Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

క ఆలోచన వచ్చింది కిట్టుకి,

ఇంటి పక్కనే "కేజీయార్" కాలేజీ ఉంది కదా... ట్యూషన్ ఫీజు కట్టేసి, కాలేజీలో చేరిపోతే?

వెంటనే ఆలోచనని అమలులో పెట్టాడు కిట్టు. కాలేజీ వాళ్ళని పర్మిషన్ అడిగాడు. వాళ్లు ఒకే అన్నారు.

ఫీజు కట్టి కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాడు.

ఒకసారి దెబ్బతిన్నాడు కాబట్టి ఈసారి కొంచెం చదువు మీద దృష్టి పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో కాలేజిలో తెలుగు లెక్చరర్... ఎమ్.ఎస్.నారాయణ గారు...ఇప్పటి తెలుగు సినిమా కమెడియన్... ఆయన క్లాసుకు ఆయన స్టూడెంట్సే కాక, ఇతర స్టూడెంట్స్ కూడా హాజరయ్యేవారు. క్లాస్ ఎప్పుడూ కిక్కిరిసిపోయి ఉండేది. బోటనీ, జువాలజీ లాంటి ఇతర క్లాసులకు వెళ్ళాల్సిన స్టూడెంట్స్...తమ తమ క్లాసులు ఎగ్గొట్టి మరీ ఎమ్మెస్ గారి క్లాసులకు హాజరయ్యేవారు.

తెలుగు ప్రజలకు తెలియని కోణం ఒకటుంది ఆయనలో...

రీజనబుల్ గా, హేతుబద్ధంగా ఆలోచిస్తారాయన...

'వెధవా... నీ ఒంటికి మురికి ఉంది, దాన్ని వదిలించుకోవడానికి పక్కనే పారుతున్న నది ఉంది... అందులో దూకి మురికి వదలగొట్టుకోవడం మానేసి... ఈ నది ఎక్కణ్ణుంచి వస్తుంది? ఏఏ ప్రాంతాల మీదుగా వస్తుంది? ఈ నదికి తాత తండ్రులు ఎవరు? లాంటి ముష్టి ప్రశ్నలు వేస్తావెందుకురా.' అంటూ చెప్పేవారాయన... విద్యార్ధులంతా ఆయన క్లాసును ఎంజాయ్ చేసేవాళ్లు...

ఇక కిట్టు, నెమ్మదిగా 'ఎమ్.ఎస్.ఎమ్' బండి ఎక్కుతూ, దిగుతూ ఇంటర్ పాసయ్యాడు.

ఎమ్మెసెమ్ బండి అంటే... మార్చి, సెప్టెంబర్, మార్చి అని... అనగా, మార్చిలో పరీక్షరాయి, ఫెయిలయితే సెప్టెంబర్ లో రాయి, మళ్లీ ఫెయిల్ అయితే మార్చి ఉండనే ఉంది కదా... అదీ దాని అర్ధం.

'ఇంటర్ పాసయ్యావు కదా...' బియ్యెస్సీలో చేరిపో అన్నారు కిట్టు నాన్నగారు.

అమ్మో...

మళ్లీ మూడేళ్ళు తిట్లు తినాలా? రికార్డులు మొహం మీదకు విసిరికొట్టించుకోవాలా? నా వల్ల కాదు... అనుకున్నాడు కిట్టు.

ఈలోపు బియ్యెస్సీ వాళ్లని... గాయపడ్డ సైనికులు అంటారని తెలుసుకున్నాడు కిట్టు.

ఎందుకంటే...

బైపీసీ వాళ్లు డాక్టర్లు కావడానికి ప్రయత్నిస్తారు. ఎంపీసీ వాళ్లు ఇంజనీరు కావడానికి ప్రయత్నిస్తారు. డాక్టరు, ఇంజనీరింగ్ సీట్లు రానివారు... తప్పని సరియై బీయస్సీ లో చేరతారు. వీళ్లు యుద్ధంలో నెగ్గుదామని వెళ్లారు.

యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి వీళ్లు గాయపడ్డ సైనికులు, కొత్తగా నేర్చుకున్న ఈ పోలిక కిట్టు బుర్రలో నాటుకుంది.

అసలు యుద్ధానికి, చదువుకి సంబంధం ఏమిటి? పోలిక ఏమిటి? ఇదేదో విచిత్రంగా ఉంది, కానీ చూడబోతే రీజనబుల్ గానే ఉంది. యుద్ధానికీ, చదువుకీ చాలా దగ్గర సంబంధం ఉందనే విషయం తర్వాత తర్వాత కిట్టుకి ఇంకా బాగా అర్ధమయ్యింది.

బియ్యెస్సీ చదివి, ఆపై పెద్ద పెద్ద చదువులు చదివి, గొప్ప వాళ్లైన వాళ్లు చాలామంది ఉన్నారు... అది వేరే విషయం.

బియ్యెస్సీ కాకపోతే మరేం చేయాలి?

ఏం చేయాలి? పక్కింటాయన "పాలిటెక్నిక్" చదివి, పంచాయితీరాజ్ లో సూపర్ వైజర్ అయిపోయాడు. మంచి ఉద్యోగం... ఇదే బాగున్నట్లుంది... అనుకున్నాడు కిట్టు...

అంతకు ముందు 10వ తరగతి మార్కులను బట్టి పాలిటెక్నిక్ సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా ఎంట్రన్స్ పెట్టారు. వెంటనే అది రాసాడు కిట్టు.

ఈ పాలి టెక్నిక్కులో ఉన్న టెక్నిక్కు ఏమిటంటే... ఉద్యోగం తొందరగా వస్తుంది. లైఫ్ సెటిలైపోతుంది. అందుకే చాలా మంది పాలిటెక్నిక్ లో చేరతారు. ఈ ఎంట్రన్స్ పరీక్ష పాసయ్యాడు కిట్టు...

అత్యధిక ర్యాంకుతో...

***

పాలిటెక్నిక్ అనేది ఒక పెద్ద ప్రపంచం.

హోమియోపతి డాక్టర్, సిరామిక్స్ (పింగాణీ) టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, మెటలర్జీ, కమర్షియల్ ప్రాక్టీస్ (ఇది చదివితే ఆఫీసులో అందరికీ తలలో నాలుకలా అయిపోవచ్చంట) లాంటి సబ్జెక్టులు కాక, ఇంజనీరింగ్ లో ఉండే అన్ని బ్రాంచీలు ఉంటాయి. ఈ కొత్త విషయాలు కిట్టుకి చాలా ఆసక్తి కలిగించాయి.

ఎమ్ సెట్ రాసిన వాళ్లకి భారీఎత్తున కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో, ఆ రేంజ్ లో కౌన్సిలింగ్ జరిపారు పాలిటెక్నిక్ వాళ్లు... ఇదొక విచిత్రం కిట్టుకి... ఇలా కూడా జరుగుతుందా? ఎవరికి ఏ కాలేజిలో సీటు వస్తుందో... ఏ ఊర్లో సీటు వస్తుందో... కౌన్సిలింగ్ ద్వారానే తెలుస్తుంది. ఎక్కడ సీటు వస్తే అక్కడ చేరాలి.

కిట్టుకి వచ్చిన "అత్యధిక ర్యాంకు" ను బట్టి "కంభం" లో సీటు వచ్చింది.

ఊ... అనకపోతే అది కూడా పోతుంది. సరే అనేసాడు కిట్టు.

కంభం అనగానే అందరికీ ఖమ్మం గుర్తుకు వస్తుంది.

ఖమ్మం వేరు...

కంభం వేరు...

గుంటూరులో ట్రైను దిగి, నేరోగేజి పట్టాలపై వెళ్లే చిన్న రైలు ఎక్కాలి.

మార్కాపురం, తర్లుపాడు దాటిన తరువాత... కంభం వస్తుంది.

మార్కాపురం, పలక పరిశ్రమకు ప్రసిద్ధి. తర్లపాడులో బియ్యీడీ కాలేజి ఉంది. అందుకని తర్లపాడు చాలామందికి తెలుసు. గుంటూరు వరకు వెళ్లి, అక్కణ్ణుంచి చిన్న రైలెక్కారు కిట్టు, వాళ్ల నాన్నగారు. ఆ రైలులో మేకలు, కోళ్లు కూడా ఎక్కించేశాడు. కొందరు చుట్ట తాగుతున్నారు. అంతా అయోమయంగా ఉంది కిట్టుకి.

కిట్టు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తే...

పెన్నాడ నుండి భీమవరం వెళ్లేవాడు. భీమవరంలో రైలు అనగానే... వాళ్ల నాయనమ్మ కంగారుగా కిట్టుని, కిట్టు వాళ్ల అన్నయ్యని, గట్టిగా పట్టుకుని 'ఆగండ్రా' అని పెద్దగా అరిచేది. ఎందుకంటే రైలు ఆగిన తర్వాత ఒక "కుదుపు" వస్తుంది. ఆ కుదుపు సర్దుకున్నాక, అప్పుడు దిగేవారు.

ఇంకా కిట్టు ప్రయాణించిన ఊర్లు...

ఆకివీడు, గుడివాడ, వేల్పూరు (వేల్పూరు జామకాయలకు ప్రసిద్ధి), నిడదవోలు, బెజవాడ. పాలకొల్లు, నర్సాపురం... లాంటివి.

రైలు కంపార్టుమెంటులో పుణుకులు, చేగోడీలు, అప్పడాలు, బెల్లంకొమ్ములు, బఠాణీలు, శనగలు, మిఠాయి ఉండలు... అమ్మేవారు.

ఈ అమ్మేవాళ్ళు వాళ్ల సరుకుని ఒక బుట్ట (జంగ్డీ అంటారు దాన్ని)లో ఉంచుతారు. ఆ బుట్టకి అర్ధ చంద్రాకారంలో ఉన్న హ్యాండిల్ ని భుజానికి తగిలించుకుని... వేగంగా పరిగెడుతున్న రైలులో, ఒక కంపార్ట్ మెంట్ నుండి ఇంకో కంపార్ట్ మెంట్ కి ఎంతో సునాయాసంగా మారేవారు. ఇప్పటిలాగా వెస్టిబ్యూల్స్ (పెట్టెని ఇంకో పెట్టెతో కలిపే దారి) ఉండేవి కాదు.

ఆర్ సీ అనే రైళ్ళు తిరిగేవి.

అవి చాలా విచిత్రంగా, హైద్రాబాద్ లోని సిటీబస్సుల్లాగా పట్టాలపై తిరిగేవి.

ఎక్కేవాడు ఎక్కడం... దిగేవాడు దిగడం...

ఈ మిఠాయిలు, పుణుకులు అమ్మేవాళ్ళు కంపార్ట్ మెంట్ లో ప్రయాణీకుల పక్కన కూర్చొని, సొంత బావమరిది తినమని ఇచ్చినట్లుగా ఇచ్చేవారు. కంపార్ట్ మెంట్ అంతా ఇదే విధంగా ఇచ్చేవారు.

డబ్బుల్దేముంది... మీరు తినండి... తినండి బాగోకపోతే డబ్బులివ్వకండి అనేవారు...

కాస్సేపాగి,

నెమ్మదిగా మళ్లీ ప్రయాణీకుల దగ్గరకు వచ్చి, డబ్బులు వసూలు చేసేసుకునేవారు.

ఒకగుడ్డివాడు కంచు కంఠంతో పాడేవాడు
ఇల్లు నాదంటావు...
డబ్బునాదంటావు...
నీ ఇల్లు ఎక్కడే సిలకా...
మూడు నాళ్ల ముచ్చటలే
ఈ జీవితం... సిలకా ll

మళ్లీ పాట మొదలెట్టేలోపు...
అమ్మా!
బాబూ!
కళ్ళులేని కబోదిని...
ధర్మం చెయ్యండయ్యా... అమ్మా... అయ్యా... అంటూ అడుక్కునేవాడు.
ఒక ముసలివాడు...
ఎముకులగూడు లాగా ఉండి, చిరిగిన పంచ, చొక్కాతో తెల్లటి గడ్డం, మీసాలతో ఉండేవాడు.

అతని చెయ్యి పట్టుకుని, మట్టిగొట్టుకుపోయిన లంగా, జాకెట్ తో ఉన్న బాలిక నడిపిస్తూ... సన్నటి గొంతుకతో... శంభోహరా...

స్వామీ దయాసాగరా...
దేవ, గిరిజావరా...
బ్రోచి ఖర శేఖరా...
నిన్నే శరనంటిరా...
నన్నే కరుణించరా...
అంటే ఎంతోశ్రావ్యంగా ఆలాపించేది.

వీళ్లకి దానం చెయ్యకుండా ఉండేవాళ్లు చాలా అరుదు.

ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు కిట్టు. రైలు శరవేగంతో పరుగులు తీస్తున్నది.

గప్పు గప్పుమని పొగవస్తున్నది. అప్పటికి జన సందోహం తగ్గింది రైలు పెట్టెలో... కిట్టు వాళ్లకి ఎదురుగా ఇద్దరు కూర్చున్నారు. వాళ్లతో మాట్లాడి తెలుసుకున్నారు కిట్టు వాళ్ల నాన్నగారు...

వాళ్లు వెళ్లేదీ కంభానికేనని... తమ్ముడిని పాలిటెక్నిక్ లో చేర్పించడానికి అన్నయ్య తీసుకువెళ్తున్నాడని.

కిట్టు వాళ్ల నాన్నగారు వాళ్లకి కూడా చెప్పాడు మేము కూడా అదే పనిమీద వెళ్తున్నామని.

ఏ బ్రాంచ్? అని అన్నయ్య అడిగాడు కిట్టుని.

"సివిల్" అన్నాడు కిట్టు.

అలాగా మా వరదరావు కూడా ఆ బ్రాంచే అన్నాడు అన్నయ్య.

కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు కిట్టు. ట్రాక్ పక్కన పొలాలు కనబడుతున్నాయి.

పొలాల్లో తెల్లని పువ్వులతో కూడిన చిన్న చిన్న చెట్లు కనబడుతున్నాయి. కిట్టుకి పరిచయమైనవి పచ్చని పంట చేలు, చేలల్లో ఆడవాళ్లు ఊడ్పులు ఊడుస్తుంటే, కట్టలుగా కట్టిన "నారు", వాళ్లకు దగ్గరగా అందించేవాడు కిట్టు. ఇక్కడ అలా లేదేమిటి అనుకున్నాడు.

నాన్నగారూ... అవేం చెట్లు? అని అడిగాను.

ఈలోపు నాన్నగారు నవ్వుకుంటూ చెప్పారు. అది పత్తిపంట అని.

కిట్టుకి ఏమీ అర్ధం కాలేదు. సైలెంట్ గా కూర్చున్నాడు.

'ఆ ప్రాంతంలో నీటి సదుపాయం అంతగా లేదనీ, నీరు తక్కువగా ఉన్నా తట్టుకోగలిగే పంట పత్తి అనీ, అక్కడి రైతులు పండించేది పత్తి అనీ, ఆ పంట... వర్షం లేక, నీరులేక, పురుగుసోకి నాశనమైతే తట్టుకోలేని రైతులు ప్రాణత్యాగం చేసుకుంటారనీ, కిట్టుకి అర్ధం కావడానికి సంవత్సరం పైనే పట్టింది.'

ఇంతలో కంభం వచ్చింది.

ఊరికి దూరంగా ఉంటుంది పాలిటెక్నిక్ కాలేజి.

అడ్మిషన్ కార్యక్రమం పూర్తయ్యింది.

కిట్టు వరదరావులు రూమ్మేట్లుగా ఒక రూమ్ తీసుకున్నారు. మెస్ ఏర్పాటు జరిగింది.

'ప్లాస్టిక్ బకెట్లు, ముగ్గులు, టూత్ పేస్ట్ లు, సబ్బులు, బట్టలు ఆరవేసుకోవడానికి ప్లాస్టిక్ తాళ్లు, పుస్తకాలు, గీతాలు గీసుకోవడానికి టీ షేపులోని పెద్దస్కేలు, ఇలా కావలసినవన్నీ కొన్నారు.'

కిట్టు నాన్నగారు, వరదారావు అన్నయ్య "బాగా చదువుకోండి" అని చెప్పి వెళ్లిపోయారు.

ఇక కాలేజికి వెళ్లడానికి రెడీ...

***

10వ తరగతి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ (మూడేళ్ళు) పూర్తయిన తర్వాత కిట్టు కొద్దిగా సాగాడు.

సాగాడు అంటే పొడుగయ్యాడు. అంతకు ముందు కిట్టుని ఎవరైనా పిలవాలి అంటే "ఒరేయ్ పొట్టోడా" అని పిలిచేవారు.

ఇంటర్ లో ఒకరోజు క్లాస్ జరుగుతుండగా కిట్టు కొంచెం లేటుగా వచ్చాడు.

ద్వారం దగ్గర నిలబడి "మే ఐ కమిన్ సర్" అన్నాడు. మాస్టారు కిట్టువైపు చూసి "కమిన్" అన్నారు.

కిట్టు ఆఖరు బెంచీకి పోయి కూర్చున్నాడు.

'ఆరడుగుల ఆజానుబాహుడండీ... వెనక్కి వెళ్లి కూర్చున్నాడు' అన్నారు మాస్టారు.

క్లాసు మొత్తం ఘొల్లుమంది.

'ముందుకొచ్చి కూర్చో...' అన్నారు మాస్టారు. గబుక్కున ముందుకెళ్లి కూర్చున్నాడు కిట్టు.

ఒక్కోసారి మాస్టారు ఏదన్నా ప్రశ్నవేసి, 'నువ్వు చెప్పరా పొట్టోడా' అనేవారు.

ఎంతో సిగ్గుగా, బాధగా ఉండేది కిట్టుకి. పొడుగవ్వాలని ఒకటే కోరికగా ఉండేది కిట్టుకి.

ఒకసారి ఏదో పత్రికలో 'పాతిక రూపాయలు కడితే మిమ్మల్ని పొడుగుచేసేస్తాం' అనే ప్రకటన చూసి, వాడికి డబ్బులు కట్టాడు కిట్టు. తర్వాత పోస్టులో ఒక పుస్తకం వచ్చింది. అందులో ఏవో పిచ్చి ఎక్సర్ సైజులు, ఎత్తు చెప్పులు వేసుకోండి, కర్ర పట్టుకుని వేలాడండి లాంటి సలహాలు ఉన్నాయి.

అవన్నీ ప్రయత్నించాడు.

ఫలితం శూన్యం...

భీమవరంలో "వెంకట్రామయ్య" గారని ప్రఖ్యాత "హోమియోపతి" వైద్యులున్నారు. ఆయన్ని కలిసి అయ్యా నన్నెలాగైనా పొడుగు చేసేయండి అని కోరాడు కిట్టు.

వెంకట్రామయ్య గారు కిట్టుతో ఇలా అన్నారు.

"ఇండియన్ జిలేబి తింటే పొడుగవుతారని హోమియోపతిలో రాసి ఉంది. హోమియోపతిని కనిపెట్టిన "హానిమన్" మహాశయుడు రాసాడో లేక ఆయన తర్వాత ఈ హోమియోపతి వైద్య విధానాన్ని అభివృద్ధిపరచిన మహానుభావులు రాసారో నాకు తెలియదుగానీ జిలేబి తింటూ ఉండు నాయనా ఫలితం కనబడవచ్చు"

ఆ తర్వాత కొన్ని గుళికలు ఇచ్చారు.

ఆయన చెప్పినట్టుగా గుళికలు వాడుతూ జిలేబి కొనుక్కొని తింటూండేవాడు కిట్టు.

కిట్టుకి సుద్దముక్క (చాక్ పీసులు) తినాలనిపించేది. ఎవరైనా చూస్తే నవ్వుతారని ఎవరికీ కనబడకుండా చిన్న చిన్న ముక్కలు తినేవాడు. ఈలోగా రన్నింగ్ చేస్తే పొడుగవుతారని ఎవరో చెపితే విని, రన్నింగ్ మొదలుపెట్టాడు కిట్టు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college drop out gadi prema katha