Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugadu inter fail ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

గాల్లో వదిలిన తుపాకీగుండులా దూసుకుపోతున్న బస్సుని కంట్రోల్ చేద్దామని బ్రేకు మీద కాలేసి గట్టిగా నొక్కిన డ్రైవర్ అప్పారావు ఒక్కసారి అదిరిపడ్డాడు.

బస్సు బ్రేకులు పట్టడం లేదు. బస్సు స్పీడు తగ్గడం లేదు. ఎదురున్న రెండు కార్లు 'పూనకం'తో వూగిపోతూ ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాయి.

డ్రైవర్ అప్పారావు శరీరమంతా ముచ్చెమటలు పోసాయి.

కొండమీద దేవుడి దర్శనం అయిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఏకాంబరం. రెండు రోజుల్నుండీ 'సింహాచలం దర్శనానికి వస్తున్నాము. మీరే దగ్గరుండి దర్శనం చేయించాలని' ఆఫీస్ మేనేజర్ గారి నుండి ఒకటే ఫోన్ కాల్స్. అందుకే ఉదయాన్నే దగ్గరుండి వాళ్ళకి సింహాద్రి అప్పన్న ఆశీస్సులు అందించి బస్సు ఎక్కించి పంపించేశాడు.

మేనేజర్ గారు రాలేదు. వాళ్ళ బంధువుల్నే పంపించారు. ఏకాంబరం అరగంట ముందే తన బైక్ మీద కొండ మీదకు వచ్చి వారికోసం ఎదురుచూస్తూ బస్సు స్టాండ్ లో కూర్చున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు.

వాళ్ళ ముక్కూ మొహం తెలియకపోయినా 'సెల్ ఫోన్ ల వలన ఒకర్నొకరు కలుసుకోగలిగారు. 'ఇప్పుడు ప్రపంచమంతా చిటికెలో తిరిగొచ్చెయ్యచ్చు' అన్నంత విజ్ఞానం పెరిగిపోవడం వలన ఎవరికి ఎవరూ కొత్తకాదు. ఎవరికి ఎవరు ముందుగా పరిచయాలు అక్కరలేకుండా అంతా ఫోన్ లో కలిసిపోతున్నారు. కలుసుకుంటున్నారు. పాత పరిచయస్థుల్లా వాటేసుకుంటున్నారు.

స్కూటర్ స్టాండ్ కి వెళ్ళి తన పల్సర్ బైక్ తీసుకున్నాడు ఏకాంబరం. బైక్ వెనకే తగిలించి వున్న హెల్మెట్ తీసి తలకు తగిలించుకున్నాడు.

బైక్ స్టార్ట్ చేసి ఒకసారి బైక్ సైడ్ మిర్రర్ లో తనకి తాను ఎగాదిగా చూసుకున్నాడు. హెల్మెట్ ధరించి అచ్చం యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడు.

తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకొని మురిసిపోయాడు ఏకాంబరం. బైక్ ని ముందుకురికిస్తూ రోడ్డు మీద నడిచి వెళ్తున్న భక్తుల కేసి చూసాడు. భక్తులంతా కుటుంబాలతో పిల్లాపాపలతో అడ్డదిడ్డంగా రోడ్డు ప్రక్కన నడుస్తున్నారు. వాళ్ళ ప్రక్కనుండి బైక్ నడుపుతూ వయసులో వున్న అమ్మాయిలకోసం 'చకోరి' పక్షిలా వెదికాడు. అందరూ పల్లెటూరి వాళ్ళే. ఎవరు అమ్మలో, ఎవరు అమ్మాయిలో పసిగట్టలేకపోయాడు. బైక్ మాత్రం తన మానాన ముందుకు సాగిపోయింది.

కొండ క్రిందకు వెళ్ళే ఎత్తైన ఘాట్ రోడ్డు దాటి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు చేరుకున్నాడు ఏకాంబరం. కొండ దిగువ నుండి పైకి వస్తున్న కార్లు, బస్సులు, బైకుల్ని తప్పించుకుంటూ ఎత్తైన ఘాట్ రోడ్ మలుపు తిరిగి డౌన్ లో బైక్ ని రివ్వున నడిపిస్తున్నాడు ఏకాంబరం. అప్పటికే బైక్ ఇంజన్ ఆఫేసి పెట్రోలు కూడా కట్టేశాడు. కొండ పైకి ఎక్కినప్పుడు మంచి రేజింగ్ లో బైక్ నడపాలి. దిగేటప్పుడు బైక్ మీద కూర్చుని కళ్ళు మూసుకుంటే అదే క్రిందకు తీసుకుపోతుంది అని మనసులోనే అనుకుని ఉలిక్కిపడ్డాడు ఏకాంబరం. కళ్ళు మూసుకుంటే మరిక మళ్ళీ కళ్ళు తెరవకుండా అయిపోతుందేమో కదా అని గజగజ వణికిపోయాడు. ఆ ఊహకే ఏకాంబరం భయంతో బిగుసుకుపోయాడు.

ఆ ఆలోచన కలగడంతోనే బైక్ స్టీరింగ్ రెండు చేతుల్తో గట్టిగా పట్టుకుని కళ్ళు రెండు బయటకు పొడుచుకు వచ్చేలా రోడ్డునే తీక్షణంగా చూస్తూ ముందుకు ఉరికించాడు.

ఎదర వాహనాలు వేగంగా ఎదురొస్తుంటే వాటిని చూస్తూ తప్పిస్తూ ముందుకు సాగిపోతున్నాడు ఏకాంబరం.

కొంచెం దూరంలో కొండ బస్సు ముందుకు దూసుకుపోతోంది. ముందు వెళుతున్న బస్సు దాటి వెళ్ళాలన్న ఉద్దేశంతో కట్టేసిన పెట్రోల్ ఆన్ చేసాడు ఏకాంబరం. ఇంజన్ లాక్ కూడా ఆన్ లో పెట్టాడు.

ముందు వెళుతున్న కొండ బస్సును అందుకోవడం ఏకాంబరం తరం కావటంలేదు. 'న్యూట్రల్' ఉన్న బండి అంతకంటే వేగం అందుకోలేకపోతోంది.

ఏకాంబరం బైక్ ని పరిగెడుతుండగానే గేర్ లోనే స్టార్ట్ చేసాడు. స్టార్ట్ కాగానే ఒక్కసారే స్పీడ్ పెంచుతూ రేజ్ చేసాడు. ముందు పరిగెడుతున్న కొండ బస్సుకి చేరువవుతోంది ఏకాంబరం బైక్. ఎదురవుతున్న వాహనాలను తప్పించుకుంటూ కొండ బస్సుని అందుకోవడానికి బైక్ ని వంద కిలోమీటర్లు స్పీడ్ దాటించి పరిగెట్టిస్తున్నాడు ఏకాంబరం.

పోటాపోటీగా పరిగెట్టుకు వస్తున్న రెండు కార్లను ఎలా తప్పించాలో అర్ధం కాక ఆందోళనగా ఉన్నాడు డ్రైవర్ అప్పారావు. బస్సు వేగాన్ని తగ్గిద్దామంటే 'బ్రేకులు' పట్టటం లేదు. బస్సులో తెలిస్తే పాసింజర్లంతా భయంతో బస్సులోనుండి దూకేస్తారేమో! ఏం చేయాలో అర్ధంకాక అయోమయంగా... ఆందోళనగా... స్టీరింగ్ పట్టుకున్నాడు డ్రైవర్ అప్పారావు. బస్సులో ఉన్న పాసింజర్లు కూడా భయంతో బిగుసుకుపోయి చూస్తుండిపోయారు.

తనతో పోటీ పడుతున్న కారుని ఓడించాలన్న పట్టుదలతో కారు నడుపుతున్న ఒక డ్రైవర్ ఎదర రాకాసిలా మీదకు దూకుడుగా వస్తున్న దేవస్థానం బస్సు వాలకం గమనిస్తూనే గజగజ వణికిపోయాడు. ఆ బస్సు ముందర ఎంతో వేగంగా... పోటీ పడుతూ వస్తున్న బస్సును చూస్తూనే చటుక్కున బ్రేకు మీద కాలేసాడు ఆ కారు డ్రైవర్. రెండో కారు ముందుకు వెళ్ళగానే గభాలున దాని వెనుకకు తగ్గి ఒక వారగా కారు వెనక కారును పోనిచ్చాడు ఆ డ్రైవర్.

హఠాత్తుగా కారు డ్రైవర్లు ఇద్దరూ ఒకరి వెనక ఒకరు క్యూలో వస్తూ బస్సుకు దారిచ్చేసరికి ఆనందంతో జాగ్రత్తగా వాటిని తప్పించుకుని ముందుకు పోనిచ్చాడు డ్రైవర్ అప్పారావు.

ఇదంతా గమనిస్తున్న బస్సులోని పాసింజర్లు ఒక్కసారే ఊపిరి పీల్చుకుని పెద్ద పెను ప్రమాదం తప్పిందని అరుచుకుంటూ డ్రైవర్ ని నానా దుర్భాషలూ ఆడారు. అంతవరకూ వాళ్ళకి బస్సుకి బ్రేకులు పట్టడం లేదని తెలీదు.

"ఏరా కళ్ళు మూసుకుపోయి బస్సు నడుపుతున్నావా?! ఎదర కార్లు వస్తూంటే వేగం తగ్గించలేవా?" అంటూ ఒక ముసలాడు గుండె చేత పట్టి కోపంగా అరిచాడు. క్షణంలో పెనుప్రమాదం తప్పింది. లేకపోతే ఏం జరిగేదో?!

 భయంతో వణికిపోతూ ముసలాయన కోపంగా డ్రైవర్ ని తిట్టేసరికి మిగతావాళ్లు కూడా తలో మాట అంటూ తమ ఆందోళనని బయట పెట్టారు.

వాళ్ళందరి నోట తిట్ల వర్షం కురిసేసరికి డ్రైవర్ అప్పారావుకి చిర్రెత్తుకొచ్చింది. అంతే!

"బస్సుకి బ్రేకులు పట్టక ఇవతల నేను చస్తుంటే మీ అందరి గోల ఏటి?! ఎవరూ అరవకుండా... భయపడకుండా జాగ్రత్తగా ఉండండి. అందరూ ఎక్కడి వాళ్లక్కడే మీ ఎదర రాడ్లను గట్టిగా పట్టుకోండి! ఎవరికీ ఏమీ కాదు. అంతా సింహాద్రి అప్పన స్వామే చూసుకుంటాడు" అంటూ అరుస్తూనే బస్సుని చాలా చాకచక్యంగా నడిపిస్తున్నాడు డ్రైవర్ అప్పారావు. అతను అలా అరిచేసరికి అందరూ ఒక్కసారే భయంతో బిక్కచచ్చిపోయారు.

కొండ బస్సు విచక్షణా రహితంగా వేగంగా మీదమీదకు దూసుకువస్తుంటే ఎదర బైకుల మీద వస్తున్న భక్తులు రోడ్డు ప్రక్కనున్న తుప్పల్లోకి వెళ్ళి బైకులను ఆపేస్తున్నారు. కొందరు తుప్పల్లోనుండి పెద్దపెద్ద గుబురు పొదల్లోకి వెళ్ళి పడిపోతున్నారు.

బస్సులో వున్న యాత్రీకులంతా "గోవిందా! గోవిందా! అంటూ సింహాద్రి అప్పన్నని వేడుకొంటూ అరుస్తున్నారు.

బస్సు వెనుక వేగంగా బస్సుని దాటాలని వస్తున్న ఏకాంబరం దేవస్థానం బస్సులోనుండి భక్తులు అరుస్తున్న అరుపులు విని క్షణం ఆశ్చర్యపోయాడు. మరుక్షణం బైకు వేగం తగ్గించి బస్సు వెనకే తన బైకుని నడిపిస్తూ ఫాలో అయ్యాడు. ఏదో జరగరానిది జరిగిందని గ్రహించాడు ఏకాంబరం. బస్సులో యాత్రీకులు ఏడుపులు పెడబొబ్బలు వింటూనే ఏదో 'ప్రమాదం' జరగబోతోందని ఊహించాడు ఏకాంబరం.

కొండ ఘాట్ రోడ్ లో ఎదర వాహనాలను చాకచక్యంగా తప్పిస్తూనే బస్సుని ఎలా అదుపు చేయాలో అని ఆలోచిస్తున్నాడు డ్రైవర్ అప్పారావు. ఒక వైపు అంతా లోయ. రెండో వైపు కొండ చరియ. ఎలాగైనా ఎడమ చేతివైపు ఉన్న కొండ చరియల్లో ప్రమాదం లేనిచోట బస్సుని ఆపే ప్రయత్నం చేయాలని చూస్తున్నాడు డ్రైవర్ అప్పారావు.

బస్సులో ఉన్న భక్తులు భయంతో కేకలు వేస్తున్నారే గాని, ఎవరికీ తాము ప్రాణాలతో బయట పడతామని నమ్మకం లేదు. కొందరు తమదగ్గరున్న సెల్ ఫోన్ లు తీసి తమ వాళ్ళకి ఫోన్ లు చేస్తున్నారు. తాము బ్రేకులు లేని బస్సులో కొండ దిగుతున్నామని ఏం జరుగుతుందో ఆందోళనగా ఉందని ఏడుస్తూనే చెప్తున్నారు.

ఈ వార్త దావానలంలా క్రింద ఊర్లోకి చేరిపోయింది. దేవాలయ అధికారులంతా గుండెలు అరచేత్తో పట్టుకుని కొండ దిగుతున్న బస్సు కోసం బస్సు స్టాండుకొచ్చి ఎదురు చూస్తున్నారు. హుటాహుటిన అంబులెన్స్ కి ఫోన్ చేసేసారు.

అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ వార్త పత్రికల వాళ్ళకు కూడా చేరిపోయింది.

బస్సులో ఉన్న ముసలివాళ్ళు ఆందోళనతో అలాగే సీటుకి చేరగిలబడి సొమ్మసిల్లిపోయారు. యువకులు కూడా భయంతో బిగుసుకుపోయి నిలబడ్డారు. బస్సులోనుండి గెంతినా ఎవరూ బ్రతికి బట్ట కట్టరని ఆ ప్రయత్నం చేయలేదెవరూ. పుట్ బోర్డు మీద ఉన్న ప్రయాణీకులు బస్సు లోపలకు చేరేందుకు తోసుకుని నిలబడ్డారు.

ఏకాంబరం ఎదర బస్సునే అనుసరిస్తున్నాడు. అతనికీ భయంగానే ఉంది. 'పాపం! మేనేజర్ గారి బంధువుల్ని ఈ బస్సులోనే ఎక్కించాడు తను. వాళ్ళెంత ఆందోళనలో ఉన్నారో?' మనసులోనే అనుకుంటూ బస్సు ఏ దిశగా వెళ్తుందా అని దాన్నే అనుసరిస్తున్నాడు ఏకాంబరం.

బస్సులో అందరూ వూపిరి బిగబట్టి డ్రైవర్ అప్పారావు కేసి చూస్తున్నారు. అతని చేతిలోనే ఉన్నాయి అందరి ప్రాణాలు... జీవితాలు... బిక్కుబిక్కుమంటూ ఎదర రోడ్డుకేసి... ఎదర వస్తున్న వాహనాల కేసి, దీనంగా డ్రైవర్ కేసి చూపులు మార్చి మార్చి చూస్తున్నారు.

బ్రేకులు ఫెయిల్ అయి కంట్రోల్ తప్పి పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి మీదమీదకు పరిగెట్టుకు వస్తున్న దేవస్థానం బస్సు కేసి చూసి అంతవరకూ కొండపైకి దర్జాగా బైకు డ్రైవ్ చేసుకువస్తున్న వాళ్ళు భయంతో తలో దిక్కు తుప్పల్లోకి బైక్ తో సహా తప్పుకుంటుంటే బస్సులో ఉన్న ప్రయాణీకులు ఆ దృశ్యం చూసి పుసుక్కున నవ్వుకుంటున్నారు. మళ్ళీ, తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని చటుక్కున ఏడుపు లంకించుకుంటున్నారు.

రెండో బ్రిడ్జి మలుపు తిరుగుతూనే పెద్ద లోయ. ఆ లోయలో విశాలంగా ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల కనిపించింది అప్పారావుకి. బస్సు అటు వెళ్ళాల్సింది చటుక్కున ఎడమ చేతివైపు స్టీరింగ్ వీలు తిప్పాడు. పెద్ద ప్రమాదం తప్పిందని మనసులోనే అనుకున్నాడు. బస్సు లోపల వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు.

ఆ మలుపు దాటి ముందుకు పరుగు తీస్తున్న బస్సుకు ఎదురుగా ఎడమచేతి ప్రక్క చిన్న చిన్న గోతులు ఆ ప్రక్కనే పెద్ద చెట్టు కనిపించేసరికి డ్రైవర్ అప్పారావు మరో ఆలోచన చెయ్యకుండా బస్సుని ఆ గోతుల్లోనుండి నడిపించాడు. బస్సు ఒక్కసారే గెంతుకుంటూ వెళ్ళేసరికి లోపల వున్న భక్తులంతా ఒకరిమీద ఒకరు ఒరిగిపోయి గుద్దుకుంటూ ఒకర్నొకరు పట్టుకున్నారు.

గోతుల్లోనుండి గెంతుకుంటూ వెళ్ళిన బస్సు వేగం తగ్గి నేరుగా ఎదుర వున్న పెద్ద చెట్టును గుద్దుకుంటూ ఆగిపోయింది. బస్సు ముందే గోతుల్లో పడి అటూ ఇటూ వూగడం వలన భక్తులంతా తమ ముందరున్న రాడ్లు గట్టిగా పట్టుకోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొందరికి చిన్న చిన్న గాయాలయ్యాయి. కొందరికి తలలు బొప్పులు కట్టాయి. బస్సు వెనకే వస్తున్న ఏకాంబరం ఆతృతగా తన బైక్ ని అక్కడికక్కడే పడేసి ఆతృతగా చెట్టును గుద్దుకుని ఆగిన బస్సు దగ్గరకు పరుగందుకున్నాడు.

అప్పటికే బస్సులో ఉన్నవాళ్ళంతా ప్రాణాపాయం నుండి బయటపడిన ఆనందంలో ఆతృతతో తలుపులు తెరుచుకుని గాయాలని లెక్క చేయకుండా ఒకర్నొకరు తోసుకుంటూ బస్సు దిగుతున్నారు. ఎవరికీ అంతగా ప్రమాదకరమైన దెబ్బలు తగల్లేదు. కొందరికి తలకి చిన్న చిన్న గాయాలు అయితే కారుతున్న రక్తాన్ని చేత్తో అదిమిపట్టి ఏడుపు ఆపుకుంటూ బస్సు దిగుతున్నారు.

ఏకాంబరం బస్సు దిగుతున్న వాళ్ళని తోసుకుంటూ బస్సు లోపలకు వెళ్ళాడు. అప్పటికే ఏకాంబరం బస్సు ఎక్కించిన వాళ్ళు బస్సు దిగుతూ ఏకాంబరాన్ని పలకరించి తమకి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పి వడివడిగా వెళ్ళిపోయారు.

ఏకాంబరం మాత్రం మేనేజర్ తాలూకా వాళ్ళని పలకరించి పలకరించకుండానే ఇంకా ఎవరికైనా 'ప్రమాదం' జరిగిందేమోనని లోపలకు వెళ్ళి బస్సంతా పరిశీలనగా చూసాడు.

అందరూ బస్సు దిగడానికి గాభరాగా ఒకర్నొకరు నెట్టుకుంటున్నారు. డ్రైవర్ అప్పారావు తలకి బస్సు అద్దాలు తగిలి గాయం అయింది. రక్తం కారుతున్నా లెక్కచెయ్యకుండా బస్సులో ఉన్న భక్తులందర్నీ జాగ్రత్తగా దిగమని... ఎవరూ గాబరా పడకండని... ఒకర్నొకరు త్రోసుకుంటే పడిపోతారని హెచ్చరిస్తూ బస్సులోనే ఉండి అందర్నీ బస్సు దింపుతున్నాడు.

ముందు సీట్లో కూర్చున్న ఎవరో నడివయసు వ్యక్తి సీట్లోనే సొమ్మసిల్లి పడి ఉన్నాడు. ఆయనని అలా చూస్తూనే ఏకాంబరం పరుగున ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని అమాంతం తమ భుజాల మీద వేసుకుని బస్సులోనుండి క్రిందకు మోసుకు వచ్చాడు. ఆ వ్యక్తితో వచ్చిన ఆడవాళ్ళు ఏకాంబరం వెనకే ఏడ్చుకుంటూ బస్సు దిగారు.

అప్పటికే 'బస్సు ప్రమాదవార్త' తెలిసి దేవాలయం అధికారులు, విలేఖర్లు, పోలీసులు వచ్చి చేరుకున్నారు. ఆ వెనకే అంబులెన్స్ లు కూడా వచ్చి చేరాయి. చిన్నచిన్న గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్సకు తరలించారు. స్పృహ కోల్పోయిన వ్యక్తిని ఏకాంబరమే నేరుగా అంబులెన్స్ లోకి చేర్చాడు. అంబులెన్స్ లో ఆ వ్యక్తితో పాటు వాళ్ళ బంధువు ఒకరు, ఏకాంబరం కూడా ఎక్కి కూర్చున్నారు.

అంబులెన్స్ ఎక్కుతూ తన మిత్రుడొకడు కనిపించేసరికి అతనికి తన బైక్ తాళాలు ఇచ్చి బైక్ ని ఇంటి దగ్గరకు చేర్చమని చెప్పాడు ఏకాంబరం.

టి.వి. ఛానళ్ళు వాళ్ళు కూడా బస్సు ప్రమాదవార్తని, బస్సుని సురక్షితంగా కొండ దిగువకు చేర్చిన డ్రైవర్ అప్పారావుని ఇంటర్వ్యూ చేస్తూ హడావిడి చేస్తున్నారు. కొందరు టి.వి రిపోర్టర్లు బస్సులో ప్రయాణించని వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తూ ప్రశ్నలు అడిగేసరికి అవతల వాళ్ళు టి.వి లో కనిపించాలని ఆనందంలో తామూ బస్సులోనే ఉన్నామని లేనిపోని సొల్లు విషయాలు చెప్తూ కెమెరాలకు ఫోజులిస్తున్నారు.

ఇంతమందికి ఎలాంటి ప్రమాదం జరక్కుండా రక్షించిన సింహాద్రి అప్పన్నకు దండం పెట్టుకుంటూ కళ్ళ నీళ్ళు దించుకున్నాడు డ్రైవర్ అప్పారావు. తలకి గాయమై రక్తం కారుతున్నా 'వార్త' కోసం అతన్ని యక్ష ప్రశ్నలతో వేధిస్తూ ఎటూ కదలకుండా కెమేరాలతో దిగ్బంధనం చేసేసారు విలేఖర్లు.

***

విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్.

సింహాచలం కొండ బస్సు ప్రమాదంలో స్పృహ కోల్పోయిన వ్యక్తిని నేరుగా తీసుకువచ్చి కె.జి. హెచ్ లో జాయిన్ చేసారు. దేవుడి దర్శనానికి వెళ్లి బస్సు ప్రమాదంలో గాయపడ్డ హాస్పిటల్ లో ఉన్నతని బంధువులందరికీ విషయం చేరిపోయింది. బంధువులంతా అతన్ని చూడ్డానికి హాస్పిటల్ కి వచ్చారు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college dropout gadi prema katha