Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Paisa

ఈ సంచికలో >> సినిమా >>

గ్లామ‌ర్ కోరుకోవడం త‌ప్పు కాదు... దాన్ని అందించ‌డ‌మూ త‌ప్పు కాదు - అదా శర్మ

Interview with Adah Sharma

తెలుగు చిత్రసీమ‌లోనే కాదు, ప్రతీ చోటా... క‌థానాయిక‌ల కొర‌తే! కాస్త ఎర్రగా బుర్రగా క‌నిపించి, గ్లామ‌ర్‌కి అడ్డుచెప్ప‌ని స్వభావం ఉండీ, ఇంకాస్త న‌టించే టాలెంట్ ఉంటే హార‌తులు ప‌ట్టి మ‌రీ ఆహ్వానిస్తారు. ఈ ల‌క్షణాల‌న్నీ ఆదాశ‌ర్మలో పూర్తిగా ఉన్నాయి. 1920 అనే బాలీవుడ్ చిత్రంలో ప్రేక్షకుల్ని భ‌య‌పెట్టి, విమ‌ర్శకుల మెప్పుపొందింది, హాంటెడ్‌లోనూ అదేర‌క‌మైన ప్రద‌ర్శన‌తో ఆక‌ట్టుకొంది. ఇప్పుడు హార్ట్ ఎటాక్‌తో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడి యువ హృద‌యాల్ని గ‌ల్లంతు చేసింది. తెలుగు సినిమా, ఇక్కడి వాతావ‌ర‌ణం, ప్రేక్షకుల అభిరుచి బ‌ట్టీప‌ట్టి మ‌రీ ఇక్కడ వాలిపోయిన‌... ఆదాశ‌ర్మ భావాలేంటి? తాను ఎలాంటి పాత్రల్ని కోరుకొంటోంది? త‌న ప్రయాణం ఎక్కడ మొద‌లైంది? హార్ట్ ఎటాక్ అనుభ‌వాలేంటి? ఈవిష‌యాల‌న్నీ మీ కోసం...

* ఎలా ఉంది తొలి తెలుగు సినిమా అనుభ‌వం?
- చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. భాష రాని చోట ఎలా నెగ్గుకురావాలో, ఏం చేయాలో అర్థమైంది.

* ఏం చేశారేంటి?
- ముందు సెట్లో తెలుగు మాట్లాడుతుంటే అంతా అయోమ‌యంగా తోచేది. ఏమీ అర్థమ‌య్యేది కాదు. అందుకే ఓ ట్యూట‌ర్‌ని పెట్టుకొన్నా. తెలుగులో ఒక్కో ప‌దం ఎలా ప‌లుకుతారు? దాని అర్థమేంటి? ఈ విష‌యాల్ని నేర్చుకొన్నా. సెట్లో ఏ ఇద్దరు తెలుగులో మాట్లాడుకొన్నా జాగ్రత్తగా గ‌మ‌నించేదాన్ని. అలా తెలుగు కొంచెం... కొంచెం అర్థమైంది. ఇప్పుడు బాగా వ‌చ్చు. అలాగ‌ని తెలుగులో మాట్లాడ‌లేను. కానీ ఎవరేం మాట్లాడినా అర్థమైపోతోంది. త్వర‌లోనే తెలుగులో మాట్లాడేస్తానేమో?

* హార్ట్ ఎటాక్ సినిమా చేయ‌క‌ముందు... ఇక్కడ ప‌రిశ్రమ గురించి ఏం తెలుసుకొచ్చారు?
- ఇక్కడివారికి సినిమా అంటే పిచ్చి. ఫ్యాష‌న్‌తో ప‌నిచేస్తారు. తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మంచివార‌ని విన్నా. అది నిజం అనే విష‌యం తెలియ‌డానికి ఎన్నో రోజులు ప‌ట్టలేదు.

* సినిమా అంటే మీకున్న ఫ్యాష‌న్ ఎంత‌?
- మాట‌ల్లో చెప్ప‌లేనంత‌. నిజంగానే నాకు సినిమాలంటే పిచ్చి. చిన్నప్పటి నుంచీ అంతే. అందుకే మ‌న‌సు చ‌దువు వైపు మ‌ళ్లలేదు. మాది చ‌దువుకొన్న కుటుంబం. నాన్న ఆర్మీలో ప‌నిచేస్తారు. అమ్మ కూడా పెద్ద చ‌దువులు చ‌దివింది. నేను మాత్రం ప‌దోత‌ర‌గ‌తే. దానికి కార‌ణం సినిమా...

* మ‌రి ఇంట్లోవాళ్లని ఒప్పించారా?
- మా ఇంట్లో ఆ స్వేచ్ఛ ఉంది. న‌చ్చిన ప‌ని ఎంచుకొనే సౌల‌భ్యం క‌ల్పించారు. అందుకే ముందు క‌థ‌క్ నేర్చుకొన్నా. యాక్టింగ్‌కి సంబంధించిన కోర్సులేం చేయ‌లేదు. క‌థ‌క్‌లాంటి డాన్స్ నేర్చుకొంటే... న‌టించ‌డం నేర్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

* మ‌రి ఈ సినిమాలో డాన్స్ చేసే అవ‌కాశం రాలేదుక‌దా..?
- (న‌వ్వుతూ) అఫ్‌కోర్స్‌.. కానీ నేర్చుకొన్న క‌థ‌క్ మాత్రం ఈ సినిమా కోసం బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఎందుకంటే కొన్ని భావాల‌ను క‌ళ్లతోనే ప‌లికించాల్సివ‌చ్చింది. అక్కడ క‌థ‌క్ అనుభ‌వం బాగా తోడ్పడింది.

* ముద్దు స‌న్నివేశం గురించి ఏమంటారు?
- ఆ సీన్ ని పూరిగారు చాలా తెలివిగా తీశారు. మా ఇద్దరి నెత్తిమీద ఓ గుడ్డవేసి... చిన్న మ్యాజిక్‌చేశారు. మేం ముద్దు పెట్టుకోలేదు. కానీ ఆ ఫీలింగ్ మాత్రం తెర‌పై క‌నిపిస్తుంది. పూరి ఎంత గొప్ప ద‌ర్శకుడో అని చెప్పడానికి ఈ చిన్న సీన్‌చాలు.

* మరి నిజంగా ముద్దు సీన్‌లో న‌టించాల్సివ‌స్తే...
- క‌థ‌కి అవ‌స‌రం అనుకొంటే త‌ప్పదు. ఓ ద‌ర్శకుడు ఏమైతే ఊహించి కాగితంపై పాత్రను సృష్టించాడో దానికి న‌టీన‌టులు న్యాయం చేయాలి. అందుకే క‌దా, మ‌మ్మల్ని తీసుకొనేది. ముద్దులైనా, కౌగిలింత‌లైనా క‌థ‌కు అవ‌స‌రం అన్నంత మేర‌కే చేయాలి. గీత దాటితే నేను చేయ‌ను. ప్రేక్షకులు కూడా హ‌ర్షించ‌రు.

* సినిమా అంటేనే గ్లామ‌ర్ ప్రపంచం క‌దా?
- అవును. ప్రేక్షకులు గ్లామ‌ర్ కోరుకోవ‌డం త‌ప్పు కాదు, దాన్ని క‌థానాయిక‌లు అందించ‌డం త‌ప్పు కాదు. కానీ అవ‌న్నీ క‌థ‌కు లోబ‌డే జ‌ర‌గాలి అంటాన్నేను. కావాల‌ని ఇరికించ‌కూడ‌దు. అలాంట‌ప్పుడు పాత్రల ఔచిత్యం దెబ్బతింటుంది.

* ఎలాంటి పాత్రలు చేయాల‌నివుంది?
- ఇప్పుడే క‌దా ప్రయాణం మొద‌లైంది. అన్ని ర‌కాల పాత్రలూ చేస్తా. డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ ప్రత్యేకంగా లేవు. వ‌చ్చిన పాత్రల‌న్నీ చేసుకొంటూ వెళ్తూ, వెళ్తూ ఓ ప‌దేళ్ల త‌ర‌వాత... ఇంకా ఏమైనా పాత్ర చేయ‌క‌పోతే... అప్పుడు అలాంటి పాత్ర కోసం ఆలోచిస్తా.

* హార్ట్ ఎటాక్ ఫ‌లితంపై సంతృప్తిగా ఉన్నారా?
- పూర్తిగా. ఇదో రొమాంటిక్ చిత్రం. యువ ప్రేక్ష‌కుల‌కు త‌ప్పకుండా న‌చ్చుతుంద‌ని ఈ సినిమా మొద‌లుపెట్టేముందే అనుకొన్నా. అది నిజ‌మైంది కూడా. నా ఫోన్‌, ఈమెయిల్ సందేశాల‌తో నిండిపోయింది. తెర‌పై అందంగా క‌నిపిస్తున్నావ్‌, బాగా చేశావ్ అంటే చాలా సంతృప్తిగా ఉంది.

* తెలుగులో కొత్తగా ఏమైనా సినిమాలు ఒప్పుకొన్నారా?
- నారా రోహిత్ తోఓ సినిమా చేస్తున్నా. ఇంకో కొత్త సినిమా ఒప్పుకొన్నా. ఆ సంగ‌తులు నిర్మాత‌లే చెప్పాలి.

* ఓకే ఆల్ ది బెస్ట్‌...
- థ్యాంక్స్‌.

కాత్యాయని

 

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu