Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrydayam

ఈ సంచికలో >> సినిమా >>

అంతకు మించిన విజయం సాధించలేదే?!

anthaku minchina vijayam sadhinchalede

ఒక హీరో, ఒక దర్శకుడి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చి విజయం సాధిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తుందనగానే ప్రేక్షకులలో, అభిమానుల్లో, సినీ పరిశ్రమలో ఒకింత ఆసక్తి, కుతూహలం కలుగుతుంది. దీనికి తోడు  ఆ హీరోనో లేదా ఆ దర్శకుడో సినిమా విడుదలకు ముందు 'మా ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందే ఒక సినిమా వచ్చి విజయం సాధించింది. ఇప్పుడు విడుదలవుతున్న సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది. ఇంతకు ముందు వచ్చిన సినిమా కన్నా మంచి విజయం సాధిస్తుంది!' అని ప్రెస్ మీట్లో తెగ చెప్తారు. కానీ సినిమా విడుదలయిన తర్వాత వచ్చిన ఫలితం మాత్రం 'సినిమా పరాజయం'! ఇదీ ఈ మధ్య విడుదలవుతున్న సినిమాల ముందు వినిపిస్తున్న మాట. జరుగుతున్న మాట. అలా ఈమధ్యన వచ్చిన సినిమాల గురించి కొన్ని సంగతులు -

కెవ్వుకేక : అల్లరినరేష్, దేవీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన 'బ్లేడు బాజ్జీ' సినిమా నరేష్ సినీ కెరీర్ లో మంచి కలెక్షన్స్ సాధించిన సినిమా. తిరిగి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కెవ్వు కేక' సినిమా అందరూ విజయం సాధిస్తుందనే అనుకున్నారు. దానికి తోడు అల్లరి నరేష్, దర్శకుడు దేవీప్రసాద్ కూడా 'బ్లేడు బాజ్జీ'కి మించిన విజయం సాధిస్తుంది 'కెవ్వు కేక' అని తెగ ఊదరగొట్టారు. కానీ 'కెవ్వుకేక' అట్టర్ ఫ్లాపయ్యింది.

ఇద్దరమ్మాయిలతో : అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'దేశముదురు' సూపర్ హిట్టయ్యింది. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో 'ఇద్దరమ్మాయిలతో' సినిమా అనగానే ఒకింత ఉత్సుకత, ఆసక్తి ఏర్పడింది. కారణం అల్లు అర్జున్ కి, పూరీ జగన్నాథ్ కి సరైన హిట్టు లేక చాలాకాలమైంది. కనీసం ఈ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా ఇద్దరికీ విజయానందం ఇస్తుందనుకుంటే సినిమా మాత్రం ఫ్లాపయ్యింది.

మసాలా : వెంకటేష్, కె. విజయభాస్కర్ కాంబినేషన్లో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలు మ్యూజికల్ హిట్స్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా వస్తుంది అనగానే చాలా క్రేజీ ఏర్పడింది. కారణం ఈ సినిమా హిందీలో సూపర్ హిట్టయిన 'బోల్ బచ్చన్' కు రీమేక్ కావడం. ఇంకా హీరో 'రామ్' ఉండడం వల్ల సినిమాపై చాలా ఆసక్తి ఏర్పడింది. 'మసాలా' పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా ముద్రపడింది.

ఆర్య 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య' సూపర్ హిట్టయ్యింది. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య 2' సినిమా ఫ్లాప్. దేవిశ్రీప్రసాద్ సంగీతం బావున్నప్పటికీ సినిమా పోయింది.

గ్రీకు వీరుడు : 'సంతోషం' సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. పాటలు కూడా హిట్టయ్యాయి. నాగార్జున, దశరథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా గుర్తింపు పొందింది. తిరిగి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గ్రీకు వీరుడు' అట్టర్ ఫ్లాపై నాగార్జునకు ఇంకోసారి నిరాశనే కలిగించింది.

కెమెరామెన్ గంగతో రాంబాబు : పూరి జగన్నాథ్ సినీ కెరీర్ పవన్ కళ్యాణ్ నటించిన 'బద్రి' సినిమాతో మొదలైంది. 'బద్రి' సినిమా వచ్చి చాలా ఏళ్ళయ్యింది. పూరి, పవన్ కాంబినేషన్లో చాలాకాలం తర్వాత వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా ఫ్లాపయ్యింది. పాటలు కూడా ఏమంత బాగాలేవు.

కొమరం పులి : పవన్ కళ్యాణ్ కు ఇప్పుడంటే 'అత్తారింటికి దారేది!', 'గబ్బర్ సింగ్' లాంటి పెద్ద హిట్లు ఉండచ్చు. ఈ సినిమాలు రాకముందు పవన్ కు పెద్ద హిట్ సినిమాలేవీ లేవు అంటే ఓ 'తొలిప్రేమ'నో లేదా ఓ 'ఖుషి'నో చెప్తారు. చాలాకాలం తర్వాత పవన్, ఎస్.జె. సూర్య కాంబినేషన్లో వచ్చిన 'కొమరం పులి' అట్టర్ ఫ్లాఫయ్యింది. పాటలు కూడా ఏమాత్రం బాగాలేక పవన్ అభిమానుల్ని నిరాశపరిచింది.

మహాత్మ : శ్రీకాంత్ కు వందవ చిత్రం 'మహాత్మ'. వంద చిత్రాలు పూర్తి చేసిన  నటులు చాలా కొద్దిమందే. అందులో శ్రీకాంత్ కూడా చేరాడు. అంతే కాకుండా ఈ 'మహాత్మ' సినిమాకు దర్శకుడు కృష్ణ వంశీ అనగానే మరింత క్రేజీ ఏర్పడింది. కారణం 'ఖడ్గం' సినిమా. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఖడ్గం' మంచి విజయం సాధించడమే కాదు పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి. తిరిగి ఇప్పుడు వచ్చిన 'మహాత్మ' మ్యూజికల్ గా బావున్నప్పటికీ సినిమా మాత్రం సరిగ్గా ఆడలేదు.

దేవుడు చేసిన మనుషులు : రవితేజకు సినీ హీరోగా కెరీర్ నిలబెట్టిన సినిమా 'ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం'. దీనికి దర్శకుడు పూరి జగన్నాథ్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ తర్వాత వచ్చిన 'ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాలు రెండూ మంచి హిట్స్. 'నేనింతే' సినిమా బావున్నప్పటికీ జనాలకు నచ్చలేదు. మళ్ళీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది.


ఇంకా మహేష్ బాబు, గుణశేఖర్ ల 'అర్జున్, సైనికుడు', తేజ, నితిన్ ల 'ధైర్యం', మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల 'ఖలేజా', పూరి జగన్నాథ్, ప్రభాస్ ల 'ఏక్ నిరంజన్', ఉదయ్ కిరణ్, వి.ఎన్. ఆదిత్య ల 'శ్రీరామ్'. ఉదయ్ కిరణ్, తేజల 'ఔనన్నా కాదన్నా'. చిరంజీవి, గుణశేఖర్ ల 'మృగరాజు'. కె. విజయభాస్కర్, తరుణ్ ల 'భలే దొంగలు'. వేణు, రామ్ ప్రసాద్ ల 'రామాచారి' - ఇలా ఎన్నో సినిమాలు అపజయం పాలయ్యాయి. తమ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఇంతకు ముందు వచ్చి విజయం సాధించిన సినిమాతో, ఇప్పుడు విడుదలవుతున్న సినిమాతో పోల్చుకుని, 'అంతకు మించిన విజయం సాధిస్తుంది' అని గొప్పగా చెప్పడం బాగాలేదు. ప్రేక్షకులు, అభిమానులు కూడా చాలాగొప్పగా 'అంతకు మించిన విజయం సాధించలేదే?!' మీ సినిమా అని తీర్పు ఇచ్చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా!

- కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
Poetry on Sri Akkineni Nageswara Rao