Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugadu inter fail ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

ని వాళ్ళందరికీ ముందే వార్నింగ్ ఇచ్చాడు షాపు యజమాని. తెలిసినవాళ్ళు షాపుకొచ్చినా 'వ్యాపారం' వరకే పలకరింపులు. లేనిపోని ఊసులకు పోతే 'ఊస్టింగే' అని చాలా గట్టిగా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, అందరిదగ్గరా ఖాళీ తెల్లకాగితాల మీద సంతకాలు తీసుకున్నాడు. ఎవరూ... ఎలాంటి అల్లరి చేయకుండా ముందే కట్టుదిట్టమైన ఒప్పందం మీద షాపులో జాయిన్ చేసుకున్నాడతను.

ఏకాంబరం షాపులో నుండి బయటకు వచ్చి బైక్ మీద కూర్చున్నాడే గాని మనసు మనసులో లేదు. కనిపించక కనిపించిన తన కలల సుందరిని కళ్ళారా చూడలేకపోయాడు. మనసారా పలకరించలేకపోయాడు.

మనసు వికలమై ఏం చేయాలో తెలీక... ఏం చేయబుద్ధికాక నేరుగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. విశాఖపట్నం సీతమ్మపేట దగ్గరున్న ఇన్స్యూరెన్స్ కంపెనీకి వెళ్ళాడు ఏకాంబరం. పనిలో పెడితే మనసు దారికొస్తుందని వెళ్ళాడు.

***

ఆమర్నాడు మధ్యాహ్నం సరిగ్గా సిల్క్ హౌస్ మూసే సమయానికి వెళ్ళాడు ఏకాంబర్. అప్పటికే అందరూ తమతమ కేరియర్లు పట్టుకుని షాపు వెనుకే ఉన్న గోడౌన్ కేసి వెళ్తున్నారు.

ఏకాంబరాన్ని చూస్తూనే షాపు యజమాని తమ పని వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రూఫ్ లన్నీ ఏకాంబరం చేతికిచ్చాడు. దానితోపాటు ఆరుగురివి క్వార్టర్లీ వాయిదాల డబ్బు కూడా లెక్కకట్టి ఏకాంబరం చేతికిచ్చాడు.

"భయ్యా! నేను షాపు మూసేసి భోజనానికి వెళ్తున్నాను. ఈ సర్టిఫికెట్లు, ఫోటోలు సరిపోయాయి కదా! ఒకవేళ ఎవరిదన్నా తేడా వస్తే అందరూ గోడౌన్ లో భోజనాలు చేస్తుంటారు. వాళ్ళతో మాట్లాడు" అంటూ షాపు యజమాని షాపు తాళాలు వేసుకుని వెళ్ళిపోయాడు.

పనిలేకపోయినా షాపు వెనకే వున్న గోడౌన్ దగ్గరకు వెళ్ళాడు ఏకాంబరం. షాపులో పనిచేసే ఆడవాళ్ళతో మాట్లాడుతూ భోజనం చేస్తోంది నూకరత్నం.

ఏకాంబరాన్ని చూస్తూనే పనివాళ్ళంతా షాపు యజమానికి ఇచ్చినంత గౌరవం ఇస్తూ లేచి నిలబడ్డారు.

"మీ పాలసీల డబ్బు తీసుకున్నాను. అన్నీ సరిపోయాయి. మీకు తిరిగి నాలుగు గంటల వరకూ విశ్రాంతి కదా! ఇక్కడే  ఉంటారా?" నూకరత్నానికి వినపడేటట్టూ అన్నాడు ఏకాంబర్.

"ఏముంది సార్! భోజనాలయ్యాక అలా రోడ్డు మీద ఓ గంట తిరిగి వచ్చేసి తలో మూల సేద తీరుతాం" చెప్పాడు ఒకాయన.

"సార్! మీరు భోజనం చేసే వచ్చారా?" మరొకతను అడిగాడు.

"లేదు. ఈ చివర ఉన్న అమృతా విలాస్ హొటల్ లో భోజనం చేస్తాను. మూడు గంటల వరకూ అక్కడే ఉండాలి. దాడి అప్పారావు గారి షాపులో పాలసీ ప్రీమియమ్ తీసుకోవాలి. లంచవర్ కదా! వాళ్ళ షాపు కూడా మీకులాగే మూసేస్తారు కదా" అన్నాడు ఏకాంబరం. తన మాటలు అర్ధం చేసుకున్నదైతే తప్పకుండా తనని వెదుక్కుంటూ నూకరత్నం 'అమృత విలాస్' కి వస్తుందనుకున్నాడు ఏకాంబర్ .

వాళ్ళందరికీ అలా చెప్పి అక్కడ నుండి బయటపడి అమృతా విలాస్ కెళ్ళి కూర్చున్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ ఊహించినట్టే అరగంటలో అమృతా విలాస్ కు వచ్చింది నూకరత్నం. హొటల్  లోకి వస్తూనే ఏకాంబరాన్ని చూసి సిగ్గుపడి దూరంగానే నిలబడిపోయింది నూకరత్నం.

ఏకాంబరమే గబాలున లేచి వెళ్ళి నూకరత్నాన్ని పిలిచి మరీ పలకరించి ఇద్దరూ ఫేమిలీ రూంలోకి వెళ్ళి కూర్చున్నారు.

"చెప్పండి. నాతో ఏదో మాట్లాడాలనే కదా! ఇందాక అందరూ వినేలా ఇక్కడ ఉంటానన్నారు. నేను అర్ధం చేసుకోలేని దద్దమ్మని కాను" నెమ్మదిగా అంది నూకరత్నం.

ఆమెకేసే తదేకంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు ఏకాంబర్.

"నేను వెళ్ళిపోనా?" లేవబోతూ అంది నూకరత్నం.

"ఆగండాగండి! వెళ్ళిపోడానికా వచ్చింది. మిమ్మల్ని ఇలా ఇంత దగ్గరగా చూస్తుంటే నాకు నోట మాట పెగలటంలేదు" మౌనం వీడి అన్నాడు ఏకాంబర్.

"దెయ్యంలా కనిపించి భయపెడుతున్నానా?" తనని తాను ఓసారి ఎగాదిగా చూసుకుంటూ అంది నూకరత్నం.

"దేవతలా దర్శనం ఇచ్చారు కదా! భక్తుడిలా మైమరచి ప్రార్ధించుకుంటున్నాను" తన్మయంగా అన్నాడు ఏకాంబర్.

"దేవతనా...?!" చిన్నగా నవ్వుతూ "ఏమని ప్రార్ధిస్తున్నారు?" ఎగతాళిగా అంది నూకరత్నం.

"ఈ దేవత మా ఇంట్లో కొలువైతే ఎంత బాగుండునో అని" ఓరగా నూకరత్నం కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

ఒక్కసారే ఉలిక్కిపడింది నూకరత్నం.

"మీరేమంటున్నారో నాకర్ధం కాలేదు అంబర్ గారూ!" తీక్షణంగాఏకాంబర్ కళ్ళల్లోకి చూస్తూ అంది నూకరత్నం.

"అదేంకాదు. అవునూ! మీరు ఇంత చదువు చదివి ఇక్కడ ఇలా ప్రత్యక్షమయ్యారేమిటండీ బాబూ!" మాట మారుస్తూ అన్నాడు ఏకాంబరం.

"ఏం చెయ్యమంటారు?! నేను చదివిన ఎండాకాలం చదువుకి ఇదే గొప్ప" తల దించుకుంటూ అంది నూకరత్నం.

"నిరాశ పడకూడదండి! అయినా, ఈ రోజుల్లో నోట్లో మాట, ఒంట్లో శక్తి ఉంటే ఉద్యోగాలెందుకండి! డబ్బు సంపాదించడానికి సవాలక్ష మార్గాలున్నాయి తెలుసా!" అన్నాడు ఏకాంబర్.

ఇంతలో బేరర్ వచ్చి వాళ్ళ టేబుల్ దగ్గర నిలబడ్డాడు.

"చెప్పండి సార్! మీకేం ఆర్డర్ ఇవ్వమంటారు" నమ్రతగా అడిగాడు.

"నాకు మినీ మీల్స్  పట్రా బాబూ. మీకు... మీరు ఇప్పుడే కంచం ఖాళీ చేసి వచ్చినట్లున్నారు కదా! లైట్ గా... కాఫీ... టీ..." నూకరత్నం కేసి చూస్తూ అడిగాడు ఏకాంబరం.

"నాకేం అక్కర్లేదు. ముందు మీ పని కానివ్వండి" వాచీకేసి చూసుకుంటూ షాపు తెరిచే టైమ్ అయిపోతోందని గాభరా పడుతూ అంది నూకరత్నం.

"ఇక్కడ జ్యూస్ దొరుకుతుందా?" బేరర్ కేసి చూస్తూ అడిగాడు ఏకాంబర్.

"ఉంటుంది సార్! మేడమ్ గారికి జ్యూస్ పట్రామ్మంటారా?" ఇద్దరికేసి అదోలా చూస్తూ అన్నాడు బేరర్.

"గ్రేప్ జ్యూస్ ఒకటి పట్రా! నాకు మినీ మీల్స్" బేరర్ తో చెప్పాడు ఏకాంబర్.

"అలాగే సర్!" అంటూ బేరర్ ఇద్దర్నీ ఎగాదిగా చూసుకుంటూ వెళ్ళాడు.

"మీరసలు నన్నెందుకు ఇక్కడకు రమ్మన్నారో నాకర్ధం కాలేదు" చిరాగ్గా అంది నూకరత్నం.

"నాతో మాట్లాడడానికి మీకు చికాగ్గా ఉంది?" నవ్వుతూ అన్నాడు.

"మాట్లాడడానికి కాదు. షాపు తెరిచే టైమ్ అవుతోంది. మా ఓనర్ అసలే తిక్కలోడు. తేడా వస్తే వెంటనే ఊస్టింగ్ ఇచ్చేస్తాడట కదా" భయంభయంగా అంది నూకరత్నం.

"పోతేపోనివ్వండి! ఇంతకంటే మంచి ఉద్యోగం నేను చూస్తాగా" ఆమెకేసి ప్రేమగా చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"మీరిప్పుడు ఇలాగే అంటారా? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో?! అమ్మ, చెల్లెళ్ళని తీసుకుని మావయ్యదగ్గరకు వచ్చేసరికి మా ఖర్మ కాలి ఆయన గుటుక్కుమన్నాడు. మమ్మల్ని ఆదుకునే దిక్కులేక ఈ నెలరోజులూ ఉద్యోగం కోసం తిరగని దుకాణం లేదు. కనీసం కలో గంజో త్రాగడానికి ఈ చిన్న ఉద్యోగమే నాకు కొండంత అండ" కళ్ళల్లో నీళ్ళు దించుకుంటూ అంది నూకరత్నం.

ఆమె అలా బాధపడేసరికి ఏకాంబరానికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. చదువుకున్న యువతీయువకుల్లో ఆర్ధిక స్వావలంబన కరువైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారనడంలో సందేహం లేదు.

"ఇన్నాళ్ళు ఎక్కడున్నారు?" సందేహంగా అడిగాడు.

"పల్లెటూర్లో నాన్న చిన్న ప్రైవేటు స్కూల్లో టీచరుగా చేసేవారు. పల్లెటూరు కావడం వలన ఇంటికి అద్దె కూడా అడిగేవారు కాదు. మేము ఉండడమే అదృష్టంగా భావించి వాళ్ళ పిల్లల్ని నాన్న దగ్గరకు 'చదువు' నేర్పమని పంపేవారు. పైపెచ్చు ఆ ఊర్లో పిల్లల తల్లిదండ్రులంతా వారం వారం కాయగూరలు తెచ్చి ఇస్తూండేవారు. హాయిగా జీవితం సాగిపోతున్నదనుకున్న సమయంలో నాన్న గుండెపోటుతో చనిపోయారు. నాకాస్కూల్లో చదువు చెప్పే వయసు కాదని స్కూలు పెద్దలు ఉద్యోగం ఇవ్వననేసారు. ఇక అక్కడ బ్రతకలేక మావయ్య సలహా సహాయం తీసుకుందామని వచ్చాము. మేము వచ్చిన నెల రోజులకే ఇలా జరిగింది. వాళ్ళింట్లోనే తల్లి నలుగురం ఆధారపడి ఉండడం ఇష్టం లేక మావయ్యే చంద్రనగర్ ఇల్లు అద్దెకు తీసి మమ్మల్ని ఉంచారు. మావయ్య పోయాక ఏం చేయాలో తోచలేదు. ఇదిగో... ఇలా ఈ ఉద్యోగంలో చేరాను" క్లుప్తంగా తన గోడంతా విన్నవించుకుంది.

ఏకాంబరానికి కళ్ళు చెమ్మగిల్లాయి. మొట్టమొదటిసారిగా ఏకాంబరానికి గుండె కలుక్కుమంది.

"మీకు నా మీద నమ్మకం ఉంటే నేను మీకు భరోసా ఇస్తాను. ఇంతకంటే మంచి 'ఆదాయం' సంపాదించే దారి కనుక్కుందాం సరేనా?" అప్రయత్నంగా ఆమె చెయ్యి మీద చెయ్యేసి చిన్నగా నొక్కుతూ ధైర్యం చెప్పాడు ఏకాంబర్.

ఏకాంబర్ ఉన్నట్టుండి తన చేతి మీద చెయ్యి వేసేసరికి ఛటుక్కున తన చెయ్యి వెనక్కి లాక్కుంది నూకరత్నం.

"మీమీద నమ్మకం లేకపోతే ఇలా ఇక్కడికెందుకొస్తానండి" అంది నూకరత్నం ఓరగా ఏకాంబర్ కళ్ళల్లోకి చూస్తూ.

"సరే! మీరిక్కడ ప్రస్తుతానికి పని చెయ్యండి. నేను ఈ నెల్లోపల ఓ ఆఫీసు ప్రారంభించాలనుకుంటున్నాను. నేను చేసిన పాలసీదారులకు సహాయ సహకారాలు అందించడానికి ఇక్కడే ఓ షాపు అద్దెకు తీసుకుంటున్నాను. మీరు కూడా అక్కడే పని చెయ్యొచ్చు. వీలైతే ఇతర బ్యాంకుల దగ్గర ఫ్రాంచైజీలు దొరుకుతాయేమో కనుక్కుంటాను" బేరర్ తన ముందర పెట్టిన మినీమీల్స్ తింటూ అన్నాడు ఏకాంబర్ .

"ఫ్రాంచైజీలంటే...?" అర్ధం కాక అయోమయంగా చూస్తూ అంది నూకరత్నం.

"పెద్ద బ్యాంకులు తమ ఖాతాదారులు దగ్గరనుండి ఇచ్చిన అప్పులకు రావలసిన వాయిదా బకాయిలు వసూలు చేయడానికి 'కమీషన్' పద్ధతి మీద ఒకరికి కాంట్రాక్టు అప్పగిస్తారు. దాన్నే ప్రాంచైజీలంటారు. ఆ సంస్థ తరపున మీరు మీదగ్గర పదిమంది యువతీయువకుల్ని ఉద్యోగులుగా నియమించి వారికి రావలసినది బకాయిలు వసూలు చెయ్యాలి. దానికి మీకు 'కమీషన్' ఇస్తారు. అందులోనుండి మీరు మీ దగ్గర ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వాలి." నూకరత్నం కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏకాంబరం.

"అమ్మో! నేనే ఉద్యోగం దొరక్క అల్లల్లాడినదాన్ని నా దగ్గర పదిమందికి ఉద్యోగమా?! వినడానికే వింతగా ఉంది సార్!" అయోమయంగా అంది నూకరత్నం.

"నేనున్నా కదండి! మీ వెనుక ఈ 'ఏకాంబర్' ఉన్నాడన్న ధీమాతో గుండెల మీద చెయ్యేసి పడుకోండి" నూకరత్నం కళ్ళల్లోకి చూస్తూ తన చెయ్యి ఆమె గుండెల మీదకు చూపిస్తూ చిన్నగా నవ్వి అన్నాడు ఏకాంబర్.

"మీ చెయ్యెందుకండి మధ్యలో. నా చెయ్యి కదా వేసుకుని పడుకోవాలి. అయినా, మీ పేరు ఏకాంబర్ అంటే ఎందుకో నాకు 'ఏక్' పుట్టిస్తోందండి." అంది సిగ్గుగా తల దించుకుంటూ.

ఆమె అలా అనేసరికి అదిరిపడ్డాడు ఏకాంబర్.

"నేనేం చెయ్యగలనండి. మా తాతముత్తాతల నుండి వస్తోందట ఈ 'అంబరం'. ఆకాశమంత ఎత్తుకి ఎదగాలని ఆశతో మా ముత్తాత్తాత ఎవడో తగిలించాడండీ బాబూ! నా పేరు ఏకాంబరం, మా నాన్న పేరు పీతాంబరం. మా అన్న పేరు నీలాంబరం. ఇంకా ఎక్కడన్నా అంబరాలు దొరికుంటే మా చెల్లెలికి కూడా తగిలించేద్దురు. అదృష్టం కొద్దీ ఇంకెక్కడా 'అంబరం' పేరు దొరకలేదు" చిరాగ్గా సిగ్గుతో తల దించుకుంటూ అన్నాడు ఏకాంబర్.

ప్రేమించిన అమ్మాయికి తన పేరు నచ్చలేదనేసరికి తల కొట్టేసినట్టూ ఫీలయిపోయాడు ఏకాంబర్.

"పోనీలెండి సార్! పేరులో ఏముంది. మన ప్రవర్తన బావుంటే ఆ పేరుకే మారు పేరు తేగలరు. అవునా!" ఏకాంబరం బాధపడడం చూసి అనునయంగా అంది నూకరత్నం.

ఆ అమ్మాయి అలా అనేసరికి ఛటుక్కున తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అనుకున్నాడు ఏకాంబర్ 'ఈ అమ్మాయి అమాయకురాలు కాదు. తెలివైనదే. ప్రపంచజ్ఞానం లేని పిల్లనుకున్నాడు. ఇంగితజ్ఞానం ఉన్నదే!" అని.

"సార్! మీరేమి అనుకోనంటే మిమ్మల్ని "అంబర్" అని పిలవచ్చా?" మళ్ళీ ఆ అమ్మాయే అంది.

"ఓ ఎస్ మీరెలా పిలిచినా పలకడానికి... పరిగెత్తుకు రావడానికి నేనీ రోజు నుండి మీ పెంపుడు చిలకననుకోండి" అన్నాడు ఏకాంబరం ఆనందంగా.

"మీరు చిలకైతే నేను గోరింకనా!?... ఎవరైనా వింటే నవ్వుతారు" పకపకా నవ్వబోయి అది హొటల్ అని గ్రహించి చుట్టూరా చూస్తూ చేత్తో నోరు మూసుకుని నవ్వాపుకుంది నూకరత్నం.

ఆ అమ్మాయి అలా తనని, ఆమెని కలిపి చిలకా గోరింకా అని పోల్చి చెప్పేసరికి ఏకాంబరం మనసు దూదిపింజలా తేలిపోయింది. ఆనందం ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. మనసులో ఉప్పొంగుతున్న ప్రేమతరంగాల్ని అదుపు చేసుకుంటూ గుంభనంగా చిరునవ్వు చిందిస్తూ ఆమెకేసి తన్మయంగా చూస్తుండిపోయాడు.

"మరి మనం ఇక వెళ్దామా?" ఏకాంబరం భోజనం ముగించి ఖాళీప్లేటులో అలా ఎంగిలి చేత్తోనే కెలుకుతూ కూర్చునేసరికి అతన్ని ఇహానికి లాక్కు వస్తూ అంది నూకరత్నం.

ఉలిక్కిపడి తన వైపు ఒకసారి చూసుకుని "సారీ! అక్కడున్న వాష్ బేసిన్ లో చెయ్యి కడుక్కుని వస్తా!" అంటూ లేచి వెళ్ళాడు ఏకాంబరం.

డైనింగ్ టేబుల్ దగ్గర నుండి హుందాగా లేచి నిలబడి ఠీవిగా నడిచి వెళ్తున్న ఏకాంబరాన్ని తదేకంగా గమనిస్తూ కూర్చుంది నూకరత్నం.

'అందగాడే! అణకువ, అల్లరి రెండూ ఉన్నాయి ఇతగాడిలో. అహం మాత్రం ఏ కోశానా కనిపించటం లేదు. అయినా, ఇతను తన దగ్గర్నుండి ఏమాశించి సహాయం చేస్తానంటున్నాడు?! 'పరోపకారం ఇదం శరీరం' అన్నారు కదూ! నిజమే. 'మానవసేవే మాధవసేవ' అన్నది ఇతని సిద్ధాంతమైతే ఎక్కడో అనాధాశ్రమంలోనో, వృద్ధాశ్రమంలోనో పని చేసుకు బ్రతకొచ్చు కదా! ఏజెంటుగా డబ్బు సంపాదన కోసం ఈ తాపత్రయం ఎందుకు?'

ఏకాంబరం వాష్ బేసిన్ దగ్గరనుండి తిరిగొచ్చేవరకూ పరిపరివిధాలా ఆలోచిస్తూనే ఉంది నూకరత్నం.

"మీ పేరు నూకరత్నం అంటే ఎబ్బెట్టుగా ఉంది. 'రత్నం' గారని పిలవచ్చా?" కర్చీఫ్ లేకపోవడంతో జేబులో చెయ్యి పెట్టుకుని జేబు లోపలే చెయ్యి తుడుచుకుంటూ కూర్చున్నాడు ఏకాంబర్.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్