Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

నగనగా ఓ మధ్యతరగతి కుర్రాడు. తొమ్మిదో తరగతి ఓ పల్లెటూరి ప్రజాపరిషత్ హైస్కూల్ లో చదువుతున్నాడు. నాటకాలు, డ్యాన్సులు వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటాడేమో ఆ స్కూల్లో వాడికి ఫాలోయింగ్ పెరిగింది. అది కో - ఎడ్ హైస్కూలు. స్టూడెంట్లు, స్టాఫు అందరూ కలిసి వాణ్ని క్లాస్ లీడర్ ని చేసారు. వాడికే తెలీదు వాడికి నాయకత్వ లక్షణాలున్నాయని. వాడు చాలా సిన్సియర్ గా డైరీలో రాసుకున్నాడు. క్లాస్ లీడర్ గా స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యేలా చదివించేస్తానని. ఆడపిల్లలందరితో రాకీలు కట్టించుకుని వాళ్ల నేడిపించే అబ్బాయిలకి టీసీలు ఇప్పించేస్తానని. ఏ కో - ఎడ్ క్లాసులోనూ లేని కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెడతానని. ఓ ఫ్రెండ్ కి వీడితో వేరే విషయంలో గొడవయ్యింది. దాంతో వాడు స్కూల్లోనూ, ఊళ్లోనూ ఈ లీడరు గాడికి ఇంకో అమ్మాయికి లవ్ ఎఫైర్ ఉందని పుకారు పుట్టించేశాడు. పల్లెటూరు కావడం మూలాన రచ్చబండ కబుర్లలో ఈ కుర్రాడు చాలా అన్ పాపులర్ అయిపోయాడు. గొడవలేవీ జరగలేదు గానీ పాపం ఆ అమ్మాయిని వాళ్ళింట్లో అనవసరమైన రిస్ట్రిక్షన్స్ లో ఇరికించారు. కొన్నాళ్ళ తర్వాత ఆ లీడరు గాడికి తెలిసింది. వాళ్ల ఫ్రెండు ఆ సదరు ఆమ్మాయి వెంట పడితే లీడరుకి చెప్పి టి.సి. ఇప్పిస్తానని బెదిరించిందని, దానికి వాడు హర్ట్ అయ్యి, ఇద్దరి మీదా గాసిఫ్ పుట్టించి ఒకే దెబ్బకి ఇద్దర్నీ పడగొట్టాడు. ఇది వాడి కరణీకం. బలైపోయింది ఆదర్శ భావాలున్న ఈ లీడరు గారు, వాడేదో కాపాడతాడని నమ్మిన ఆ సదరు అమ్మాయి.

లవ్ స్టోరీలో ఎప్పుడూ లవ్ కన్నా, హీరో, హీరోయిన్ ల కన్నా విలనే బలవంతుడు. తర్వాత ఏడాది పదోతరగతి. ఈ లీడరు గాడికి ఓ ఐడియా వచ్చింది. లీడర్ షిప్ వల్ల చదువుపాడౌతుందని, ఈ ఏడాది స్కూలు ఫస్ట్ రావాలంటే, పదవి వదిలేస్తే బెటరని - క్లాసులో బాగా అల్లరిచేసే కుర్రాడికి ఆ బాధ్యతనిచ్చి, వాణ్ని హీరోలా నిలబెట్టి వాడు కామ్ గా, శ్రద్ధగా చదువుకోవడం మొదలుపెట్టాడు. కొత్తగా ఆ స్కూల్ కి వచ్చిన ఓ పక్కింటి అమ్మాయి ఈ మాజీ లీడరు మంచివాడని మిగిలిన అమ్మాయిల ద్వారా విని, వీణ్ని నోట్స్ అడగడం, వీడింటికి రాకపోకలు సాగించడం మొదలు పెట్టింది. వీడు అందరికీ ఆ అమ్మాయిని నా చెల్లెలు అని పరిచయం చేసేవాడు. వాళ్లు మొహం మీదే జోకులేసేవాళ్లు. ఆ అమ్మాయి కూడా ఒక్కోసారి సైలెంట్ గా ఉండేది. ఒక్కోసారి తిట్టేది అలా చెప్పొద్దని. వీడిది ఆదర్శం - ఆమెది తెలిసీ తెలియని ఆకర్షణ - ఇద్దరిదీ లవ్ కాదు. కాని ఊళ్ళో వారి నోళ్లల్లో ఓ ప్రేమకథ పుట్టేసి ప్రాచుర్యం పొందేసింది. ఫలితంగా ఈ మాజీ లీడరు కేమీ కాలేదు గానీ, పాపం ఆ అమ్మాయికి సమ్మర్ హాలిడేస్ లో మైనారిటీ తీరకుండానే పెళ్ళి చేసేశారు పెద్దవాళ్ళు. వీడో పట్నానికి ఇంటర్ చదవడానికి వచ్చాడు. ఇంటర్, డిగ్రీ అయిదేళ్ళూ వాడికి అమ్మాయిల గోల లేదు. కాలేజీ, చదువు, ఫ్రెండ్స్, సినిమాలూ, పుస్తకాలు - ఇదే వాడి ప్రపంచం. వాడికి టెన్ టూ ఫైవ్ జాబ్ చేయకుండా కష్టపడి వ్యాపారం చేసి పైకి రావాలని ఆశయం. ధీరూభాయ్ అంబానీ, రామోజీరావు, అంబికా దర్బార్ బత్తి ఆలపాటి రామచంద్ర రావు, ఇలా చాలామంది వ్యాపారవేత్తలు వీడి రోల్ మోడల్స్. వీడి డిగ్రీ చివర్లో ఓ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరి కామన్ టాపిక్సూ లైఫ్ లో పైకి రావడం ఎలా?

ఇద్దరి ఫ్రెండ్ షిప్పూ బలపడింది - ఇద్దరి ఫ్రెండ్ 'షిప్పు' పీకల్లోతుల్లోకి  మునిగాక వాళ్ళు 'లవ్' లో ఉన్నారని వాళ్ళకే అర్థమైంది. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి కాస్త ముందుకెళ్ళి వీడి చేతిమీద చెయ్యేసింది. వీడు ఆదర్శ పురుషుడు కదా ! మంగళసూత్రం నీ మెళ్ళో కట్టే వరకూ నిన్ను ముట్టుకోను అని విదిలించాడు. ఎన్నాళ్ళు పడుతుంది పెళ్ళి చేసుకోవడానికి? అని అడిగింది. కనీసం నేను సెటిలవ్వాలంటే అయిదారేళ్ళు పడుతుంది అన్నాడు ప్రాక్టికల్ గా. ఈలోపు మా ఇంట్లో సంబంధాలు చూడ్డం మొదలుపెడితే నేనాపలేను అంది. ఎలాగైనా ఆపుదాం డోంట్ వర్రీ అన్నాడు. పోనీ నన్ను మర్చిపో అంది. చచ్చిపొమ్మన్నా పోతాను గానీ మర్చిపొమ్మంటే మర్చిపోలేను అన్నాడు వీడు చాలా ఎమోషనల్ గా.

కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చి ఆ అమ్మయి వీడ్ని కలిసింది. వ్యాపారం లాంటి రిస్కీ జాబ్ ఉన్నవాడ్ని మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. ఏదన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తే తప్ప నేను మా పేరెంట్స్ ని ఒప్పించలేను అంది. వీడు ఏమీ మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఒక డెసిషన్ తో వచ్చిందని వీడికి అర్థమైంది. నీకు నేను కావాలా, నీ యాంబిషన్ కావాలా అని అడిగింది. యాంబిషన్ అన్నాడు తడుముకోకుండా. ఆ అమ్మాయి కోపంగా వెళ్ళిపోయింది. లవ్ బ్రేక్ అప్.

కొన్నేళ్ళ తర్వాత వీడు వ్యాపారం లో కాస్త బాగానే నిలదొక్కుకున్నాక వీడికి ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేశారు. ఫ్రెండ్ షిప్, లవ్ అన్నీ పెళ్ళాం తోనే చేశాడు. వీడి ఆదర్శాలు ఆ పెళ్ళానికి నచ్చలేదు. పాజిటివ్ నెస్ తో వీడ్ని కాల్చుకు తినడం మొదలుపెట్టింది. పిల్లలు పుడితే డైవర్ట్ అయి ఆమె మైండ్ సెటిల్ అవ్వచ్చని వీడు ఓపిగ్గా వెయిట్ చేశాడు. ఓ పిల్లాడు పుట్టాడు. పెళ్ళాం వీడికో కండీషన్ పెట్టింది. నేను, నా పిల్లాడు కావాలా? మీ అమ్మ, నాన్న కావాలా? - వీడు వెంటనే మా అమ్మ, నాన్న అన్నాడు  - దెబ్బకి వీడితో మాట్లాడ్డం మానేసింది. కొన్నాళ్ళు ఓపిక పట్టాక వీడికి విసుగొచ్చి ఆమెని పుట్టింటికి పంపేశాడు. వీడికి ఓ చిన్నప్పటి స్నేహితురాలుంది. ఆమె మొగుడు వీడితో ఆమెకి సంబంధం అంటగట్టి వీడినేమీ అనకుండా , ఆమెని కాల్చుకు తినడం మొదలుపెట్టాడు. దాంతో ఆ అమ్మయికి చిరాకేసి మొగుణ్ణి దూరంగా పెట్టింది. అలాగే తన తల్లి దండ్రులు, పిల్లలు అపార్ధం చేసుకోకుండా ఉండడం కోసం వీడితో ఫ్రెండ్ షిప్ ని కూడా కట్ చేసింది.

వీడొక ఒంటరి జీవి. వీణ్ని చాలామంది ఇష్టపడతారు. మంచివాడని. వీడు అందర్నీ అభిమానంగా చూస్తాడు అదే మంచితనంతో. వీడు లవ్ స్టోరీ లన్నీ నేను వీడి క్లాస్ మేట్ ని కాబట్టి ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాను. ప్రతి స్టోరీలోనూ ప్రేమని, స్నేహాన్ని, చుట్టూ ఉన్న పదిమందీ ఎలా పడితే అలా అనుకోవడమే తప్పించి ఒరిజినల్ గా ఉన్నదేదో ఎవరికీ తెలీదు. పైగా జీవితం తాలూకు అన్ని దశల్లోనూ ప్రేమని మిగిలిన రిలేషన్ షిప్స్ డామినేట్ చేస్తూనే ఉన్నాయి, ఉంటాయి. ఓసారి యాంబిషన్, ఓసారి పేరెంటల్ ఎఫెక్షన్, ఓసారి పిల్లలు, సమాజం, ఇలా ఎవరికో ఇంపార్టెన్స్ ఇచ్చి లవ్ ని బలిపెడుతుండాల్సి వస్తుంది. అందుకే ఐ హేట్ లవ్ - బాధ్యతగా ఉండడం,  సిన్సియర్ గా ఉండడం, అర్ధం చేసుకోవడం, కలిసున్న అయిదు, పది నిమిషాలైనా కొట్టుకోకుండా ఆహ్లాదంగా గడపడం - ఇవే నిజమైన ప్రేమ అని నా అభిప్రాయం. ప్రయారిటీ లో టాప్ వన్ నేనా కాదా అని అడిగే పరిస్థితికి ఎదుటి వ్యక్తి వస్తే అది ప్రేమే కాదు.

వాలంటైన్ నుంచి నా ఈ ఫ్రెండ్ వరకూ అందరూ భగ్న ప్రేమికులే.

ఆకర్షణ, అవసరం, ఎక్వయింటెన్స్, లోన్లీనెస్, ఇవే త్వరగా ప్రేమలో పడేస్తాయి. బాధ్యత, సంఘమంటే భయం, డబ్బు కోల్పోయాక అనుభవించే అవమానం, ఆదర్శం, ఆశయం - ఇవన్నీ ప్రేమలోంచి బయట పడేస్తాయి.

అందుకే ప్రేమ బలహీనమైంది. జీవితం బలమైనది. ప్రేమని అడుగడుగునా కాపాడుకోవలసిన అవసరం ఉంది బెంజ్ కార్ లా. జీవితాన్ని ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసినా మళ్లీ కంట్రోల్ లోకి వస్తుంది అంబాసిడర్ కార్ లా.

వాలంటైన్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులకి వార్నింగ్ తో కూడిన ఈ వ్యాసం నా శుభాభి నందనలతో...

(మళ్ళీ వచ్చేవారం మరిన్ని విశేషాలతో...)

 

మీ
వి.ఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
hit combination