Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

హేట్సాఫ్ పవర్ స్టార్!

hats off powerstar

సినిమా షూటింగుల్లో యూనిట్ అందరికీ ఆరారా కాఫీలు అందిస్తూ, టిఫిన్లు, భోజనాలు వండి వడ్డిస్తుండే డిపార్ట్ మెంట్ ఒకటుంటుంది. దాన్నే ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ అంటారు. అతి తక్కువ గుర్తింపుకు నోచుకునే విభాగం కూడా ఇదే!

33 సంవత్సరాలుగా ఈ విభాగంలోవుంటున్న ప్రొడక్షన్ చీఫ్ ప్రకాష్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తించి, గొప్ప గౌరవాన్ని కల్పించారు మొన్న ‘గబ్బర్ సింగ్-2’ ప్రారంభోత్సవంలో.

అదెలాగంటే, సాధారణంగా సినిమా షూటింగ్ ఓపెనింగ్స్ లో కెమెరా స్విచ్చాన్, క్లాప్, ఫస్ట్ షాట్ డైరెక్షన్... వీటిని సెలబ్రిటీలతోనే చేయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమాకి ప్రొడక్షన్ చీఫ్ ప్రకాష్ తో కెమెరా స్విచ్చాన్ చేయించి తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నారు పవర్ స్టార్.

ఇదెలా జరిగిందని ప్రకాష్ ని అడిగితే... 'పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” సినిమాకి నేను ప్రొడక్షన్ చేశాను. ఆ టైంలో ఆయన నాతో చాలాసార్లు స్నేహపూర్వకంగా మాట్లాడేవారు. 'గబ్బర్ సింగ్' సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్.. మీ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది అనేవాడిని. 'ఏదో మీ అభిమానం ప్రకాష్ గారూ!’ అనేవారాయన. సినిమా అంత పెద్దహిట్టూ అయ్యింది. నాకు మణికొండలో మెస్ వుండేది దానికి ’గబ్బర్ సింగ్’ మెస్ అని పేరు పెట్టాను. ఆయనే ‘గబ్బర్ సింగ్-2’ సినిమాకి నన్ను రికమెండ్ చేశారు’ అన్నాడు కృతజ్ఞతా పూర్వకంగా.

అసలారోజు ఏం జరిగిందని అడిగితే...   ‘గబ్బర్ సింగ్-2’ ముహూర్తానికి వచ్చిన గెస్ట్ లకి, టీ, కాఫీలు, టిఫిన్లు అందిస్తున్నాను. హీరోగారు నన్ను పిలిచి, ప్రకాష్ గారూ ఓ అరగంట పాటు మీరు ఈ పనులు మీ అసిస్టెంట్లకి అప్పజెప్పి ఖాళీ చేసుకోండి. నేను పిలుస్తాను అన్నారు. ఎందుకు అని నేను అడగలేదు. సరేసార్ అన్నాను. కాస్సేపయ్యాక ఆయన పిలిచారు. గుడిలో పూజముగిసి ఫస్ట్ షాట్ కి ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ సంపత్ నంది.

“కెమెరా స్విచ్చాన్ మన ప్రకాష్ గారు చేస్తారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు సడన్ గా. నేను అందరితో పాటు నేనూ ఆశ్చర్యపోయి అయోమయంగా చూశాను. ’రండి’.. అని పిలిచి కెమెరా ఎలా ఆన్ చేయాలో చూపించారాయన. అలాగే చేశాను. అంతపెద్ద హీరో నన్ను గుర్తుపెట్టుకోడం, ఇలా గౌరవించడం ఇప్పటికీ కలలాగే వుంది సార్. అన్నాడు ప్రకాష్ ఆనందంతో వచ్చిన కన్నీళ్ళను తుడుచుకుంటూ.

దటీజ్ పవర్ స్టార్!!!

ఇంతకీ ఈ ఆర్టికల్ నేనెందుకు రాయాల్సివచ్చిందంటే.. నేను ’సితార’ జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పటినుంచీ ప్రకాష్ తో నాకు మంచి పరిచయం వుంది. నేను బేచిలర్ గా వున్న రోజుల్లో నాకోసం పచ్చళ్ళు, పొడులు ప్రేమగా తెచ్చి ఇచ్చేవాడు. షూటింగుల్లో ఎవరైనా సరిగా భోజనం చేయకపోతే తనవంట బాగోలేదేమోనని తెగ బాధపడిపోయేవాడు. ’ఇవాళ మావిడికాయ పప్పు సార్.. కొంచెం నెయ్యేసుకోండి. ఇదిగో ఈ ఆవకాయ కలుపుకోండి” అని కొసరి కొసరి వడ్డించేవాడు. ఎవరు కాఫీ తాగుతారో, ఎవరు టీ తాగుతారో అన్నీ గుర్తుపెట్టుకునేవాడు...

“ప్రకాష్.. నువ్వు ఇలా భోజనం పెడితే.. షూటింగ్ చేయడం మానేసి నిద్రపోవాలనిపిస్తుందయ్యా” అని యూనిట్ అంతా ప్రకాష్ ని ప్రేమగా తిట్టుకునేవారు. ప్రకాష్ తన కొడుకుని హీరో ని చేసే ప్రయత్నాల్లో వున్నాడు. తనకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

- భాస్కరభట్ల

మరిన్ని సినిమా కబుర్లు
reddygaru atakekkaru