాస్త్రి,. రంగనాయకమ్మ, ఇలా లెఫ్టిస్టు దృక్పథం వున్న రచనలన్నీ ఔపాసన పట్టేసింది. స్టూడెంట్ గా ఎస్ఎఫ్ఐ, ఆ పై ఆర్.ఎస్.యు అన్నీ రాడికల్ వ్యవహారాలే. నరనరానా విప్లవ భావాలే. అలాంటి అమ్మడ్ని తీసుకెళ్లి.. జ్యోతిచిత్ర రిపోర్టర్ గా మద్రాసులో వేసారు. అసలే నూరు శాతానికి కాస్త అటుగానే ఇండువిడ్యువాలిటీ. ఆపై ముక్కుసూటితనం. పైగా సినిమా ఫీల్డ్ అంటేనే బూర్జువా.. భూస్వామ్య వాసనలు నిండిందన్న నికార్సయిన అభిప్రాయం. అయినా అక్కడా నెగ్గుకొచ్చింది.. ఏ సపోర్టు లేకుండా సూపర్ హిట్ మాగ్ జైన్ స్టార్ట్ చేసారు. దాన్ని సూపర్ హిట్ చేసారు..ఆపై సినిమా నిర్మాణం అన్నారు. అదీ ఓకె. చాలదు దర్శకత్వం అన్నారు. అక్కడా విజయమే.. ఇన్ని రంగాలు.. ఇన్ని విజయాలు సొంతం చేసుకున్న ఆవిడ పేరు.. జయ. బి. జయ. చంటిగాడు నుంచి లవ్ లీ వరకు ఆమె ప్రయాణం సినిమా ప్రియులందిరికీ తెలిసిందే. ఆమెతో గో తెలుగు ఇంటర్వూ.

ఎక్కడ నుంచి ఎక్కడి కొచ్చారు.. ఈ ప్రయాణం ఎలా వుంది?
అలా సాగిపోతోందంతే..

అనుకున్నట్లుగానే సాగుతోందా?
లేదు.. నేను. మంచి జర్నలిస్టును కావాలనుకున్నా.. అంతలో సినిమా జర్నలిజంలోకి వచ్చాను.. పోనీ సైకాలజీ ఎంఫిల్ చేద్దాం అనుకున్నాను. ఇండియన్ సైకాలజీ మీద మంచి పుస్తకాలు రాయాలనుకున్నాను. కానీ సినిమా మాగజైన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి సినిమా రంగంతో పరిచయాలు పెరిగాయి. నిర్మాత అయ్యాను. అనుకున్న కంటెంట్ అనుకున్నట్లు రాకుంటే, దర్శకత్వం చేపట్టాల్సి వచ్చిది..

మీరు జర్నలిజంలోకి వచ్చేసరికే ఈ రంగంలో మహిళలు తక్కువ. ఇంక సినిమా జర్నలిజం అంటే అసలు వుండే వుండరు. మీరు ఎలా నెగ్గుకొచ్చారు?
నాకు మొదట్నించీ ఈ జెండర్ సమస్య లేదు. నేను ఎస్ఎఫ్ఐ లో వున్నాను. ఆంధ్రజ్యోతిలో ఇద్దరం తప్ప రెండు ఫ్లోర్లు మగవాళ్లే. పైగా ఎందుకో నాకు ఇలా ప్రేమలేఖలు ఇవ్వడాలు, ప్రపోజ్ చేయడాలు లాంటివి ఎవరూ చేయలేదు.

మీరు నచ్చలేదా.. మీరంటే భయమా?
రెండోదే అయివుంటుందేమో?

సినిమా జర్నలిజం స్టార్ట్ చేసాక ఎలా వుంది?
మీరు నమ్మరు. నన్ను జ్యోతిచిత్రకు మోహన్ కుమార్ గారు పంపేదాక, నాకు చిరంజీవి, బాలకృష్ణ అంటే కూడా పెద్దగా తెలియదు. ఎక్కువగా చదివేయడమే. అందరి రచనలు. అదే లోకం. అలాంటిది మద్రాసుకు వచ్చి పడ్డాను.

సినిమా రంగం అంటే ఒదిగి వుండాలి. మరి మీరు చూస్తే డైనమిక్ వ్యవహారం,. ఎలా నెగ్గుకొచ్చారు?
అలాగే.. నేనేం మారలేదు. వాళ్లే అర్థం చేసుకున్నారు. అర్థం అయ్యాక, ఇంటర్వూ అంటే జయను పంపించండి.. బాగా రాస్తారు అనేవారు.

తలకాయనొప్పులు తెచ్చిన వారు లేరా..
లేకేమి..అలాంటి వారిని అప్పుడే మర్చిపోయాను.

సూపర్ హిట్ ఐడియా ఎలా వచ్చింది?
నేను ఎంఫిల్ చేద్దాం అనుకున్నా.. సీటు కూడా వచ్చింది. కానీ బిఎ రాజు మ్యాగ్ జైన్ పెడదాం అన్నారు. అప్పటికి డైలీ పత్రికలే సినిమా మ్యాగ్ జైన్లు రన్ చేస్తున్నాయి. వారికి మార్కెటింగ్ ఈజీ. శివరంజని, సితార, జ్యోతిచిత్ర టాప్ లో వున్నాయి. అయినా ధైర్యంగా మొదలెట్టాం. ఒక దశకు చేరేసరికి 80 వేల సర్క్యులేషన్ తో శివరంజనిని కూడా క్రాస్ చేసాం.

ఇది ఎలా సాధ్యమైంది?
రీడర్స్ పల్స్ తెలుసుకున్నాం. ముఖ్యంగా సినిమా అభిమానుల పల్స్. వారికేం కావలో అది అందించాం. మీకు తెలుసా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఫోటో తొలిసారి ప్రచురించింది మేమే. ఇలా చాలా చేసాం.

మరి అక్కడి నుంచి సినిమాల్లోకి?
నాకే అందరితో పరిచయాలు పెరిగాక సినిమా తీయాలనిపించింది. ఘటికాచలం అని ఓ డైరక్టర్ కు అవకాశం కల్పించాలనుకున్నాం. చాలా మంది వారించారు. చాలా కష్టం. నష్టం అన్నారు. రాజు కూడా కాస్త ఆలోచించాడు. కానీ అక్కడా ఇప్పటిదాకా మేమేం పొగొట్టుకోలేదు.

మరి దర్శకత్వం?
కానీ ఘటికాచలం బాగా చేయలేకపోయారు.. నేనే ఘోస్ట్ గా చేయాల్సి వచ్చింది. చంటిగాడు నా డ్రీమ్ ప్రాజెక్ట్. నాకు నచ్చిన మా ఊరి కథ. అందుకే అది చేసాం. అక్కడా ఘోస్ట్ నేనే. అలా అలా నడుస్తోంది.

ఇన్ని రంగాలు చుట్టేసారు. ఎక్కడ సంతృప్తి లభించింది?
ఎక్కడా లేదు.

అదేంటీ?
నేను అనుకున్నది అనుకున్నట్లు చేయలేకపోతున్నాను. ఒక జోనర్ అనుకుంటే ఆ జోనర్ లో పీక్ అదే అన్నట్లు చేయాలనుకుంటాను. కానీ రాజీ తప్పదు.

మరి అందుకోసం ఏమైనా చేద్దామనుకుంటున్నారా?
అలా అనుకుని ఏమీ చేయలేం. దానికి అది కుదరాలంతే.

మీరు బిఎ రాజు ఇద్దరు సినిమా రంగం లోనే వున్నారు. ఇద్దరివి టెన్షన్ జీవితాలే. దీనివల్ల సమస్యలు ఏవన్నా?
లేదు.. అస్సలు. నేను కాక మరో హౌస్ వైఫ్ ఎవరైనా అయి వుంటే రాజుకు చాలా సమస్యలు వచ్చేవేమో? నేను ఇదే ఫీల్డ్ కాబట్టి అర్థం చేసుకుంటాను. ఇప్పటికీ టైమ్ కు రారు, ఫోన్ తీయరు, మెసేజ్ కు రిప్లయ్ వుండదు.. సరే ఏ హీరో దగ్గరో వుండి వుంటారు. ఏ ప్రమోషన్ కార్యక్రమంలోనో వుండి వుంటారు అనుకుంటాను.

సినిమాలు తీసారు.. దర్శకత్వం చేసారు. రాజుగారు కూడా రెండు జనరేషన్లను సినిమా ఫీల్డులో చూసారు. ఇంక చాలు.. హాయిగా ప్రశాంతంగా వుందాం. అని ఎప్పుడన్నా అనిపించిందా?
లేదు. మేం సాధించాల్సింది ఇంకా చాలా వుంది. ఇప్పుడిప్పడే నాపై సినిమా జనాలకు కాన్ఫిడెన్స్ వస్తోంది. అందువల్ల సినిమాలు చాలా చేయాలి. రాజు కూడా థర్డ్ జనరేషన్ ను కూడా చూడాలి. గౌతమ్ హీరోగా వచ్చే సినిమాకు కూడా పీఆర్వోగా వుండాలి. నాగ చైతన్యకు చేసాడు. అఖిల్ కు కూడా చేయాలి. అలాగే మోక్షజ్ఞ. ఇలా ఎంతో వుంది.

సూపర్ హిట్ ఇప్పటికీ హిట్ గానే వుందా?
దాన్నిఇప్పటికీ క్వాలిటీతో రన్ చేస్తున్నాం. జిఎమ్ గా నేను, ఎడిటర్ గా ఆయన క్వాలిటీపై చాలా కేర్ తీసుకుంటాం. ఆ విషయంలో మాత్రం చాలా సార్లు ఢీ అంటే ఢీ అనుకుంటాం. నేను టైమ్ కు మ్యాగ్ జైన్ రావాలంటాను.. ఆయన కాస్త ఆలస్యమైనా క్వాలిటీ వుండాలంటారు. అలా అన్న మాట.

భవిష్యత్ కార్యక్రమాలు?
రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. ఒకటి యంగ్ హీరోతో నా దర్శకత్వంలో. లైన్ ఓకె అయింది. డైలాగ్ వెర్షన్ జరుగుతోంది. మరోటి కేవలం నిర్మాతగా చిన్న సినిమా.

కంగ్రాట్స్.. మీరు అనుకున్న రీతిలో గోల్ రీచ్ కావాలని 'గో తెలుగు' కోరుతోంది.
థాంక్సండీ.. గోతెలుగు మరింతగా ఎదగాలని మేమూ కోరుకుంటున్నాం.

-- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Yevadu