Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahithee vanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

పుస్తక సమీక్ష: సమ్మాన్యుడు - సిరాశ్రీ

Book Review - Sammaanyudu

పుస్తకం: సమ్మాన్యుడు
రచన: శ్రీరామ శాస్త్రి
మూల్యం: 100/-
ప్రతులకు: 9440066633, 9885066633


రిత్ర పాఠాల్లో రాజుల గాధలు ఉంటాయి కానీ, సామాన్యుల జీవితాలు ఉండవు. కవులు, కథకులు చేసిన రచనల్లో సామాన్యుల కథలు కొన్ని ఉన్నా, అందులో కల్పనలు కలిసి సహజత్వం కోల్పోయి కథలుగా మిగిలాయే తప్ప చరిత్రగా నిలబడ్డవి లేవు. కనుక చరిత్రలో సామాన్యుడి కథలు ఉండవు. ఒకవేళ ఉంటే వాడిని సామాన్యుడు అనం. కీర్తికి నోచుకోని వాడిని సామాన్యుడు అంటుంది లోకం. ఒక మనిషికి ధనం, ధైర్యం, జ్ఞానం కంటే కీర్తి గొప్ప సంపద. ఎందుకంటే ఆయువు తీరినా బతికుంచేది అదే. లోకానికి తెలియనంత వరకు సామాన్యుడు. ఇక తెలిసాక అసామాన్యుడు. ఏదో విషయం లేనిదే లోకం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చూపదు. ఆసక్తి చూపాక విశేషం ఉంటే తప్ప ఆ వ్యక్తికి చరిత్రలో చోటివ్వదు.

ఇక్కడ ప్రస్తావిస్తున్న పుస్తకం "సమ్మాన్యుడు". గత వారం విడుదలయ్యింది. అట్ట మీద ఉన్నది చేంబోలు యోగి గారు...అనగా ప్రఖ్యాత తెలుగు సినీ గీత రచయిత సీతారామ శాస్త్రి గారి తండ్రి గారు. ఈ విశేషం పుస్తకంలో పేజీలు తిప్పనిస్తుంది. ఆ పుటల్లోని విషయం యోగి గారిని చరిత్రకెక్కిస్తుంది.

ఇక విషయంలోకి వెళ్దాం.

ఎప్పుడో 37 సంవత్సరాల క్రితం 40 ఏళ్ల వయసులో శరీరం విడిచిన తమ తండ్రి గారి గురించి తనయులు వ్రాసిన పుస్తకమిది. ఇందులో వారు వ్రాసిన విషయాలతో పాటు, తమ తండ్రి గారిని దగ్గరగా గమనించిన ఆయన సమకాలికుల చేత కూడా వ్యాసాలు వ్రాయించారు. ఇందులో విశేషం ఏముంది..ఒక సావెనీర్ లాగ..! అంతేకదా..అనిపించడం సహజం. కానీ మెట్రిక్ వరకు చదివిన తమ తండ్రిగారు (శ్రీ సి వి యోగి) ఇంగ్లీషు, అరబిక్, ఉర్దు, తమిళ్, సంస్కృతం, హిందీ, పార్శీ, గణితం, భౌతిక శాస్త్రం, ఎకనామిక్స్, వైద్య శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు వంటి అంశాల్లో కేవలం ప్రవేశం కాకుండా సాధికారిక ప్రావీణ్యం సంపాదించడం ఎలా సాధ్యమయ్యింది? అది కూడా కేవలం 4 పదుల వయసులో..!!? ఏకంగా ఆయా విభాగాల్లో పీజీ చదివే వారికి ట్యూషన్స్ చెప్పే స్థాయిలో..!? ఇదొక ఎత్తైతే, ఇంత విశేష ప్రతిభ ఉన్నా కీర్తి కాంక్ష లేకపోవడం, ఆడంబరాల జోలికి పోకపోవడం, జగజ్జేతగా కన్నా గొప్ప తండ్రిగా కితాబులందుకోవడం ఎలా కుదిరింది? అసలు ఈ పుస్తకంలో ఉన్నది నిజమేనా? పితృ భక్తితో తనయులు కాస్త ఎక్కువ చెపుతున్నారా? ...ఇలాంటి ప్రశ్నలు ఈ పుస్తకం చదివే క్రమంలో పాఠకులకి కలిగినా, సహేతుకమైన వివరణలతో విజ్ఞులు వ్రాసిన వ్యాసాల వల్ల ఆ ప్రశ్నలన్నింటినీ బద్దలుకొడుతూ సమాధానాలు చెబుతుంది ఈ పుస్తకం.

ఒకసారి ఎక్కడో విన్నాను. "రామాయణం నిజంగా జరిగిందాండి"? అని అడిగాట్ట శిష్యుడు. అందుకు గురువుగారు చెప్పిన సమాధానం, "జరిగిందంటే చాలా గొప్ప విషయం. అలాంటి ఆదర్శవంతమైన దంపతులు భూమి మీద తిరిగారా, అని ఆశ్చర్యం వేసి భక్తి పుడుతుంది. అది భక్తి యోగం. జరగలేదంటే ఇంకా గొప్ప విషయం. మహాకవి లోకానికి ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలో నిజంగా జరిగినంత గొప్పగా చెప్పాడు. అనుసరిస్తే బాగుంటుందన్న ఆలోచన పుడుతుంది. అది కర్మ యోగం", అన్నారట.

ఈ పుస్తకం చదివిన పాఠకులందరికీ పైన చెప్పిన ఏదో ఒక అనుభూతి కలుగుతుంది. కనుక రచయిత కృషి సార్ధకమైనట్టే.

ఈ పుస్తకంలో సీతారామ శాస్త్రి గారు వ్రాసిన 23 పేజీలు తండ్రులందరికీ ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. చదివి తీరాలి. కొన్ని సంఘటనలు పాఠకుల్ని నిశ్చేష్టుల్ని చేస్తాయి. ముఖ్యంగా 39 వ పేజీలోని సంఘటన హృదయకంపం తెప్పిస్తుంది.

కొక్కిరిగడ్డ శ్రీరామ మూర్తి గారి వ్యాసం నవ్విస్తూనే ఆశ్చర్యానికి గురి చేసే సన్నివేశాలతో రక్తి కట్టిస్తుంది.

ఇక ముఖ్యంగా చెప్పుకోవల్సినది ఈ పుస్తక ప్రధాన రచయిత శ్రీరామ శాస్త్రి గారి గురించి. వీరు వ్రాసిన వ్యాసాలు (తెలుగుగైనా, ఇంగ్లీషైనా) చాలా తేలిక భాషలో ఉంటూ గుండెకు దగ్గరగా సాగాయి. "మానవుని అశక్తతను నగ్నంగా నడి రోడ్డు మీద నిలబెట్టేదే చావు", అన్న వారి వాక్యం ఒక కోటబుల్ కోట్. వీరు వ్రాసిన చివరి వ్యాసం చదివితే చావంటే భయం చాలా వరకు తగ్గుతుంది (అది ఉన్న వాళ్లకి). నిజానికి చనిపోయే వాడి నొప్పికంటే, కుటుంబ సభ్యుణ్ణి పోగుట్టుకున్న వాళ్ల బాధే పెద్దది. అంత బాధని తట్టుకోవడానికి అవసరమయ్యే జ్ఞాన సర్వస్వాన్ని సహేతుకంగా అందించారు ఈ వ్యాసంలో.

"ఒక మనిషి గురించి పుస్తకం రాయడం చాలా సులువు. ఆ మనిషియొక్క ఆదర్శాలను పాటించడం చాలా కష్టం. అలా ఆదర్శాలను పాటిస్తున్న మా కుటుంబాన్ని గత 35 సంవత్సరాలుగా చూస్తున్నాను" అని యోగి గారిని ఎప్పుడూ చూడని ఆయన కోడలు అన్నారంటే ఆ కుటుంబంలో సంస్కారం అర్ధమౌతుంది.

ఇంకా ఇందులో పలువురు కుటుంబ సభ్యులు, ఆప్తులు వ్రాసిన వ్యాసాలన్నీ ఒక్కోటీ ఒక్కో విషయన్ని విశద పరుస్తాయి. కొందరు యోగి గారి ప్రజ్ఞని విశ్లేషిస్తే, కొందరు వారి దాయార్ద్ర హృదయాన్ని వివరించారు. ఇంకొందరు వారిలోని హాస్య చతురతని తెలిపారు. అన్నీ సంఘటనలతోను, స్వానుభవాలతోను ముడిపడి ఉండడం వల్ల మనసుని పట్టుకుంటాయి.

నిజానికి ఈ పుస్తకం చదవడం పూర్తయ్యే సరికి పాఠకులకి కీ శే సి వి యోగి తమకు బాగా పరిచయమున్నవారు అనే భావం కలుగుతుంది. ఆయనపై మక్కువ, భక్తి పెరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వివేకానందుడు లేకపోతే పరమహంస కీర్తి దక్షిణేశ్వరానికి పరిమితమయ్యేది. అలాగే సీతారామశాస్త్రిగారికి కీర్తి, శ్రీరామ శాస్త్రిగారికి స్ఫూర్తి లేకపోతే బహు భాషావేత్త, జ్ఞాన నిధి, సార్ధక నామధేయులు అయిన కీ శే యోగి ఉనికి కాలగర్భంలో కలిసిపోయేది.

సమ్మాన్యుడైన తండ్రి జీవన విధానాన్ని స్ఫూర్తిదాయకంగా గ్రంథస్థం చేసిన తనయుల సత్సంస్కారాన్ని ప్రశంసించాల్సిందే.

నోట్: ఈ పుస్తకం కావల్సిన వారు పైన పేర్కొన్న ఫోన్ నంబర్లకు కాల్ చేయండి.

మరిన్ని శీర్షికలు
duradrushtapu dongalu