Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

మ్యను చూడగానే అలర్టయ్యారు అక్కడి కుర్రాళ్ళు. ఎవడినో వెంటతీసుకొచ్చిందని చూపులతోనే సైగ చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరుగా లేచినిలబడ్డారు.

కొందరు సిగరెట్టు దమ్ముకొడుతూ, కొందరు టీలు తాగుతూ కోర చూపులు చూస్తున్నారు. గడ్డం పెరిగి జుత్తు వెనక్కి దువ్విన నల్లషర్టు వాడు పక్కవాడి భుజంమీద మోచేయి అన్చి నిలబడి వస్తూన్న త్రివిక్రమ్‌ని ఎగాదిగా చూస్తూ చిన్నగా నవ్వాడు.

''ఏమిట్రా, వాడయిపోయాడు. ఇప్పుడు వీడెవడ్నో తీసుకొచ్చింది యిది. ఎవడయి వుంటాడ్రా?'' అంటూ కామెంట్‌ చేసాడు.

''బహుషా పక్కింటి బాయ్‌ ఫ్రెండేమోరా....'' అంటూ బదులిచ్చాడు పక్కవాడు. అదేదో పెద్ద జోక్‌లా ఫెళ్ళున నవ్వారంతా.

త్రివిక్రమ్‌ వాళ్ళ కామెంట్స్‌ని కొంచెంకూడా పట్టించుకోలేదు. అతడి ఫోర్స్‌ చూసి తమవైపే వస్తున్నాడనుకుని గుప్పిళ్ళు బిగించారంతా, అయితే కన్నెత్తికూడా వాళ్ళవంక చూళ్ళేదు త్రివిక్రమ్‌. లోన చిన్న టేబుల్‌ వెనక ఛెయిర్‌లో కూర్చున్నాడో పెద్దమనిషి. టీ మాష్టరు ఒకడు బంకుదగ్గర నిలబడి టీలు చేస్తున్నాడు. మరొకడు సప్లయ్‌చేస్తున్నాడు. పనివాడు మరొకడున్నాడు. పోకిరి కుర్రాళ్ళుగాక కొందరు కస్టమర్లు కూడా వున్నారక్కడ.

సరాసరి వెళ్ళి టేబుల్‌మీద చేతులాన్చి సూటిగా ఆ పెద్దమనిషి వంక చూసాడు త్రివిక్రమ్‌. ''ఎవరు? ఈ హోటల్‌ ఓనర్‌ ఎవరో తెలియాలి?'' అనడిగాడు. ''తెలిస్తే ఏం చేస్తావ్‌? ఏమిటి సంగతి? నేనే ఓనర్ని'' అంటూ తాపీగా బదులిచ్చాడతను.

''ఇక్కడ కొన్ని కుక్కలు నా చెల్లెల్ని అవమానించి, నా తమ్ముడిని కొట్టారు. దానికి నీ సమాధానం ఏమిటి?'' అడిగాడు.

ఓనర్‌ బదులు చెప్పేలోపలే అక్కడున్న కుర్రాళ్ళలో ఒకడు తొందరపడిపోయాడు. ''ఎవరు..... ఎవర్రా కుక్కలు?'' అంటూ పెద్దగా అరుస్తూ ముందుకొచ్చాడు.

చివ్వున వెనుతిరిగాడు త్రివిక్రమ్‌.

అంతే

వాడి ముఖం టపాకాయలా పేలింది.

దెబ్బకు చుక్కలు కన్పించి గావురుమని అరుస్తూ రెండు చేతులతో ముఖం కప్పుకుని కూలబడిపోయాడు. పైగా ''చంపేసాడు నాయనో. నా ముఖం పగిలిపోయింది'' అనరిచాడు.

''ఇవతల పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను. తొందరపడితేఎలా'' అని చివ్వున ఓనర్‌వైపు తిరిగాడు.

''చెప్పు నీ సమాధానం ఏమిటి?'' తన ప్రశ్నని రిపీట్‌ చేసాడు. ''ఏమిటీ..... నీ ఫోర్స్‌ చూసి భయపడతాననుకున్నావా? నాది హోటల్‌ వ్యాపారం. మిగిలిన విషయాలు నాకేమిటి సంబంధం? దమ్ముంటే వాళ్ళతో తేల్చుకో. నా సంగతి నీకు తెలియదు'' అంటూ వెటకారంగా నవ్వాడు.

అంతే.... త్రివిక్రమ్‌ గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. ''నా సంగతి నీకు తెలియదు. నీ హోటల్‌ ఇక్కడుంది గాబట్టి అడ్డమైనవాళ్ళుచేరి కాలేజీ అమ్మాయిల్ని అల్లరిచేస్తున్నారు. దీన్ని తగలబెడితే పీడ పోతుందికదూ. లేవరా.. నీ వెనకాల వచ్చే మగాడు ఎవడో చూస్తాను'' అంటూ చివ్వున ఆ పెద్దమనిషిని కూర్చీలోంచి లాగి ఎత్తికుదేసాడు బల్లమీద. నడుం విరిగిపోయినంత బాధతో గొళ్లున అరిచాడు వాడు. వాడు ఏమయ్యాడో కూడా చూడకుండా చివ్వున వెనుతిరిగి అక్కడే నిలబడున్న కుర్రాళ్ళని చూసాడు.

''రండి నా తమ్ముడ్ని కొట్టడంకాదురా. రండి మీరో, నేనో తేల్చుకుందాం కమాన్‌'' అంటూ ఎడా పెడా ఇద్దర్నికొట్టి నల్లచొక్కా వాడిమీదకు పోయాడు.

''ఏయ్‌.... నా గురించి తెలీదు. ఏమనుకుంటున్నావు....'' అంటూ దూసుకొచ్చాడు వాడు.

''ఏమిట్రా తెలిసేది  నా చెల్లెల్ని అల్లరిచేస్తే చూస్తూ వూరుకోడానికి గాజులు తొడిగించు కూర్చున్నాననుకున్నావా?'' అనరుస్తూనే ఎగిరి తన్నాడు వాడి గుండెలమీద, సుత్తితో బలంగా గుండెలమీద కొట్టినంత బాధతో పెద్దగా అరుస్తూ తలక్రిందులుగా పడిపోయాడు వాడు. తనని కమ్ముకొస్తున్న మిగిలిన వాళ్ళకి దొరక్కుండా, దొరికినవాడ్ని దొరికినట్టు విరగదీసాడు. ఒక కుర్చీని నేలకేసికొట్టి రెండుచేతుల్లోను రెండు కర్రలు పట్టుకుని విజృంభించాడు.

ఒక్కసారిగా చెలరేగింది అక్కడ కలకలం.

హోటల్‌ ఓనర్‌ లేచి బయటికొస్తూ కేకలేస్తున్నాడు. పనివాళ్ళు త్రివిక్రమ్‌కి అడ్డంపడాలని చూసారు. నల్లచొక్కా వాడితోసహా కుర్రాళ్ళు అతన్ని పడగొట్టాలని చూసారు.

ఆ క్షణంలో త్రివిక్రమ్‌ త్రినేత్రుడే అయ్యాడు. ఒక్కొక్కడి నడుం విరగదీసాడు. కుర్చీలు, బల్లలు విరిగాయి. అంతలోనే హోటల్‌ షెడ్డుకి నిప్పంటుకుంది.

ఈ లోపల బయట గొడవ కాలేజీలోకి తెలిసిపోయింది. క్లాసులు వదిలి స్టూడెంట్స్‌అంతా బయటకొచ్చేసారు. దొరికిన అవకాశాన్ని వాళ్ళు వదులుకోలేదు. ఇంతకాలం రోజూ తమని ఏడిపిస్తున్న పోకిరి కుర్రాళ్ళమీద కడుపు మంటతో వున్నారు అమ్మాయిలు. దొరికినవాడ్ని దొరికినట్లు తాటతీసారు. నల్లచొక్కావాడ్ని మరీ దారుణంగా కొట్టారు.

ఎలాగో తన్నులుతిని, పోకిరి కుర్రాళ్ళు గుంపులోంచి తప్పించుకుని పారిపోగలిగారు. కాని హోటల్‌ ఓనరు తన హోటల్‌ తగులబడుతున్నందుకు అగ్గిమీద గుగ్గిలం అయిపోతూ పోలీసుల్ని పిలిపించాడు. పోలీసుల ఎదురుగానే అమ్మాయిలు వాడ్ని చితకగొట్టారు.

ప్రిన్సిపాల్‌తోసహా అంతా త్రివిక్రమ్‌కి సపోర్టు వచ్చారు. ఇక మీదట కాలేజీ పరిసరాల్లో హోటల్‌ ఏదీ ఉండకూడదని, ఎవరన్నా పెట్టాలని చూస్తే తగలబెడతామని స్టూడెంట్సు వార్నింగిచ్చారు.

ఈ గొడవ మధ్యలోనే....

తాపీగా సిగరెట్‌ దమ్ముకొడుతూ చెల్లెలు రమ్య వద్దకొచ్చాడు త్రివిక్రమ్‌. అప్పటికే ఆటోలో అక్కడికి చేరుకుని రమ్య పక్కన నిలబడున్నాడు చక్రధర్‌. ప్రతీకారం తీసుకోవడమేకాదు. ఇక ఆ పరిసరాల్లో పోకిరికుర్రాళ్ళ బెడద తప్పినందుకు అంతా సంతోషించారు. చక్రధర్‌ త్రివిక్రమ్‌ని కౌగిలించుకున్నాడు.

''సారీ అన్నయ్యా..... డాడీ చదువుతప్ప మనిషికి ఇంకేమీ అక్కరలేదంటారు. చదువుతోబాటు నేర్చుకోవలసింది చాలా వుందని నిన్నుచూసాక అర్థమవుతోంది. నీ ధైర్యంలో పదోవంతు నాకున్నా ఆ వెధవల్ని ఇందాకే నేను కుక్కల్ని కొట్టినట్టు కొట్టేవాడ్ని'' అన్నాడు.

''అదే పొరబాటు తమ్ముడూ. ధైర్యం వుంటే చాలదు దమ్ము కూడా వుండాలి. నేను రోజూ కరాటే క్లాస్‌లకు వెళ్ళటానిక్కారణం ఇదే. ఇలాంటప్పుడు ఉపయోగపడుతుంది ఇవాళ్టికి కాలేజీ వద్దులే. మీ ఇద్దరూ ఇంటికి పదండి నేను తర్వాత వస్తాను'' అన్నాడు.

''నువ్వు కూడా వచ్చేయ్‌ అన్నయ్యా. మమ్మీ గొడవచేస్తుంది'' అంది రమ్య. ఆమె ముఖంలో ఇప్పుడు సంతోషం.

''వస్తానంటున్నాగా, మీరు పదండి...'' అంటూ బైక్‌ మీద ఇద్దర్నీ ఇంటికి పంపించేసి, తను స్నేహితుల కోసం ఆటోలో బయలుదేరాడు త్రివిక్రమ్‌.

***

సాయంకాలం అయిదుగంటలు.

త్రివిక్రమ్‌తోబాటు మిత్రబృందమంతా పార్కులో సెటిలయి కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రతిరోజూ సాయంత్రాల్లో వుండే సందడే ఇప్పుడూ పార్కులోవుంది. పార్కు కలర్‌ఫుల్‌గా, ఆహ్లాదంగా వుంది.

''ఒరే త్రివిక్రమ్‌! ప్లీజ్‌రా...... ఓ సిగరెట్‌ ఇవ్వరా....'' అడిగాడు శివా.

''అవున్రా, నాకో సిగరెట్‌రా'' అంటూ చైతన్య అడిగాడు.

''నా దగ్గర సిగరెట్లు లేవు. ఇవ్వను'' అన్నాడు త్రివిక్రమ్‌.

''ప్లీజ్‌రా....''

''ఓ కే.... అంతగా అడుగుతున్నారు గాబట్టి యిస్తాను. నాతో చిన్న పందెం వేయండి. మీరు నెగ్గితే తలో సిగరెట్‌ పాకెట్‌, నేను నెగ్గితే ఒక్కపాకెట్‌ కొనివ్వండిచాలు.''

''ఏడ్చినట్లుంది. ఇప్పుడు ఓడినా, నెగ్గినా ఇచ్చుకోడానికి మా దగ్గర పైసల్లేవు బాబూ! అంత వుంటే నిన్ను అడుక్కోవటం దేనికి'' అన్నాడు శివా. చైతన్య మాత్రం రోషంగా చూశాడు.

''ఏరా త్రివిక్రమ్‌! నువ్వు చాలా తెలివైనవాడివి. నీతో పందెంకాచి ఎవరూ నెగ్గలేరు. అంతేగదా? అనడిగాడు.

''అదే తప్పు. నేనే తెలివైనవాడ్నని నేను చెప్పలేదు. మీరు అనుకుంటున్నారు అంతే. నాకన్నా తెలివైనవాళ్ళు, నీకన్నా తెలివితక్కువ దద్దమ్మలు లోకంలో చాలామంది వున్నారు'' అంటూ నవ్వేసాడు త్రివిక్రమ్‌, చుట్టూ ఫ్రెండ్స్‌ కూడా నవ్వారు. అయినా ఫీలవలేదు చైతన్య.

''ఓకేరా! నేను దద్దమ్మనే. నీ టాలెంట్‌కి నేనో పరీక్ష పెడతాను'' అన్నాడు.

''నేను రెడీ, బెట్‌ ఎంతో చెప్పు''

''వెయ్యి రూపాయలు, ఎవరు ఓడినా ఎల్లుండి  ఇదే టైంకి డబ్బుతెచ్చివ్వాలి ఇప్పటికిప్పుడు మనదగ్గర డబ్బుల్లేవుగా''.

''ఓకే! పందెం ఏమిటో చెప్పు?!

''అటుచూడు. అక్కడ వేపచెట్టుకింద గ్రీన్‌ కలర్‌ చుడిదార్‌లో ఓ అమ్మాయి కూర్చునుంది. ఆ అమ్మాయి నీకు తెలుసా?''

''మన కాలనీలో రెండు మూడుసార్లు చూసాను. అయితే?''

''మన కాలనీయే. నేను రోజూ చూస్తూనే వుంటాను. పిల్ల అందంగా వుంది కదూ?''

''వెధవకామెంట్లు వద్దు. విషయానికిరా.''

''ఓర్ని..... అమ్మాయిలంటే ఇంత అలర్జీ ఏమిట్రా వీడికి....ఓకే... ఓకే.... ఆ పిల్ల పేరు అలేఖ్య డిగ్రీపాసయి ప్రస్తుతం ఇంట్లోనేవుంటోంది. ఇంకా పెళ్ళికాలేదు. అలేఖ్యను పడగొట్టాలని  చాలామంది కుర్రాళ్ళు ట్రైచేసి ఫెలయ్యారు.''

''అయితే నన్నేం చేయమంటావ్‌?''

''అలేఖ్యతో రెండు నిమిషాలు మాట్లాడగలిగితే చాలు''

''ఓకే. మీరిక్కడే వుండండి. నేను వెళ్లి ఆమెతో అక్కడ కూర్చుని అరగంట కబుర్లు చెప్పుకుని వస్తాను. కాని.......పందెం వెయ్యి కాదు. రెండువేలు. ఓకే?''

''అయ్యబాబోయ్‌! అంత నావల్లకాదు. వెయ్యికే ఫిక్సయిపోదాం'' రిక్వెస్ట్‌ చేసాడు చైతన్య.    ''ఆ పిల్లసంగతి నాకూ తెలుసు. అలేఖ్యతో వీడు అరగంట కాదుగదా అయిదు నిముషాలు కూడా మాట్లడలేడు. రెండో వెయ్యి నేను బెట్‌ కాస్తాను బెస్టాఫ్‌లక్‌. ఇవాళ నువ్వు ఓడిపోవడం ఖాయంరా త్రివిక్రమ్‌. ట్రై యువర్‌ లక్‌'' అన్నాడు శివా.

''థాంక్యూ....'' అంటూ లేచి ఆ అమ్మాయి కూర్చున్న చెట్టువేపు అడుగులేసాడు త్రివిక్రమ్‌.

అలేఖ్య చాలా అందమైన అమ్మాయి.

వేపచెట్టుకింద సిమెంట్‌ బెంచిమీద రిలాక్స్‌గా కూర్చుని వాక్‌మెన్‌లో పాటలు వింటూ, తన ధ్యాసలో మునిగివుంది. దూరంగా వున్న కుర్రాళ్ళ మధ్య తన గురించి జరిగిన చర్చగాని, వాళ్ళ పందెం గురించి గాని ఆమెకు తెలీదు. ఇంకా చెప్పాలంగే, త్రివిక్రమ్‌ గురించి అసలేతెలీదు. కాని అతడ్ని రెండు మూడుసార్లు చూసింది ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడని తెలుసు.

త్రివిక్రమ్‌ ఆమెకోసమే వస్తున్నట్టుగాకుండా ఏదో పనిమీద ఆమె ముందునుంచి పోతున్నట్టు పోతూ ఆగి ఆమెవంక చూసాడు. ఆమె కూడా అతడ్ని చూసింది.

''హలో మిస్‌...మీరు నిర్మల్‌ సిస్టర్‌ కదూ?'' అనడిగాడు.

ఆమెకు అర్ధం కాలేదు.

చెవుల్లో ఇయర్‌ ఫోన్స్‌ వున్నాయి.

అతడు తనను పలకరించటం గమనించి, ముఖం మాడ్చుకుంటూ ఇయర్‌ ఫోన్స్‌ తీసి చూసింది. ''ఏమిటి?'' అంది.

''మీరు నిర్మల్‌ సిస్టర్‌ కదూ?'' తన ప్రశ్నను రిపీట్‌ చేసాడు.

''అవును.... అయితే?''

''అయితే ఏమిటండి.... ఈ మధ్య వాడలా తయారవుతున్నాడేమిటి? మీరు వాడి గురించి అస్సలు పట్టించుకోవటం లేదా...? ఓ.కే. మీరేదో కోపంలో వున్నారు. నాకెందుకులెండి.. వస్తాను'' అంటూ పోబోయాడు. ''ఆగండాగండి'' అంది వెంటనే ఆమె.

నిర్మల్‌ ఆమె తమ్ముడు.

వాడికి ఇప్పుడు పదిహేనేళ్ళు.

వాడు త్రివిక్రమ్‌కి తెలుసు. ఆమెతో పరిచయం పెట్టుకోవడానికి వాడి పేరు ఉపయోగించుకున్నాడు త్రివిక్రమ్‌. ఎవరయినాసరే తమ ఆప్తులకు సంబంధించి ఏదన్నా సమాచారం వుందంటే అది తెలుసుకోడానికి ఇంట్రస్ట్‌ చూపిస్తారు. ఇది సహజంగా మనిషిలో వుండే వీక్‌పాయింట్‌. ఆ పాయింట్‌ మీదే దెబ్బకోట్టాడు త్రివిక్రమ్‌.

అది వర్కవుటయింది.

''వద్దులెండి, వెళతాను'' అన్నాడుగానీ కదల్లేదతను.

ఆమె వాక్‌మేన్‌ ఆఫ్‌చేసి పక్కన పడేసింది.

''వెళ్ళిపోతే ఎలా? ఏమైంది. మా తమ్ముడు ఏం చేసాడు?'' అడిగింది.

''అలా అడిగారు బాగుంది... ఇది బాధ్యత తెలిసినవాళ్ళు అడిగే మాట. ఎక్స్యూజ్‌మి. ఇలా కూర్చుని చెప్పొచ్చా?'' ఆమె సమాధానంకోసం చూడకుండానే బెంచీమీద కూర్చున్నాడు.

''నిర్మల్‌ చాలా మంచి కుర్రాడు. స్కూలుకి సక్రమంగా వెళుతున్నాడో లేదో నాకు తెలియదుగానీ, గుడివెనకాల కుర్రాళ్ళతో గోళీలు ఆడుతూ రెండు మూడుసార్లు కన్పించాడు. నేను తిట్టి పంపించాను. మీ అక్కని చూసి నేర్చుకోరా. అంత చక్కని అమ్మాయికి ఇలాంటి తమ్ముడివేమిట్రా! చదవరా వెళ్ళు, అని బుద్ధిచెప్పి పంపించాను. అప్పట్నుంచి వాడు గుడిపక్కన కన్పించటంలేదు.'' అంటూ చిన్న కథ విన్పించాడు.

''అలాగా....! ఇంతకీ మీరు గుడిదగ్గరకి ఎందుకెళ్ళారు?'' డౌట్‌పుల్‌గా చూస్తూ అడిగిందామె.

''మీరు నాస్తికులా?'' వెంటనే అడిగాడు త్రివిక్రమ్‌.

ఆమె ఫక్కున నవ్వింది.

''ఎందుకొచ్చిందా డౌట్‌?'' అంది నవ్వుతూనే.

''లేకపోతే ఏమిటండీ! గుడి, బడి ఎంతో పవిత్రమైనవి గదా! గుడికెందుకు వెళతాం... దైవదర్శనం కోసం.''

''బాగుంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు?''

''అదే అర్థంగావటంలేదండి. ఏం చేయాలాని ఆలోచిస్తున్నాను.''

''ఆలోచిస్తున్నారా...'' అంటూ ఆపుకోలేక ఈసారి పెద్దగానే నవ్వేసిందామె.

వాళ్ళిద్దరూ అంత సింపుల్‌గా, సరదాగా మాట్లాడుకోవటం దూరం నుంచి గమనిస్తున్న మిత్రబృందం ముఖాలు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. పలకరిస్తేనే చిరుబురులాడే అలేఖ్య వీడితో అంత చనువుగా ఎలా మాట్లాడుతుందో, ఆ కిటుకేమిటో బుర్రలు చించుకున్నా అర్ధం కావటంలేదు వాళ్ళకు.

''అరే చైతన్యా! ఆయిపోయాంరా... ఎల్లుండికి మనం డబ్బు రెడీ చేసుకోవాల్సిందే! వీడసాధ్యుడు'' అన్నాడు శివా.

ఈలోపల -

త్రివిక్రమ్‌ ఆమెతో సరదాగా మాట్లాడేస్తున్నాడు.

అతడి జోకులకి ఆమె నవ్వుతూనే వుంది.

''అవును మిష్టర్‌ త్రివిక్రమ్‌....! మీరెప్పుడూ సీరియస్‌గా వెళ్ళిపోడం చూస్తుంటాను. మీలో ఇంతగా సెన్స్‌ఆఫ్‌హ్యూమర్‌ వుందని నాకు తెలీదు. మీతో కాసేపు మాట్లాడితే టైం తెలీదు...'' అంది నవ్వు ఆపుకుంటూ.

''నాదేముందిలెండి. మీరు చాలా ఇంటెలిజంట్‌ అని, జనరల్‌ నాలెడ్జ్‌లో ఫస్ట్‌ అని విన్నాను. అందానికి తగ్గ తెలివితేటలు అందరి ఆడపిల్లలకూ ఉండవు.''

''థ్యాంక్యూ!''

''నా జనరల్‌నాలెడ్జ్‌ని మీచేత పరీక్షించుకోవాలనుకుంటున్నాను ఏదన్నా ఒక ప్రశ్న అడగండి. ఊరికేకాదులే, నేను ఓడిపోతే ఏభై ఇస్తాను. మీరు ఓడిపోతే ఏమీ ఇవ్వక్కర్లేదు.''

''అలావద్దు... పందెం అన్నాక మినహాయింపులు వుండకూడదు. ఏభై ఇస్తాను.''

''అయితే ఓ.కె. అడగండి.''

క్షణం ఆలోచించింది అలేఖ్య.

''ఏం అడగమంటారు?'' అంది.

''మీ ఇష్టం మేడం... ఏ సబ్జక్టయినా, ఏ జనరల్‌ క్వశ్చనయినా, సంథింగ్ మీ యిష్టం.''

''ఓ.కే. జనరల్‌గానే అడుగుతాను కాలంగాని కాలంలో కారు. ఆ కారు వచ్చిందంటే బేజారై అంతా పరుగులెత్తాల్సిందే! అదేం కారు?''

''వానకారు... యామై రైట్‌?''

''నేను ఓడిపోయాను'' అంటూ తన వేనిటీబేగ్‌లోంచి ఏభై కాగితం తీసిచ్చింది అలేఖ్య.

''ఓ.కే.... ఇప్పుడు మరోప్రశ్న అడగండి. మీ ఏభైకి ఏభై కలుపుతున్నాను వంద పందెం. చాలా కష్టమైయినది  అడగండి ఛాయిస్‌ మీది. నెగ్గితే మీకు నూటఏభై ప్రాఫిట్‌! ఎందుకంటే నేను ఓడితే మీకు రెండువందలు ఇస్తాను మీరు ఓడితే నాకు వంద ఇవ్వండి చాలు ఓ.కె.... అడగండి.''

పది సెకన్లు ఆలోచించుకుంది అలేఖ్య.

''నేను అడగటంకాదు, మీరు నన్నడిగి, నాచేత అవును అనిపించండి. నేను ఓడినట్టే. మీకు మూడు ప్రశ్నలకి ఛాన్స్‌ ఇస్తాను అడగండి'' అంది.

కొంచెం కూడా తడబడకుండా ''ఓ.కె'' అన్నాడు త్రివిక్రమ్‌.

''మీ పేరు అలేఖ్య కాదా?'' సింపుల్‌గా అడిగాడు.

''కాదు... నా పేరు పింకీ. ఇంట్లో అంతా అలాగే పిలుస్తారు'' చెప్పింది నవ్వుతూ.

''మీది మా పక్కిల్లు కాదు. అవునా?''

''కానేకాదు, మీ పక్కిల్లు మాది కాదు. మిష్టర్‌ త్రివిక్రమ్‌! ఓడి పోతున్నారు. లాస్ట్‌ క్వశ్చన్‌ అడగండి'' అంది ఉత్సాహంగా అలేఖ్య.

''మీ మమ్మీ గొడ్రాలు కాదు. మీరు మీ మమ్మీకే పుట్టారు. అవునా?''

అలేఖ్య ముఖంలో ఒకటే షాక్‌! కాదు అని చెప్పలేని ప్రశ్న.

అతడు తనని కార్నర్‌ చేసిన పద్దతి ఆమెను ఎంతో షాక్‌కి గురిచేసింది.

మొదటి రెండు ప్రశ్నలు సాదాసీదాగా అడిగి చివరిప్రశ్నతో కట్టేసాడు. తను ఈసారి కూడా ఓడిపోయింది.

''కాదంటారా?'' కొంటెగా అతను అడుగుతుంటే.

అందంగా నవ్వింది.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass