Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

పాటల పల్లవులే!

patala pallavule

'రాణీ రాణెమ్మ!' 1985 లో అర్జున్, పూర్ణిమ జంటగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'మా పల్లెలో గోపాలుడు' లోని సూపర్ హిట్ పాట. ఈ 'రాణీ రాణెమ్మ' పల్లవి పేరుతోనే ఇప్పుడు కోడి రామకృష్ణ అర్జున్, లక్ష్మీరాయ్ లతో ఒక సినిమా తీస్తున్నారు. ఇలా సూపర్ హిట్టయిన పాటల పల్లవులతో ఈ మధ్యన వస్తున్న  సినిమాలకు పేర్లు పెట్టడం బాగా అలవాటుగా మారింది. ఇప్పుడని గాదు, గతంలోనూ ఇలా పాటల పల్లవుల పేర్లతో చాలా సినిమాలు వచ్చాయి. పాటల పల్లవులతో వచ్చిన కొన్ని సినిమాల గురించి కొన్ని సంగతులు -

ఎవర్ గ్రీన్ ఆణిముత్యం 'మాయాబజార్' సినిమాలోని పాటల పల్లవులతో జంధ్యాల రాజేంద్ర ప్రసాద్, రజని, కోట శ్రీనివాసరావులతో 'అహ నా పెళ్ళంట', హరీష్, సంఘవి లు జంటగా 'ఓహో నా పెళ్ళంట', మోహన్, నరేష్, అశ్విని ల కాంబినేషన్ లో 'చూపులు కలిసిన శుభవేళ', రాజేంద్ర ప్రసాద్, అశ్విని ల 'వివాహ భోజనంబు' సినిమాలు తీసారు. ఇదే 'మాయాబజార్' సినిమా లోని 'లాహిరి... లాహిరి... లాహిరి లో' పల్లవితో దర్శకుడు వై.వి.యస్. చౌదరి హరికృష్ణ, సుమన్, వినీత్ ల కాంబినేషన్ లో ఒక సినిమా తీశాడు.

ఇక 'అభినందన' సినిమాలో నుంచి 'ప్రేమ ఎంత మధురం' అనే పాట పల్లవితో సీనియర్ నరేష్ తో జంధ్యాల తీసిన ఒక సినిమా వచ్చింది. 'చుక్కలాంటి అమ్మాయి - చక్కనైన అబ్బాయి' పల్లవితో ఈ మధ్యనే తరుణ్, విమలారామన్ లతో ఒక సినిమా వచ్చింది. 'మంచు కురిసే వేళలో' పేరుతో కూడా ఒక సినిమా షూటింగ్ జరుపుకుంది కాని సినిమా విడుదలైంది లేనిది తెలీదు.

'సిరిసిరిమువ్వ' లోని 'ఝుమ్మంది నాదం' పల్లవితో తాప్సీ, మంచు మనోజ్ నటించిన సినిమా, 'అల్లూరి సీతారామరాజు' సినిమాలోని 'వస్తాడు నా రాజు' పల్లవితో ఒక సినిమా వచ్చింది. ఇక చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' లో నుంచి 'జై చిరంజీవ, ప్రియతమా' పాటల పల్లవులతో సినిమాలు వచ్చాయి.

ఇంకా 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి', 'జయమ్ము నిశ్చయమ్మురా', 'నా హృదయంలో నిదురించే చెలి', 'నువ్వక్కడుంటే నేకిక్కడుంటా', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'ఈ వర్షం సాక్షిగా', 'కలవరమాయె మదిలో', 'కనులు మూసినా నీ వాయె', 'ఆకాశ వీధిలో', 'సొగసు చూడ తరమా', 'ఇదే నా మొదటి ప్రేమలేఖ', 'అందమైన అనుభవం', 'కొత్త బంగారు లోకం', 'ఖుషీ ఖుషీగా', 'నీకు నేను నాకు నువ్వు', 'నిను చూడక నేనుండలేను', 'ఓ పాపా లాలి', 'మౌనమేలనోయి', 'శ్రీ ఆంజనేయం', 'ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే', 'రావోయి చందమామ', 'చందమామ రావే', 'సరిగమలు', 'చెప్పవే చిరుగాలి', 'జగమే మాయ', 'ఒక చిన్న మాట', 'నువ్వు వస్తావని', 'చెప్పాలని వుంది' ఇలా ఎన్నో సినిమాలు పాటల పల్లవుల పేర్లతో వచ్చాయి.

ఇప్పుడు 'నాని' సినిమాలోని 'వస్తా నీ వెనుక' పల్లవి పేరుతో ఒక సినిమా, 'రాంబంటు' సినిమాలోని 'ఏమో గుర్రం ఎగరావచ్చు' పల్లవితో ఒక సినిమా, 'పోటుగాడు' సినిమాలోని 'ప్యార్ మే పడిపోయానే' పల్లవితో ఒక సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మధ్యనే హీరో నితిన్ కు 'గుండెజారి గల్లంతయ్యిందే' లాంటి హిట్ సినిమాను అందించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నటుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమాకు ఒక పేరును నిర్ణయించినట్లు తెలిసింది. ఆ పేరేంటంటే 'ఒక లైలా కోసం!' ఇది శ్రీ అక్కినేని గారు నటించిన 'రాముడు కాదు కృష్ణుడు' సినిమాలోని సూపర్ హిట్ పాట పల్లవి.

- కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
Anamika