Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-14 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

రాజ‌మౌళి సినిమాలో విల‌న్‌గా న‌టించాల‌నుకొన్నా! - సునీల్‌

Interview with Sunil

ఆ(య్‌... మాది భీమ‌వ‌రం అండీ.. అంటూ గోదావ‌రి యాస‌తో డైలాగులు చెప్పి క‌వ్వించాడు.. న‌వ్వించాడు.. కిత‌కిత‌లు పెట్టించాడు సునీల్‌. కామెడీ వేషాల‌తో బిజీగా ఉన్న‌ప్పుడే హీరోగా టర్న్ తీసుకొన్నాడు. అయితే అది సునీల్ కెరీర్‌లో ఎదురైన అతిపెద్ద స‌వాల్‌. ఎందుకంటే క‌మెడియ‌న్లు హీరోలుగా మారారు గానీ, నిల‌దొక్కుకొన్న‌వాళ్లే లేరు. అయితే హీరోయిజాన్ని మాత్రం సునీల్ కామెడీగా తీసుకోలేదు. హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ మెల్లిమెల్లిగా తెచ్చుకొన్నాడు. స్వ‌త‌హాగా డాన్స‌ర్‌, దానికి తోడు సిక్స్ ప్యాక్ కూడా చూపించాడు. త‌న శైలి కామెడీని మాత్రం అస్స‌లు వ‌దులుకోలేదు. అందుకే హీరోగానూ నిల‌బ‌డ్డాడు సునీల్‌. అప్ప‌ల్రాజు, మిస్ట‌ర్ పెళ్లికొడుకు నిరాశ ప‌రిచినా.. త‌డాఖాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఇప్పుడు భీమ‌వ‌రం బుల్లోడు గా మ‌రోసారి థియేట‌ర్ల‌లో న‌వ్వులు పంచుతున్నాడు. ఈనెల 28న పుట్టిన‌రోజు జ‌రుపుకొంటున్న సునీల్‌తో.. ప్ర‌త్యేక చిట్ చాట్ ఇది.

* భీమ‌వ‌రం బుల్లోడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు...
- (న‌వ్వుతూ) థ్యాంక్సండీ.

* ఊరు పేరును సినిమా టైటిల్ చేసేశారు.. పుట్టిన ఊరు రుణం తీర్చుకోవ‌డానికా?
- భీమ‌వ‌రం నుంచి.. హైద‌రాబాద్ వ‌చ్చా. ఇక్క‌డ నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నా!  నేనీ స్థాయికి రావ‌డానికి భీమ‌వ‌రం కూడా ఓ కార‌ణ‌మే. ఆ పేరు.. ఇలా త‌ల‌చుకోవ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమాపై ఎలాంటి త‌మాషా పేరైనా పెట్టొచ్చు. కానీ.. భీమ‌వ‌రం బుల్లోడు అనేది బాగా కుదిరింది. అందుకే ఈ టైటిల్ నిర్ణ‌యించాం. నేను భీమ‌వ‌రం నుంచి వ‌చ్చినా... నాపై అంద‌రి ఆశీస్సులూ ఉన్నాయి. అది నా అదృష్టం.

* మీ భీమ‌వ‌రం బుల్లోడు నుంచి ఎలాంటి అంశాలు ఆశించొచ్చు..
- నేను హీరో అయ్యాక‌.. కామెడీకి దూర‌మ‌య్యానేమో.. అనే అనుమానం ఉంది. కొంత‌మంది మిత్రులు నాతో ఇదే మాట అన్నారు. హీరో అంటే అన్నీ చేయాలి క‌దండీ. ఆ ప్ర‌య‌త్నంలో కామెడీ కాస్త త‌గ్గిందనిపించింది. భీమ‌వ‌రం బుల్లోడులో మాత్రం.. ఆ లోటు రానివ్వ‌లేదు. నా సినిమా అంటే న‌వ్వుకోవ‌డానికి వ‌స్తార‌న్న సంగ‌తి నాకూ తెలుసు. వాటిని అందించేయాలి. అందుకే ఈ సినిమాలో.. వినోదానికి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. ఇక డాన్సులు, ఫైటింగులూ మామూలే. నాతో పాటు చాలా పాత్ర‌లున్నాయి. వాటికి ప్రాధాన్యం కూడా ఉంది.

* హీరో అనే ట్యాగ్ లైన్ భారంగా అనిపిస్తోందా..?
- అస్స‌ల్లేదండీ. ఆ ఊహే రాలేదు.

* కానీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి చాలా చేయాలి క‌దా? ముఖ్యంగా డాన్సులు..
- వాటి కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా. ఇప్ప‌టికీ ప‌డుతున్నా. మీర‌న్న‌ట్టు డాన్సుల్లో వైవిధ్యం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్నా. మోకాళ్ల‌మీద నిల‌బ‌డి.. స్టెప్పులేశా. అవి చూసి న‌న్ను నీ - స్టార్ అనే పేరుతో పిల‌వ‌డం మొద‌లెట్టారు. కమెడియ‌న్ నుంచి హీరో అయ్యా క‌దా? నేను కొడితే విల‌న్ ప‌డ్డాడ‌నుకోండి.. జ‌నం న‌మ్మ‌రు. అందుకే సిక్స్ ప్యాక్ చేశా. ఇప్పుడు నేను కొట్టినా, ఎదుటివాడు ప‌డినా.. అందంగా ఉంటుంది.

* సిక్స్ ప్యాక్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు క‌దా?
- మామూలుగా కాదులెండి. పాత బ‌స్తీలో త‌యారైన సిక్స్ ప్యాక్ ఇది. అక్క‌డ వ్య‌వ‌హారం చాలా మోటుగా ఉంటుంది. కానీ... ఫ‌లితం నీట్‌గా వ‌స్తుంది. ఈ ప్ర‌యాణంలో చాలామంది హీరోలు నన్ను ప్రోత్స‌హించారు. వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి. ముఖ్యంగా మ‌హేష్‌బాబు స‌ల‌హాల్ని మ‌ర్చిపోలేను. నువ్వు చేయ‌గ‌ల‌వ్‌.. చేయ్‌... అంటూ భుజం త‌ట్టేవారు. ప్ర‌భాస్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. ఒక్క‌రేంటి అంద‌రూ న‌న్ను త‌మ‌వాడిగా చూసుకొన్నారు.

* త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మీరు న‌టిస్తార‌నే వార్త‌లొచ్చాయి. అవి ఇంకా నిజం కాలేదేంటి?
-  త్రివిక్ర‌మ్‌, నేనూ మిత్రుల‌మే. అయితే త‌న స్థాయి వేరు. నా కోసం మెట్టు దిగ‌డం నాకే న‌చ్చ‌దు. త‌న సినిమాల్లో చిన్న వేషం ఇచ్చినా చేయ‌డానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే తాను మాత్రం.. నువ్వు నీలానే ఉండు.. అంటుంటాడు. మా ఇద్ద‌రి కాంబినేషన్‌లో ఓ సినిమా త‌ప్ప‌కుండా ఉంటుంది. అయితే ఎప్పుడు?  అనేది నేనూ చెప్ప‌లేను.

* త్రివిక్ర‌మ్‌ని ద‌గ్గ‌రుండి గ‌మ‌నించారు. ఆయ‌న సినిమాల్లోకి రాక‌ముందు నుంచీ మీకు తెలుసు క‌దా...? ఆయ‌న‌లో టాలెంట్ మీకు ముందే గుర్తుప‌ట్టారా?
- త్రివిక్ర‌మ్ ఈ స్థాయికి వ‌స్తాడ‌ని ఎవ్వ‌రూ అనుకోక‌ముందే.. నాకు తెలుసు. ఎందుకంటే.. త‌న‌లో చాలా చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడు చూసింది కొంచెమే. ఓ గుండ‌మ్మ క‌థ‌.. ఓ మాయాజ‌జార్‌లాంటి సినిమాలు తీయ‌గ‌ల స‌త్తా.. ఉన్న ద‌ర్శ‌కుడు. అత‌ని నుంచి అలాంటి గొప్ప సినిమాలు త‌ప్ప‌కుండా చూస్తాం. బాగా చ‌దువుకొన్న వ్య‌క్తి.. ఏ విష‌యాన్న‌యినా నిశితంగా ఆలోచిస్తాడు. నిడారంబ‌రంగా ఉంటాడు. ఇవే త్రివిక్ర‌మ్‌ని గొప్ప‌వాడిగా తీర్చిదిద్దాయ‌న్న‌ది నా న‌మ్మ‌కం.

* స్టార్ హీరోల‌తో పోటీ ప‌డి డాన్సులు చేస్తుంటారు. వారిలో మీకు న‌చ్చిన డాన్స‌ర్ ఎవ‌రు?
- అప్ప‌టికీ ఇప్ప‌టికీ డాన్సులంటే చిరంజీవి అన్న‌య్య‌వే. ఆయ‌న త‌ర‌వాతే.. ఎవ‌రైనా. చ‌ర‌ణ్‌, బ‌న్నీ, ఎన్టీఆర్‌... అంతా సూప‌ర్బ్‌గా చేస్తున్నారు. ఎవ‌రి శైలి వారిదే.

* అప్ప‌ల్రాజు, మిస్ట‌ర్ పెళ్లికొడుకు సినిమాలు నిరాశ‌ప‌రిచాయి. ఆ క్ష‌ణాల్లో ఏమ‌నుకొన్నారు?
- నాకు ఎలాంటి క‌థ‌లు న‌ప్ప‌వో అర్థ‌మైంది. ప్ర‌తి విష‌యాన్నీ పాజిటివ్‌గా తీసుకోవ‌డం నాకు అల‌వాటు. ఆ ఫ్లాపుల నుంచి కూడా పాఠాలు నేర్చుకొన్నా.

* ఇక మీదట ఎలాంటి క‌థ‌ల్ని ఎంచుకొంటారు?
-  ఫ‌స్ట్ సీన్ నుంచి.. ప్రేక్ష‌కుల్ని న‌వ్వించాలి. మ‌ధ్య మ‌ధ్య‌లో డాన్సులు,  ఫైటింగులూ.. అందులోనే కాస్త కొత్త‌ద‌నం చూపించాలి. నిర్మాత‌ల‌కు నాలుగు డ‌బ్బులు మిగ‌లాలి. అలాంటి క‌థ‌ల్ని ఎంచుకొంటా.

* మీ క‌ల‌ల పాత్ర ఏమైనా ఉందా?
- విల‌న్‌గా క‌నిపించాల‌ని వుంది. ఛ‌త్ర‌ప‌తిలో కాట్రాజు చేశాడే.. అలాంటిది. రాజ‌మౌళిగారికి ఈ విష‌యం చెప్పా. సార్‌.. మీ సినిమాలో విల‌న్‌గా క‌నిపిస్తా అని అడిగా. ఈ స‌మ‌యంలో ర‌మ‌గారు అక్క‌డే ఉన్నారు. `ఆయ‌న నీలో హీరోని చూస్తుంటే నువ్వు విల‌న్ అంటావేంటి?` అన్నారు. ఆ త‌ర‌వాత రాజ‌మౌళి గారితో మ‌ర్యాద రామ‌న్న సెట్స్‌పైకి వెళ్లింది. ఎప్ప‌టికైనా స‌రే... విల‌న్‌గా మెప్పిస్తా.

* ప్ర‌స్తుతం చేయ‌బోతున్న చిత్రాలు.
- నాలుగు సినిమాలున్నాయి. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తా.

* ఆల్ ది బెస్ట్ సునీల్‌..
- థ్యాంక్యూ

- కాత్యాయని

 

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Bheemavaram Bullodu