Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

'దూదుంపుల్లాట' లో ఇసుకని సన్నగా, పొడవుగా, ఒక మనిషి మోచేయి కంటే ఎక్కువ పొడవుగా రెండు అరచేతులతో పోగు చేస్తారు. ఒక చిన్న ఈనె పుల్లని ఒకడు ఎదుటివాడికి కనబడకుండా ఆ ఇసుకలో దాస్తాడు. రెండో ఆటగాడు తన రెండు చేతి వేళ్ళనీ ఒకదానిలో ఇంకొకటి దూర్చి, ఆ ఈనె పుల్ల ఎక్కడ ఉందనుకుంటాడో అక్కడ వేయాలి. సరిగ్గా పుల్ల ఉన్న చోట వేస్తే వాడు నెగ్గినట్టు...
లేకపోతే మళ్ళీ ప్రయత్నించాలి. అలా ఆట నడుస్తూ ఉంది...

ఇంతలో కిట్టుని వెతుక్కుంటూ, నాయనమ్మ రానే వచ్చింది.

ఏంట్రా...

ఇందాకట్నుంచి, నోరు పడిపోయేటట్టు అరుస్తూనే ఉన్నాను... ఉలక్కుండా, పలక్కుండా నీ దారిన నువ్వు ఆడుతూనే ఉన్నావు. అన్నం తినకుండా ఆటలేంటి?

ఏయ్... పిల్లలూ... పోండ్రా మీరందరూ...

అని తిడుతూ కిట్టు రెక్క పట్టుకుని చటుక్కున చంకనేసుకుని, గబగబా ఇంటివైపు నడక సాగించింది.

****

తెల్లవారింది...

కిట్టు ఇంకా నిద్రలేవలేదు...

ఇంతలో 'శేఖర్'గాడు వచ్చాడు... శేఖర్ గాడు కిట్టుకి బంధువు... కిట్టు ఇంటి పక్కనే వాడి ఇల్లు.

కిట్టుని కుదుపుతూ 'ఒరే... కిట్టూ లేవరా' అన్నాడు శేఖర్. కళ్ళు నులుముకుంటూ ఏంట్రా? అన్నాడు కిట్టు... లేవరా అన్నాడు శేఖర్. 'ఓ సంగతుంది... నువ్వొస్తే చూపిస్తా... చూద్దువుగాని' అన్నాడు శేఖర్.

కిట్టు ఉత్సాహంగా లేచి, 'నడు... ఎల్దాం...' అన్నాడు.

వెళ్తూ వెళ్తూ గోడకి ఆనించిన ఇనుప రింగు, ఒక అడుగు అడుగున్నర వ్యాసం ఉన్నది(ఈ ఇనుప రింగుని ఎడ్లబండి చక్రానికి మధ్యలో, గట్టిగా చక్రాన్ని ఉంచేందుకు వాడతారు.) తీసుకుని దాని పక్కనే పెట్టిన తాటి కమ్మతో చాకచక్యంగా తోసుకుంటూ, శేఖర్ తో కలిసి ఊళ్లోకి వెళ్లాడు కిట్టు.
ఇద్దరూ కలిసి ఒక ప్రదేశానికి వెళ్లారు...

అక్కడ ఒక చిన్న మైదానం ఉంది. చాలా మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఉత్సాహంగా ఉన్నారు...

ఏముందిరా ఇక్కడ? అని శేఖర్ ని అడిగాడు కిట్టు...

శేఖర్ కిట్టుని ఇంకా దగ్గరకు తీసుకెళ్లాడు.

అక్కడ నేల మీద నిలువుగా ఒక 'అరటి బోదె', దానిపై అడ్డంగా ఇంకో అరటి బోదె, ఒక ఫ్యాన్ లాగా నిలబెట్టబడి ఉన్నాయి. అవి రెండూ కిందపడిపోకుండా మధ్యలో బలమైన 'గునపం' లాంటిది ఉంది.

అడ్డంగా ఉన్న అరటి బోదె పై ఆ చివరా, ఈ చివరా పిల్లలు కూర్చొని ఉన్నారు.

ఇద్దరు పెద్దవాళ్లు ఆ అడ్డుబోదెను ఫ్యాన్ లాగా తిప్పుతున్నారు.

పిల్లలు కింద పడిపోకుండా వాళ్లే చూసుకుంటున్నారు.

పిల్లలంతా నేను... నేను... అని ముందుకు వస్తున్నారు.

కిట్టు కూడా ముందుకుపోయి... నేను... నేను... అన్నాడు.

అక్కడున్న పెద్దవాళ్లలో ఒకడు కిట్టువైపు చూశాడు.

'పొట్టి బాలుడు, నల్లటి దేహచ్చాయ, పుల్లల్లాంటి కాళ్ళూ చేతులూ, చట్టి ముక్కుతో ఒంటిమీద చొక్కా లేకుండా, జారిపోతున్న నిక్కరును అప్పుడప్పుడూ పైకి లాక్కుంటున్న కిట్టు...' కనిపించాడతనికి.

కిట్టుని చూడగానే ముఖం చిట్లింది, అరే... ఇందాకే కదా నువ్వు ఎక్కావు?

మళ్లీ మళ్లీ వస్తే ఎలా? ఇంకోళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా? అన్నాడు.

'లేదండీ... లేదు...

నేను ఇప్పుడే వచ్చాను,

ఒరే... శేఖర్... నువ్వు చెప్పరా...' అన్నాడు కిట్టు.

శేఖర్ కిట్టుకి వత్తాసు పలికాడు.

సరే... కాస్సేపాగండి అన్నాడు పెద్దవాడు.

కాసేపటికి కిట్టుకి, శేఖర్ కి ఛాన్స్ వచ్చింది.

ఆ అరటి బోదెపై కూర్చుని, గిర గిరా తిరిగేటప్పటికి కిట్టుకి ఎంతో ఆనందం కలిగింది.

ఈసారి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు శేఖర్ గాడుకిట్టుని అడిగి, ఇనుపరింగు తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఇంటి ముఖం పట్టారు. ఇంటి వరకూ రాగానే శేఖర్ వెళ్లి రెండు 'కచ్చిక' ముక్కలు తెచ్చాడు.

కచ్చిక ఎలా వస్తుందంటే...

పేడతో 'పిడకలు' చేసి, ఆ పిడకల్ని కాల్చగా మిగిలినదే 'కచ్చిక'. ఈ 'కచ్చిక'ని అరచేతి పై వేసి రుద్దితే 'పౌడర్' అయిపోతుంది. ఆ 'పొడుం' నే కాల్గేట్ టూత్ పౌడర్ గా భావించి దానితో పళ్ళు తోముకుంటారు. దాంతో ఇద్దరూ పళ్ళు తోముకున్నారు.

ఒక తాటి ఆకును చక్కగా 'టంగ్ క్లీనర్' సైజులో కత్తిరించుకుని దగ్గర్లో ఉన్న బావి దగ్గరకు పోయి ముఖం కడుక్కున్నారు. అక్కణ్ణుంచి బయల్దేరి, దాదాపు ఊరి చివరకు చేరుకున్నారు. అక్కడ ఎక్కువ జన సంచారం ఉండదు. చెట్లు చేమలు, పొదలు, ఒక నీటి గుంట ఉంటాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఊరివాళ్ళకి అనువైన ప్రదేశమిది.

ఇద్దరూ కలిసి మొగలి పొదలున్న చోటికి వెళ్లారు. మొగలి పొదలు, దట్టంగా కాక పల్చగా ఉండి, చెట్టులాగా ఎత్తుగా కొమ్మలు కలిగి ఉన్నాయి.

రెండు ఎదురు బదురుగా ఉన్న చెట్లను ఎంచుకుని వాటి పైకి ఎక్కి చెరో కొమ్మమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ 'టాయిలెట్' పని కానిచ్చారు.

ఈలోపు దూరంగా ఎవరో తెలిసిన మనిషి వస్తున్నట్లు కనిపించాడు.

కిట్టు 'కనిపెట్టి, ఒరే... శేఖర్ మీ నాన్నొస్తున్నాడురా' అన్నాడు.

ఇద్దరూ గబగబా చెట్టుదిగి, నీటి గుంట దగ్గరకు పోయి, శుభ్రం చేసుకుని, పరిగెత్తుకుంటూ 'చెరువు' దగ్గరకు వచ్చారు.

అక్కడ కిట్టు వాళ్ళ అన్నయ్య చెరువులో స్నానం చేస్తున్నాడు. చెరువు గట్టుపైన సగానికి కట్ చేసిన లక్సు సబ్బు ఉంది. సబ్బు తొందరగా అరిగిపోకుండానూ, ఉన్నదానిని
ఎక్కువ రోజులు వచ్చేలా చేసిన ఏర్పాటు అది.

కిట్టు, శేఖర్ అదే సబ్బుతో చెరువులో స్నానం చేసేశారు. అక్కడున్న టవల్ లో ఇద్దరూ తుడుచుకుని ఇంటికి బయలుదేరారు.

బడికి వెళ్ళేది ఉందా? లేదా?... పొద్దున్నే వెళ్లి, ఇప్పుడా వచ్చేది...

అంటూనే కిట్టు వాళ్ల నాయనమ్మ కిట్టూకీ, అన్నయ్యకీ ఉప్మా పెట్టి, ఒక స్టీలు గ్లాసు నిండా కాఫీ పోసి ఇచ్చింది.

కొద్దిగా ఉప్మా తింటూ, కొద్దిగా కాఫీ తాగుతూ, అన్నదమ్ములు అల్పాహారం కానిచ్చారు.

చొక్కావేసుకుని, పుస్తకాల సంచి తగిలించుకుని బడికెళ్ళాడు కిట్టు.

కిట్టు స్కూలు ఇంటికి చాలా దగ్గర. స్కూలు గోడపై ఒక చెక్కబోర్డు ఉంది. ఆ బోర్డు మీద "ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, పెన్నాడ అగ్రహారము, పశ్చిమ గోదావరి జిల్లా..." అని రాసి ఉంది.

కిట్టు వాళ్ల అన్నయ్య కిట్టు కంటే ఒక క్లాసు ఎక్కువ. ఊళ్ళో, బళ్ళోకి వెళ్తాడు. "ఊళ్ళో బడి" అని పేరెందుకొచ్చిందంటే, అది ఊరి మధ్యలో ఉంటుంది గనుక. ఎక్కువ మంది మేష్టార్లు, ఎక్కువ క్లాస్ రూంలు ఉంటాయి.

కిట్టు బళ్ళోను, ఊళ్ళో బళ్ళోనూ ఐదో క్లాసు వరకే. కానీ కిట్టు బళ్ళో ఇద్దరే మాష్టార్లుంటారు. మొదటి మాష్టారు పేరు 'పంతులమ్మ గారు' ఈ పంతులమ్మ గారి అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలని ఎవరూ అనుకోరు కూడా... ఆ అవసరం కూడా లేదు.

పంతులమ్మగారు... పంతులమ్మగారు... అని పిల్లలు, గ్రామస్థులు ఆవిడను పిలుచుకుంటారు. ఆవిడను చాలా గౌరవంగా చూసేవారు.

రెండో మాష్టారు... మాత్రం మారుతూ ఉంటారు.

ఒకసారి ఒక 'లేడీ టీచర్' వచ్చింది... ఆమె పేరు 'కొత్త పంతులమ్మ' అని పెట్టుకున్నారు.

ఆమె వెళ్లిన తర్వాత 'సత్యం' మాష్టారు, ఆ తర్వాత 'మూర్తి' మాష్టారు అలా...

అదేంటోగానీ పంతులమ్మగారు మాత్రం మారరు, రెండో మాష్టారు మాత్రమే మారుతుంటారు.

కిట్టు తల్లిదండ్రులిద్దరూ గవర్నమెంటు ఉద్యోగస్తులే. ఈ ట్రాన్స్ ఫర్ ల గొడవల్లో పిల్లల్ని ఎన్నిసార్లు అటూ ఇటూ మారుస్తాములే అని, తాత నాయనమ్మల దగ్గర పిల్లల్ని ఉంచేసారు. ఎప్పుడన్నా సెలవుల్లో వచ్చి పిల్లల్ని చూసుకుంటుంటారు.

కిట్టుని కూడా బళ్ళో చేరుస్తానన్నారు వాళ్ల నాన్నగారు. కానీ కిట్టుకి ఇంటి దగ్గర బడి అలవాటై పోయింది. వేరే బడి, అందునా 'పెద్దబడి' అంటే భయం వేసి, ఏడ్చి, గోల చేసి ఊళ్ళో బళ్ళోకి వెళ్లలేదు. కిట్టు బడిలో కూర్చున్నాడు.

పంతులమ్మగారు లెక్కల పాఠం మొదలెట్టారు. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, అంతకుముందు చెప్పినవే కొద్దిపాటి అంకెల మార్పుతో మళ్లీ చెప్పారు. రెండు లెక్కలు బోర్డుమీద రాసి, మీ అంతట మీరు చేసి నాకు చూపించండి... అన్నారు. బోర్డు మీద చూసి పలకమీద రాసుకున్నాడు కిట్టు.

'పలక' ని ఇంగ్లీష్ లో 'స్లేట్' అంటారు. ఇప్పుడసలు పిల్లలు 'పలక'లే వాడటం లేదు. వాడినా అవి చాలా 'మోడర్న్' పలకలు.

కిట్టువాడే పలకకి చుట్టూ చెక్క బోర్డరు ఉండి, ఆ మధ్యలో పలుచగా ఉండే 'పలక' అమర్చబడి ఉంటుంది. కిందపడితే పలక పగిలిపోతుంది.

దానిపై 'కణికె' తో రాయాలి. ఆ 'కణికె' కూడా పలకతో చేసినదే... సన్నగా, పొడవుగా ఉంటుంది. దాన్ని 'బలపం' అంటారు.

ఈ పలకలతో పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. పలకతో నెత్తిమీద కొడితే, ఆ పలక పగిలి, దాని చుట్టూ ఉన్న చెక్క బోర్డరు మెడ చుట్టూ హారం లాగా ఉండిపోతుంది. దెబ్బతిన్నవాడికి హాని కలగకుండా ఈ హారాన్ని తియ్యడం ఒక పెద్ద పని.

మాస్టార్లు, వీలున్నంతవరకు ఈ పనిని తమ భుజస్కందాలపై వేసుకుని, ఏడ్చేవాడిని ఊరుకోబెడుతూ, కార్యాన్ని సాధించేవారు.

బలపాలది ఇంకో కథ...

చెవిలో బలపం దూర్చుకొనే వాడొకడు, ముక్కులో పెట్టుకుని, ఊపిరాడ్డంలేదని గోలపెట్టేవాడొకడు, బలపాలు తినేసేవాడొకడు,

ఇలా రకరకాల గొడవలు... గొడవకి తగ్గ మందు కనిపెట్టడం మాస్టారి వంతు.

లోకల్ గా ఉన్న 'ఆరెంపీ' డాక్టర్ని పిలిచి, జాగ్రత్తగా ముక్కులోనో, చెవిలోనో దూరిన బలపాలను తీయించడం, బలపాలు తిన్నవాణ్ణి 'బెత్తం' తో కొట్టడం... లాంటి అదనపు
బాధ్యతలు మాస్టార్లు స్వీకరిస్తూ ఉంటారు.

పంతులమ్మగారిచ్చిన లెక్కలు కిట్టుకి అర్ధంకావడం లేదు... ఎలా చేయాలో చేతకావడం లేదు.

ఈలోపు పంతులమ్మ గారు ఇంకో టీచరుతో బాతాఖానీలో పడ్డారు.

లెక్కలు చేసిన పిల్లలు ఒక్కరొక్కరే పంతులమ్మగారి దగ్గరకు వెళ్లి పలకలు చూపిస్తున్నారు. ఆవిడ మాటల్లోనే ఉండి టిక్కు పెట్టి పంపిస్తున్నది.

ఒక టిక్కు పెట్టిన పలకమీద ఉన్నది యధాతధంగా కాపీ కొట్టి, తీసుకువెళ్లాడు కిట్టు.

మాటల్లోనే ఉన్న పంతులమ్మగారు 'ఇంటూ' కొట్టారు. మళ్లీ వెనక్కి వచ్చి, ఎవడికి టిక్కు వచ్చిందో వాడితోనే లెక్క చేయించి తీసుకువెళ్లాడు కిట్టు. ఈసారి కూడా ఇంటూనే...

ఎందుకిలా జరుగుతోంది? కిట్టుకి ఏ మాత్రం అర్ధంకావడంలేదు... కిట్టు లెక్కల్లో 'వీక్' అని పంతులమ్మగారికి తెలుసు. అందుకనే చూడకుండానే ఇంటూ మార్కు పెట్టిందావిడ.

ఈ విషయం అర్ధం చేసుకోవడానికి కిట్టుకి కొన్ని సంవత్సరాలు పట్టింది...

పంతులమ్మగారి బాతాఖానీ అయిపోయింది. మళ్ళీ ఈలోకంలోకి వచ్చిందామె...

కిట్టు పలక చూసి, 'ఎవడు రాసాడురా ఇది' అని అడిగింది. వెంటనే రాసినవాడు భయపడుతూ చెప్పేశాడు.

"నా అంతట నేను రాయలేదండి... కిట్టు రాయమని అడిగితేనే రాసాను" అన్నాడు.

"వాడితో రాయిస్తావురా?" అంటూ బెత్తంతో కిట్టుకి నాలుగు దెబ్బలు వడ్డించారు పంతులమ్మ గారు.

ఆ తర్వాత...

"ఏంట్రా... నువ్వు, శేఖర్ గాడు, చెట్టుమీద తప్ప అందర్లాగా నేలమీద టాయిలెట్ కి వెళ్లరేంట్రా అంటూ ఇంకో నాలుగు బెత్తం దెబ్బలు తగిలించింది.

ఈ సంగతి పంతులమ్మగారికెలా తెలిసిందో కిట్టుకి అంతుబట్టలేదు."

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
duradrushtapu dongalu