Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugadu inter fail ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

''మీరు సైలంట్‌ అయిపోయారు. ఎందుకని?'' తిరిగివస్తుండగా ఆమెను అడిగాడు.

''నథింగ్‌... మీ విషయంలో పొరపాటు పడ్డాను.''

''లేదు లేదు. అది పొరబాటు కాదు. ప్రేమ, స్నేహం రెంటికీ వ్యత్యాసం వుంది. ఒక్కోసారి ఇదే అది అనుకుని పొరబాటు పడుతుంటాం మనం బెస్ట్‌ఫ్రెండ్స్‌గా వుంటేనే బాగుంటుంది.''

''థ్యాంక్యూ.''

ఇద్దరూ షాపువద్దకి చేరుకున్నారు.

రావయ్యా రా నువ్వే నెగ్గావ్‌. నీ గురించి తెలీక చిత్తయిపోయాను డబుల్‌ డబుల్‌.. నాలుగు వేలకి లిస్టుప్రకారం సరుకులు రేడీచేస్తున్నారు. దగ్గరుండి రిక్షాలో తీసుకుపో. అలేఖ్యగారూ. మీ సరుకులు ఇప్పుడే మీఇంటికి పంపించాను. మీరు వెళ్ళిపోవచ్చు'' అన్నాడు షాపు ఓనరు రామారావు.

అలేఖ్య వెళ్ళిపోయింది.

అన్నమాట ప్రకారం తను నాలుగువేలకి సరుకులు తీసుకువెళుతున్నాడు. అదిచూసి తన తండ్రి గోవిందరావుగారి ముఖం ఎలా ఉంటుందో వూహించుకొని నవ్వుకున్నాడు త్రివిక్రమ్‌.

***

సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ప్రతిచోటా వుంటాయి. కొందరివి చిన్ని చిన్ని సమస్యలు కొందరివి పెద్ద పెద్ద సమస్యలు. ముందుచూపు, కొంచెం తెలివితేటలు వున్నవాళ్ళు సులువుగా సమస్యలనుంచి తప్పించుకుంటారు. కొందరు అదిచేతగాక సమస్యల్లో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. మరికొందరున్నారు వీళ్ళకి జీవితమంతా సమస్యలే ఒకటి వదిలితే ఒకటి సమస్య.

గోవిందరావుగారి కుటుంబంవరకు చూస్తే ఏ సమస్యా లేకుండా సాగిపోతూనే వుంది. తన కుటుంబంవరకు తన పెద్దకొడుకు త్రివిక్రమ్‌ ఆ కుంటుంబానికి భారంగాగాని, సమస్యగాగాని ఎప్పుడూలేడు. ఇంకా చెప్పాలంటే తమ్ముడు, చెల్లెలు ఇద్దరికీ సంబందించి ఎన్నో సమస్యల్ని అతడే పరిష్కరించాడు. పందాలు కసో, తమాషాలు చేసో ఎంతోకొంత డబ్బు సంపాదించి తన ఖర్చులు తను చూసుకోవటంతోబాటు ఎంతో కొంత ఇంట్లో ఇస్తూనే వస్తున్నాడు. అంతేకాదు. తన చదువెలాగూ ఆగిపోయింది.

తమ్ముడయినా కష్టపడి చదివి ఇంజనీరు కావాలని అతడిలో ఆరాటం వుంది. అందుకే ఆ యింటికి పెద్దకొడుకులా గాకుండా ఒక నౌకరులా పనులన్నీ తనే చేస్తుంటాడు. సరుకులుగాని, గ్యాస్‌గాని, ఇతరత్రా ఎవరికి ఏం కావాలో అన్నీ తనే ఇచ్చేస్తుంటాడు. అతడి కష్టం తల్లి ప్రశాంతికి తెలుసు. అందుకే ఈ ఇంట్లో త్రివిక్రమ్‌ తరుపున ఎక్కువగా వాదించేది ఆవిడే.

అయితే గోవిందరావుగారి యాంగిల్‌లో త్రివిక్రమ్‌ చేతకాని ఎందుకూ పనికిరాని మనిషి. ఆయన కోపానికి సంగం కారణం త్రివిక్రమ్‌ చదువుమానేయడం. డాక్టర్‌ని చేయాలనుకున్న కొడుకు గాలికి తిరగటం చూస్తే ఏ తండ్రికైనా బాధాగానే వుటుంది. ఆ బాధలోంచి పుట్టిన కోపం ఆయనది ఆపైన ఇంటికోసం, ఇంత సంసారం కోసం తను ఒక్కడే కష్టపడుతున్నాడు.

చదువుకుని పెద్దకొడుకు ఏదో ఒక ఉద్యోగంలోనయినా సెటిలయితే తనకు ఆర్ధికభారం చాలావరకు తగ్గేది కాని అలా జరగలేదు. రానురాను భారం పెరుగుతోందేగాని తరగటంలేదు.

ఆయన చేస్తోంది టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసులో ఆఫీసరు ఉద్యోగం. నిజానికి ఆయన తలచుకుంటే, లక్షలకు లక్షలు సంపాదించి వుండేవాడు చాలామంది సంపాదిస్తున్నారు కూడ కాని ఆయన లంచగొండికాదు. నూటికి నూరుశాతం నిజాయితీపరుడు.

ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఏ పనీ ఆయన చేయడు. అందుకే పెరుగుతున్న ధరలమధ్య జీతం రాళ్ళతోనే సంసారం ఈదలేక, అప్పుడప్పుడూ ఆయన చిరాకు పడుతుంటాడు.

నీతి సూత్రాలు వినడానికి చాలా అందంగా వుంటాయి. కాని ఆచరణ సాధ్యంకాదు. అలాగని తప్పులు చేయరని కాదుగాని, మరీ నీతిమంతుడిగా బ్రతకడం కూడా నేటి సమాజంలో కష్టసాధ్యం.

అంచేత అసలయిన కష్టం ఏమిటో ఇప్పుడిప్పుడే గోవిందరావుగారికి అర్ధమవుతోంది. రమ్య డిగ్రీ పూర్తిచేసింది. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యింది.

అటుచూస్తే చక్రధర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ఇంకా రెండు సంవత్సరాలు చదవాలి. పిల్లల చదువులకు బాగా ఖర్చుపెడుతువచ్చాడు. ఇప్పుడు రమ్య తనకు పెళ్ళి వద్దని, ఇంకా పై చదువులు చదువుతానని పట్టుబడుతోంది. చదివినా చదివించే స్తోమత తనకులేదు.

చదువుకన్నా ముందు ఆడపిల్ల పెళ్ళిచేసి, అత్తారింటికి పంపించేసే ఆలోచనలో వున్నాడాయన. ఉన్న డబ్బు పూర్తిగా వీళ్ళ చదువులకే ఖర్చు అయిపోతే తర్వాత ఆడపిల్ల పెళ్ళి చేయలేనేమో అనే భయం ఆయన మనసులో వుంది.

సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ కొడుకుల పెళ్ళిళ్ళ గురించి తొందర పడరు. కూతుళ్ళ పెళ్ళిళ్ళకే తొందర పడుతుంటారు. అందుకు కారణాలు చాలా వున్నాయి.

ఎంత చదివినా ఆడపిల్ల మరో యింటికి వెళ్ళాల్సిందేగదా! గొప్ప గొప్ప చదువులు చదివించినా, కట్న కానుకలు లేకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగవు. ఈ లోపల చదువు పక్కనపెట్టి, ప్రేమలో పడినా, లేక వయసు తొందరకు తలొగ్గి తప్పుచేసినా, పరువులుపోయి తలదించుకొనే పరిస్థితులు రావచ్చు.

ఇవన్నిటికీ మించి కడుపో, కాలో తెచ్చుకుంటే నవ్వులపాలు కావాలి. కాబట్టి ఆడపిల్లలకి ఎంత తొందరగా పెళ్ళిచేసి పంపించేస్తే అంత మంచిది. ఇలా సాగుతాయి తల్లిదండ్రుల ఆలోచనలు. గోవిందరావు గారు వీటిలో కొన్ని పాయింట్లయినా దృష్టిలోపెట్టుకొని రమ్య పెళ్ళి చేయాలనే నిర్ణయానికి రావటం జరిగింది.

''చూడమ్మా! నీకు అంతగా చదువుకోవాలనుకుంటే, పెళ్ళయ్యాక నీ భర్త సహకారంతో ఎంతయినా చదువుకో, నాకు అభ్యంతరంలేదు, నీ పెళ్ళి చేయటం మా బాధ్యత కాబట్టి జరిపిస్తాం. నువ్వు చేసుకోవాలి. అంతే... అంటూ తన అభిప్రాయాన్ని కూతురికి స్పష్టంగా చెప్పేసాడాయన.

తండ్రి మాటకు కట్టుబడి తప్పలేదామెకు.

సరి సంబంధం చూడటం, పెళ్ళిచూపులు, నిశ్చితార్ధాలు కూడా జరిగిపోయాయి. మంచి సంబంధం కుర్రాడు కూడా మంచి జాబ్‌లో వున్నాడు. అయితే కట్నం దగ్గర సమస్య.

వరుడి తరుపువాళ్ళు కట్నంగా పదిలక్షలు డిమాండ్‌ చేసారు.

ఆడపిల్లకు పుట్టింటివాళ్ళు లాంఛనంగా ఎంత ఇచ్చినా తప్పులేదు. అది నేరం కాదు.

వరుడికి కట్నంగా యిస్తేనే నేరం కాబట్టి అటు వీలుకానప్పుడు ఇటు నరుక్కొస్తూ మీ అమ్మాయికి ఏమిచ్చుకుంటారు అనడుగుతున్నారు.

మరో విషయం ఏమంటే

మగ పిల్లలతోబాటు ఆడపిల్లకీ ఆస్థిలో సమానహక్కు కల్పించింది చట్టం. కాని చాలామంది తల్లిదండ్రులు కొడుకులకేగాని, కూతుళ్ళకు ఆస్తి పంచి యివ్వటానికి సిద్దంగా లేరు.

ఎంతో కొంత కట్నంగా యిచ్చి పెళ్ళిచేసి పంపించేస్తున్నారు. కాబట్టి ఏ చట్టం మనకు ఎంతవరకు న్యాయం చేస్తోంది అంటే, ఆ చట్టం అమలు అయినప్పుడే న్యాయం అమలు కాకుంటే న్యాయం జరగదు. అందుకే అంటారు.

చట్టం కల్పించిన హక్కుల్ని మనం వినియోగించుకున్నప్పుడే చట్టం మనకి న్యాయంచేస్తుంది. చట్టం ప్రజలకోసం చేయబడింది. కాబట్టి ప్రజల సహకారం లేనిదే ఏ చట్టం కూడ కాగితాలకే పరిమితమవుతుందిగాని, తనంతటతాను అమలు కాదు.

ఆస్తిలో సమానహక్కుకోసం తల్లిదండ్రులతో పోరాడుతున్న అమ్మాయిలు ఈరోజు ఎంతమంది వుంటారు? కాబట్టి

ఈరోజుకి వరకట్నం అనేది ఒక సాధారణ విషయంగా ఇంకా చెలామణి అవుతూనేఉంది. అందుకే కట్నం యిచ్చుకోడానికి గోవిందరావుగారు కూడా సిద్దంగాక తప్పలేదు.

మొదట్లో పదిలక్షలు పెద్ద భారంగా వూహించలేదాయన తీరా తన దగ్గర వున్నది, సమకూర్చుకోగల డబ్బు మొత్తం కలిపి చూస్తే ఎనిమిది లక్షలకు మించటంలేదు.   

కట్నం సొమ్ముకే ఇంకా రెండు లక్షలు తగ్గుతోంది. మరి లాంఛనాల కింద మరో రెండు లక్షలు పెళ్ళి ఖర్చులకి కనీసం మూడు కలిపి మొత్తంమీద మరో అయిదు లక్షలు చేతిలో వుంటేగాని పరువు నిలబడేలా ఈ పెళ్ళి జరిపించలేడు.

సరిగ్గా యిక్కడే ఆయన బాగా అప్‌సెట్‌ అయ్యాడు. పెళ్ళిముహూర్తానికి రెండు మాసాలే టైముంది. అక్కడా ఇక్కడా అడిగి మరో రెండు లక్షలు ఏర్పాటు చేసుకోగలిగాడు. అంతకుమించి ఆయనవల్లకాలేదు. ఇంకా మూడు లక్షలు తగ్గింది.

ఆయన బాగా ఇరిటేట్‌ అయ్యాడు.

ఆ కోపమంతా ఆ రాత్రి పెద్దకొడుకు త్రివిక్రమ్‌మీద చూపించేసాడు.

''నువ్వు చదువుమానేసి ఎంత కాలమైంది'' త్రివిక్రమ్‌ని అడిగాడు.

అంతక్రితమే భోజనాలు చేసారంతా.

భర్త పెద్దకొడుకుని ప్రశ్నించటం వింటూనే ప్రశాంతి అలర్టయింది. ప్రస్తుతం వున్న చికాకులు వత్తిళ్ళు ఆమెకు తెలీందికాదు. చిన్నగా తనూ హాల్లోకి వచ్చేసింది.

తండ్రి ప్రశ్న విని కంగారుపడలేదు త్రివిక్రమ్‌.

''చాలా కాలమైంది డాడీ? అన్నాడు నిబ్బరంగా.

''నీవల్ల నాకు ఉపయోగం ఏమిటి?'' వెంటనే తన రెండోప్రశ్న అడిగాడు గోవిందరావు.

ఏ తండ్రీ కొడుకును అడగకూడని ప్రశ్న అది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులూ ఉపయోగాలు, లాభాలు ఆశించి బిడ్డల్ని కనరు. బిడ్డల్ని కన్నాక వాళ్ళు ప్రయోజకులు కావాలనే ఆశపడతారు తండ్రి ప్రశ్న, ఆయన అడిగిన తీరు, త్రివిక్రమ్‌ని హర్ట్‌చేసింది. కోర్టులో ముద్దాయిని లాయరు ప్రశ్నించినట్టు ఆయన ప్రశ్నిస్తున్నాడు అది చాలా ఇబ్బందికరం.

''ఏమిటండీ యిది? ఇప్పుడు వాడు ఏం చేసాడని?'' కొడుక్కి సపోర్టుగా సీన్‌లోకి ఎంటర్‌ కాబోయింది ప్రశాంతి.

వెంటనే చేయెత్తి వారించాడాయన.

''ఇందులోకి నువ్వు రావద్దు. కాస్సేపు నోరుమూసుకుని వుండు'' అంటూ వార్నింగ్‌ యిచ్చాడు.

''చెప్పరా, నీవల్ల మాకు ఏదన్నా ఉపయోగం వుందా?'' తన ప్రశ్నకి రిపీట్‌ చేసాడు.

''లేదు డాడీ, ఉపయోగంలేదు'' జవాబు చెప్పాడు త్రివిక్రమ్‌. ''మరెందుకు ఇంకా ఈ ఇంట్లో వున్నావ్‌? ఇంట్లో పరిస్థితి ఏమిటో నీకు తెలీదా? చెల్లెలి పెళ్ళి చేయాలి. ఇంకా మూడు లక్షలకు షార్టేజ్‌ ఏం చేయాలి? ఇల్లు అమ్ముకోమంటావా? ఇదే నువ్వు చదివి ఉద్యోగస్తుడివి అయితే లోన్‌ తీసుకొని అయినా డబ్బు సమకూర్చుకునే వాళ్ళం. గాలికి తిరగటం తప్ప ఎందుకూ పనికిరాకుండా తయారయ్యావు. ఈ ఇంటికి పెద్ద కొడుగ్గా బరువు, బాధ్యతలు పంచుకోవాల్సిన వాడివి ఎందుకిలా తయారయ్యావని నేను అడగను.

ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బు కావాలి. అవతల పెళ్ళికి రెండు మాసాలే టైముంది. ఏం చేయమంటావ్‌?'' సీరియస్‌గా అడిగాడాయన.

సుదీర్ఘమైన ఆయన మాటలకి అటునుంచి చక్రధర్‌, ఇటునుంచి రమ్య కూడా వచ్చి హాల్లో నిలబడి వింటున్నారు. అందరిముందూ దోషిలా నిలబడున్నాడు త్రివిక్రమ్‌.

తండ్రి తిడుతున్నందుకు అతనికి బాధగాలేదు. ఆయన మాటల్లోనూ న్యాయం వుంది.

తను చదువుకోలేదు. ఉద్యోగంలేదు. బాధ్యతగా ఏమీ చేయలేదు కాబట్టే ఈ పరిస్థితి. అందుకే తండ్రి మాటలు మనసుకు బాధకరంగా వున్నా అతను ఇరిటేట్‌ కాలేదు.

''ఏం చేయాలో మీరే చెప్పండి డాడీ!'' అనడిగాడు.

తల పంకించాయన.

''ఓ.కే. ఏం చేయాలో అదీ చెప్తాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నెలరోజుల్లోపల నీ వంతుగా మూడు లక్షలు తీసుకురా. సరిగ్గా నెల... అప్పటివరకూ నేను మాట్లాడను. అప్పటికి నువ్వు డబ్బుసమకూర్చలేకపోతే... నో ప్రాబ్లం.

నా తంటాలేవో నేనుపడి పెళ్ళి జరిపిస్తాను. కానీ నీకుమాత్రం ఈ ఇంట్లో స్థానం వుండదు. పెళ్ళి మండపంలోకి కూడా నువ్వు అడుగుపెట్టకూడదు. శాశ్వతంగా నీకూ మాకూ సంబంధాలు తెగిపోతాయి. ఇది రిక్వెస్టు కాదు.

ఆర్డర్‌. నెల తర్వాత ఇదే రోజుకి మూడు లక్షలు నా చేతిలో వుండాలి''  అంటూ చెప్పాల్సిందేదో చెప్పేసి, లేచి తన గదిలోకి వెళ్ళిపోపయాడాయన.

అసాధారణమైన ఆయన కండిషన్‌కి అంతా షాకయ్యారు. భర్త నిర్ణయానికి కంగారుపడుతూ.

ఏం మాట్లాడాలో అర్థంగాక

కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ త్రివిక్రమ్‌ని జాలిగా చూసింది ప్రశాంతి, ఇక అక్కడ వుండలేక లోనకు వెళ్ళిపోయింది.

గోవిందరావు తన నిర్ణయం ఏమిటో చెప్పేసాడు.

కాని

త్రివిక్రమ్‌ మాత్రం అవుననిగాని కాదనిగాని డబ్బు యిస్తాననిగాని బదులు చెప్పలేదు.

ముప్పైరోజుల్లోపల మూడులక్షలు తీసుకురావటం అదీ ఉద్యోగం సద్యోగంలేని తనలాంటివాడికి సాధ్యమయ్యే పనేనా? సాధ్యాసాధ్యాల గురించి ఆలోచనలేదు.

ఎలాగయినా సంపాదించాలి అనే పట్టుదల ఏర్పడింది.

మానసిక సంక్షోభంనుంచి బయటపడటానికి పెరట్లోకి వచ్చేసి తిన్నెమీద కూర్చున్నాడు. త్రివిక్రమ్‌ కాసేపటికి ముందుగా ప్రశాంతి వచ్చి కొడుకుపక్కన కూర్చుంది.

''ఏమిట్రా యిది? మూడు లక్షలు సంపాదించగలవా? అది సాధ్యపడుతుందా? ఎంతో కొంత చూస్తానని చెప్పకుండా సైలంట్‌గా ఎందుకు వుండిపోయావ్‌. నవ్వు మాకు దూరమైతే తట్టుకోలేన్రా'' అంటూ తిరిగి కళ్ళనీళ్ళు పెట్టుకుందావిడ.

''మమ్మీ'' అంటూ తనూ బయటికొచ్చింది రమ్య.

''అన్నయ్య వెళ్ళిపోయే పరిస్థితి వస్తే నాకీ పెళ్ళి అక్కర్లేదు. నేను చేసుకోను'' అంది త్రివిక్రమ్‌కి అవతలిపక్క కూర్చుంటూ.

''నువ్వు కొత్త మెలికపెట్టకు, డాడీ వింటే మళ్ళీ ఇదో గొడవకి దారితీస్తుంది'' అంటూ అప్పుడే తనూ పెరట్లోకి వస్తూ హెచ్చరించాడు చక్రధర్‌.

అంతవరకు మౌనంగా వున్న త్రివిక్రమ్‌ అప్పుడు పెదవివిప్పాడు. తల్లిచేయి అందుకుని ముఖంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు.

''మమ్మీ, నీ కొడుకు అంత చేతకాని వాడనుకుంటున్నావా?'' అనడిగాడు.

''అదికాదురా..... మూడు లక్షలు..''

''మమ్మీ! నీ ఆశీర్వాదం వుండాలిగాని మూడేమిటి ముప్పైలక్షలయినా తెస్తాను. నా గొంతులో ప్రాణం వుండగా ఈ ఇల్లు అమ్ముకొనే పరిస్థితి రానీయను. చెల్లాయి పెళ్ళి ఆగదు. గ్రాండ్‌గా జరుగుతుంది. సరేనా? డాడీ మాటల్లోనూ న్యాయం వుంది. ఒక్కచేత్తో ఆయన మాత్రం ఇంత ఖర్చును ఎలా నెట్టుకురాగలరు. మీరు నా గురించి వర్రీగాకండి. సంపాదించి యిచ్చి నేనేమిటో నిరూపిస్తాను''. అంటూ ముగ్గురికి ధైర్యంచెప్పి లేచి బయటికి వెళ్ళిపోయాడు త్రివిక్రమ్‌.

***

ఏ పనికయినా సంకల్పం ముఖ్యం. చేయాలి అనే పట్టుదల వచ్చినప్పుడు సాధించగలను అన్న ధీమా కూడా ఏర్పడుతుంది. ప్రయత్నం లేకుండా ఎవరూ ఫలితాన్ని ఆశించలేరు. ఇప్పుడు త్రివిక్రమ్‌ ముందు ఒక లక్ష్యం వుంది. ఒక టార్గెట్‌ వుంది, మూడు లక్షలు నెల రోజుల్లోపలే సంపాదించాలి. ఎలా.. ఎలా.... ఎలా...ఎలా...???

ప్రస్తుతం అయితే ఎలాగో త్రివిక్రమ్‌కే తెలీదు, అతడు సంపాదించగలడో లేదో నెలతిరిగినతర్వాతగాని తెలీదు.

''ఏమైందిరా? అలా వున్నావేమిటి.''

డల్‌గా వచ్చి కూర్చుంటున్న త్రివిక్రమ్‌ని చూపి ఆశ్చర్యంగా అడిగాడు శివా. మిత్రబృందమంతా అక్కడే వున్నారు.

''నీరసంగా వుందిరా, టీ చెప్పండ్రా'' అన్నాడు త్రివిక్రమ్‌.

''ఒరే నందూ... వెళ్ళి సెల్వం అన్నాచ్చికి చెప్పు.  పది టీలు తీసుకురమ్మను'' అంటూ నందూ అనే కుర్రాడికి డబ్బులిచ్చి తరిమాడు శివా.

''చెప్పరా... ఏమైంది?'' గాభరాగా అడిగాడు ఇవతల కూర్చున్న చైతన్య.

పేలవంగా నవ్వాడు త్రివిక్రమ్‌.

''ఏమైందంటే ఏం చెప్పన్రా?  నాజీవితానికి ఓ పరీక్ష కాలం వచ్చేసింది. ఫేస్‌చేయాలి. తప్పదు'' అంటూ భారంగా నిట్టూర్చాడు.

''వేదాంతం చెప్పకు ఏం జరిగిందో చెప్పు'' విసుకున్నాడు శివా.

''అర్జంటుగా మూడు లక్షలు సంపాదిపంచాలి. అదీ ముప్పైరోజుల్లోపల.''

''జోకా, సీరియసా?''

''డబుల్‌ సీరీయస్‌ మా డాడీ ఆర్డరు'' అంటూ ఇంట్లో జరిగిన మేటరంతా ఫ్రెండ్స్‌కి వివరించాడు త్రివిక్రమ్‌.

''అదిరా జరిగింది. డబ్బు సంపాదించడానికి మంచి అయిడియా ఇవ్వండ్రా'' అనడిగాడు.

''ఏడ్చినట్టుంది తట్టలు తట్టలుగా అయిడియాలిచ్చే వాడివి నువ్వు. నీకు మేం అయిడియా ఇవ్వటమా? మా చెత్త అయిడియాలు వినటంకన్నా అదేదో నువ్వే ఆలోచించుకోవటం బెటర్‌. అయినా ఇంత పెద్దమ్తొతంలో సొమ్ము సంపాదపించటం అదీ నెల తిరిగేలోపు.... ఇది సాధ్యపడుతుందా? అసలు ఈ కండీషన్‌కి ఎలా ఒప్పుకున్నావ్‌రా?'' అంటూ ఎద్దేవా చేసాడు శివా.

''ఎలా , ఏమిటి అంటూ ఆర్గ్యుమెంట్లు వద్దు. ఏదన్నా ఆలోచించి మంచి సలహా యివ్వండి.''

''ఎలా రా ఎక్కడన్నా ఫైనాన్స్‌ అడుగుదామన్నా ఏం చూసి అప్పిస్తారు చెప్పు. నువ్వు చిన్నచిన్నవి కాదుగదా. పెద్ద పెద్ద పందాలు కాచినా ఇంత డబ్బు ఈ టైంలోపల సంపాదించలేవు. ఓ.కే! టైముందిగదా. ఆలోచిద్దాం'' అన్నాడు చైతన్య.

ఇంతలో నాడార్‌ సెల్వం స్వయంగా అందరికి టీలు తెచ్చి అందించాడు. మిత్రబృందం అంతా సీరియస్‌గా వుండటం చూసి ఆశ్చర్య పోయాడు.

''ఎన్నా తంబీ.... ఏమైంది? అంతా అదో మాదిరి వుండారు?'' అనడిగాడు.

''ఏం చెప్పం అన్నాచ్చి, మన త్రివిక్రమ్‌ కష్టాల్లో వున్నాడు'' అన్నాడు చైతన్య.

''అంత కష్టం ఏమొచ్చిందబ్బా... ఏం జరిగింది?''

''నెల తిరిగేలోపల మూడు లక్షలు సంపాదించి యివ్వమని వాళ్ళ డాడీ కండీషన్‌. ఇవ్వకపోతే ఇంట్లోంచి పొమ్మని ఆర్డర్‌. అదే ఆలోచిస్తున్నాం''

అరవంలో ఐడియా ఇచ్చి వెళ్ళిపోయాడు నాడర్‌ సెల్వం.

''ఏమిట్రా వాడి ఆరవగోల. ఏమంటున్నాడు?'' త్రివిక్రమ్‌ని అడిగాడు శివ.

''ఏముంది అది జరగని పని. ఒకటా, రెండా, మూడు లక్షలు, నువ్వెలా సంపాదించాలంటే ఏదో ఒక బ్యాంకుచూసి దోపిడి చేయాలి. ఎందుకొచ్చిన గొడవగాని మాట్లాడకుండా ఇంట్లోంచి వచ్చెయ్యమని సలహా యిస్తున్నాడు'' అంటూ నాడారు మాటల్ని తెలుగులో విన్పించాడు త్రివిక్రమ్‌.   

ఆ మాటలు వినగానే చివ్వున లేచాడు చైతన్య.

''ఎక్కడికిరా?'' అడిగాడు శివా.

''అర్జంటుగా వెళ్ళి ఆ నాడార్‌ని చంపేసివస్తాను. వాడ్ని మనం సలహా అడిగామా?'' వెధవ ఇంత చచ్చు సలహా యిస్తాడా'' అంటూ ఆవేశపడిపోయాడు చైతన్య. అతడ్ని లాగి కూర్చోబెట్టాడు త్రివిక్రమ్‌.

''ఇందులో వాడి తప్పులేదు. నా పరిస్థితి చూస్తే ఎవరయినా అలాగే అంటారు. అవునూ, కోటిగాడు రాలేదా?'' చుట్టూ చూస్తూ అడిగాడు.

''రాలేదు. ఇంట్లోనే వున్నాడు'' చెప్పాడు శివా.

''అయితే పదండి. వాడేమన్నా అయిడియా చేప్తాడేమో చూద్దాం'' అంటూ లేచాడు త్రివిక్రమ్‌.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్