Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

''తెలుసు తంబీ ... ఎదక్కి కేకరే?''

''ఎందుకంటే..... ఓసారి అవ్వకి నేరేడుపండు తినాలనిపించింది. కొమ్మపైన కుమారస్వామి బాలుడి రూపంలో కన్పించాడు. పండ్లు కోసుకుతింటున్నాడు. నాకు కాసిని పండ్లు ఇమ్మని అడిగింది అవ్వ. నీకు వేడిపండ్లు కావాలా ? చల్లని పండ్లు కావాలా అవ్వని అడిగాడు బాలుడు. వేడి పండ్లు అవి ఎలా వుంటాయో చూద్దామని వేడిపండ్లు కోరింది అవ్వ. బాలుడు పళ్ళు ఇసకలోకి విసిరాడు. అవ్వ వాటిని ఊదుకొని తినటంచూసి. ''అవ్వా! అంత వేడిగా వున్నాయా?'' అని అడిగాట్ట కొంటె కుమారస్వామి.

''అటువంటి స్వామిపేరు పెట్టుకున్నావ్‌ సెల్వమ్‌ అని, పోటీపడలేవా? ఛ .. నువ్వొక తమిళనా?

''ఇరు తంబీ'' అన్నాడు సీరియస్‌గా సెల్వమ్‌.

తమిళం గురించి, కుమారస్వామి గురించి త్రివిక్రమ్‌ పొగిడిన పొగడ్తలకి సెల్వమ్‌ ఛాతీ పొంగింది. రోషం ముంచుకొచ్చింది.

''నేను పోటీకి రెడీ చెప్పు'' అన్నాడు.

''శభాష్‌. అదీ రోషం అంటే. ఇది తెలివికి పరీక్ష. ఓ. కే. నువ్వు నన్నొక ప్రశ్న అడుగు. నేను చెప్పాలి. తర్వాత నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. నువ్వు బదులు చెప్పాలి.''

''ఎన్నా యిది? విడుకదయా....''

''అదే..... పొడుపు కథలే అనుకో నేను ఓడిపోతే పాతబాకీ వందకి రెండువందలు వేసిస్తాను. నువ్వు ఓడిపోతే మా అందరికీ టిఫిన్లు, టీలు యివ్వాలి. ఓ.కె. నా? రెడీనా?'' అంటూ పోటీ వివరించాడు త్రివిక్రమ్‌.

''రెడీ తంబీ. కేళు........ అడుగు.''

''ముందు నువ్వే అడుగు.''

''సరి...... వాల్‌ ఇరుక్కిది పరవైయిల్లై. తలై ఇరుక్కుది పాంబు యిల్లై. అది మేలే ఆడినా కీళే ఎల్లోరుక్కుం ఒరే ఖుషీ, ఎన్న అది? ''

''అర్ధమై చావలేదు తెలుగులో చెప్పండ్రా?'' అనరిచాడు శివా.

''ఏంలేదురా. తోక వుంది పక్షికాదు తలవుంది పాముకాదు. పైన ఆడుతుంటే కింద అందరికీ ఒకటే ఖుషీ. అదేమిటో చెప్పమంటున్నాడు'' అంటూ అర్థం చెప్పాడు త్రివిక్రమ్‌

''ఇదేదో తమిళనాడు జంతువయి వుంటుందిరా'' అన్నాడు శివా.

''కాదు'' అంటూ సెల్వంవంక చూసాడు త్రివిక్రమ్‌.

''అన్నాచ్చి. నువ్వు ఓడిపోయావు. నీ పొడుపుకథకి అర్దం గాలి పటం. అవునా?'' అనడిగాడు నవ్వుతూ.

సెల్వం ముఖంలో నవ్వు మాయమైంది.

''ఓ కె. తంబి. ఇప్పుడు నువ్వడుగు'' అన్నాడు.

''అది పంచరస కషాయం. కాషాయం కట్టినవాడయినా కారులో తిరిగేవాడయినా ఇష్టపడే కషాయం. ఎందరో మెచ్చిన కషాయం. అది ఏమిటో చెప్పుకో. నీకు రెండు నిముషాలు టైమిస్తున్నాను'' అంటూ సిగరెట్‌ ముట్టించుకున్నాడు త్రివిక్రమ్‌.

సందేహం లేకుండా తమిళ సెల్వం ఓడిపోయాడు.

''నువ్వే చెప్పు తంబి. ఏంటి అంద కషాయం?'' అనడిగాడు.

ఫక్కున నవ్వేసాడు త్రివిక్రమ్‌.

''చేతిలో వుంచుకునే ఏంది అనడుగుతావ్‌ బుద్దుందా? నువ్వు అందించే యాలక్కాయ టీ వుంది చూసావా? అదే పంచరస కషాయం. అందులో ఏమున్నాయి? టీపొడి, యాలకుల పొడి, పంచదార, పాలు, నీళ్ళు ఇవి అన్నీ కలిస్తే పంచరస కషాయం నీచేతి అద్బుతమైన టీ'' అంటూ వివరణ యివ్వగానే తమిళ్‌ తంబికి ఓడిపోయినందుకు బాధకన్నా తన టీ గొప్పతనం చెప్పినందుకు ఆనందం పొంగుకొచ్చింది.

''అడతంబి నా టీ నే పొడుపుకథగా చెప్పి నాకే షాకిచ్చావ్‌. నువ్వు కిల్లాడివప్పా. నీ చేతిలో ఓడిపోవడం నాకు సంతోషందా. కూర్చోండి. టిఫిన్లు తినండి. టీలు తాగండి. సిగరెట్లు తీసుకోండి. అంతా ఫ్రీ. ఈ పూట వరకే'' అంటూ అనౌన్స్‌ చేసాడు.

ఓడిపోయినందుకు తమిళ్‌ తంబి బాధపడలేదు. కాని మౌని ముఖం మాత్రం ప్యూజు పోయిన బల్బులా మాడిపోయింది. ఎందుకంటే, ఇప్పుడు తను త్రివిక్రమ్‌కి బెట్‌ ఓడిపోయినందుకు వెయ్యిరూపాయలు బాకీపడ్డాడు. అందుకే తింటున్న అందరికీ టిఫిను రుచిగా వున్నా మౌనికి మాత్రం చేదుగా అన్పించింది.

''వీడసాధ్యుడు జీవితంలో ఎప్పుడూ వీడితో పందెం కాయకూడదు అనుకున్నాడు మనసులో.

అందరూ తీరిగ్గా టిఫిన్లుచేసి, టీలు తాగి తలో సిగరెట్‌ పాకెట్‌ తీసుకుని సిగరెట్లు ముట్టించుకొంటూ హేపీగా యిళ్ళకు యబల్దేరారు. చివరగా బయలుదేరిన శివా ఎందుకయినా మంచిదని పన్నీరు సెల్వాన్ని చూస్తూ ''పాత బాకీ కూడా రద్దయిపోయింది అన్నాచ్చి గుర్తుపెట్టుకో'' అంటూ హెచ్చరించి బయటికొచ్చేశాడు.

పాపం ఏడుపు ఒక్కటే తక్కువ సెల్వంకి మొత్తంమీద ఆపూట త్రివిక్రమ్‌ మూలంగా ఆరువందలు లాస్‌ అతనికి.

***

ఉదయం తొమ్మిది గంటలు కొట్టింది గోడ గడియారం. ఆ టైంకి రోజూ వుండే హడావుడే ఆ యింట్లో ఇప్పుడూ వుంది. బిజీ బిజీ బిజీ, ఓ పక్కన గోవిందరావు ఆఫీసుకు రెడీ అవుతున్నాడు.

మరో పక్కన కొడుకు చక్రధర్‌, కూతురు రమ్య ఇద్దరూ కాలేజీకి రెడీ అవుతూ వాళ్ళ హడావిడి వేరే.

వీళ్ళ ముగ్గురి మధ్యన కాళ్ళకు బలపాలు కట్టుకుని బొంగరంలా తిరుగుతూ. ఎవరికి ఏం కావాలో గమనించటంలో ప్రశాంతి బిజీగా వుంటుంది.

''ఏమేవ్‌? నా కళ్ళజోడు'' బూట్లు వేసుకుంటూ గోవిందరావు అరుపులు.

''అక్కడే....... టీపాయ్‌మీద వుంచాను చూడండి'' ప్రశాంతి  కిచెన్‌లోంచి జవాబు.

''మమ్మీ! నా సాక్స్‌ కన్పించటంలేదు'' తన బెడ్‌రూంలోంచి చక్రధర్‌  కేకలు.

''ఒరే... రాత్రి ఉతికి ఆరేసాను, పెరట్లో వుంటాయి కాస్త వెళ్ళి తెచ్చుకోరా'' కిచెన్‌లోంచే ఆమె ఆర్డరు.

ఇంతలోనే.

తన గదిలోంచి కూతురు రమ్య డిమాండ్‌

''మమ్మీ, నా టిఫిన్‌ బాక్స్‌ కట్టావా లేదా? టైమవుతోంది'' అంటూ,

''అబ్బబ్బ! నాకేమన్నా పదికాళ్ళు చేతులు వున్నాయనుకుంటున్నారా మీరంతా? వస్తున్నాగా. ఎందుకలా అరుస్తారు? అంటూ విసుక్కొంటూనే మూడు బాక్స్‌లతో హాల్లోకి వచ్చిందావిడ.

సరిగ్గా ఈ హడావుడి టైంలోనే బయటనుంచి లోనకొచ్చాడు త్రివిక్రమ్‌.

పెద్ద కొడుకును చూసి కంగారుపడిందావిడ.

వీడు ఈ టైంలో రాకుండా వుంటే బాగుండేది అనుకుంది మనసులో.

ఆమె భయపడినట్లే అయింది. కళ్ళజోడు పెట్టుకుంటూ కొడుకు వంక చాలా సీరియస్‌గా చూసాడు గోవిందరావు. ఆయన ముఖంలో  విసుగు, కోపం రెండూ పోటీపడుతున్నాయి.

''ఏం సార్‌ ఇప్పుడు టైమెంతో తెలుసా?'' అనడిగాడు వెటకారంగా కొడుకును.

''నాకు తెలుసు డాడీ! మీకు తెలీకపోతే పైకి చూడండి గోడగడియారం కన్పిస్తుంది..... ''అంటూ కేర్‌లెస్‌గా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.

అప్పటికే అంతా హాల్లో వున్నారు.

పెద్దన్నయ్య సమాధానం విని నవ్వబోతూ చివరి క్షణంలో బలవంతంగా అపుకుంది రమ్య, తండ్రి కోపం తనకు తెలీందికాదు. మబ్బులులేకుండా వర్షం కురిపిస్తాడాయన.

కొడుకు సమాధానంతో గోవిందరావు ముఖం ఇంకా వివర్ణమైంది. భార్యవంక చూసాడు.

''విన్నావా నీ కొడుకు సమాధానం... వింటున్నావా?'' అంటూ ఏదో చెప్పబోయాడు.

కానీ మధ్యలోనే అడ్డుకుంది ఆవిడ.

''నా కొడుకేమిటి అసహ్యంగా, మనకొడుకు అనండి. మనమింకా ఆస్తిని, పిల్లల్ని పంచుకోలేదు'' అంటూ హెచ్చరించింది.

తల్లి హెచ్చరిక విని ఈసారి చక్రధర్‌ చిన్నగా నవ్వాడు.

గోవిందరావు కళ్ళజోడు సరిచేసుకుంటూ చికాగ్గా చూశాడు.

''మాటవరసకి అన్నాను. అదీ పొరబాటేనా? వీడికసలు టైమ్‌ సెన్స్‌ వుందా? గడియారం చూడమని నాకు సలహా ఇస్తున్నాడు. ఏరా...... నువ్వేమన్నా పెద్ద మేధావనుకుంటున్నావా? ఉదయం లేచినవాడివి ముఖం కూడా చూపించకుండా బయటకుపోయి ఇప్పుడా  రావటం?'' అంటూ నిలదీసాడు.

బదులు చెప్పలేదు త్రివిక్రమ్‌.

సైలంట్‌గా వుండిపోయాడు.

దాంతో ఆయనకోపం మరోమెట్టు పైకిపోయింది.

''అడుగుతోంది నిన్నేరా! కనీసం సమాధానం చెప్పటంకూడా ఇష్టం లేదా? లేక చెప్పక్కర్లేదనుకుంటున్నావా? వాళ్ళని చూడరా. నీకన్నా చిన్నవాళ్ళు రోజుకి పదిగంటలు చదువుకు కేటాయిస్తున్నారు. కష్టపడి చదువుకుంటున్నారు. వాళ్ళని చూసయినా బుద్దితెచ్చుకోరా. చదువుకుంటేనే గొప్పవాళ్ళు కాగలరు. గొప్పవాడివిగాకపోయినా కనీసం మనిషిగా బ్రతకాలన్నా చదువుకావాలి. ఛ..... రేవులో తాటిచెట్టులా ఎదిగితే సరిపోదు. లోకజ్ఞానం కావాలి''. అంటూ అసహ్యంగా చూసాడు.

తండ్రి మాటలకు కొంచెం కూడా బాధపడలేదు త్రివిక్రమ్‌ అదే చిరునవ్వు, అదే ప్రశాంతత.

''ఏం డాడీ చదువులేకపోతే మనిషి గొప్పవాడుకాలేడా?'' అనడిగాడు.

''బాగుందిరా, చాలా బాగుంది. ఎలా అవుతాడనుకుంటున్నావ్‌? ఇంకులేకుండా పెన్నురాస్తుందా? చుక్కానిలేకుండా పడవ నడుస్తుందా? పైలట్‌ లేకుండా విమానం ఎగురుతుందా? జీవితం కూడ అంతే! చదువు లేకుండా ఒక మనిషి జీవితంలో ఎదగలేడు, గొప్పవాడుకాలేడు. నీ చదువు ఎలాగూ అటకెక్కింది. కనీసం లోకజ్ఞానం కూడాలేదు. ఎలా బ్రతుకుతావురా?''

''మీరంతగా జాలిపడనక్కరలేదు డాడీ! హెపీగా బ్రతగ్గలను. కానీ మీరుచెప్పిన అభిప్రాయంలోనే లోపముంది''.

''అబ్బో! నా అభిప్రాయానికే వంకలుపెట్టే గొప్పవాడివయ్యావన్న మాట. అదేమిటో చెప్పుచూద్దాం.

''మీరు ఒకమనిషి గొప్పవాడు కావటానికి చదువే ముఖ్యమంటున్నారు. చదువుకన్నాముఖ్యం తెలివితేటలు అంటాన్నేను. తెలివిలేనివాడు ఎంత చదివినా ప్రయోజనంలేదు. తెలివిగలవాళ్ళు చదువు తక్కువయినా గొప్పవాళ్ళు కాగలరు.     మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌, హతోలేషర్‌ కింగ్‌ రాంరెన్‌బఫెట్‌, ఫేస్‌బుక్‌ జుకెర్‌బర్గ్‌ కాలేజీడ్రాపవుట్స్‌.

కేవలం పెద్దచదువుల మూలంగా ఒక మనిషి బాగా బ్రతుకుతాడనుకుంటే అది కేవలం భ్రమ! మీరు చెప్పిందే నిజమైతే పదోతరగతి వరకే చదివిన ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్‌, ఇంటర్‌ వరకే చదివిన ధీరూ భాయ్‌ అంబానీ, ఐదోతరగతి కూడా చదవని మోహన్‌సింగ్‌ ఒబెరాయ్‌, ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది వున్నారు. మరి వీళ్ళంతా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎలా ఎదిగారు? చెప్పండి డాడీ.''

త్రివిక్రమ్‌ అర్గ్యుమెంట్‌కి గోవిందరావు దగ్గర సమాధానంలేదు.

అందుకే బాగా ఉడికిపోతూ...

''ఇది పిడివాదం... ఖచ్చితంగా నీది పిడివాదం, వితండవాదమూను, ఆ రోజుల్లో వాళ్ళకి అవకాశంలేక చదువుకోలేకపోయారు. అయినా అదృష్టం కలిసొచ్చి తెలివిగా గొప్పవాళ్ళు కాగలిగారు. కానీ ఈ రోజుల్లో నీకు పుష్కలంగా అవకాశముంది. చదువుకోడానికేం రోగం? పైగా వెధవ ఆర్గ్యుమెంట్లు వేరే! నిన్ను మార్చటం నావల్ల కాదుగానీ పోరా! ఎలాగో తగలడు. నాకు టైమవుతోంది'' అంటూ విసుగ్గా తన లంచ్‌బాక్స్‌ తీసుకొని బయటికెళ్లిపోయాడాయన.

ఆ వెనకే చక్రధర్‌, రమ్యలు కదిలారు.

ముందుగా గోవిందరావు స్కూటర్‌ వెళ్ళి పోయింది.

రమ్యని తన బైక్‌మీద తీసుకుని చక్రధర్‌ కదిలాడు.

ఇక ఇంట్లో తల్లి కొడుకు ఇద్దరే మిగిలారు.

వర్షం కురిసి వెలిసినట్టుగా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది

ప్రశాంతి వచ్చి కొడుకు పక్కన కూర్చుంది.

''రారా..... టిఫిన్‌ చేద్దువుగాని'' పిలిచింది.

''మమ్మీ నువ్వు టిఫిన్‌ చేసావా ?'' అడిగాడు.

భారంగా నిట్టూర్చిందామె.

'' ఈ ఇంట్లో నవ్వొక్కడివేరా మమ్మీ తిన్నావా?, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ నా గురించి పట్టించుకునేది. వాళ్ళంతా ఎవరికివాళ్ళు హడావుడిగా తిని, పరుగులెత్తటంతప్ప నా గురించి పట్టించుకోరు. అయినా ఎంతకాలంరా మీ డాడీచేత రోజూ తిట్లు, చీవాట్లు తింటావు. ఏదో ఒకటి చిన్నజాబ్‌లో చేరిపోరా'' అప్యాయంగా అడిగిందావిడ.

''లేదు మమ్మీ! ఇంటర్‌ రెండుసార్లు తప్పిన నాకు పిలిచి ఉద్యోగం ఇచ్చేవాడు ఎవడు? ఇచ్చినా ఇప్పుడు నేను సంపాదించేదాంట్లో సగం కూడా జీతంరాదు. నాకంటూ ఒకటైం వస్తుంది. అప్పుడే తప్పకుండా గొప్పవాడ్ని అవుతాను చూస్తుండు''.

''అంటే .... అంతవరకు ఇలా చిన్న చిన్న పందాలుకాసి సంపాదిస్తూ కాలక్షేపం చేస్తావా? తట్టుకోలేకపోతున్నారా! నా కొడుకు గొప్పవాడుగాకపోయినా పర్వాలేదు చేతకానివాడనిపించుకుంటే తట్టుకునే శక్తి నాకు లేదు నాన్నా ! తర్వాత నీ ఇష్టం'' అంటూ చెమర్చినకళ్ళు తుడుచుకుందావిడ.

''మమ్మీ! నేను నీ కొడుకుని. నేనేమిటో నిరూపించుకుంటాను సరేనా? నా గురించి నువ్వెప్పుడూ దిగులుపడకూడదు. పద మమ్మీ టిఫిన్‌ చేద్దాం'' అంటూ లేచాడు త్రివిక్రమ్‌.

***

జీవితం సాఫీగానే సాగిపోతున్నట్టు వుంటుంది.

కానీ ఒక్కోసారి వూహించని ఒడిదుడుకులు వచ్చిపడుతుంటాయి. వాటిని ఫేస్‌చేయగలగాలి. ధైర్యంగా నిలబడాలి. పిరికివాళ్ళని లోకం భయపెడుతుంది. బెదిరిస్తుంది. ఏదో బ్రతికేస్తున్నామంటే చాలదు. బ్రతకటానికి అన్నింటితోబాటు ధైర్యసాహాసాలు కూడా అవసరం.

తల్లి ప్రశాంతితోబాటు తనూ టిఫిన్‌ తీసుకుని బయటికొచ్చాడు త్రివిక్రమ్‌.

ఇంతలో చక్రధర్‌ బైక్‌ రివ్వున దూసుకొచ్చి పోర్టికోలో ఆగింది. తమ్ముడు చక్రధర్‌తో బాటు చెల్లెలు రమ్యకూడా వెనక్కి వచ్చేయటం త్రివిక్రమ్‌ను ఆశ్చర్యపరచిన విషయం.

రోజూ చెల్లెల్ని డిగ్రీకాలేజీ దగ్గర డ్రాప్‌చేసి తను ఇంజనీరింగ్‌ కాలేజీకి వెళ్ళిపోతాడు చక్రధర్‌. వచ్చేటప్పుడు మాత్రం చక్రధర్‌ ఆ టైంకి వస్తేసరి లేదంటే ఆటోలో ఇంటికి వచ్చేస్తుంది రమ్య. ఇవాళ ఏమైంది? ఏమైందో అడగక్కర్లేకుండానే కొంత వూహించాడు త్రివిక్రమ్‌. ఎందుకంటే బైక్‌ దిగుతూనే కన్నీళ్ళతో వేగంగా లోనకు పరుగెత్తింది రమ్య.

చక్రధర్‌ నుదుటిమీద దెబ్బతగిలి రక్తం చెమర్చుతోంది. ''ఏమైందిరా చక్రీ! ఆ గాయం ఏమిటి? ఆక్సిడెంటా?'' సీరియస్‌గా అడిగాడు త్రివిక్రమ్‌.

''అలాంటిదే అన్నయ్యా! కంగారుపడాల్సిందేమీలేదు'' అంటూ తనూ లోనకు నడిచాడు చక్రధర్‌.

వాళ్ళవెనకే లోనకొచ్చేసాడు త్రివిక్రమ్‌ అప్పటికే హాల్లోకొచ్చిన తల్లి ప్రశాంతిని కౌగిలించుకుని ఏడుస్తోంది రమ్య.

త్రివిక్రమ్‌ తమ్ముడి మాటలు నమ్మలేదు. తనకోపం తెలుసుగాబట్టి జరిగింది చెప్పకుండా దాస్తున్నాడని అర్థమైంది. గబగబా వెళ్ళి చెల్లెలి చేయి పుచ్చుకొని ఇవతలికి లాగాడు.

''ఏడవకు ఏడ్చేవాళ్ళు, అబద్దాలు చెప్పేవాళ్ళంటే నాకు నచ్చదు. ఏం జరిగిందో చెప్పు. ఎవరు వాళ్ళు'' నిలదీసాడు.

''అది కాదు అన్నయా....'' అంటూ చక్రధర్‌ వారించబోయాడు. చూపుడు వేలుతో హెచ్చరించాడు త్రివిక్రమ్‌.

''నువ్వు మాట్లాడకు. ఇది గోవిందరావుగారి కుటుంబ పరువు మర్యాదలకు సంబంధించిన ప్రశ్న. నా చెల్లెల్ని అవమానించి, నా తమ్ముడి మీద చేయిచేసుకుంటే చూస్తూ వూరుకోవడానికి నీ అన్న చేతకానివాడు కాదు. రమ్య? ఏం జరిగింది చెప్పు. ఏడవకుండా చెప్పు'' అనడిగాడు. రమ్య కళ్ళు తుడుచుకుంది.

''కాలేజిగేటు దగ్గర ఒక బేచ్‌ వుంది వాళ్ళు అమ్మాయిల్ని టీజ్‌చేసి ఏడిపిస్తున్నారు. నేను బైక్‌దిగి లోనకెళుతుంటే అసభ్యంగా మాట్లాడాడు. అది చూసి చక్రి అడిగాడని కొట్టాడు....'' క్లుప్తంగా చెప్పింది.

''ఎవరువాళ్ళు? కాలేజీ స్టూడెంట్సా?''

''లేదు. బయటి కుర్రాళ్ళు''

రమ్యను తనవెంట తీసుకెళుతున్న కొడుకును చూసి కంగారు పడింది ప్రశాంతి. ఆపాలని చూసిందిగానీ, త్రివిక్రమ్‌ ఆగలేదు. బైక్‌ స్టార్ట్‌ చేసాడు. రమ్య కూర్చోగానే వేగంగా బయటకు  దూకించాడు బైక్‌ని.

''ఒరే చక్రి వీడికి అసలే కోపం ఎక్కువ, అక్కడ ఏం గొడవలు జరుగుతాయో ఏమిటో నువ్వుకూడా వెళ్ళరా'' అంటూ తొందర చేసింది ప్రశాంతి. 

తల్లి హెచ్చరికతో కర్తవ్యం బోధపడినట్లు వేగంగా వీధిలోకి వచ్చి అటుగా వస్తున్న ఆటో  ఎక్కేసాడు చక్రధర్‌. ఆటో కాలేజీ దిశగా పరుగు తీసింది.

***

డిగ్రీ కాలేజీ గేటుకు.....

అతి సమీపంలో ఉంది ఒక చిన్న హోటల్‌.  రేకుల షెడ్డు ఎదురుగా పందిరికింద అరడజను బల్లలువేసి నడుపుతున్న హోటల్‌అది. ఉదయం, సాయంత్రం అక్కడికికొందరు పోకిరి కుర్రాళ్ళు చేరి అమ్మాయిల్ని అల్లరిచేయటం మామూలయిపోయింది.

కాలేజీ కేంపస్‌లో క్యాంటీన్‌ వుంది. బయట వెలసిన ఆ హోటల్‌ని తీయించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. హోటల్‌ ఓనర్‌ వెనకాల రాజకీయ నాయకుడి అండ వుండటంతో అది సాధ్యం కాలేదు. అప్పుడప్పుడూ పోలీసులు రావడం కుర్రాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళటం జరుగుతుంది. పది రోజులు ప్రశాంతంగా వుంటుంది. తిరిగి మామూలే.

ఈ పరిస్థితిలోనే ఒక బేచ్‌ కుర్రాళ్ళు రమ్యను అల్లరిచేసి చక్రధర్‌ని కొట్టడం జరిగింది. సరాసరి హోటల్‌ సమీపంలోకి బైక్‌ను తీసుకెళ్ళి ఆపాడు త్రివిక్రమ్‌. రమ్య బైక్‌ దిగింది. బైక్‌ స్టాండ్‌వేసి లాక్‌చేసాడు.

''వాళ్ళిక్కడే వున్నారా?'' చెల్లెల్ని అడిగాడు.

''ఉన్నారు. అదిగో....... ఆ బ్లాక్‌ షర్టువాడే నన్ను అసభ్యంగా గేటుదాకా వచ్చి అల్లరి చేసాడు. అన్నయ్యని కొట్టాడు. అక్కడున్న తొమ్మిది మంది వాడి బ్యాచ్‌'' అంటూ చెప్పింది.

''ఒ.కే. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను'' అంటూ హోటల్‌ వైపు అడుగులు వేసాడు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekamber