Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

హిట్లూ, ఫ్లాపులూ నాకు ముందే తెలిసిపోతాయి - జ‌గ‌ప‌తి బాబు

Interview with Jagapati Babu

ఫ్యామిలీ హీరో
మాస్ హీరో
క్లాస్ హీరో... ఈ మూడూ క‌లిపితే - జ‌గ‌ప‌తిబాబు. వీడి గొంతు సినిమాల‌కు ప‌నికి రాదు... అన్న చోటే జ‌గ‌ప‌తిబాబుది బేస్ వాయిస్ - అని పొగిడించుకొన్నాడు. ఇక జ‌గ‌ప‌తి బాబు ప‌నైపోయింది అనుకొన్న ప్ర‌తీసారీ లేచాడు... నిల‌బ‌డ్డాడు. త‌న‌ని తాను నిరూపించుకొన్నాడు. 25 యేళ్ల కెరీర్‌లో ఇన్ని ఎత్తులు, ఇన్ని ప‌ల్లాలు చూసిన హీరో లేడేమో.?!  విజ‌యం, ప‌రాజ‌యం, వైభ‌వం, వైరాగ్యం అన్నీ పీక్‌లో చూసేసిన హీరో - జ‌గ‌ప‌తిబాబు. జ‌గ‌ప‌తికి అమ్మాయిల పిచ్చి, బెట్టింగులు ఆడ‌తాడు, ఆర్థికంగా చితికిపోయాడు - ఇలాంటి కామెంట్లు ఎన్నో, ఎన్నెన్నో...! అయితే ఇప్ప‌టి జ‌గ‌ప‌తిబాబు వేరు. నేనూ - నా జీవితం అనుకొన్న ఈ క‌థానాయ‌కుడు ఇప్పుడు - కుటుంబం కోసం ప‌రిత‌పిస్తున్నాడు. హీరోగా వెలిగిన జ‌గ‌ప‌తి ఇప్పుడు విల‌న్‌పాత్ర‌ల్లో ఒదిగిపోవడానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. జ‌గ‌ప‌తి మారాడు అనడానికి ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ కావాలా??  25 యేళ్ల కెరీర్ పూర్తిచేసుకొన్న జ‌గ‌ప‌తిబాబుతో ప్ర‌త్యేక ముఖాముఖి ఇది.

* 25 యేళ్ల సినీ ప్ర‌స్థానంలో ఏం నేర్చుకొన్నారు?  ఈ ప్ర‌యాణం ఏం నేర్పింది?
- చాలా చాలా విష‌యాలు నేర్చుకొన్నా. ముఖ్యంగా చెప్పాలంటే జీవితాన్ని చాలా ఎంజాయ్ చేశా. డ‌బ్బు, ప‌ర‌ప‌తి, సౌఖ్యం, సుఖం... అన్నీ అనుభవించా. ఖ‌రీదైన కార్ల‌లో తిరిగా. ప్ర‌పంచం చుట్టేశా. నాకేం కావాలో అదే చేశా. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించా. నాకు సినిమా చాలా ఇచ్చింది. అందుకే ఈ ప‌రిశ్ర‌మ‌కు చాలా చాలా రుణ‌ప‌డిపోయా.

* కానీ ఫ్లాపులూ ఎదుర్కొన్నారు క‌దా?
- ఫ్లాపులు ఎవ‌రికి లేవు?  పెద్ద పెద్ద క‌థానాయ‌కులే సినిమాల్లేన‌ప్పుడు ఇంట్లో కూర్చున్నారు. ఇక్క‌డ  ప్ర‌తీదీ ఓ అనుభ‌వ‌మే. ఫ్లాప్‌లు కూడా కావాలండీ. లేకపోతే విజ‌యాల విలువ అర్థం కాదు.

* ఫ్లాప్ ఎదురైన‌ప్పుడు, టైమ్ బాలేన‌ప్పుడూ ఒత్తిడికి గుర‌వ్వ‌లేదా?
- అరె... ఏం చేయాలి? నా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?  అనే ఆలోచ‌న ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. లేదంటే ఎలా? నాకు సినిమాలంటే ఇష్టం. ఇది త‌ప్ప మ‌రోటి తెలీదు. అలాంట‌ప్పుడు గెలిచినా, ఓడినా ఇక్క‌డే అనుకొంటా క‌దా? అందుకే హిట్ల కోసం ఆరాట‌ప‌డేవాడిని. కానీ నాకో విష‌యం మాత్రం స్ప‌ష్టంగా తెలిసేది. ఏ సినిమా హిట్ట‌వుతుంది? ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది? అనేది సెట్లోనే తెలిసిపోతుంది. అప్పుడు నేను కూడా ఏం చేయలేను. సినిమా ఒప్పుకొన్నా క‌దా, అని పూర్తి చేయాలి. ద‌ర్శ‌కుడు చెప్పింది త‌ల‌కెక్క‌న‌ప్పుడు నాఅంత చెడ్డ న‌టుడు ఇంకెవ‌డూ ఉండ‌దు. అస‌లు ఎక్స్ ప్రెష‌న్స్ ప‌ల‌క‌వు. ఒక్క క్ష‌ణం కూడా సెట్లో ఉండ‌లేను.

* అలా ద‌ర్శ‌కుల‌తో విబేధించిన సంద‌ర్భాలున్నాయా?
- చాలా. ఇప్పుడు పేర్లెందుకు గానీ - నీకు డైరెక్ష‌న్ రాదు, ఏదో అదృష్టం బాగుండి డైరెక్ట‌ర్ అయిపోయావ్‌... అని చాలా పెద్ద ద‌ర్శ‌కుల ముందే చెప్పేశా. కార‌ణం.. చెప్పేదొక‌టీ, తీసేది మ‌రోటి. అలాంటి ప‌రిస్థితుల్లో ఫ్లాపులు లేకుండా ఎలా ఉంటాయి.

* కొత్త ద‌ర్శ‌కుల‌పై అజ‌మాయిషీ చెలాయించేవారా?
- ద‌ర్శ‌కుడు కొత్తా, పాత అనికాదండీ. వాళ్ల ద‌గ్గ‌ర విష‌యం ఉంటే మౌల్డ్ అయిపోతా. వాళ్లేం చెబితే అది చేస్తా. స‌ల‌హాలు కూడా ఇవ్వ‌ను. కానీ వీడి ద‌గ్గ‌ర విష‌యం లేద‌ని తెలిస్తే మాత్రం.. అస్స‌లు ప‌ట్టించుకోను. వాడి సినిమా ఎప్పుడైపోతుందా అన్న‌ట్టే ఉంటా.

* ఈమ‌ధ్య కొన్ని సినిమాలు డ‌బ్బులు కోస‌మే చేశార‌ట‌.. నిజ‌మేనా?
- అవునండీ. ఎందుకంటే నేనూ బ‌త‌కాలి క‌దా? దానికి తోడు ఖాళీగా ఉండ‌కూడ‌దు. ఏదో ఓ ప‌ని చేసుకొంటే నాకు నేను స‌మాధానం చెప్పుకోవ‌చ్చు క‌దా? అందుకే కొన్ని సినిమాలు పోతాయ‌ని తెలిసినా ఒప్పుకొన్నా.

* జ‌గ‌ప‌తి బాబు ఆర్థికంగా బాగా చిదికిపోయాడు అని అంటుంటారు. నిజ‌మేనా?
- మీరు చెప్పిన‌దాంట్లో కొంత నిజం ఉంది. ఇంకొంత అతిశ‌యోక్తి ఉంది. నేనేం ఆర్థికంగా చిదికిపోలేదు. ఎవ్వ‌రి ద‌గ్గ‌రా చేయి చాచ‌లేదు. కానీ... పెద్దగా సంపాదించ‌లేక‌పోయా. సంపాదించినా... విచ్చ‌ల విడిగా ఖ‌ర్చు చేశా. న‌మ్మి మోస‌పోయా. నా డ‌బ్బుని నేను ఎంజాయ్ చేశా. డ‌బ్బు దాచుకోవ‌డం కూడా నాకు తెలీదు. అయితే... అప్పుడు మాత్రం చేయ‌లేదు. కావ‌ల్సినంత లేదు గానీ, స‌రిపోయేటంత మాత్రం ఉంది.

* మాస్‌, ఫ్యామిలీ. క్లాస్ - ఇలా ఏ పాత్ర‌ల‌కైనా న‌ప్పేవారు. కానీ ఎలాంటి పాత్ర‌లు ఎంచుకోవాలి? నాకు ఎలాంటివి స‌రిపోతాయి? అనే క‌న్‌ఫ్యూజ‌న్ మీకు ఎప్పుడైనా ఉండేదా?
- అలాంటిదేం లేదండీ. బేసిగ్గా నాకు కొత్త‌ద‌నం అంటే ఇష్టం. ఓర‌క‌మైన పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైపోకూడ‌దు అని బ‌లంగా న‌మ్మేవాడిని. హీరోలుగా ఎన్న‌ని చేస్తాం. అప్పుడుప్పుడూ స‌ర‌దాగా కొత్త పాత్ర‌లు ట్రై చేయాలి అని నాకు నేనే అనుకొనేవాడిని. గాయం లాంటి సినిమా త‌ర‌వాత శుభ‌ల‌గ్నం చేశా. హీరోగా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశా. నీ సినిమాలో పాసింగ్ సీన్ ఉంటే చెప్పు, చేస్తా - అని చాలామంది ద‌ర్శ‌కులని అడిగా.

* ఫ‌లానా ద‌ర్శ‌కుడితో చేయాలి... అనే కోరిక ఉండేదా?
- అలాంటిదేం లేదండీ. హీరో, దర్శ‌కుడు... వీళ్ల‌లో నా ఫేవ‌రెట్స్ ఎప్పుడూ లేరు. కాక‌పోతే అంతఃపురంలాంటి సినిమా ఇంకోటి చేయాలి. అంతే.

* విల‌న్ గా ట‌ర్న్ తీసుకోవాల‌ని ఎందుకు అనిపించింది?
- మూడేళ్ల క్రిత‌మే నాకు హీరోగా మార్కెట్ లేద‌ని అర్థ‌మైంది. ఎంత‌కాలం హీరోగా చేయాలి? జ‌నం చూస్తారా? వాళ్ల మొహం మొత్తేయ‌క‌ముందే నా ప‌ద్ధ‌తి మార్చాలి అనుకొన్నా. ల‌క్కీగా నాకిప్పుడు మంచి పాత్ర‌లు దొరుకుతున్నాయి. ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ అన‌గానే మ‌న‌వాళ్లు ప‌క్క చిత్ర‌సీమ‌ల‌వైపు దృష్టిసారించేవారు. ఇప్పుడు వారంద‌రికీ నేను అందుబాటులో ఉన్నా.

* మ‌రి హీరోగా అవ‌కాశాలొస్తే..?
- చేస్తా. త‌ప్ప‌కుండా ఆ రోజు వ‌స్తుంది. అయితే రొమాంటిక్ హీరోగా చేయ‌ను. అప్పుడు కూడా నా వ‌య‌సుకు త‌గిన పాత్ర‌లే ఎంచుకొంటా.

* ద‌ర్శ‌క‌త్వం చేస్తారా?
- అది నా డ్యూటీ కాదు. నాకు ఆ ఆలోచ‌న ఎప్పుడూ లేదు.

* మ‌ళ్లీ సినిమానిర్మాణం ఎప్పుడు?
- నేనో బ్యాడ్ బిజినెస్ మేన్‌. ఒక్క‌సారి చేసిన త‌ప్పు మ‌ళ్లీ మ‌ళ్లీ చేయ‌ను.

* భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లేంటి?
- లెజెండ్‌, రారా కృష్ణ‌య్య‌, పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలు చేస్తున్నా. క‌చ్చితంగా ఈ మూడు పాత్ర‌లూ నాకు మంచి పేరు తీసుకొస్తాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. పేరే కాదు.. మ‌రో మూడేళ్ల‌కు స‌రిప‌డా అవ‌కాశాలూ అందిస్తాయి. ఈ యేడాది నుంచి నా ఫేట్ పూర్తిగా మార‌బోతోంది..

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌...
- థ్యాంక్యూ.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు