Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> రసఝరీయోగం

rasajhareeyogam

ప్పటికి రెండోవాయ చంద్రకాంతులు నూనెలో వేస్తూ... గంభనంగా నవ్వునాపుకుంటూ - "అలాగే జరిగింది" - అనింది నాతో అమ్మమ్మ, నా ప్రశ్నలన్నింటికీ జవాబుగా! నాకయితే అంత మురిపెంగా చెప్పిన అమ్మమ్మని మెడచుట్టూ చేయివేసి ఒక్కసారిగా కావలించుకోవాలన్పించింది గానీ... ఇప్పటికీ, మామూలుగా మధ్యాహ్నం వేళ, పలహారాలు తయారుచేస్తున్నా సరే... మడి గట్టుకుని చేసి, తొలి వాయుదేవుడికి నైవేద్యం పెట్టిగాని అమ్మమ్మ తనని ముట్టుకోనివ్వదు. ఈ విషయంలో మాత్రం రూల్సు దాటడానికి వీల్లేదన్న విషయం బాగా తెలిసినదానినే గనకా నా కోరికను అలా అర్ధాంతరంగానే ఆపుకుని, మళ్లీ సంభాషణని పొడిగించాను.

"అయితే అమ్మమ్మా! నీ మనసుకి కష్టం కలిగేది కదా?" అన్నాను. మా సంభాషణ అంతా తాతయ్య నడివయసులో నడిపిన శృంగార కలాపాల గురించి నడుస్తోంది.

తాతయ్యకి ఇతర స్త్రీలతోటి సంబంధాలని గురించి అమ్మమ్మ అంత సాధారణంగా ఎలా మాట్లాడగలుగుతోందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంక ఉండబట్టలేక "అమ్మమ్మా! ఇవాళ నీ వయసు మళ్ళినప్పటి సంగతివేరు.

ఆనాటికి నువ్వు చిన్నదానివే కదా! నీకు తాతయ్యకున్న ఇతర సంబంధాలు గురించి కష్టమే కలగలేదంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు?? అన్నాన్నేను రెట్టించి.

అమ్మమ్మకీ నాకూ మధ్య ఉన్న నలభై ఏళ్ళ వ్యత్యాసం మా స్నేహానికి ఏనాడూ అడ్డు రాకపోవడం వింతగా ఉంటుందేమోగానీ, మా అమ్మమ్మ నాకు మంచి స్నేహితురాలు.

"కష్టమా కాదా అన్నది ఆ ఇద్దరి మధ్యా ఉండే ఆకర్షణ మీదా... అవసరం మీదా ఆధారపడి ఉంటుందే అమ్మాయీ..." అంది అమ్మమ్మ. "మీ తాతయ్యకీ నాకు అలాంటి అవసరం అంత బలంగా ఆనాడు కలిగింది లేదు.

ఆ మాట అంటున్నప్పుడు అమ్మమ్మ గొంతులో ఏ కాస్త తడబాటు లేదు. వేదనా లేదు. నిరాశా నిర్లిప్తతా కూడా లేవు. అమ్మమ్మ చాలా స్పష్టంగా మాట్లాడిన ప్రతీమాటనీ అత్యంత ఆసక్తితో విన్నాన్నేను.

"అది అలా జరిగింది మరి" అంది అమ్మమ్మ. "నాకు పెళ్లయ్యేనాటికే  మీ తాత. బహిరంగంగానే మాలక్ష్మి ఇంటికి వెళ్లి వస్తూండేవారు. ఆయన కులాసా పురుషుడని ఆనోటా ఈ నోటా విన్నా - మా వాళ్ళు దాన్నంత గణనలోకి తీసుకోలేదు. నాకప్పటికి పధ్నాలుగేళ్ళు. ఏ విషయమూ తెలిసీ తెలియని వయసు. వంటినిండా అణుకువా... భయమూ ఉండేవి తప్ప దేని గురించీ ప్రశ్నలే తలెత్తేవి కావు. పైగా నా లోకమంతా సత్కావ్యమయం!" అంటూ కాసేపాగింది అమ్మమ్మ. "మరి తాతయ్యో?" అన్నాన్నేను. మీ తాతయ్యకేవీ?! పరమ లౌకికుడు. నాలా కాక పుస్తకాల అవసరం దాటినవాడూనూ" అంది హాస్యంగా.

అమ్మమ్మని తిరిగీ సంభాషణలోకి మళ్లించటంలో ఏ మాత్రమూ ఏమరిపాటు చూపలేదు నేను. అందువల్ల అవీ ఇవీ మాట్లాడి జారిపోకుండానూ అమ్మమ్మ దారి మళ్ళకుండానూ నా ప్రశ్నలతో కాచుకుంటూ వచ్చాను నేను. నన్ను నిరాశ పరచకుండా నా సందేహాలన్నీ తీరుస్తూ అమ్మమ్మ మాట్లాడింది.

"నేను పుష్పవతినయ్యాకా కాపురానికైతే వచ్చాను గానీ... మరీ చిన్నదాన్ని. ఆటపాటల మీద ఉన్నంత శ్రద్ధ నాకు ఆయన మీద ఉండేది కాదు. ఆయన కూడా అప్పట్లో నన్ను చిన్నపిల్లగానే చూశారు. అదీగాక మా మధ్య వయసు తేడా చాలా ఉంది. మీ తాతయ్య నాకన్నా పదిహేనేళ్లు పెద్ద. పురుళ్లకనీ, పుణ్యాలకనీ నేనెక్కువ పుట్టింట్లోనే ఉండేదాన్ని. పైగా మా ఇంట నేనొక్కతనే ఆడపిల్లని. ఎంతసేపూ మా జట్టు పిల్లలతో ఏటిదాకా పోయి తోట్లంటా దొడ్లంటా తిరగటం, ఏటిలో ఈతలు కొట్టడం, అప్పల్రావుడి కన్ను గప్పి తోటలో చొరబడి మామిడికాయలు కోసుకోవడం ఈ పన్లంటే చాలు మనసు ఉరకలేసేది నాకు. మరి కాస్త పెరిగాకా ఆరోజుల్లో నా మనసునెక్కువ నాకర్షించినవి సంస్కృత కావ్యాలూ, నాటకాలూనూ!!

"నీకు తెలుసుకదా! మా పుట్టింట అంతా సురభారతీ సేవకులే! మా ముత్తాతలు, తాతలూ సంస్కృత పండితులు. కావ్య తర్క వ్యాకరణాలలో రచ్చగెలిచి ఔనన్పించుకున్న వాళ్ళూనూ! మా ముత్తాతగారువీధి సావిట్లో - వాలు కుర్చీలో కూర్చుని, కళ్ళు మూసుకుని, అలా శిష్యులు వల్లెవేసే శ్లోకాలవైపూ సూత్రాలవైపూ ఒక చెవివేసి వింటూ, తలపంకిస్తూ ఉంటే... ఆయన ఎదురుగా అప్పటికే తలనెరిసిన మా తాతగార్లందరూ ఆయన ముందు చాలా వినయంతో మసలటం నాకింకా జ్ఞాపకం ఉంది. సంస్కృత నాటకాలని మా చిన తాతగారు పాఠం చెబుతూ ఉంటే వినడం ఎంత బాగుండేదనీ!! అందరూ కాళిదాసు శకుంతల అంటారుగానీ... నాకు శూద్రకుడి వసంతసేన మీదనే ఎక్కువ మక్కువ ఏర్పడింది."

మా నాయనమ్మ చాలా శ్రావ్యంగా అష్టపదులు మొదలుకొని, తరంగాలనించి, ఆధ్యాత్మ రామాయణం దాకా తన్మయత్వంతో పాడుతూ ఉండేది. "అచ్యుత మాధవహరి రామేతి కృష్ణానంద పరేతి" - అంటూ పాడుతూ కళ్ళు మూసుకుని, తన గాత్ర మాధుర్యంలో తానే లీనమయ్యే నాయనమ్మ ముఖం ఇప్పటికీ నా కళ్ళలో కదలాడుతుంది. నాయనమ్మ పాటతో పెరిగిన దాన్ని నేను. "జయదేవుడంటే ఎంతో అనురక్తి ఏర్పడింది నాలో! నన్ను నేను వసంతసేనగానూ, గోపికగానూ భావించుకునేదాన్ని. ఎంత చక్కగా అలంకరించుకునేదాన్నో తెలుసా"? సంతోషంగా అంది అమ్మమ్మ.

అటూ ఇటూ కదులుతూ, పనిచేస్తూ ఇలా మాట్లాడుతున్న అమ్మమ్మని గమనిస్తున్నాను నేను. అమ్మమ్మ అందం వాసి తగ్గలేదిప్పటికీ! సన్నగా పొడవుగా కంచుకడ్డీలా ఉంటుంది అమ్మమ్మ శరీరం. పట్టుచీరని అడ్డకచ్చ కట్టుకుని, తనువంతా పసుపురాశి పోసినట్టు పచ్చగా ఉంటుంది అమ్మమ్మ. నిత్యమూ పసుపుతో విరాజిల్లే... అమ్మమ్మ పాదాలని కప్పుతూ వెండి కడియాలూ... వెండి గొలుసులూ, అమ్మమ్మ కంటానికి అతుక్కుని బంగారపు నానూ, పట్టెడ, మంగళసూత్రం, నల్లపూసల కుత్తిగంటూ, చేతులకీ బంగారు గాజులు, వాటిమధ్య ఎర్రటి మట్టి గాజులూ ఆవిడ శరీరంలో ఒక భాగమైనట్టుగా మెరుస్తూ ఉంటాయి. నెరసిన బారెడు పొడవైన తన తల వెంట్రుకలని జారు ముడి వేసుకుంటుంది. మడి మధ్యలో ఎర్రటి ముద్దమందార పువ్వుని ఎప్పుడూ వాడకుండా చూసుకుంటుంది. ఆవిడ తన ఆకర్నాంత నేత్రాలనలా భావస్ఫోరకంగా కదుపుతూ ఉంటేనూ... అటూ ఇటూ తల తిప్పుతూ మాట్లాడుతున్నప్పుడల్లా ఆవిడ ముక్కున పుష్యరాగ పొడితో తళుక్కుమంటూండే, ఆ నిమ్మగుత్తి ముక్కుపుడక మీద కిరణాలు పడి చెదిరి పోతుంటేనూ... విశాలమైన ఆవిడ నుదుటిమీద ఎర్రటి కుంకంబొట్టూ, కళ్ళకి కాటుకా, తాంబూలంతో పండిన ఆ పలచటి పెదాలూ... గడ్డం కింద సదా ఎండిన గంధపుచారా... తన ఒక్క శరీరంలో ఇంత వైవిధ్యాన్ని ఆవిడ ఎలా నిలుపుకుందో ఎప్పుడూ నాకు ఆశ్చర్యమే!!

ఆవిడ రూపాన్ని అలా గమనిస్తూ ఉండగా శరీరమంతా నిండిన ఎరుపుల మిశ్ర వర్ణాలతో ఆవిడ నిజంగా కుందనపు ఆకాశాన పొద్దుపొడుపు సూర్యుడిలా కన్పించింది. అలా ఆవిడని చూస్తూ 'ధన్యోస్మి' అనుకున్నాను.

మా అమ్మమ్మది చాలా అందమైన నవ్వు. ఎంత అందమైన నవ్వంటే... నవ్వుతూ ఆవిడ మాట్లాడుతూ ఉంటే, ఆవిడ ముఖం మీంచి చూపు తిప్పుకోవటం కష్టం. ధనుస్సు వొంగినట్టుగా మెలికలు తిరిగిన పెదాల మధ్య నించి, అలవోకగా... చంద్రవంకలా... నవ్వగలదావిడ! ఆవిడ నవ్వొకటి చాలు కదా! ఆనాటి మగవాళ్ళు తమ చూపు తిప్పుకోలేకపోవడానికి అనుకుని, ఆ మాటే అడిగాను అమ్మమ్మని. దానికావిడ ముసిముసిగా నవ్వి, మాటదాటవేసి - ఎలా ఉండేదాన్నా? అచ్చం నీలాగే ఉండేదాన్ని... ఆ ఎడం బుగ్గమీద నవ్వినప్పుడు పడే సొట్టతో సహా! అంది... నా వైపు మురిపెంగా చూస్తూ!!... తన కనుకొలకుల్లో కొంటెదనాలని కూడా మేళవించి మరీ!!

"అయితే అమ్మమ్మా! మా లక్ష్మిని చూసేవా నువ్వు?" అన్నాను. "అయ్యో! చూడకేవే! ఛామన ఛాయ అన్నమాటేగానీ చూడచక్కనిది తెలుసా!" అంది అమ్మమ్మ. "మంచి పాటగత్తె అది. ఎంతటివాళ్లు గాని మా లక్ష్మి పాడితే చాలు మైమరచి పోవలసిందే" అని నిశ్శబ్దంగా ఊరుకుంది కాసేపు. అప్పటికే చనిపోయిన మా లక్ష్మిని తలచుకుని కాబోలు అమ్మమ్మ కళ్ళు తడి అయ్యాయి. కాసేపయ్యాక ఆలోచనల్లోంచి తేరుకుని "మాలక్ష్మి చాలా చక్కనిది కమలా!" అని మళ్లీ అంది అమ్మమ్మ ఆవిడ గొంతులో తన మొగుడు వలచిన ఆ మరో ఆడది తనకీ ధీటైనదే గానీ, ఏమంత అల్లాటప్పా మనిషి కాదు సుమా అన్న కించిత్ అతిశయం తొణికిశలాడింది కూడా! తాతయ్యకే కాదు అమ్మమ్మకి కూడా మాలక్ష్మి అంటే ఇష్టమని అర్ధమైంది నాకు. ఆడది మెచ్చిందే అందం అనుకున్నాన్నేను. తరువాత అమ్మమ్మ తన మాటల్లో - పెళ్లంటే చేసుకోలేదు గానీ, కడదాకా వాళ్లిద్దరూ ఎంతగా కలిసి మెలిసి ఉన్నారో... వివరంగా చెప్పుకొచ్చింది. మాలక్ష్మి పోయాకా తాతయ్య ఎంత ఒంటరివాడయ్యాడో అర్ధమైంది నాకు.

ఆలోచిస్తూ నేను... పీటమీద మోకాళ్ళని దగ్గరగా మడచి, వాటిమీద నా గడ్డం ఆన్చుకుని మౌనంగా కూచున్నాను. వాళ్ళకాలంలో ఇంత సంక్లిష్టమైన విషయాలని ఇంత సజావుగా మామూలుగా ఎలా తీసుకున్నారన్నదే నాకింకా అంతుపట్టడంలేదు. బహుశా వారికి మల్లే నా జీవితంలో అంతగా ఆకర్షించిన పరిచయాలేవీ ఇంకా ఎదురు కాలేదేమో?! అనుకున్నాను. అంతలో నాకు పతంజలి జ్ఞాపకానికొచ్చాడు. నేనూ పతంజలీ యూనివర్సిటీలో సోషియాలజీలో రిసెర్చ్ స్కాలర్లమి. నేనంటే చాలా ఇష్టపడే వాడు పతంజలి. పైగా నాతోపాటే రిసెర్చ్ చేస్తున్నవాడూ, బ్రాహ్మడూ కూడా గనుక, మా ఇంట్లో వాళ్ళంతా అతడి పట్ల సుముఖంగానే ఉండేవారు.

కానీ, నాకు రెండేళ్లు జూనియర్ - రమేష్ అని. ఒక నాయుళ్ల కుర్రాడు ఉండేవాడు. అతడు పతంజలి అంత తెలివైనవాడు కాదుగానీ, చాలా చలాకీ అయినవాడు. ఆ అబ్బాయికీ నేనంటే ఇష్టముండేది. నేను కూడా పతంజలి కన్నా ఈ రమేష్ తోనే ఎక్కువ మాట్లాడేదాన్ని. అతడితోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. రమా రమా! అని పిలిచేదాన్నతడిని. అనేక విషయాల వల్ల మేమిద్దరం కలగలిసిపోగలిగే వాళ్లం. అలాంటి సమయాల్లో పతంజలి ముభావంగా దూరంగా ఉండేవాడు నాకు. పతంజలి అలా ఉడుక్కుంటూ ఉంటే చూడటం నాకు సరదాగా ఉండేది. పతంజలి మీద నాకు ఆసక్తి కన్నా - రమేష్ తో నాకున్న స్నేహం... చనువూ మాత్రం పతంజలితో ఉండేది కాదు. యూనివర్సిటీలో వాళ్ళు నేను పతంజలినో, రమేష్ నో తప్పక పెళ్ళి చేసుకుంటానని ఊహాగానాలు చేస్తుండేవారు. అందరూ అనుకున్నట్టుగా నేను అటు పతంజలికి గానీ, ఇటు రమేష్ కి గానీ, పెళ్లి దగ్గరవలేదు. డాక్టరేట్ డిగ్రీ తీసుకుని, ఉద్యోగం రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాను. పెళ్లి చేసుకోమంటున్న ఇంట్లోవాళ్ల వత్తిడి నించి కొంతకాలమైనా తప్పించుకుందుకని.

నా ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ... "కాఫీ తాగుతావే అమ్మాయి" అంది అమ్మమ్మ. నన్ను కలపనివ్వదని తెలిసినా... "కాఫీ నేను కలపనా? అమ్మమ్మా!" అని అడిగాను నేను. "ఎంతసేపే! ఈ పాటిదానికి." "నువ్వలా కూచో" అనేసి, నిజంగానే రెండు నిమిషాల్లో నా ముందు కాఫీకప్పు పెట్టింది అమ్మమ్మ. తరువాత లేచి వెళ్లి సావిట్లో ఉయ్యాల మంచం మీద కూచున్న తాతయ్యకి వేడివేడిగా చేసిన చంద్రకాతాలని వెండిపళ్లెంలో పెట్టి ఇచ్చి... కాసేపు మాట్లాడుతూ ఇక్కడే నించుంది.

దూరాన్నించీ వాళ్లిద్దరినీ పరిశీలిస్తూ కూచున్నాను నేను. కోసుగా ములితిరిగిన తెల్లని బుంగమీసాలు, తాతయ్య సగం బుగ్గల దాకా ఆవరించి ఉన్నాయి. అచ్చం ఆదిభట్ల నారాయణదాసుమీసాలకు మల్లేనే! తాతయ్యది వంకీల జుట్టు. మధ్య పాపిడి తీసుకుని తల దువ్వుకుంటాడు. సూదిముక్కు ముఖానికంతటికీ ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. విశాలమైన ఆయన కళ్ళనించి చూపు తీక్షణంగా ఉంటుంది. ఆయన కళ్లలో నిరంతరం ఒక ఎర్రజీర - మలిసంధ్యలా వ్యాపించి ఉంటుంది. తాతయ్య చెవులకి కెంపుల తుమ్మెట్ల అతుక్కుని ఉంటాయి. తాతయ్యకి వేషంలోనేగానీ, వ్యవహారంలో మాత్రం ఏ కోశాన వైదిక సంప్రదాయాలేవీ అలవడలేదు. మిగతా వాటిల్లో ఆయన పూరా లౌక్యుడే.

ఆయన ఖాళీ ఛాతీకి అడ్డుగా జంధ్యం వేళ్లాడుతూ ఉంటుంది. చిరుబొజ్జ... పంచె కట్టుని దాటి పైకి కన్పిస్తూ ఎర్రటి మొలతాడు, కూచుంటేనే అంత ఎత్తు కనిపించే ఆజానుబాహుడాయన. ఏమేం జ్ఞాపకాలని నెమరు వేసుకుంటాడో... ఇంట్లో ఉన్నంతసేపూ ఏకాంతంలో ఉంటాడు. వయసులో ఈయన సూదంటురాయిలా ఆడవాళ్లని ఆకర్షించే ఉంటాడు - అనుకున్నాన్నేను. నాకు తాతయ్య దగ్గిర బొత్తిగా చనువులేదు. ఎప్పుడన్నా పలకరిస్తే ఔననో... అలాగేననో... సరేననో... జవాబుచెప్పి ఆయన ముక్తసరి ప్రశ్నలకి తలూపడం తప్పిస్తే... మాట పెగిలి వచ్చేది కాదసలు. చేతికర్రని విలాసంగా ఊపుకుంటూ ఆయన వీధిలో నడిచి వెడుతూ ఉంటే ఆ ఊరి రైతులు ఎంతో మర్యాదగా "బుగతా!" అంటూ అనుసరించడం మేమంతా ఎరుగుదుం. బయట వాళ్ళందరికీ తలలో నాలుకలా మసలే ఆయన ఇంట్లో మాత్రం పరమ గంభీరంగా ఉండేవాడు.

ఇంతలో అమ్మమ్మ తిరిగొచ్చి మళ్లీ పొయ్యిదగ్గర కూచుంది.

"అమ్మమ్మా! తాతయ్య నిన్నెలా చూసుకునేవాడూ?" అని అడిగాను.

దానికి నవ్వేసి "ఒక మొగుడిలా... ఇంకెలా?" అనేసింది అమ్మమ్మ. అమ్మమ్మ గొంతులో వ్యంగ్య మేం లేదు. విషాదమూ లేదు. చివరికి కొంచెం కోపాన్ని నా కంఠంలో వొలికిస్తూ...

"నీకు మా లక్ష్మి గురించి తెలిస్తే... నువ్వేమైనా అనుకుంటావనైనా ఆలోచించలేదా తాతయ్య?" అన్నాను. అమ్మమ్మ నేనెంత కవ్వింపు చూపినా లొంగిరావడం లేదు నాకు. "ప్రేమ ఉన్నచోట ఒకరు అనుకుంటారనీ, అనుకోరనీ ఆలోచించే అక్కర ఉండదే! అది నాకు స్వానుభవంగా తెలుసు" అంది అమ్మమ్మ. "సరే విను. నేనూ... మీ తాతయ్య బాగా పరిచయస్థులమైన అపరిచయస్థులం అనుకో! ఆయనా, మా లక్ష్మి కలిసి ఒక ప్రపంచం. వాళ్ళ ప్రపంచాన్ని నేను అలాగే ఒప్పుకున్నాను. నేను అడ్డు వెళ్లదలచుకోలేదు. గొడవ పడదలచుకోనూ లేదు. అదలా జరిగిపోయింది అంతే!" అంది అమ్మమ్మ.

"ఇదంతా ఎలా సాధ్యమైంది అమ్మమ్మా! నీ త్యాగం వల్లనేగదా?" అన్నా నేను 'త్యాగం' అన్న పదాన్ని వత్తి పలుకుతూ అక్కసుగా! ఎలాగైనా అమ్మమ్మలో ఒక కోప వీచికని చూడాలన్నది నా కోరిక.

లేదమ్మా కమలా! నేను అడ్డుపడినా... గొడవపడినా... తాతయ్యని నా చుట్టూ తిప్పుకోలేను నేను. ఆయన మనసులో మాలక్ష్మి ఉంది. నాకూ అక్కడ ఇంత చోటిప్పంచమని నేను ప్రాధేయపడదలచుకోలేదు. పోటీ పడదలచుకోలేదు. ఎందుకో చెప్పనా? నాకు శృంగారం మీద గౌరవం ఉంది గనుకనే!" అంది అమ్మమ్మ.

నాకు ఈసారి నిజంగానే కోపం వచ్చింది. "అంత సౌమ్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావ్? అదే నీకే ఇంకో సంబంధం ఉంటే... తాతయ్య నీ అంత విశాలంగా ఆలోచించి ఒప్పుకోగలిగి ఉండేవాడా అమ్మమ్మా?" అన్నాన్నేను. నా మనసులో పతంజలి ముభావం మెదులుతూండగా!

మా సంభాషణ అంతా ఏకాంతంలో మృదువుగా... నెమ్మదిగా... సాఫీగా... సాగుతోంది. మా చుట్టుపక్కల ఏ  అలికిడీ... ఆటంకమూ లేకనే... ఆ సాయంత్రాన వాతావరణం... ఇద్దరాడవాళ్ల అంతర్ లోకాల అల్లకల్లోల కెరటాన్వితమయ్యింది. పెరట్లో... నూతి చప్టా పక్క... పున్నాగ చెట్టుమీద పక్షుల కలకలం తప్ప మరే శబ్దమూ లేదు. ఈ సారి నేనడిగిన ప్రశ్న అమ్మమ్మని కొంచెం కలవర పెట్టినట్టే ఉంది. కొంత సమయం గడిచాకా... నా ప్రశ్నకి అమ్మమ్మ ఇలా జవాబు చెప్పింది.

"తాతయ్య ఒప్పుకోవడం... మానడం అన్నదానికన్నా ముఖ్యం, అసలాయన దృష్టిలో - ప్రేమ, శృంగారానుభవం ఉన్న సంగతులు, కేవలం మగవాడికే సొంతమన్న అహంకారం తరచూ వ్యక్తమయ్యేది. అది నాకు నచ్చని విషయం. సంసారం లోపలి ఆడవాళ్ళకీ శృంగారాలనుభవాలనేకం కలగగలవన్న ఆలోచనకే ఆయనలో చోటులేదు. అందునా వాళ్ల వాళ్ల  సంసారాల్లోని ఆడవాళ్లంటే... వాళ్ల దగ్గిర శృంగారపు ప్రసక్తే రాదసలు. అదొక నిషిద్ధ విషయం. - జీవితమంతా నటించాల్సిందే వాళ్ళ ముందు వాళ్ళ ఆడవాళ్ళు!" ఈ మాటని ఎంత మామూలుగా అందామనుకున్నా అమ్మమ్మ గొంతు తడబడింది. ఆమెకున్న నచ్చనితనం బలంగా వ్యక్తమయింది ఆ మాటల్లో!

నా ఆలోచనల్లోని లోపం కూడా నాకు కొట్టొచ్చినట్టు తెలిసింది ఈ మాటలతో. ఔను నిజమే కదా! నేను మాత్రం? ఇంతసేపూ... తాతయ్యకి మాలక్ష్మితో ఉన్న సంబంధం గురించే ప్రశ్నించానుగానీ... నా అనుభవాల గురించే ఆలోచించుకుంటున్నాను గానీ... ఎక్కడా... అమ్మమ్మ జీవితంలో కూడా ఆవిడకే సొంతమైన కొన్ని అపురూప అనుభవాలుండొచ్చు నేమో!? అన్న ఊహకి కూడా పోలేదు కదా! అనుకున్నాను.. తప్పు చేసినట్టు.

నేను మరేవీ ప్రశ్నించకుండానే... నా సందిగ్ధతలన్నీ తాను చదివినట్టుగానే... నా ముఖంలోకి చూస్తూ... "గాడమైన శృంగారానుభవం కలిగితే జీవితంలో సమతుల్యత దానికదే సాధ్యమవుతుందే మనవలారా!" అంది అమ్మమ్మ నా మీద ప్రేమ ఉట్టిపడే గొంతుకతో.

"అలాంటి అనుభవాలు నాకున్నాయి గనుకనే నేను మీ తాతయ్య శృంగార జీవితపు లోతులని అర్ధం చేసుకోగలిగేను. ఎప్పుడని, ఎలాగని ప్రశ్నించకు. కథలు అనేకం. ఎవరి అనుభవం వారిదే"! అంది మళ్లీ. అంతదాకా లేని గాఢత ఒకటి అమ్మమ్మ మాటల్లో వ్యక్తమయింది. వివరంగా చెప్పమని బతిమాలి అడిగాను నేను.

అమ్మమ్మ తనకోసమే  మాట్లాడిందో... నా కోసమే మాట్లాడిందో కూడా నాకు తెలీదుగానీ.. ఏనాడూ నాతో మాట్లాడనంత నిగూడంగా మాత్రం మాట్లాడింది. ఆవిడ అనుభవాన్ని ఆవిడ మాటల్లోనే జ్ఞాపకం పెట్టుకున్నాను నేను.

"నా పెళ్లయ్యాకే! మా పుట్టింట్లో.. నాకు మీ అమ్మ పుట్టిన తరువాత... ఆదిరాజు వారి కుర్రాడు.. మా ఇంట సంస్కృతాధ్యయనాని కొచ్చిన కుర్రాళ్ళందరిలోనూ చురుకైనవాడు... ఎవరినీ ఒక పట్టాన మెచ్చుకోని మా పెదతాతగారు సైతం మణిపూసలాంటివాడని ప్రత్యేకంగా అభిమానించేవారు తెలుసా?" అంటూ తనలో తాను మాట్లాడుకున్నంత నెమ్మదిగా మాట్లాడింది అమ్మమ్మ.

వయసులో నాకన్నా కొంచెం చిన్నవాడే అనుకుంటాను. ఎంతటి ధీమంతుడో... చురుకైనవాడో చెప్పలేను నేను..." ఈ మాటలంటున్నప్పుడు అమ్మమ్మ పెదవి కొనల్లొ మెరిసిన నునుసిగ్గు హాసరేఖని సరిగ్గా అందుకోగల చిత్రకారులున్నారో... లేదో... నాకు తెలీదు గానీ, నేను మాత్రం ఆ క్షణంలో ఆవిడలోని ఆ హఠాత్ సౌందర్యాన్ని నా చూపుతో పట్టుకుని భద్రపరచుకున్నాను. నేను మరే ప్రశ్నలు వేయనక్కరలేనంత వివరంగా అమ్మమ్మ తన ప్రణయాన్ని నా ముందు రేకురేకుగా విప్పి చెప్పింది.

"శృంగార స్పర్శ చాలా బలమైనదే అమ్మాయీ! ఇవాళ్టి దాకా నేనతడి స్పర్శని మరచి పోలేదు సుమా! అందునా ఆ కార్తీకమాసపు తెల్లారగట్ట... ఏటి గట్టున... ఆకాశం కింద... శుక్రుడి సాక్షిగా... ఏకమైన దేహాల మధ్య... ఎంతటి తీవ్ర శృంగార కలాపం అదీ?!! జన్మానికంతకీ వన్నె తెచ్చిన అనుభవం అది... మా ఇద్దరికీనూ" అంది కనులరమోడ్పుగా అమ్మమ్మ. "రెండు జ్వాలలు పెన వేసుకుని వెలిగినట్లనుకో! ప్రసూన,మాలలా శరీరాలు ఆవ్యక్తసుగంధాలని వెదజల్లే కామమే నిజమైన కామం. దానికి దోసిలి పట్టాలి... ఎదురెళ్లి దాసోహమనాలి... ఆ స్థితిలో, ఈ లోకంలో చెలామణీ అయ్యే మతాలకీ... ధర్మాలకీ... శాస్త్రాలకీ ఏ  విలువా లేదు. అదొక రసఝరీయోగం అంతే!! కావ్యానుభావాన్ని అక్షరాలుగా పఠించడం కన్నా అణువణువులోంచి గ్రహించడం అన్నదే ఎక్కువ విలువైనదన్న విషయం నాకు ఆ రాత్రే తెలిసింది. ఆ తరువాత మరి నేను సంస్కృత కావ్యాల మీద మునుపటి మొహాన్ని వదిలేసుకున్నాను. కావ్యాన్ని చదవడం కన్నా కావ్యంగా మిగలటం మరీ మధురం" అంది అమ్మమ్మ మరీ మధురంగా!! నేను విభ్రమతో మిగిలాను.

నా లోపల అపరిష్కృత అనేక ప్రశ్నలకి జవాబు దొరికినట్లయ్యింది. అప్పటిదాకా నాకెదురైన శృంగారానుభవాలనన్నీ తిరగదోడుకుని ఆలోచించుకున్నాను. ఎందుకనో గాని, "ప్రేమ" అన్న భావంలోనే... శృంగారపు గాఢతలోనో... నేను ఇంతదాకా నిజంగా సంలీనమయ్యానన్పించిలేదు నాకు. అసలీభావాలు స్థిరమనీ... శాశ్వతమనీ కూడా నేననుకోలేదు.

ఏదో వెలితి, చాలా చదువుకున్న తర్వాత కూడా - విజ్ఞానమూ నా లోపలి శూన్యాలనీ పూడ్చలేని వెలితి తాలూకు కొస అంచులేవో ఇప్పుడు అమ్మమ్మ మాటల్లో దొరుకుతున్నట్లే అన్పించింది నాకు. మేము మసక చీకట్లని వెలిగించుకోగల దీపశిఖగా ప్రజ్వలింప చేసుకోలేకపోయామా? అనుకున్నాను. ఇలా చదువుల వెంటా, ఉద్యోగాల వెంటా పేరు ప్రఖ్యాతుల వెంటా, ప్రపంచాలు తిరుగుతూ పరుగులు పెట్టే తొందరలో ప్రాణధారమైన వాటినెన్నో జారవిడుస్తున్నామా? అని కూడా అనుకున్నాను. నాలో ఎంతకీ వదలని అసంతృప్తుల ఆది మూలాలేవో అమ్మమ్మ ఇలా చెప్పకనే చెప్పి నన్ను మేల్కొలిపిందా? ఏమిటి కావాలి నాకు? ఎందుకీ భయాలు నాలో? వేటి గురించి? ఇంత అనుభవం తర్వాత కూడా??!

వెన్నెల్లో పడుకుని. ఆలోచిస్తూ చాలాసేపు ఒంటరిగా అలా మిగిలిపోయాను. ఎప్పుడో... తాతయ్య నిద్రపోయిన తరువాత నా ప్రక్కనే వచ్చి, నిశ్శబ్దంగా పడుకుని నా తల నిమురుతూ... నా భయాలన్నీ తనకి తెలుసన్నంత నమ్మకంగా నన్ను దగ్గిరికి తీసుకుంది అమ్మమ్మ. ఎక్కడా దొరకని విశ్రాంతి - అమ్మమ్మ గుండెల్లో మొహం దాచుకుంటే దొరికింది. నాకు. నా వీపు మీద చేయి వేసి రాస్తూ... చెవిలో గుసగుసగా అమ్మమ్మ నాతో మాట్లాడిన ఒక్కొక్క మాటా నేను మరిచిపోలేనివి.

మా అమ్మమ్మ రసోచిత వ్యక్తిత్వం వెనక దృశ్యాదృశ్యంగా తారాడే ఆయనెవరో తెలుసుకోవాలన్న కోరికని అణచుకోలేకపోయాను. ఇంకా... నిద్రలోకి జారుకోబోయే క్షణాన... చివరికి చొరవ సేసి... "అమ్మమ్మా! ఆ... ఆదిరాజు వారి కుర్రాడూ..." అంటూ... ఆర్ధోక్తిలో ఆగిపోయాన్నేను.

చిక్కటి చీకట్ల మధ్య పాలపుంతవైపు తల తిప్పి చూస్తూ... తన చూపులో నక్షత్రాలు ప్రతిఫలిస్తుంటే... "నీలకంఠశాస్త్రి" అంది అమ్మమ్మ!


మా మావయ్య పేరు ఎవరిద అప్పటికి నాకు అర్ధమైంది.

***

 

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు
niradharam