Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

రీమిక్స్ ల జోరు

Remix

కె. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన 'కొండవీటి సింహం' సినిమా సూపర్ హిట్టైంది. ఇందులోని పాటలూ హిట్టయ్యాయి. ఇందులో 'అత్తమడుగు వాగులోనా అత్తకూతురా' అనే పాటను జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగుతెరపై వస్తున్న సినిమాలలో రీమిక్స్ పాటల జోరు ఎక్కువైంది. 2013 లో విజయం సాధించిన సినిమాల్లో 'ప్రేమకథా చిత్రమ్', 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలు ఉన్నాయి. 'ప్రేమకథా చిత్రమ్' లో 'పచ్చని కాపురం' సినిమాలోని 'వెన్నెలైనా' అనే పాటను రీమిక్స్ చేస్తే 'గుండెజారి గల్లంతయ్యిందే' లో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం 'తొలిప్రేమ' లోని  పాటను రీమిక్స్ చేసారు.

ఈ రీమిక్స్ ల పాటలకు ఆద్యుడు సీనియర్ దర్శకుడు వంశీ. ఎప్పుడో పాతికేళ్ళ కిందట వచ్చిన 'శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్' సినిమాలో రీమిక్స్ పాటలను పరిచయం చేసారు. ఎవర్ గ్రీన్ కామెడీ క్లాసిక్ 'గుండమ్మ కథ'లోని 'ప్రేమయాత్రలకు బృందావనం' అనే పాటను తానే మళ్ళీ రాసి 'డిటెక్టివ్ నారద' లో చూపారు. రాజేంద్రప్రసాద్ 'జోకర్' సినిమాలోనూ అలనాటి 'రేపంటి రూపం కంటి...' పాటను రీమిక్స్ చేశారు. శివాజీ, అర్చనలతో వచ్చిన 'కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను' సినిమాలో ఎ.ఎన్.ఆర్, కృష్ణకుమారి ల 'కులగోత్రాలు' లోని 'చిలిపి కనుల తీయని చెలికాడా' పాటను రీమిక్స్ చేసి రీమిక్స్ ల పట్ల తన ఉత్సాహాన్ని చూపారు వంశీ.

రీమిక్స్ పాటలు చేయడంలో రామ్ చరణ్, అల్లరి నరేష్ నువ్వా నేనా అనే జోరు మీద ఉన్నారు. 'మగధీర'లో చిరంజీవి 'ఘరానా మొగుడు' లోని 'బంగారు కోడిపెట్ట' పాటను, 'రచ్చ' లో 'వానా వానా వెల్లువాయె...' అనే పాటను, 'నాయక్'లో 'కొండవీటి దొంగ' సినిమాలోని సూపర్ హిట్టయ్యిన 'శుభలేఖ వ్రాసుకున్నా...' అనే పాటను రీమిక్స్ చేశారు. ఇక అల్లరి నరేష్ 'సీమ శాస్త్రి' లో చిరంజీవి 'కొండవీటి రాజా' లోని 'మంచమేసి దుప్పటేసి' పాటను, 'అహ నా పెళ్ళంట'లో సీనియర్ నరేష్ 'నాలుగు స్తంభాలాట' లోని 'చినుకులా రాలి...' పాటను, 'సీమటపాకాయ్' లో సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ సినిమా 'సింహాసనం'లోని 'ఆకాశంలో ఒకతార' పాటను రీమిక్స్ చేసారు. 2013 లో వచ్చిన 'యాక్షన్ 3D' సినిమాలో నాగార్జున 'ప్రేమయుద్ధం' లోని 'స్వాతి ముత్యపు జల్లులలో' పాటను రీమిక్స్ చేశారు.

ఇదే విధంగా మహేష్ బాబు కూడా 'పోకిరి' సినిమాలో 'గలగల పారుతున్న గోదారిలా...' పాటను, గోపీచంద్ 'శౌర్యం'లో ఒక పాటను, జూ. ఎన్టీఆర్ 'అల్లరి రాముడు' లో 'ఆకుచాటు పిందె తడిసె' పాటను, 'యమదొంగ' లో 'ఓలమ్మీ తిక్కరేగిందా' పాటను, అర్జున్, కోడిరామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'మా పల్లెలో గోపాలుడు' లోని 'రాణీ రాణమ్మ' పాటను రీమిక్స్ చేసి అదే పేరును పెట్టి 'రాణీ రాణెమ్మ' సినిమాను రూపొందిస్తున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీమిక్స్ సాంగ్స్ పట్ల మక్కువ చూపారు. అలనాటి క్లాసిక్స్ ల్లో 'మిస్సమ్మ' సినిమా ఒకటి. ఇందులోని 'ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే...' అనే పాటను 'ఖుషి' సినిమాలో రీమిక్స్ చేసి అభిమానులను అలరించారు. ఇక పవన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'జానీ' సినిమాలో 'ఈ రేయి తీయనిది...' అనే పాటను రీమిక్స్ చేసి అభిమానులను ఆనందింపజేసారు.

- కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
pedarayudu+yamadharmaraaju 'rowdy'