Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

ప్రిన్సిపాల్ గారు అంతా విని, తన విచారాన్ని ఈ విధంగా వ్యక్తం చేసారట....

"ఈ వెధవ... (బూతు) బూతులు, అలవాటైపోయాయండి, (బూతు).... ఎన్నిసార్లు ప్రయత్నించినా మానలేకపోతున్నానండి....."

'డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు, రచయితలు, రాజకీయవేత్తలు, ఐ.ఏ.ఎస్ లు, కళాకారులు, సినీరంగ ప్రముఖులు కూడా ఈ సంస్కృత భాషని విరివిగా వినియోగిస్తారు.

వీళ్ల దగ్గర్నుండి ఎప్పుడైనా ఈ దేవభాష వినబడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. తెలుగులో మాట్లాడిన బూతులు, వినడానికి కర్ణకఠోరంగా అభ్యంతరకరంగా ఉండవచ్చునేమో? ఇప్పుడున్నటివంటి ఆధునిక (మోడరన్) ప్రపంచం గురించి 'పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి' వారు ఎప్పుడో చెప్పారు.

'నీతి బూతవుతుంది, బూతు నీతవుతుంది' అని...

ఈ రోజుల్లో ఎవరు, ఎన్ని, ఎక్కువ బూతులు ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్లు అంత గొప్పవాళ్లు...

ఇంగ్లీషులో బూతులు మాట్లాడినవాడు అమెరికా వాడితో సమానమైపోయి, సమాజంలో అత్యున్నత గౌరవం పొందుతాడు. బూతులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడిన వాడికి సరిగ్గా ఇంగ్లీష్ రాదన్నమాట! అందుకనే తెలివైన ఆడపిల్లలు, మగపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ బూతులు ఉండేలా జాగ్రత్తపడతారు...

ఉదాహరణకి ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు... ఏదన్నా అనుకోనిది జరిగినప్పుడు... 'షిట్' అనాలి. అలాగే చేతిలోంచి ఏదన్నా జారిపడితే.. ఓహ్...! ఫా... అనాలి. ఓహ్... డామిట్... అనాలి. అప్పుడప్పుడూ అలవోకగా... మా..... ఫా..... అనాలి. తనకు తెలియకుండానే తన నోటినుండి వస్తున్నట్లుగా... 'యాస్'... అనాలి. ఇంగ్లీష్ లో 'యాస్' అనే పదానికి 'గాడిద' అనేకాక ఇంకో నానార్ధం కూడా ఉంది.

ఏదైనా బాగా ఖరీదైన కొట్టు (ఖరీదైన కొట్టు అనగా కోట్లతో కట్టిన మాల్స్) కి వెళ్ళినప్పుడు ఆ కొట్టువాడు అందరికీ వినబడేలా 'ఇంగ్లీష్ సంగీతం' పెడతాడు. వినే వాడెవడైనా ఏదన్నా తెలుగుపాట పెట్టండి అని అడిగితే వాడంత వెధవ ఈ ప్రపంచంలోనే లేడన్నట్లుగా చూస్తారు.

'ఏ  కోన్' అనే ఆఫ్రికాకు చెందిన అమెరికా దేశస్థుడు 'ఐ... వానా... ఫా.. యూ...' అని పాడిన పాట, ఇంకా ఎన్నో చిత్ర విచిత్రమైన బూతులతో కూడిన పాటలు 'వేద మంత్రాల్లా' అన్ని షాపుల్లోనూ వినబడుతుంటాయి. పిల్లలూ, పెద్దలూ, అంతా ఆనందంగా వింటూ, షాపింగ్ చేసుకుంటారు.

ఏమిటిది?

కర్ణకఠోరం! అనేవాడు లేనేలేడు, ఉండడు కూడా...

ఒకవేళ ఎవడైనా అంటే వాడిని పురుగుని చూసినట్లుగా చూస్తారు అందరూ...

ఓహో... మనమేమన్నా తక్కువ తిన్నామా..? అని మన తెలుగు సినిమా వాళ్లు కూడా తమవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. రకరకాల అందమైన పాటలు...

రింగ... రింగా... అనీ... కెవ్వు... కేకా... అనీ...

'అ' అంటే అమలాపురం అనీ కట్టి, జనరంజకంగా పాడించి, ఒకటికి వందసార్లు ప్రసారం చేసి, యువతను ఆకట్టుకుంటూ, శరవేగంగా ముందుకు సాగిపోతున్నారు.

'జాతీయగీతం' సరిగ్గా పాడలేని యువకులుంటారేమోగాని, 'అ' అంటే అమలాపురం పాట రానటువంటి యువకులు ఉండరు.

జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికీ... జై!

కిట్టు వాళ్ళకి ఒక సొంత తాటి  చెట్టు ఉంది. దాన్ని ఒక కల్లుగీసే ఆయనకు అప్పజెప్పాడు కిట్టు వాళ్ల తాత. కల్లు అనేది తాటి చెట్టు 'మొవ్వు' (చెట్టు చివరన ఉండే మొత్తటి కమ్మలు) నుండి వచ్చే తెల్లటి ద్రవ పదార్ధం, అది సాధారణంగా వేసవిలో ఎక్కువగా తీస్తారు. ఈ తెల్లటి కల్లు పాల వలె ఉంటుంది చూడడానికి అందుకే ఒక సామెత వచ్చింది...

'తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నానంటే ఎవరూ నమ్మరు' అని.

పాలు, కల్లు ఒకలాగే ఉన్నా పాలు పాలే, కల్లు కల్లే.

కల్లుగీసే అతను కాళ్లకి బంధం వేసుకుని, చకచకా సునాయాసంగా చెట్టు పైకి ఎక్కి, అక్కడ కుండ అమరుస్తాడు. తరువాతి రోజు ఆకుండ నిండుతుంది. దానిని జాగ్రత్తగా చుక్క కూడా కింద పడకుండా కిందకి తెస్తాడు. గ్రామస్తులు చెట్టు కింద కూర్చొని ఉంటారు. గ్లాసుల్లో కాకుండా తాటి ఆకుతోనే ఒక చక్కని, 'దోనె'ని అర్ధ చంద్రాకారంలో తయారు చేసుకుని, ఈ 'దోనె'లో కల్లు పోసి, గ్రామస్తులు సేవిస్తారు.

గ్లాసుల్లో తాగితే కల్లుకి విలువ ఉండదు.

ఆకు దోనెల్లో తాగితేనే దాని అందం.

కిట్టు తొమ్మిదో తరగతిలో ఉండగా కిట్టు వాళ్ల తాత కిట్టుని వాళ్ల తాటి చెట్టు దగ్గరకు తీసుకువెళ్లాడు. కల్లుతో నింపిన ఒక దోనె కిట్టుకి ఇచ్చి, తానొకటి తీసుకున్నాడు.

తాగు కిట్టు... మంచిది చలువ చేస్తుంది... అన్నాడు.

గ్రామాల్లో తాటి కల్లుని గౌరవిస్తారు. శరీరానికి చలువ చేస్తుందనీ... ఔషధం లాగా పని చేస్తుందనీ... కొంతమంది ఆడవాళ్ళు కూడా బాహాటంగా, అందరితో పాటే కల్లు సేవనం చేస్తారు. కల్లు తాగితే మత్తెక్కి, మైమరచిపోరు... తాగిన తరువాత ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్ళిపోతారు... కల్లులో రకరకాల క్వాలిటీలు ఉన్నాయి. తియ్యటి కల్లు మైకాన్నివ్వదు. పుల్లటి కల్లు మైకాన్నిస్తుంది. కొంతమంది అదే పనిగా తాగుతూ కుండని ఖాళీ చేసేయ్యగలరు. కుండెడు కల్లు తాగితే మత్తు ఎక్కడం ఖాయం.

కల్లు కుండని "లొట్టి" అంటారు. కొందరు లొట్టెడు కల్లు తాగేయగలరు.

"అతి సర్వత్రా వర్జయేత్"

కిట్టు కొద్దిగా తాగి చూశాడు. తియ్యగా ఉంది. మెల్లగా ఒక దోనె ఖాళీ చేసాడు. దోనె ఖాళీ కాగానే కల్లు పోసే అతను దాన్ని మళ్ళీ నింపాడు. నింపాదిగా అది కూడా ఖాళీ చేసేశాడు కిట్టు.

కిట్టు వాళ్ళ తాత గమనిస్తూనే ఉన్నాడు.

రెండోది అయిపోగానే దగ్గరకు వచ్చి, 'ఇంక చాలు... నడు... ఎల్లిపోదాం, అని ఇంటికి తీసుకెళ్లిపోయాడు'.

ఒకప్పుడు స్వచ్చమైన కల్తీలేని కల్లు దొరికేది. గ్రామస్తులు సరిగ్గా చెట్టు మొదట్లో కూర్చుని తాగేవారు. ఇప్పుడు అలాంటి కల్లు దొరకడమనేది 'కల్ల'... కల్లుగీసే వాళ్లు ఏదో మత్తు మందు... చెట్టు పైకి వెళ్ళేటప్పుడు పట్టుకుపోయి, కల్లు కుండలో కలిపేసి కిందకు తీసుకువస్తున్నారు. గ్రామస్తులు కూడా మారిపోయారు. మత్తు ఇవ్వని కల్లు వాళ్లకి నచ్చటం లేదు. వీళ్లకి తగ్గట్టుగానే గీసేవాళ్ళూ తయారయ్యారు.

గ్రామంలోని కల్లు పట్టణాల్లోకి, నగరాల్లోకి ప్రవహిస్తుంది.

పట్టణాల్లోనూ, నగరాల్లోనూ కల్లు కంపౌండ్లు వెలిసాయి.

గ్రామం నుండి పట్టణాల్లోకి, నగరాల్లోకి వెళ్ళేలోపు ఆకల్లు కాస్తా 'గిల్లు' అయిపోతుంది. అంటే, అందులో మత్తు కోసం ఏమేం కలపరాని, కలపకూడనివి కలుపుతారో ఆ భగవంతుడికే ఎరుక.

'కల్తీ కల్లు తాగి అనేక మందికి అస్వస్థత, అనేక మంది మృతి' అనేవార్త అప్పుడప్పుడూ వార్తా పత్రికల్లో చూస్తూనే ఉంటాం.

ఒక మాటలో చెప్పాలంటే... 'స్వచ్చమైన, కల్తీలేని కల్లు, అసలుసిసలైన షాంపేన్ వంటిది.'

****

కిట్టువాళ్ళ నాన్నగారు కిట్టుకి వాళ్ల అన్నయ్యకి కలిపి, ఒక హీరో జెట్ సైకిల్ కొనిచ్చారు. హీరోజెట్ సైకిలు తొక్కుకుంటూ స్కూలుకి వెళ్ళే ఆనందంతో పోలిస్తే, ఇప్పటి బజాజ్ పల్సర్, యమహా, హీరో హోండా, హార్లే డేవిడ్ సన్, బుల్లెట్, అవెంజర్ లు ఎందుకూ పనికిరావు.

స్కూలు సంగతి తరువాత...

అప్పటివరకు కిట్టు, ఫ్రెండ్స్ అంతా కలిసి, నడుచుకుంటూ 'ఐదు' కిలోమీటర్లు దూరంలో ఉన్న భీమవరం వెళ్లి సినిమాలు చూసేవారు.

భీమవరం వెళ్లడానికి అనువైన సమయం... స్కూలుకు వెళ్లే సమయమే... సరిగ్గా స్కూలు సమయానికే బయలుదేరి... రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ భీమవరం చేరుకునేవారు. ఇప్పుడు సైకిల్ వచ్చింది కాబట్టి, సైకిల్ లేనివాళ్ళు అద్దె సైకిళ్లు తీసుకుని ఫ్రెండ్సంతా సినిమాకు వెళ్లేవారు. 'రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ' ల సినిమాలతో సహా, డబ్బింగ్ సినిమాలు కూడా వదిలేవారు కాదు.

'దొంగలకు దొంగ' సినిమాలో హీరో కృష్ణని మెచ్చుకుంటూ. 'తూఫాన్' అంటూ మోహన్ బాబు వెరైటీ ఏక్షన్ గురించి ముచ్చటించుకుంటూ తిరిగి వెళ్లేవాళ్లు.

'అడవి రాముడు' సినిమా చూసి, 'ఒరేయ్... రామారావు 'అరబ్ షేకు'లాగా మారువేషంలో వచ్చినట్టు సత్తిగాడికి (విలన్ సత్యనారాయణ)తెలియదురా'... అనుకుంటూ ఆనందపడిపోయేవారు.

'నీ పని ఖాళీ... కాళీ... కాళీ... అంటూ ఎన్టీవోడు (రామారావు) ఎంత తెలివిగా 'కాళీ' అనే ఏనుగును సత్తిగాడికి తెలియకుండా ఎలా పిలిచాడురా'... అని చర్చిస్తూ ఆశ్చర్యపోయేవారు.'

పెన్నాడలోని 'తాట్ర్ పళ్ళోడు' రోజూ పొలం పనికి వెళ్తాడు. ఈ తాట్ర్ పళ్ళోడు కిట్టు, కిట్టు ఫ్రెండ్స్ కంటే వయసులో పెద్దవాడు. వాడికి ఈ విధ్యార్దులంటే అభిమానం. ఎప్పుడైనా ఆదివారం సెలవురోజు కిట్టుని, ఇంకా ఒకరిద్దరు ఫ్రెండ్స్ ని తీసుకుని సైకిళ్ళపై భీమవరం తీసుకెళ్ళేవాడు. స్టూడెంట్ లా కనబడాలని భీమవరం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా కుట్టించిన ప్యాంట్, షర్ట్ వేసుకునేవాడు తాట్ర పళ్ళోడు.

సినిమా టిక్కెట్టు, ఆ తర్వాత ఫేమస్ బీమా హొటల్ లో బన్ జామ్, లేక పరాటా, టీ ఖర్చులన్నీ వాడే పెట్టుకునేవాడు. ఖర్చు ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు.

పొలం పనులకు వెళ్లేవాళ్లు. రెండు మూడు వారాలకోసారి దగ్గరలోని పట్టణానికి వెళ్లి, సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని దర్జాగా, పీనాసితనం లేకుండా ఖర్చు పెడతారు.

గ్రామంలో...

సెలవు దినాల్లో కిట్టుని ఫ్రెండ్స్ ని, 'పీకడు' తోటల్లోకి తీసుకువెళ్ళేవాడు. పీకడు కూడా పొలం పనికి వెళ్తాడు. వీడు, కిట్టుకి సమవయస్కుడు. తోటల్లోకి వెళ్ళేటప్పుడు పీకడు కొడవలి పట్టుకుని వెళ్లేవాడు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం, ఎవరూ ఉండని సమయం, తోట కాపలాదారులు భోజనానికి వెళ్లే సమయం చూసుకుని వెళ్లేవారు. పీకడు కాళ్లకి బంధం లేకుండానే తాటి చెట్టును గబగబా ఎక్కగలడు.

కొడవలిని నోటితో పట్టుకుని, తాటి చెట్టెక్కి, ముంజ కాయల గెల (గుత్తి) నరికేవాడు.

ఒక్కో గెలకు పది నుండి పదిహేను ముంజకాయలు ఉంటాయి. అవి కిందపడగానే భుజానికెత్తుకుని, ఆ ప్రదేశానికి దూరంగా వెళ్లే పని ఇద్దరికి అప్పజెప్పబడుతుంది. చెట్టు దిగేముందు పీకడు కొడవలిని కిందకు విసురుతాడు. ఎక్కినంత త్వరగా కిందకి దిగుతాడు. కిందవున్న వాళ్లు కొడవలిని తీసుకుని రెడీగా ఉంటారు... పీకడు దిగిన వెంటనే కింద ఉన్నవాళ్ళతో కలిసి, పరిగెత్తుకుంటూ అంతకుముందు వెళ్లిన వాళ్లని కలుసుకుంటాడు. అమ్మయ్య... ఇంకేం ఫర్వాలేదు... అనిపించే చోట కూర్చున్నాక కొడవలితో ముంజల్ని చెలుపుతాడు. (చెలపడమంటే చక్కగా కట్ చేయడం) కొన్ని వాడికోసం పక్కన పెట్టుకుంటాడు.

బొటనవేలితో గుచ్చి, నీళ్లు చిందకుండా, బొటనవేలినే ఒక స్పూనులాగా ఉపయోగిస్తూ ముంజకాయల్ని తినడం ఒక గొప్పకళ...

సరిగ్గా తినడం రానివాడిని వేళాకోళం చేస్తూ ముంజలు తినేవారు ఫ్రెండ్స్ అంతా...

కిట్టు నాయనమ్మకు వీళ్లు చేసే పనులన్నీ తెలుసు...

'ఎవడన్నా పట్టుకుంటే మెత్తగా తంతాడు' అనేది. మెత్తగా తన్నడమంటే సుకుమారంగా తన్నడమని కాదు, చితకబాదడమని నాయనమ్మ భావం.

ఆమెకు తెలుసు... పీకడు మాత్రమే చెట్టు ఎక్కగలడు... మిగిలిన వాళ్లు ఎక్కలేరని.

పీకడి వల్లే వీళ్లంతా తోటల వెంబడి తిరుగుతున్నారని అంటూండేది.

ఒరేయ్..! ఆ పీకడితో తిరగొద్దురా... అంటూ తిట్టేది. పిల్లలు మాత్రం షరా మామూలే.

****

కిట్టుకి ఈత నేర్పిన గురువుగారొకరున్నారు... భయం లేకుండా, సరదాగా, క్షేమంగా నేర్పించారు.

ఎవరో కాదు...

కిట్టువాళ్ళ గేదె.

గేదెని బర్రె అనీ, బఫెలో అని కూడా అంటారు. కిట్టు వాళ్ల గేదె నుదుటి మీద తెల్లని మచ్చతో, ఎంతో అందంగా, సుందరంగా ఉండేది. పిల్లలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది. వీళ్ల నాయనమ్మ ఆ గేదె పాలు ఇంట్లోకి సరిపడా ఉంచి, మిగిలిన పాలు అమ్మేది.

సెలవు రోజుల్లో కిట్టు, కిట్టు వాళ్ల అన్నయ్య గేదెని మేపడానికి చేలల్లోకి (ఫీల్డ్స్) తోలుకెళ్లేవాళ్లు. వీళ్లతోపాటు ఇంకా కొంతమంది గేదెలను మేపడానికి తీసుకువచ్చేవారు.

ఒకోసారి 'గుర్రపు పందాల' లాగా 'గేదె'లపై కూర్చొని, కొంతమందిని వాటిని వేగంగా పరిగెత్తించేవారు.

"గేదెల రేస్" అన్నమాట. నెగ్గిన విజేతను మెచ్చుకునేవారు.

కిట్టుకి గేదెల పందెంలో పాల్గొనేటంత బలం లేదు. కాబట్టి గేదెపై ఠీవీగా కూర్చొని విహరించేవాడు.

తిరిగి ఇంటికి తీసుకువచ్చేటప్పుడు 'ఎండు గడ్డి' తో గేదెను బాగా రుద్ది, కాలువలో కడిగి, ఇంటికి తీసుకువచ్చేవారు అన్నాదమ్ములిద్దరూ.

ఒకోసారి మధ్యాహ్నం పూట గేదెని గేదెల చెరువులో వదిలేవారు. మంచినీటి చెరువు వేరుగానూ, గేదెల చెరువు వేరేగానూ ఉండేవి.

గేదెకు ఈత ఎవరు నేర్పించారో తెలియదు గానీ, ఎంతో నేర్పుగా ఈత కొట్టేది. కిట్టుకూడా గేదె వెనకాలే ఉండి, దానితోక పట్టుకుని, దానితో పాటు తేలుతూ వెళ్తూ, కాళ్లు డబ... డబ మని నీటిలో కొడుతూ ధైర్యంగా ఈత కొట్టేవాడు. మునిగిపోతానన్న భయం లేదు... కొండంత అండగా గేదె ఉంది. ఎప్పుడన్నా గేదె బాగా లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు భయమేస్తే, చాలా తేలికగా గేదె వీపు మీద ఎక్కి కూర్చునేవాడు కిట్టు.

ఈ విధంగా చెరువంతా తిరుగుతూ ఈత కొట్టేవాడు.

ఒక్కొక్కసారి....

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్