Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugadu inter fail ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

క్తుల పెన్నిధి. అశేష భక్తుల ఆరాధ్యదైవం. సింహాచలం మహా పుణ్యక్షేత్రం.

పచ్చగా చూడచక్కగా గోచరిస్తున్న 'సింహగిరి' కొండని చుట్టుకొని పాములా మెలికలు తిరిగి ఉంది ఘాట్ రోడ్.

జీడి, మామిడి, అనాస, పనస పండ్ల తోటలతో పాటు సువాసనలు వెదజల్లే సంపంగిపూలు చెట్లతో కళకళలాడుతుంది కొండ కొండంతా.

కొండ పైకి ఘాట్ రోడ్ లో ప్రయాణించే భక్తులు కమ్మటి సువాసనలు ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా సింహాద్రి అప్పన్న దర్శనానికి నిర్మల మనస్కులై వెళ్తుంటారు.

కొన్ని వందల ఏళ్ళ క్రితం గుర్తించబడి నిర్మించబడ్డ ఆలయం అది. పురూరవ చక్రవర్తి కాలంలో భక్తులకు చేరువైన భగవంతుడు నిత్యపూజలందుకుంటూ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిగా, సింహాద్రి అప్పన్నగా, చందనస్వామిగా వేనోళ్ళ కొలవబడుతున్నాడు.

ఆ రోజు -
స్థిరవారం. చందన స్వరూపుడైన సింహాద్రి అప్పన్నకు మేలిమిరోజు, వేలుపురోజు. అప్పన్నకు ప్రీతి పాత్రమైన దినము. ఆంధ్రరాష్ట్రం నలుమూలల నుండే కాక ఒడిశా, బెంగాల్ తదితర రాష్ట్రేతరాల నుండి కూడా వేలకు వేల మంది భక్తజనులు దైవ దర్శనానికి విచ్చేశారు. క్షేత్రమంతా చాత్రలో జాతరలా ఉంది.

కొండ దిగువున ఊరు ఊరంతా భక్తులతో కిక్కిరిసి ఉంది. కొండ దిగువ బస్సు స్టాండ్ లో భక్తులు బస్సుల కోసం క్యూలో నిలబడి ఉన్నారు. కొందరు కాలినడకన మెట్ల మార్గంలో 'తొలి పావంచా' దగ్గర కాలభైరవ స్వామికి కొబ్బరికాయలు కొట్టి 'గోవిందా గోవిందా' అను అరుచుకుంటూ కాలి నడకన నడిచి వెళ్తున్నారు.

ఒకదాని వెనుక ఒకటి బస్సులు భక్తులను ఎక్కించుకుని కొండపైకి వెళ్తున్నాయి. కొండపైనుండి దర్శనాలు అయిన భక్తులను మోసుకుంటూ క్రిందకు దిగుతున్నాయి కొన్నిబస్సులు.

సింహాచలానికి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుండి చేరువలోన ఉన్న ఇతర నగరాల నుండి నేరుగా కార్లలోనూ, స్కూటర్ల పైన, బైక్ లపైన వస్తున్న భక్తులు టోల్ గేట్ దగ్గర టిక్కెట్లు తీసుకుని నేరుగా ఘాట్ రోడ్ లో కొండపైకి వెళ్ళిపోతున్నారు.

కొండ ఘాట్ రోడ్డంతా వచ్చేపోయే వాహనాలతో మహారద్దీగా ఉంది. బైకులయితే ఈగల్లా అటూ ఇటూ తిరుగుతున్నాయి.

కొండపైన దేవాలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది. దైవ దర్శనానికి భక్తులంతా క్యూలలో నిలబడ్డారు. ఆలయంలో ప్రాంగణమంతా దివ్యత్వం నిండుకుని ఏదో తెలియని మహదానందం పరచుకుని ఉంది. భక్తులంతా భక్తి పారవశ్యంలో స్వామి నామస్మరణ చేసుకుంటూ క్యూలో ముందు సాగుతున్నారు.

దేవాలయంలో ఉన్న మైకుల్లో నుండి భక్తులకు రకరకాల జాగ్రత్తలు చెప్తున్నారు. దొంగలున్నారని జాగ్రత్తలు చెప్తూ పిల్లలు తప్పిపోకుండా జాగ్రత్త పడమని చెప్తూనే క్యూలో తోపులాటలు లేకుండా వెళ్ళమని అభ్యర్ధిస్తున్నారు.

సరిగ్గా పదిగంటలు కావస్తోంది. భక్తుల రద్దీ రాను రాను మిక్కుటమవుతోంది. పోలీసులు, దేవాలయ సిబ్బంది యాత్రికులను కంట్రోల్ చేయలేకపోతున్నారు.

ఉత్తర ద్వారం గుండా దర్శనానికి వెళ్ళిన భక్తులు గాలిగోపురంలో నుండి తిరిగి వెలుపలకు వస్తున్నారు. గాలి గోపురం ప్రక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్ల దగ్గరకి పరుగందుకుంటున్నారు. అక్కడ కూడా ప్రసాదాల కోసం క్యూ చాంతాడంత సాగి ఉంది. కొందరు భక్తులు నిత్యాన్నదాన సత్రంకేసి వెళుతున్నారు.

గాలి గోపురం దగ్గరనుండి కొండపై బస్సు స్టాండ్ వరకూ దారి పొడవునా ఉన్న దుకాణాల్లో చాలామంది భక్తులు గుమిగూడి ఉన్నారు. సెనగలు, ఖర్జూరం, స్వామివారి ఫోటోలు, పిల్లల ఆటవస్తువులు ఇళ్ళల్లో పూజకోసం ఇత్తడి కుందులు గట్రా కొనుక్కునేందుకు ఆ షాపుల్లో ఈగల్లా మూగి ఉన్నారు.

కొండ దిగువకు నడిచి వెళ్ళే భక్తులు బస్సు స్టాండ్ కి ప్రక్కనే వున్న మెట్ల మార్గంలో దిగువకు దిగి వెళ్ళిపోతున్నారు. కొండపైకి వచ్చేవాళ్ళు వస్తున్నారు.

కొండ దిగువ నుండి వస్తున్న బస్సుల్లో యాత్రీకులు దిగ దిగగానే, దర్శనాలు అయిపోయిన భక్తులు కొండ క్రిందకు చేరుకునేందుకు బస్సు ఆగీ ఆగ్గానే మీద పడుతున్నారు. లోపలనుండి దిగుతున్న వాళ్ళని దిగనీయకుండా తోసుకుంటూ ఎక్కుతున్నారు. అక్కడున్న క్లీనర్ కుర్రాళ్ళు వాళ్ళని కంట్రోల్ చెయ్యలేకపోతున్నారు.

కొండ దిగువకు వెళ్ళే ఒక బస్సు యాత్రీకులతో క్రిక్కిరిసిపోయి ఉంది. క్లీనర్ కుర్రాడు బస్సులో ఉన్న యాత్రీకులందరి దగ్గర టిక్కెట్లు ఉన్నాయో లేదో చెక్ చేసి 'రైట్' అంటూ బస్సు మీద పెద్దగా ఒక్క చరుపు చరిచాడు.

బస్సు డ్రైవర్ అప్పారావు ప్రక్కనే వున్న రావిచెట్టు క్రిందనున్న పాన్ షాప్ దగ్గర నిలబడి భక్తులు బస్సు ఎక్కుతుంటే గమనిస్తున్నాడు. జర్దాకిళ్ళి బుగ్గన పెట్టుకుని నెమ్మదిగా నములుకుంటూ నిదానంగా నడుచుకుంటూ బస్సు దగ్గరికి వచ్చి స్టీరింగ్ సీట్లో ఎక్కి కూర్చున్నాడు.

బస్సు స్టార్ట్ చేసి హారన్ మోగించాడు. ఇంకా ఎవరైనా ఎక్కవలసి ఉన్నా ఎక్కుతారని, క్లీనర్ కుర్రాడు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తాడని అలా హారన్ మ్రోగిస్తారు డ్రైవర్లు.

ఇంతలో పరుగు పరుగున ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు డ్రైవర్ దగ్గరకు వెళ్ళి ఆపమని చేతులూపుతూ వచ్చాడు. పరిగెత్తుకు మెట్లు దిగడం వలన ఆయాసంతో మాట్లాడలేకపోతున్నాడు.

"అన్నా! మా వాళ్ళు నలుగురు బస్సు ఎక్కుతున్నారు" అంటూ తను దగ్గరుండి దర్శనం చేయించి తీసుకువచ్చిన వాళ్ళని దగ్గరుండి బస్సు ఎక్కించాడు ఆ యువకుడు. ఆ యువకుడికి అక్కడ అందరూ తెలిసినవాళ్ళే.

"చాలా థాంక్స్ ఏకాంబర్! చాలా శ్రమ తీసుకుని మాకు గైడ్ గా వ్యవహరించి దర్శనాలు దగ్గరుండి చేయించావ్! నువ్వు లేకపోతే ఇంత తొందరగా మా దర్శనాలు అయ్యేవి కావు" బస్సు ఎక్కుతూ ఆ నలుగురిలో పెద్దాయన ఒకరన్నారు.

"అదేంటి సార్! మీతో పనుంటే మీరు నాకు సహాయం చెయ్యరా? ఏంటి?!" వినయంగా అన్నాడు ఏకాంబర్.

"నువ్వు రావా?!" ఇంకొకతను అడిగాడు.

"నేను ముందే మీకోసం కొండకి వచ్చా కదా సార్! అందుకే బైక్ మీద వచ్చేసాను. నా బైక్ ఇక్కడే ఉంది. ఉంటా సార్!" అంటూ వారికి వీడ్కోలు పలికాడు ఏకాంబర్.

"ఏకాంబర్ సార్! మీ కుశల ప్రశ్నలు ముందే మాట్లాడుకుంటే బాగుండేది. బస్సు బయలుదేరే ముందు ఎక్కి ఈ సోదేంటి సార్" అని ఏకాంబర్ తో అంటూనే క్లీనర్ కుర్రాడు బస్సు మీద దబదబా బాదుతూ 'రైట్ రైట్' అని అరిచాడు.

బస్సు నిండు చూలాల్లా కదల్లేక కదులుతూ ముందుకు కదిలింది. అరఫర్లాంగ్ దూరం మేర కొండ ఘాట్ రోడ్ ఎక్కాలి. క్రిక్కిరిసిన యాత్రీకులతో ఫస్టు గేర్ మార్చి రెండో గేర్ లోనే ముందుకు నడిపించాడు డ్రైవర్ అప్పారావు.

ఆ తర్వాత ఘాట్ రోడ్ అంతా పల్లంలోనే ఉంది. మలుపులు మలుపులతో జర్రున జారిపోయేలా రోడ్డంతా పల్లంలోనే సాగిపోతుంది.

'ఈ అరఫర్లాంగ్ దూరం దాటితే ఇక అంతా డౌనే. టాప్ గేర్ లోనే ఎలాంటి రేజింగ్ ఇవ్వకుండా కొండ క్రిందకు దిగవచ్చు' మనసులోనే అనుకున్నాడు అప్పారావు. ఎన్నిసార్లు బస్సు కొండపైకి, దిగువకి నడిపినా అస్తమానం కొత్తగానే జాగ్రత్తగానే బస్సు నడపడం డ్రైవర్లందరికీ అలవాటు.

కొండ ఘాటీ ఎక్కగానే ఉన్న పెద్ద మలుపు దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ చేసే సెక్యూరిటీ గార్డు వచ్చే పోయే వాహనాలకి సిగ్నల్స్ ఇస్తున్నాడు. ఆ మలుపులో క్రింద నుండి వచ్చే వాహనాలు, దిగే వాహనాలను పసిగట్టలేవు. హారన్ కూడా సరిగ్గా వినిపించదు. ప్రమాదాలు జరక్కుండా దేవాలయం అధికారులు ఏర్పాటు చేసిన జాగ్రత్త చర్యల్లో అదొకటి.

పెద్ద మలుపు దాటి కొండ బస్సు పల్లం రోడ్డులో రివ్వున తారాజువ్వలా దూసుకుపోతోంది.

బస్సులో యాత్రీకులు కిక్కిరిసి ఉన్నారు. మగాళ్ళు కొందరు గుండు చేయించుకుని తలకి చందనం పూసుకొని ఉన్నారు. ఆడ, మగ, పిల్లలు, పెద్దవాళ్ళు అంతా ఒకర్నొకరు ఒరుసుకుంటూ కూర్చున్నారు. నిలబడ్డ వాళ్ళంతా ఒకరిమీద ఒకరు పడిపోతూ బస్సు కొండ దిగుతూంటే వూగిపోతూ సున్నితంగా గుద్దుకుంటూ కొండ దిగువనున్న ఊర్ని, లక్క పిడతల్లా కనిపిస్తున్న ఇళ్ళని చూస్తూ భక్తి పారవశ్యంలో ఉన్నారు.

ఎవరో పిల్లాడు ఊపిరి సలపక గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. జనాల మధ్య నిలబడి పిల్లాడ్ని ఎత్తుకోలేక నానా అవస్థలూ పడుతోంది ఆ తల్లి.

సీట్లో కూర్చున్న ఎవరో పుణ్యాత్మురాలు ఆమె దగ్గర నుండి పిల్లాడ్ని తీసుకుని బుదిరించింది. కొద్ది దూరంలో ఉన్న ఫుట్ బోర్డు మీద బూరలు, చిన్న బొమ్మలు, పిల్లనగ్రోవి కర్రలు, కాగితం ఫేనులు అమ్ముకునే ముసలతను నిలువుగా నిలబెట్టిన కర్ర పట్టుకుని ఉన్నాడు. ఆ కర్రకి పుల్లలతో పిల్లల ఆటవస్తువులన్నీ గుచ్చి గుచ్చి ఉన్నాయి.

ముందు సీట్లో కూర్చున్నతని గుండు మీద వెనక కూర్చున్న పిల్లాడు ఉండుండీ తబలా వాయిస్తున్నట్టు కొడుతున్నాడు. అతను వెనక్కి తిరిగి కుర్రాడ్ని చూసి మళ్ళీ తల తిప్పుకుంటున్నాడు.

బస్సు జారుడు బల్లమీద నుండి జారుతున్న పిల్లాడిలా రివ్వు రివ్వున ముందుకు దూసుకుపోతోంది.

కొండపైకి వస్తున్న బస్సులు, కార్లు, స్కూటర్లు, బైక్ లు టాప్ గేర్లో రివ్వున పైకి ఎక్కుతున్నాయి. ఏమాత్రం స్లో చేసినా వాహనాలు ఘాట్ రోడ్ లో ముందుకు సాగటం కష్టం. అదీగాక కార్లు, బస్సులు కిక్కిరిసి ఉంటాయి.

కొండ పై నుండి క్రిందకు రివ్వున దూసుకు వస్తున్న బస్సును తప్పించుకుంటూ ముందుకు పరిగెడుతున్నాయి. వాహనాలన్నీ.

కొండమీద నుండి క్రిందకు దిగుతున్న బైక్ లు రయ్ రయ్ మని ముందున్న బస్సుని దాటి గాల్లో దూసుకుపోతున్నాయి. నాలుగు చక్రాల కార్లు, బస్సులకు ముందు వెళ్తున్న బస్సుని తప్పించుకుని ముందుకు సాగే అవకాశం దొరకటం లేదు.

ఎన్నో ఏళ్ళుగా దేవస్థానంలో డ్రైవర్ గా పనిచేస్తున్న అప్పారావు బస్సుని ముందుకు అలవోకగా నడిపిస్తున్నాడు. తన ప్రమేయం లేకుండానే ముందుకు ఉరుకుతున్న బస్సుని మలుపుల దగ్గర, చాకచక్యంగా తిప్పుతూ ఎదర వస్తున్న వాహనాలను తప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు.

బస్సులో ఉన్న భక్తులంతా ఆహ్లాదంగా... ఆనందంగా కేరింతలు కొడుతూ, ఎవరి బాతాఖానీలో వాళ్ళున్నారు. ఫుట్ బోర్డు మీద నిలబడ్డ బూరల తాత దగ్గర కొందరు పిల్లలు బూరలు, కాగితం ఫేన్లు, అట్టతో చేసిన డమరుకం లాంటి ఆట వస్తువులు కొనమని తల్లిదండ్రుల్ని వేధిస్తున్నారు. పిల్లలు అలా ఏడుస్తుంటే బూరల తాత సంబరంగా వాళ్ళకేసి చూస్తూ బొమ్మలతో ఊరిస్తున్నాడు. నోట్లో బూరపెట్టుకుని ఊదుతున్నాడు. అది విని పిల్లలు మరింతగా అల్లరి చేస్తున్నారు.

రెండు చక్రాల వాహనం మీద ప్రయాణం చేస్తున్నవాళ్ళు కొండ దిగేటప్పుడు ఇంజన్ ఆపేసి, పెట్రోల్ కట్టేసి 'నూట్రల్' లోనే బైక్ లను ముందుకు పరిగెట్టిస్తున్నారు. వారి ప్రమేయం లేకుండానే టూ వీలర్స్, ముందున్న భారీ వాహనాలను సైతం దాటుకుంటూ పరుగులెడుతున్నాయి.

నాలుగు చక్రాల వాహనాలకు ఆ సౌకర్యం లేదు. ఇంజన్ ఆపితే 'ఎయిర్ బ్రేకులు' పని చెయ్యవు. ఒకవేళ ప్రమాదవశాత్తూ ఇంజన్ ఆగిపోతే అంతే సంగతులు. బ్రేకులు ఫెయిలయి వాహనం ఏ లోయలోనో పడిపోతుంది.

అందుకే బస్సులు, కార్లు నడిపే డ్రైవర్లు ఇంజన్ ఆన్ లోనే టాప్ గేర్లో వాహనాలను ముందుకు నడిపిస్తుంటారు. గతంలో ఇలాగే కొండపైన ఉన్న మరో ఘాట్ రోడ్డు నిర్మాణాలలో పనిచేస్తున్న కూలీలు లారీ ఎక్కి క్రిందకు దిగుతున్నప్పుడు 'లారీ' ఇంజన్ హఠాత్తుగా ఆగిపోయి బ్రేకులు పట్టక ప్రక్కనున్న లోయలో పడిపోయింది, అందులో ప్రయాణిస్తున్న కూలీలు, లారీ డ్రైవర్ తో సహా అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ సంఘటన ఇప్పటికీ మరుపురాని దుర్ఘటనే.

అప్పట్నుండీ లారీలను కొండపైకి అనుమతించడం మానేశారు. లారీలే కాదు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రైవేటు బస్సులు కూడా కొండపైకి నేరుగా రావడానికి వీల్లేదు. కొండ దిగువనే ఆగిపోవాలి. భక్తులంతా దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాలి. సుశిక్షితులైన దేవస్థానం డ్రైవర్లు నిరంతరం ఘాట్ రోడ్డులో బస్సులు నడుపుతూండడం వలన ప్రమాదాలకు ఆస్కారం లేదని అధికారుల ఆలోచన... ప్రగాడ నమ్మకం.

డ్రైవర్ అప్పారావు బస్సుని టాప్ గేర్ లో చాలా చాకచక్యంగా ముందుకు నడిపిస్తున్నాడు. బుగ్గనున్న జర్దాకిళ్లీ నములుతూ మధ్య మధ్య హారన్ కొడుతూ ఎదర వస్తున్న వాహనాలను దూరం నుండి గమనిస్తూ ముందుకు సాగుతున్నాడు. బస్సులో ఉన్న యాత్రీకులైన ప్రయాణీకులంతా కొండపైనుండి కొండ దిగువకి విమానంలా దూసుకుపోతున్న బస్సు వేగాన్ని కూడా పట్టించుకోవటం లేదు.

హఠాత్తుగా ఎదర రెండు కార్లు ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఘాట్ రోడ్డంతా ఆక్రమించి ముందుకు పరిగెడుతూ వస్తున్నాయి. ఒక కారు వేగంగా వస్తుంటే దాన్ని దాటేయాలని రెండో కారు దాన్ని దాటి ముందుకు వస్తోంది. అలా ఒకదాన్ని ఒకటి పోటీపడి రేసుగుర్రాల్లా దూసుకు వస్తున్నాయి.

దూరం నుండి వాటి పోటా పోటీ 'పరుగుల పందెం' గమనించిన అప్పారావు గతుక్కుమన్నాడు. తారాజువ్వలా ముందుకు దూసుకుపోతున్న బస్సుని కొంచెం స్లో చెయ్యకపోతే ఆ రెండు కార్లని గుద్దుకుని పెద్ద ప్రమాదం జరగవచ్చని గ్రహించాడు. గబుక్కున బ్రేకు మీద కాలేసి గట్టిగా నొక్కాడు. బ్రేకు మీద వేసిన కాలు మెత్తగా జారిపోయింది. అంతే! డ్రైవర్ అప్పారావు గుండె జారిపోయింది.
 

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college dropout gadi prema katha