Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
o college drop out gadi prema katha

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

యితే, బస్సు ప్రమాదం కంటే ప్రమాదం జరుగుతుందనే భయంతో అతను గుండె ఆగి మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు. అంబులెన్స్ లో హాస్పిటల్ కి చేరేసరికే అతడు మరణించాడని చెప్పారు.

మరణించినతని భార్యాపిల్లలతో పాటు దగ్గర బంధువులందరూ హాస్పిటల్ కి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. వాళ్ళతోటే ఉన్న ఏకాంబరం కూడా కళ్ళల్లో నీళ్ళు దించుకున్నాడు. ఏడుపు రాకపోయినా మరణించినతని బంధువులు కోసమన్నా ఏడవక తప్పదన్నట్టు విచారంగా మొహం పెట్టి తల దించుకుని నిలబడ్డాడు ఏకాంబరం.

చనిపోయినతని బంధువుల్లో హాస్పిటల్ కి వచ్చిన వాళ్ళల్లో యవ్వనంతో మిలమిలా మెరిసిపోతూ ఒక అమ్మాయి ఏకాంబరం కళ్ళల్లో పడింది. ఆమెని చూస్తూనే శరీరం విదిల్చుకుని కొంచెం హీరోలా ఫోజు కొడుతూ హడావిడి చేయబోయాడు ఏకాంబరం.

"ఏడవకండమ్మా! ఎవరైనా... ఎప్పుడైనా చావాల్సిందే కదా! పుణ్యాత్ముడు దేవుడ్ని చూడ్డానికి వెళ్ళి శాశ్వతంగా ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు. దీనికి ఏడుస్తారెందుకు?!" అన్నాడు పెద్దమనిషిలా ఫోజు కొడుతూ.

ఏకాంబరం అలా అనేసరికి చనిపోయినతని భార్య, పిల్లలు ఏకాంబరం కేసి గుర్రుగా చూసి కోపంగా మొహం తిప్పుకున్నారు. వాళ్ళలా కోపగించుకునేసరికి 'ఏకాంబరం' తన తప్పు తెలుసుకుని భిన్నుడైపోయాడు.

శవాన్ని అంబులెన్స్ లో వాళ్ళింటికి తీసుకు వెళుతున్నప్పుడు కూడా ఏకాంబరం శవంతో పాటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కంచరపాలెంలో గల వాళ్ళింటికి వెళ్ళి దహన సంస్కారాలు అయ్యేంతవరకూ అక్కడే ఉన్నాడు.

అక్కడ ఉన్నంతసేపూ అందరూ విచారంతో ఏడుస్తూంటే ఏకాంబరం మాత్రం ఆ అమ్మాయినే చూస్తూ గడిపేశాడు. ఎవరూ తనని గమనించకుండా దొంగ చూపులు చూస్తూ ఓ మూల నిలబడేవాడు.

ఎర్రగా బుర్రగా ఎంతో అందంగా ఉన్న ఆ అమ్మాయి ఒడ్డూ పొడుగూ ఏకాంబరానికి బాగా నచ్చేశాయి. తనలాగే రివటలాగ సన్నగా ఉన్న ఆ అమ్మాయి శరీరాకృతిని కళ్ళతోనే కొలతలు వేస్తూ కళ్ళతోనే ఆమెని అన్ని భంగిమల్లో ఫోటోలు తీసి మనసులో భద్రపరుచుకున్నాడు.

ఆ అమ్మాయి పదే పదే ఏడుస్తూ ముక్కు చీదుకుంటున్న దృశ్యాలు కళ్ళల్లో కదలాడేసరికి చిరాగ్గా కళ్ళు మూసుకుని అందమైన ఆమె రూపలావణ్యాన్ని గుర్తు చేసుకుంటూ చిరాకు కలిగించే దృశ్యాలను కళ్ళల్లోనుండి చెరిపెయ్యాలని ప్రయత్నించాడు ఏకాంబరం. అయినా, ఆ దృశ్యాలే ఏకాంబరాన్ని కలవరపెడుతున్నాయి.

ఆ అమ్మాయి చనిపోయినతని మేనకోడలు. గోపాలపట్నంలో ఉన్న చంద్రనగర్ లో ఈ మధ్యే అద్దెకు దిగారు. చనిపోయినతనికి ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. కొడుకులిద్దరూ పెళ్ళిళ్ళయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కూతురికి ఇంకా పెళ్ళికాలేదు.

శవాన్ని పాడె మీద మోసుకు వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో పడాలని తనూ ఓ మూల పాడె భుజాన మోస్తూ శ్మశాన వాటిక వరకూ వెళ్ళాడు ఏకాంబరం.

ఆ తర్వాత -

దశదిన కర్మకి కూడా వాళ్ళెవరూ పిలవకపోయినా పదో రోజు గుర్తు పెట్టుకుని టిప్ టాప్ గా తయారయి బైక్ మీద వెళ్ళాడు ఏకాంబరం.

బంధువులతోనూ, స్నేహితులతోనూ ఆ రోజు అక్కడ అంతా హడావిడిగా ఉంది. ఏకాంబరం ఉదయం పదో గంటకే వెళ్ళి ఆ ఇంటి ముందున్న టెంట్ లో కూర్చున్నాడు. ఎక్కడెక్కడి నుండో వచ్చిన బంధువులు కూడా ఆ టెంట్ లో కూర్చున్నారు.

ఆ ఇంటిల్లిపాది ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. ఏకాంబరం కూడా అలా ఒంటరిగా కూర్చోవడం బావుండదని లేచి వంటలు చేస్తున్న దగ్గరకెళ్ళి వంటవాళ్లకి సూచనలు, సలహాలు ఇస్తూ నిలబడ్డాడు.

అటుగా వెళ్తూ ఒకామె ఏకాంబరాన్ని చూసి టక్కున ఆగిపోయింది.

"ఓయ్ వంటాయన! నువ్వేనా ఈ వంటల కాంట్రాక్టర్ వి. ఉదయం ఆ టిఫిన్ లు ఏంటి అలా తగలడ్డాయి. ఎవరైనా తినడానికే చేసారా?" అంటూ చిర్రుబుర్రులాడింది.

ఏకాంబరానికి నోట మాట రాలేదు. అయోమయంగా ఆమెకేసి చూస్తుండిపోయాడు. వంట దగ్గర కూరగాయలు తరుగుతున్న ఆడవాళ్ళు వంట చేస్తున్న మగవాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ తల దించుకుని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు.

"నీకేనయ్యా! మతిగాని పోయిందా?! నీ చెవులు గాని పని చెయ్యటం లేదా?" ఏకాంబరం మీదకు వస్తూ చీర చెంగును బొడ్లో దోపుకుంది ఆమె.

"అయ్యో! అత్తా! ఆగు... ఆగు... అతను వంటలు చేసే కాంట్రాక్టర్ కాదు" ఎక్కడినుండో పరిగెత్తుకు వచ్చి చెప్పాడు చనిపోయినతని కొడుకు.

"మరీ?! ఈ గుంటడెవడ్రా! ఎర్రగా బుర్రగా... సూటు బూటు వేసుకుని అచ్చం సినిమాల్లో 'వంటలు' చేసినోడిలా ఉన్నాడు" ఏకాంబరాన్ని ఎగాదిగా చూస్తూ అంది ఆమె.

"అయ్యో! ఛాయాదేవి వదినా! అతను మా అన్నయ్య స్నేహితుడు. అన్నయ్యకి బస్సు ప్రమాదం జరిగిన దగ్గర్నుండి అన్నయ్యతోనే ఉండి చనిపోయాక కూడా దహన సంస్కారాలు అయ్యే వరకూ ఉన్న కుర్రాడితనే" నడి వయసులో ఉన్నావిడ ఇంట్లో నుండి వచ్చి అంది.

"ఇంకెక్కడన్నయ్యే రాజ్యం! ఎప్పుడో ఈ ముదనష్టపు వెధవలందరూ కలిసి కాష్టంలో కలిపేసారు కదే! నిక్షేపంలా ఉన్నోడ్ని పేకాటకని పట్టుకెళ్ళి తాగుబోతుని చేసారు కదే తల్లీ! ఇలాంటి గుంట వెధవలతో సాహసం చేసి ఒళ్ళూ, ఇల్లు గుల్ల చేసుకున్నాడు కదే రాజ్యం?" అంటూ ఏడుస్తూ శాపనార్ధాలు పెట్టడం ప్రారంభించింది ఛాయాదేవి.

ఏకాంబరానికి ముచ్చెమటలు పోశాయి. ఏం మాట్లాడాలో తెలియక బిక్క చచ్చిపోయాడు.

"ఛాయ వదినా! అంతా మన ఖర్మ అనుకోవాలి. వీళ్ళందర్నీ తిట్టి ఏం లాభం చెప్పు!" అంటూ ఆమెని బుదిరించింది రాజ్యం.

"అయ్యో! ఆయనెవరో నాకు తెలీదండీ! నేను....." నసుగుతూ అన్నాడు ఏకాంబరం.
"అయ్యో! అయ్యో! మా బావ ఎవరో నీకు తెలీదా? అయితే నువ్వు దొంగతనానికొచ్చావా? అందరం ఆదమరచి ఉంటే... అమ్మో... అమ్మో... చూడవే రాజ్యం! చూడు! ముక్కు మొహం తెలీని వాళ్ళని ఇలా ఇళ్ళల్లోకి రానిస్తారా ఎవరన్నా!" లబోదిబోమంటూ తన మెళ్ళో ఉన్న బంగారాన్ని తడుముకుంటూ పైట చెంగుని ముసుగులా కప్పుకుంది ఛాయాదేవి.

"అవునా అబ్బాయ్! నీకూ మా అన్నయ్యకి పరిచయం లేదా?! మరి, ఇన్నాళ్ళూ... ఇంతలా ఎందుకయ్యా మా అన్నయ్యకి సేవ చేశావ్? మా వదినన్నట్టూ కొంపదీసి దొంగతనానికి ప్లాన్ చెయ్యటం లేదు కదా!" ఆశ్చర్యంగా ఏకాంబరం కేసి చూస్తూ అంది రాజ్యం.

"అదేం కాదండి! మాది సింహాచలమే. ఆపదలో ఎవరికైనా సహాయం చెయ్యడం మానవధర్మం కదండీ!" వినమ్రంగా అన్నాడు ఏకాంబరం.
"సహాయం చెయ్యొచ్చుగాని, ఇలా రోజూ వచ్చి వూడిగం చెయ్యరు కదా బాబు!" చిరాగ్గా అంది రాజ్యం.
"ఊడిగం చెయ్యడం కాదండి. ఇంటి పెద్ద మగ దిక్కి పోయారు కదా! ఎందుకైనా అవసరం పడుతుందేమోనని" వినయంగా అన్నాడు ఏకాంబరం.

"ఏం నాయనా! ఆళ్లింటికి అల్లుడైపోదామనుకుంటున్నావా? ఇంటికి యజమానివై ఆళ్ళ అప్పుల్ని తీర్చేద్దామనుకుంటున్నావా?" ఎకసెక్కంగా అంది ఛాయాదేవి.

"అయ్యో! అలా కాదండి! ఆయన చనిపోయారు కదా! బయట ఆఫీసు పనులు గట్రా ఏమన్నా ఉంటే సహాయం చేద్దామని" అన్నాడు ఏకాంబరం.

"అవునే రాజ్యం! ఇప్పుడంతా బ్రోకర్ల రాజ్యమే కదా! భూములమ్మే బ్రోకర్లున్నారు, అమ్మాయిల్ని అప్పచెప్పే బ్రోకర్లున్నారు. వంటలకి, పెళ్ళిళ్ళకి ఒకటేంటి అన్నింటికీ బ్రోకర్లున్నారు కదా! ఇలా సహాయం చేసి పదో పరకో తీసుకుంటారేమోనే రాజ్యం! అవునా బాబూ!" ఆశ్చర్యంగా అంది ఛాయాదేవి.

"ఛ! ఛ!! నేను అలాంటివాడ్ని కాదండి! కావాలంటే చూడండి! నా దగ్గర ఎన్ని కార్డులున్నాయో!" అంటూ జేబులో ఉన్న పర్సులోనుండి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు తీసి చూపించాడు ఏకాంబరం.

"ఇవేం కార్డులు నాయనా! ఊరందరివీ ఎత్తుకొచ్చినట్టు ఇన్ని కార్డులా!" ఆశ్చర్యంగా బుగ్గ మీద చెయ్యేసుకుంటూ అంది ఛాయాదేవి.

"ఇవన్నీ నావేనండి. నేను సహాయం చేసింది మానవసేవే మాధవసేవ కదండి! అంతే!" అమాయకంగా అన్నాడు ఏకాంబరం.

"అవున్నాయనా! అందరూ అలాగే అంటారు. దొరికితే దొంగలు. దొరక్కపోతే దొరలు" వ్యంగ్యంగా అంది ఛాయాదేవి.

ఏకాంబరానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఏం మాట్లాడాలో అర్ధం కాక మూగబోయాడు.
"అత్తమ్మా! ఆయన్నలా బెదరగొట్టేయకే! పాపం! పదిరోజుల్నుండీ మావయ్య మంచి చెడ్డలన్నీ ఆయనే చూసారు" అంటూ ఎక్కడినుండి వచ్చిందో ఆ అమ్మాయి ఏకాంబరాన్ని అదరగొట్టేస్తున్న 'ఛాయాదేవి'కి నచ్చచెప్పింది. ఇంతలో చనిపోయినతని కొడుకులు, భార్య కూడా అక్కడకు వచ్చారు. అందరూ ఏకాంబరం చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పారు.

"ఈ రోజుల్లో మీలాంటివాళ్ళెక్కడున్నారు సార్! అందరూ అవకాశం దొరికితే ఏదో ఎత్తుకుపోదామనే వాళ్ళే కదా!" అన్నాడు చనిపోయినతని పెద్ద కొడుకు.

"అలా అనకండి సార్! మనుషులన్నాక మంచివాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు ఉంటారు. రాత్రీ పగలు, కష్టం సుఖం, బొమ్మా బొరుసూ, తూర్పు పడమర ఇలా ఒకదానికొకటి వ్యతిరేఖ పదాలున్నట్లే మనుషుల్లోనూ చట్టవ్యతిరేకులుంటారు సార్!" హుందాగా ఒళ్ళు విరుచుకుని అన్నాడు ఏకాంబర్.

"వెల్ డన్ సార్! రెండు ముక్కల్లో ఎన్ని నిజాలు చెప్పారు" అన్నాడు చనిపోయినతని రెండో కొడుకు.

"నీ మేలు ఈ జన్మకి మర్చిపోము బాబూ! మీరెవరో మాకు మీ ముక్కూ మొహం కూడా తెలీదు. అయినా, కష్టాల్లో ఉన్నప్పుడు అడక్కుండానే వచ్చి ఆ సాయిబాబాలా ఆదుకున్నారు" కళ్ళల్లో కన్నీళ్లు దించుకుంటూ అంది చనిపోయినతని భార్య.

"అయ్యో! అత్తమ్మా! ఇది ఆయన వృత్తిధర్మం. ఆయన మదర్ థెరిస్సాలా సమాజ సేవకుడు. మనం లేకపోతే ఆయనకి ఇలా సేవ చేసే అవకాశం, అదృష్టం దొరకదు అత్తయ్యా!" అవునా సార్!" ఏకాంబర్ మొహంలోకి చూస్తూ అంది ఆ అమ్మాయి. అత్తయ్య భుజం మీద చెయ్యి వేసి కళ్ళనీళ్ళు తుడుస్తూ.

"అవునమ్మా! అవును. మీకు అభ్యంతరం లేకపోతే, చనిపోయిన సార్ పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలు గట్రా ఏమైనా ఉంటే చెప్పండి వెంటనే దగ్గరుండి 'డెత్ క్లైమ్'లు పెట్టించి సార్ కి రావలసిన ఇన్స్యూరెన్స్ సొమ్ము చెక్కులు రాయించి తెస్తాను" ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న ఏకాంబర్ ఆమెతో అంటూనే చనిపోయినతని కొడుకుల కేసి చూస్తూ అన్నాడు.

"ఉన్నాయి సార్!... అయినా, ఈ ఆఫీసు గొడవలు మీకెందుకు సార్! ఇప్పటికే ఎంతో సేవ చేసి అలసిపోయారు" అన్నాడు చనిపోయినతని పెద్ద కొడుకు వినయంగా.

"అవును సార్! ఇంకా మీకు శ్రమ ఇవ్వడం భావ్యం కాదు కదా!" అంది ఏకాంబరాన్ని చూస్తూ ఒయ్యారాలుపోతున్న ఆ అమ్మాయి.

ఏకాంబరం కూడా ఆ అమ్మాయిని ఓరకంట చూస్తూ ఒకోసారి తనని తనే మైమరచిపోతున్నాడు.

"అలా అంటారేంటి మేడమ్! నేను కూడా ఇన్స్యూరెన్స్ ఏజెంట్ నే. అందులో సాధకబాదకాలన్నీ తెలిసినవాడ్ని. నా ద్వారా అయితే మీ పనులన్నీ చిటికెలో అయిపోతాయి తెలుసా?" అన్నాడు ఏకాంబరం.

"అద్గదీ అలా చెప్పండి! మీకైతే ఇదంతా కొట్టిన పిండే. మీకే అప్పగిస్తాంలెండి. ముందు ఈరోజు కార్యక్రమాలు పూర్తి కానివ్వండి" చనిపోయినతని పెద్దబ్బాయి అంటూనే వంటవాళ్లంతా వంటలు వేగిరం కానివ్వండని చెప్పి డైనింగ్ హాల్ దగ్గరకు పరుగందుకున్నాడు.

"ఒరేయ్ నాయనా నీ పేరు సహాయం కదూ!" నడవలేక ఏకాంబరం చేయూత తీసుకుంటూ అంది ఛాయాదేవి.

"సహాయం కాదండి! ఏకాంబరం. ఇన్స్యూరెన్స్ ఏజెంట్ ఏకాంబరం" ఆనందంగా అన్నాడు ఏకాంబరం. అంటూనే తన జేబులో ఉన్న విజిటింగ్ కార్డు తీసి ఆమె చేతికి ఇవ్వబోయాడు.

"ముసలి ముండని. కళ్ళు కనిపించవు. కాళ్ళు కదలక చస్తున్నదాన్ని నాకెందుకురా ఈకార్డు ముక్కలు" అంటూ ఏకాంబరం చేతిలో విజిటింగ్ కార్డ్ తీసుకుని విసిరెయ్యబోయింది ఛాయాదేవి.

చటుక్కున ఛాయాదేవి చేతిలో ఉన్న ఏకాంబరం విజిటింగ్ కార్డును ఆ అమ్మాయి లాక్కుని చూసింది.

"మీరు ఇన్స్యూరెన్స్ కంపెనీకి చైర్మనా?" ఏకాంబరం విజిటింగ్ కార్డు చూస్తూ ఆశ్చర్యంగా అంది ఆ అమ్మాయి.

"కొంపముంచారు. చైర్మన్ క్లబ్ మెంబర్ని అని రాసానండీ బాబూ! కంపెనీకి చైర్మన్ ఎలా అవుతానండీ?" ఆ అమ్మాయి తెలిసి ఆట పట్టిస్తోందా? తెలీక తప్పుగా అర్ధం చేసుకుందా?! ఆ అమ్మాయి కేసి అయోమయంగా చూస్తూ అన్నాడు ఏకాంబరం.

"ఏం చైర్మన్ కాకూడదా? ఎంతమందీ పనీపాటా లేనివాళ్ళు జిల్లా పరిషత్ లకీ, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలకి, మరెన్నో సంస్థలకి చైర్మన్ లు కావటం లేదు?" తనకే అంతా తెలిసినట్టూ అంది ఆ అమ్మాయి.

"అమ్మా! తల్లీ! నేను రాజకీయ నాయకుడ్ని కాదు. ఉద్యోగం సద్యోగం లేక, రాక రాక ఇలా ఇన్స్యూరెన్స్ ఏజెంట్ నయ్యాను. చైర్మన్ క్లబ్ మెంబర్ అంటే వరుసగా మూడేళ్ళు ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు పెట్టే రూల్స్ ప్రకారం పాలసీలు కట్టిస్తే ఇలా 'చైర్మన్' క్లబ్ లో మెంబర్ గా గుర్తిస్తారు" ఆ అమ్మాయికి బోధపరుస్తూ వినమ్రంగా అన్నాడు ఏకాంబరం.

"చైర్మన్ అంటే అందరి కంటే పెద్దే కదా" అమాయకంగా అంది ఆ అమ్మాయి.

"అవునవును. పాలసీలు ఎక్కువ చేసినవారికి ఇచ్చే పెద్ద గౌరవం. ఇంకేం చెప్పాలి... ఎలా చెప్పాలో తెలీక అన్నాడు ఏకాంబరం.

సరిసరి మీరు బాగా చదువుకున్నారులా ఉంది కదూ?" కళ్ళింత చేసుకుని అడిగింది ఆ అమ్మాయి.

"అవునవును. మా ఊర్లో పదోతరగతి పాసయ్యాక ఇంటర్ చదవడానికి ఎన్నో అవస్థలు పడ్డాను" చాలా గుంభనంగా తనేదో పెద్ద చదువు చదివినట్టూ ఫోజిస్తూ అన్నాడు ఏకాంబరం.

"అదేంటి మీరు ఇంటర్ వరకే చదువుకున్నారా? అదెలా! నేనైతే ఇంటి దగ్గరుండే డిగ్రీ వరకూ చదివేసాను. తెలుసా?" ఆనందంగా ఎగిరి గంతేస్తూ నీ కంటే నేను రెండాకులు ఎక్కువే చదివానన్న గర్వంతో అంది ఆ అమ్మాయి.

"అవునులెండి! అందుకేగా మీకింత తెలివి ఎక్కువైపోయింది. ఇంతకీ మీ పేరు ఏంటో చెప్పనేలేదు" వ్యంగ్యంగా అన్నాడు ఏకాంబరం.

"దాని పేరా బాబూ. నూకరత్నం." ప్రక్కనే ఉన్న ఛాయాదేవి టక్కున అంది.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass