Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
o college drop out gadi prema katha

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

కిట్టుకి ఈ కళాశాల అంతా అయోమయంగా ఉంది. అంతా కొత్తగా ఉంది.

అందరూ ఒకళ్లనొకళ్ళు అండీ... అండీ అని పిలుచుకుంటున్నారు...

కిట్టుకి ఏరా... ఒరేయ్... అని పిలుచుకునే స్నేహితులు ఉన్నారు కానీ...

కొత్తగా ఇదేంటి...?

ఫ్రెండ్స్ అనేవాళ్లు లేరు... ఒంటరితనం...

అన్నింటికంటే బాంబుపేలుడు లాగా భయపెట్టే విషయం ఏమిటంటే... బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి ఉంది. తెలుగు మీడియం తీసుకుందామనుకుంటే, కిట్టు నాన్నగారు ఏమన్నారంటే... 'ఇంగ్లీష్ మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఏం ఫర్వాలేదు. పోనుపోను నువ్వే నేర్చుకుంటావు.'

ఇక సబ్జెక్టుల విషయానికొస్తే...

తెలుగు సబ్జెక్టు ఫర్వాలేదు... ఇంగ్లీష్ సబ్జెక్టు ఒకమాదిరిగా ఓకే...

ఫిజిక్స్ అనగానే భౌతికశాస్త్రం... పెద్ద గజిబిజి... ఈ 'వెర్నియర్ కాలిపర్స్' ఏమిటి? ఎందుకది? దీంతో ఏం చేయాలి? అర్ధం కాని ప్రశ్నలివన్నీ... 'స్క్రూగేజీ' ఇంకోటి... దీని కథ ఏమీ అర్ధమై చావడంలేదు.

మాస్టారు ఇంగ్లీష్ లో గడగడా చెప్పేసి, 'నేను చెప్పినట్టు చెయ్యండి' అంటున్నారు...

వెర్రిముఖం వేసుకున్న కిట్టుని చూసి... ఇదిగో ఇదిలా చెయ్యాలి... అని మళ్లీ చెప్పేవారు...

మళ్లీ కిట్టుది అదే ముఖం. ఇంక నీకు చెప్పడం నావల్ల కాదు అనేభావం మాస్టార్లకి వచ్చేసింది...

ఇదంతా ప్రాక్టికల్స్ కథ...

క్లాస్ రూంలో...

ఈ 'న్యూటన్' గాడెవ్వడు? 'బోరు' గాడెవ్వడు? అణువు అనేది ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? మళ్లీ ఈ అణువు చుట్టూ ఎలక్ట్రాన్ లేంటి? న్యూట్రాన్ లు ఏంటి? అసలు వీటిని ఎవడైనా చూసాడా? ఎక్కడ ఉంటాయి? తల గోడకేసి కొట్టుకున్నా అసలు ఏమీ అర్ధమై చావడంలేదు. ఇంకో దరిద్రమేమిటంటే ఈ భౌతికశాస్త్రంలో లెక్కలు చేసి చావాలి. తప్పించుకోలేము.

ఇక, జంతుశాస్త్రం... జువాలజీ...

మాస్టారు కప్పని కోసి చూపించారు.

ఇదీ రక్తప్రసరణ వ్యవస్థ... మీరు కూడా కప్పని కోసి, రక్త ప్రసరణ వ్యవస్థని చూపించాలి. నరాలు ఇలా కనబడాలి.

ఆ నరాలు క్లియర్ గా కనబడాలంటే, వాటికింద నల్లని కాగితం పెట్టాలి.

నానా తిప్పలు పడి, కప్పని కోసి పారేశాడు కిట్టు. నల్లకాగితం కూడా పెట్టేశాడు. గర్వంగా తీసుకువెళ్లి మాస్టారికి చూపించాడు. దాన్ని చూసి మాస్టారు అయోమయంలోకి వెళ్లిపోయారు. అయోమయం నుండి తేరుకుని అడిగారు.

కప్ప గుండెకాయ ఏది?

అడ్డంగా ఉందని కోసి పక్కన పడేశాను సార్ అన్నాడు కిట్టు.

మాస్టారు తల పట్టుకున్నాడు.

ఏమిటీ? గుండెకాయ పీకేసి, రక్తప్రసరణ వ్యవస్థని చూపిస్తున్నావా? పైగా నరాల కింద నల్ల కాగితం కూడా పెట్టేసావా? బుద్ధుందా నీకు? గుండె లేకుండా రక్తప్రసరణ ఎక్కడుంది? నరాలెలా కనబడతాయి నీకు...? అని చివాట్లు పెట్టారు మాస్టారు....

కొబ్బరికాయ బొమ్మవేసి, దాని నెత్తిమీద ఇంగ్లీష్ అక్షరం వి షేపులో ఆంటెన్నా పెట్టి... దీన్ని "క్లామిడోమొనాస్" అనాలి. అంటారు. ఇదెక్కడుంటుంది? ఎవరికి కనబడుతుంది? ఈ విచిత్రమైన పేర్లేంటి? నోరు తిరగని పేర్లేంటి? లాటిన భాష నుండి, గ్రీకు భాష నుండి తెచ్చిపెట్టిన పేర్లంట... మనిషికైతే ఒక ఇంటిపేరు, తర్వాత వాడి పేరు ఉంటాయి. ఈ బోటనీలోనూ (వృక్షశాస్త్రం), జువాలజీలోనూ(జంతుశాస్త్రం) ఉండే జీవాలకు ఒక్కపేరు కాదు... వంద పేర్లుంటాయి... అవి కూడా కష్టమైనవి... వాటి ఇంటిపేర్లు....

జీనస్... దానికో పేరు...
స్పెషీస్... దానికో పేరు...
ఫ్యామిలీ...
కింగ్ డమ్...
ఫైలమ్...
క్లాస్...
ఆర్డర్...

ఈ ఇంటిపేర్లనీ, వాటికి అనుసంధానమైన అన్నిపేర్లనీ గుర్తించుకోవాలి. మళ్లీ ఈ జీవాల్ని రంగు రంగుల్లో బొమ్మలు గీయాలి. వాటి గురించి వివరంగా రాయాలి. బోటనీ, జువాలజీలే కాక, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా ఇలా బొమ్మలు, వివరాలతో ఒక రికార్డు తయారు చేయాలి. బొమ్మలు సరిలేకపోయినా. సకాలంలో మాస్టారికి చూపించకపోయినా... ఆ రికార్డును ముఖం మీదకు విసిరికొడతారు మాస్టారు...

ఇక బోటనీ... వృక్షశాస్త్రం...

ఆకులు తీస్తారు, కోస్తారు... 'ఎల్లెస్' అంటారు, 'టియ్యస్' అంటారు. ఏమీ అర్ధం కావడం లేదు. 'మైక్రోస్కోప్' లో చూడమంటారు... అందులో ఏం పెట్టారో తెలీదు... ఏం చూసాం...? ఏం కనబడుతుంది...?

బంగాళాదుంపలు (ఆలుగడ్డలు) ఒకదానిమీద ఒకటి పేర్చినట్టు కనబడుతుంది...

దాన్ని "పేరంఖైమా" అనాలంటారు...

మటన్ ఖైమా లాగా పేరంఖైమా ఏంటి? ఈ మొక్కలకి కూడా వంద ఇంటిపేర్లు...

ఎన్నని గుర్తించుకోవాలి?

ఇంకొకటి... రసాయన శాస్త్రం... కెమిస్ట్రీ...

నూట ఎనిమిది పైగా పదార్ధాలున్నాయంట. అవన్నీ వస్తే మంచిదట... వాటికి షార్ట్ కట్ పేర్లుంటాయి.

... అవి కూడా బట్టీ కొట్టుకోవాలి. ఆ తర్వాత ఈక్వేషన్లు, ఏదో పదార్ధాన్ని ఇంకో పదార్ధంతో కలిపి ఈక్వేషన్లు తయారు చేస్తారు... మళ్లీ ఈ ఈక్వేషన్ని తక్కెట్లో రాళ్ళేసి, మళ్లీ తీసినట్లు... కూరగాయలు తక్కెట్లో వేసి మళ్లీ తీసినట్లు, వేసి, తీసి ఇరువైపులా సమానం చేయాలి.

ఎన్ని బాధలురా నాయనా...

కార్బన్ కెమిస్ట్రీ... ఇదంటే అందరికీ భయమే... కిట్టు అదృష్టవశాత్తూ అది కంపల్సరీ కాదు....

పిప్పెట్టు... బ్యూరెట్టు... పిప్పెట్టు అనేది గాజుకుప్పె... బ్యూరెట్టు అనేది పైపులాంటిది...

ఈ రెండూ ఉపయోగిస్తూ రకరకాల రంగుల ద్రావకాలు కలపాలి.

ఆ... ఏదో ఒకటి లే అనుకుని, తనకిష్టమైన ద్రావకాన్ని కలిపి, బుస్సుమని వచ్చే పొగలు, శబ్దాలు, చూస్తూ, వింటూ, ఆనందించేవాడు కిట్టు... ఒకసారి ఆ రంగు రంగుల ద్రావకాలు, ఒకదానితో ఒకటి సరిపడక, గాజుకుప్పె భళ్లున పగిలిపోయింది.

అటెండర్ కనిపెట్టి, వెళ్లి మాస్టారికి చెప్పేలోపే కిట్టు చల్లగా అక్కడనుండి జారుకున్నాడు.

***

ఈ బాధల్లో కొట్టుకెళ్లిపోతున్న కిట్టుకి ఒకరోజు 'కాళి'గాడు తారసపడ్డాడు కాలేజిలో.

ఈ కాళిగాడు, కిట్టుకి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు క్లాస్ మేట్.

హైస్కూలు లో ఇద్దరూ ఎక్కువగా కలిసింది లేదు. ఎవరిలోకంలో వాళ్ళుండేవారు.

కాళీని పలకరించాడు కిట్టు.

ఇద్దరం ఒకటే క్లాస్... కానీ కలుసుకోలేదు మనం. అనుకుంటూ ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.

మాటల్లో... మాటల్లో... కాళిగాడు కిట్టుని ఏమండి, ఏమిటండీ... అంటున్నాడు...

ఏమండి,ఏంటండీ?... ఏంట్రా... మామూలుగా మాట్లాడరా... అన్నాడు కిట్టు...

అంటే... మనం కాలేజి కి వచ్చాం కదా... అందుకని అన్నాడు కాళి.

'కాలేజి' లేదు, 'కాకరకాయ' లేదు...

కావాలంటే నువ్వు ఏమండీ... అను, నేను మాత్రం నిన్ను ఏరా... ఒరేయ్, అనే అంటాను అన్నాడు కిట్టు.

ఇక అప్పట్నుండీ వీళ్ళిద్దరూ ఒకరి బాధలు ఇంకొకరికి చెప్పుకుంటూ, కలిసి తిరగడం మొదలుపెట్టారు. కాళీ కూడా చిన్నప్పట్నుండి తెలుగు మీడియం... ఇప్పుడేమో అన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఎలా గట్టెక్కాలి ఇద్దరిదీ అదే బాధ...

ఎప్పుడైనా కష్టమనిపించే క్లాసు ఉన్నా... లేదా ఈ క్లాస్ లో తిట్లు తినడం ఖాయం అనిపించినా... ఇద్దరూ కలిసి క్లాస్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్లిపోయేవాళ్లు...

కాళీ హాస్టల్ రూమ్ లో నలుగురు ఉండేవారు.

ఆ నలుగురిలో ఒకడు భాస్కర్, ఈ భాస్కర్ గాడు ఎంపీసీ గ్రూపు. ఎప్పుడు చూసినా చదువుతుండేవాడు...

రాత్రి సెకండ్ షో సినిమా చూసి, రూముకు వస్తే, మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతున్నా కానీ, భాస్కర్ మాత్రం మెలకువగా ఉండి పుస్తకంతో కనబడతారు.

కిట్టుని, కాళీని చూసి, వెధవల్లాగా సెకండ్ షో సినిమాలకి తిరగకుండా, శుభ్రంగా చదువుకోవచ్చు కదా అని తిట్టేవాడు భాస్కర్...

"వీడికెప్పుడూ చదువు తప్ప ఇంకేమీ పట్టదు. లెక్కల్లో నూటయాభైకి రెండు మార్కులు తక్కువొస్తే, ఆ రెండు మార్కుల కోసం మళ్లీ బెటర్ మెంట్ కట్టి, రాసి ఆ రెండు మార్కులు తిరిగి తెచ్చుకున్నాడు వీడు. "వీడో పెద్ద పూల్ అనుకుని నవ్వుకునేవారు కిట్టు, కాళి.

***

రెస్ట్ హౌస్ రోడ్...

రాష్ట్ర గవర్నర్ గారు ఎప్పుడైనా వస్తే ఉండడానికి... ఒక రెస్ట్ హౌస్ ఉంది, భీమవరంలో...

దానికి చేరుకోవడానికి వెళ్లే రోడ్డు రెస్ట్ హౌస్ రోడ్డు. ఈ రోడ్డు ఏరియాలో కిట్టువాళ్ల సొంత ఇల్లు ఒకటుంది. ఇక అదే ఏరియాలో చాలా ఇళ్లున్నాయి. ఒక రామాలయం ఉంది.
ఈ రెస్ట్ హౌస్ రోడ్ కుర్రవాళ్లకి "పెద్ద ముదుర్లు" అన్నపేరు ఉంది.

కిట్టు, రెస్ట్ హౌస్ రోడ్ లోని ఇంట్లో ఉంటూ, కాలేజీకి వెళ్లేవాడు. భోజనం హాస్టల్ లో...

రెస్ట్ హౌస్ రోడ్ కుర్రవాళ్ళు కొంతమంది కిట్టుకి ఫ్రెండ్స్ అయ్యారు. కొంతమంది డియ్యన్నార్ లోనూ... కొంతమంది కేజీయార్ కాలేజీలోనూ, మరికొంత మంది మూర్తిరాజు కాలేజిలోనూ. చదివేవాళ్లు ఈ కుర్రవాళ్లు అప్పుడప్పుడు గొడవలకి వెళ్లేవాళ్లు.

"గొడవ" అంటే... వీళ్ల గ్రూపుకి, ఇంకో గ్రూపుకి... యుద్ధం... కొట్లాట... కిట్టుకి కొట్లాటలోపాల్గొనేటంత బలంలేదు కాబట్టి, ఒక ప్రేక్షకుడిగా ఉండి ఆ యుద్ధాలను తిలకించేవాడు. ఇంకో విధమైన గొడవ ఏమిటంటే...

ఒరేయ్! వాడెవడో రోజూ ఫలానావాడి చెల్లెలి వెనకబడి, ఏడిపిస్తున్నాడంట...

నడవండి వెళ్లి వాణ్ణి వేసేద్దాం... అని ఈ కుర్ర గ్యాంగ్ అనుకోవడం... నలుగురైదుగురు ఒక్కసారిగా ఆ అమ్మాయిని ఏడిపించేవాడి చుట్టూ చేరి, పిడిగుద్దులు గుద్ది, వార్నింగ్ ఇచ్చేయడం, చకచకా జరిగిపోయేది.

అలాగని ఈ కుర్రగ్యాంగ్ తక్కువేమీ తినలేదు...

అమ్మాయిల మీద కామెంట్లు చెయ్యడంలో మహా ఎక్స్ పర్ట్ లు ఈ రెస్ట్ హౌస్ రోడ్ కుర్రవాళ్లు డాన్స్ చెయ్యడంలో మహా దిట్టలు. వీళ్ల డ్యాన్స్ స్టైల్ వెస్ట్రన్ (పాశ్చాత్య) శైలిలో ఉండేది. హిందీ పాటలు కూడా పెట్టి డ్యాన్స్ చేసేవారు. ఒక్కొక్కళ్ళదీ ఒక్కొక్క శైలి. ఒకళ్లకి భిన్నంగా ఇంకొకళ్ళు డ్యాన్స్ చేసేవారు.

కొంతమంది ఆర్కెస్ట్రాలో చేరి, భీమవరం పట్టణంలో స్టేజి మీద పాటలు పాడి, పేరు కూడా సంపాదించుకున్నారు. ఇలా విభిన్న రంగాల్లో ప్రవేశం, ప్రావీణ్యం ఉన్న రెస్ట్ హౌస్ రోడ్ యూత్ సాంగత్యంతో కిట్టు చాలా విషయాలు నేర్చుకున్నాడు.

ఈ యూత్ తో కలిసి ఒకోసారి రాత్రిపూట సెకండ్ షో సినిమాలకి వెళ్లేవాడు కిట్టు. అందరూ యూనిఫారంగా లుంగీలు కట్టుకుని వెళ్లేవారు.

మూన్ రేకర్, స్టార్ వార్స్... లాంటి సినిమాలు... నేల టిక్కెట్టు... నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్లడం. తిరిగి వస్తూ బీమా హొటల్ లో కానీ, వనితలో కానీ, టీ తాగడం, (వనిత టీ దుకాణం వంతెన మొదట్లో ఉండేది. తర్వాత ఎత్తేసారు). నెమ్మదిగా ఇంటికి చేరుకోవడం...

ఎప్పుడైనా కిట్టు వాళ్ళ నాన్నగారి కంట్లో పడేవారు. ఆయన స్ట్రాంగ్ గా డోసులు ఇచ్చేవారు.

'అర్ధరాత్రి, అపరాత్రి రోడ్లెంట తిరుగుతారేంట్రా... ఇలా రాత్రిళ్ళు రోడ్లంట తిరిగేది గూండాలూ, రౌడీలూ... దొంగలూ... ఇలాంటి వెధవ్వేషాలు వెయ్యద్దు... అని తిట్టేవారు.'

ఆయన చెప్పింది నిజమే.

ఇలా సెకండ్ షో నుండి వస్తున్న కిట్టు బృందాన్ని ఒకోసారి పోలీసులు ఆపేవారు.

'ఎవరు మీరు?' 'ఎక్కడకు వెళ్తున్నారు?' అని ప్రశ్నించేవారు.

'ఇలాంటిదేదో జరుగుతుందని ఈ బృందానికి తెలుసు... సినిమా టిక్కెట్టు ముక్కని పడవేయకుండా జేబులో పెట్టుకుని, అది తీసి పోలీసులకు చూపించేవారు.'

'సరే తొందరగా ఇళ్లకు పొండి' అనేవారు పోలీసులు.

ఒకోసారి ఈ కుర్రాళ్ళంతా కంబైన్డ్ స్టడీ అంటూ పరీక్షల సమయంలో మొదలుపెట్టేవారు.

రాత్రి 11 గంటల సమయంలో టీ కని బయలుదేరి, ఒకమూలగా ఉంచిన రిక్షాని నెమ్మదిగా బయటకు తీసేవారు. ఒకడు తొక్కుతుంటే మిగతావాళ్లు కూర్చునేవాళ్లు. వంతుల వారీగా రిక్షాని తొక్కుతూ... సరదాగా... టీ తాగి... వచ్చి రిక్షాని యధాతధంగా పెట్టేసేవారు.

***

కాలం ఎలా గడిచిందో తెలియదు. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి.

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి.

కిట్టు ఫెయిల్...

పాసయిన వాళ్లు డిగ్రీలో చేరుతున్నారు...

ఏదో పొరపాటు చేసిన భావనకలిగింది కిట్టుకి...

ఇప్పుడేం చెయ్యాలి...

ఖాళీగా ఇంట్లో ఉండాలా?

తప్పు చేసిన ఫీలింగ్...

ఫెయిలయినందుకు కిట్టుని చెడామడా తిట్టలేదు వాళ్ల నాన్నగారు...

ఫెయిలయ్యాడని తెలిసిన రోజునే సైకిలెక్కించుకుని బజారుకు తీసుకువెళ్లి, ఆల్విన్ వాచీ కొనిచ్చారు. థ్రిల్ అనే కోకాకోలా లా ఉండే కూల్ డ్రింక్ ఇప్పించారు. 'ఫెయిల్ అయినందుకు బాధపడడం కంటే. ఆ తర్వాత ఎలా పాస్ అవ్వాలో ఆలోచించి, దానికి తగిన కృషి చేయాలి' అని చెప్పారు.

కిట్టు ఆలోచనలో పడ్డాడు...

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekamber