Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-15 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

హిందీ హీరోయిన్లకే డిమాండ్ - స్వాతి

Interview with Swathi

మాట‌ల వెన‌క ఏదో మంత్రం ఉంది. న‌వ్వు వెన‌క ఇంకేదో మాయ దాగుంది. కాక‌పోతే మ‌రి! ఆమె మాట్లాడ‌టం స్టార్ట్ చేసిందంటే చాలు... ఎంతసేపైనా అలా వింటూ కూర్చోవాల‌నిపిస్తుంది. న‌వ్వితే మాత్రం ఎవ్వడైనా ప‌డిపోతాడంతే. ఆ ల‌క్షణాలే స్వాతిని బుల్లితెర నుంచి వెండితెరపైకి తీసుకొచ్చాయి. అందం, అమాయ‌క‌త్వం, అల్లరి క‌ల‌గ‌లిపి ఆమె తెర‌పై సంద‌డి చేస్తుంటుంది. మ‌హేష్‌... మ‌హేహేష్‌... అంటూ అష్టాచ‌మ్మా చిత్రంలో గారాలు పోయిన లావ‌ణ్య పాత్రలో మ‌రొక‌రిని ఊహించుకోవ‌డం సాధ్యమ‌య్యే ప‌నేనా? న‌ట‌న‌లో ఆ పెక్యులారిటీనే స్వాతిని ప్రత్యేక‌మైన క‌థానాయిక‌గా నిల‌బెట్టింది. ఇంకా మ‌న ద‌గ్గర స‌రైన అవ‌కాశాలు పొంద‌లేక‌పోతోంది కానీ... త‌మిళం, మ‌ల‌యాళ ప‌రిశ్రమలు మాత్రం రంగుల పిల్ల టాలెంట్‌ని ఇప్పటికే ప‌సిగ‌ట్టేశాయి. అందుకే ఆమెకి వ‌రుస‌బెట్టి అవ‌కాశాలిస్తున్నాయి. తెలుగులోనూ అప్పుడ‌ప్పుడు ఒక‌టీ అరా సినిమాలు చేస్తుంటుంది స్వాతి. ఆమె న‌టించిన `బంగారు కోడిపెట్ట` 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా స్వాతితో ముఖాముఖీ విష‌యాలివీ...

* బంగారు కోడిపెట్ట గుడ్డు పెడుతుందా లేదా?
- గుడ్డు పెట్టకుండా పుంజు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అక్కడే వ‌చ్చింది తంటా అంతా.

* మ‌రి పుంజు వ‌చ్చిందా?
- ఆ విష‌యాన్ని మీరు తెర‌పైన చూసి తెలుసుకోవ‌ల్సిందే.

* ఇందులో కూడా మీరు య‌థావిధిగానే అల్లరి చేశారా?
- ఓ మోస్తరు గా చేశాన్లెండి. అయితే ఇందులో నా అల్లరి ఓ కొత్త కోణంలో సాగుతుంది. ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దివిన  అమ్మాయిగా క‌నిపిస్తాను. వ‌చ్చీ రాని ఇంగ్లీషుతో ఓ ఉద్యోగం చేస్తుంటుంది. ఎంత‌కాలం ఈ జీవితం అనుకొంటూ కొన్ని అడ్డదారులు ట్రై చేస్తుంది. తొంద‌ర‌గా సెటిల్ అయిపోవ‌చ్చు క‌దా అని ఆ అమ్మాయి ఆశ‌. ఆ అడ్డదారి ఆలోచ‌న కాస్త బెడిసి కొడుతుంది. ఆ త‌ర్వాత ప‌రిణామాలేమిన్నదే సినిమా. ఇందులో నేను భానుమ‌తి పినిశెట్టి అనే యువ‌తి పాత్రలో క‌నిపిస్తా.

*  తెలుగులో మీ సినిమా రాక యేడాదిపైనే అయిన‌ట్టుంది...
- అవునా? నాకైతే అలా అనిపించ‌డం లేదు మ‌రి. బ‌హుశా తమిళం, మ‌ల‌యాళంలో సినిమాలు చేస్తూ గ‌డుపుతుండ‌డంవ‌ల్లేనేమో పెద్దగా గ్యాప్ వ‌చ్చిన ఫీలింగ్ నాకు క‌ల‌గ‌డం లేదు. యేడాదని మీరంటుంటూనే నాకు గుర్తొస్తోంది.

* తెలుగును వదిలిపెట్టి అటువైపు ఎందుకు వెళ్లారు?
- ఎవ‌రు వ‌దిలిపెట్టారు తెలుగును. తెలుగమ్మాయిని బాబూ.. తెలుగులో న‌టించ‌డ‌మే నాకిష్టం. కాక‌పోతే ఇక్కడ అవ‌కాశాలే రావ‌డం లేదు. త‌మిళం, మ‌ల‌యాళం ప‌రిశ్రమ‌ల్లో మంచి మంచి అవ‌కాశాలొస్తున్నాయి. దీంతో వాటిని వ‌దిలిపెట్టబుద్ది కావ‌డం లేదు. భాష క‌ష్టమైనా స‌రే... నేర్చుకొని మ‌రీ అక్కడ న‌టిస్తున్నా.

* తెలుగులో అవ‌కాశాలు రావ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నారా?
- బాధెందుకు? అయినా... చిత్ర ప‌రిశ్రమ‌లో మార్కెట్ ఆధారంగానే అవ‌కాశాలు దక్కుతుంటాయి. సినిమాని అమ్ముకోవాలంటే అందులో ఏ ముంబై హీరోయిన్నో, ఢిల్లీ ముద్దుగుమ్మో ఉండాలి. అప్పుడే ఆ సినిమాని కొన‌డానికి ముందుకొస్తారు. అందుకే నిర్మాతలు అక్కడికెళ్ళి హీరోయిన్స్ ని వెదుక్కొని తీసుకొస్తారు. ఇక్కడ ఎవ‌రిని ఎవ్వరూ త‌ప్పు ప‌ట్టడానికి ఛాన్స్ లేదు.

* కానీ తెలుగులో తెలుగ‌మ్మాయిల‌కు ఎప్పుడూ ప్రోత్సాహం ల‌భించ‌ద‌ని అంటుంటారు క‌దా?
- అలాంటి మాట‌ల్ని నాలాంటివాళ్లు చెప్పడానికీ, మీరు రాయ‌డానికీ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ వాస్తవం అది కాదు క‌దా. నీ వెన‌క ఎన్ని విజ‌యాలున్నాయి? ఎలాంటి సినిమాలు చేశావు? అనే విష‌యాలే కీల‌కం. స‌క్సెస్ వ‌చ్చిందా మ‌రో అవ‌కాశం తీసుకో.  సినిమా స‌క్సెస్ అయిందా? ఆ క్రెడిట్ ద‌ర్శకుడి ఖాతాలోకి వెళ్లిందా? ఇక  ద‌క్కాల్సిన అవ‌కాశం కూడా రాదు. అలా ఇక్కడ చాలా లెక్కలుంటాయి.

* క‌థానాయిక‌గా మీ ప్రయాణం సంతృప్తిక‌రంగానే సాగుతోందా?
- నా వ‌ర‌కు నేను హ్యాపీనే. యంగ్ డైరెక్టర్స్‌, యంగ్ హీరోస్‌తో క‌లిసి నా శైలికి త‌గ్గ క‌థ‌ల్ని ఎంచుకొంటూ ప్రయాణం చేస్తున్నా.

* చిన్న సినిమాల‌కే ప‌రిమిత‌మైపోతున్నానే అని ఎప్పుడూ అనిపించ‌లేదా?
- `గోల్కొండ హైస్కూల్` స‌మ‌యంలో అనిపించింది. నేనింతేనా? ఇక పెద్ద హీరోల‌తో చేయలేనా? అని ఆలోచించేదాన్ని. నా స‌న్నిహితులు కూడా ఆ స‌మ‌యంలో నాకు ర‌క‌ర‌కాల దారులు చూపించారు. `స్వాతి ఫేస్ బుక్ ఓపెన్ చెయ్‌`, స్వాతీ పార్టీల‌కు వెళ్లు, స్వాతీ అలా మాట్లాడు, ఇలా మాట్లాడు అంటూ చాలా చెప్పారు. కానీ అవేవీ వర్కవుట్ అవ్వలేదు. సినిమా స‌క్సెస్ అయితేనే అక్కడ కూడా రిజల్ట్ అని తేలింది.

* కానీ మీరు క‌థానాయిక‌గా ఓ సినిమా చేస్తున్నారంటే... అందులో ఎంతో కొంత స్టఫ్  ఉంటుంద‌ని ప్రేక్షకులు న‌మ్ముతుంటారు. ఆ విష‌యం మీ దృష్టికి వ‌చ్చిందా?
- నిజ‌మా? అలా అనుకొంటున్నారా. య‌హూ... అయినా ప్రతీ ఇంటర్వ్యూలో ఇలాంటి కొశ్చన్‌లు అడుగుతాన‌ని ప్రామిస్ చేయ‌రూ!

* కథ‌ల ఎంపిక‌లో మీ ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయి?
- అంద‌రూ అనుకొంటున్నట్టుగా ఆ విష‌యంలో నేను పెద్దగా ఆలోచించ‌ను. నాకు త‌గ్గట్టు ఉందా లేదా? క‌థ ఏమిటి? అని మాత్రమే చూస్తుంటా. కొంచెమైనా ఛూజీగా ఉండాలి క‌దండీ. అది మాత్రమే చేస్తుంటానంతే.

* స్పెష‌ల్ సాంగ్స్‌, స్పెష‌ల్ రోల్స్ వ‌స్తే చేస్తారా?
- స్పెష‌ల్ సాంగ్స్ అంటే ఈజీ అనుకొంటున్నారేమో. అదెంత క‌ష్టమో మీకు తెలియ‌దు. క‌నిపించేది కాసేపే అయినా... నెయిల్ పాలిష్ ద‌గ్గర్నుంచి అన్నీ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండాలి. అదెంత క‌ష్టమో నాకు తెలుసు.

* క‌ష్టం న‌ష్టం త‌ర్వాత... మీరు ఒప్పుకొంటారా లేదా?
- అయ్యో ... (న‌వ్వుతూ ). అలాంటి పాత్రల‌కు న‌న్నెవ‌రు అప్రోచ్ అవుతారండీ.

* న‌ట‌న విష‌యంలో మీరు క‌థానాయ‌కుల్ని డామినేట్ చేస్తుంటార‌నీ, అందుకే మీకు అవ‌కాశాలు త‌గ్గుతున్నాయ‌ని అంటుంటారు.
- నిజ‌మా? అయితే... ఓవ‌ర్ యాక్టింగ్ త‌గ్గిస్తాలెండి.

* ప్రేమ‌, పెళ్లి క‌బుర్లేమైనా ఉన్నాయా?
- చిత్ర ప‌రిశ్రమ‌లో ప్రేమ‌లు, స్నేహాలు అంటూ ఏమీ ఉండ‌వు. ఇక్కడ ప‌నికోసమే క‌లుస్తారు. అది అయిపోగానే ఎవ‌రిదారిన వాళ్లు వెళ్లిపోతారు.  ఇక పెళ్లి విష‌యం ఇంట్లో వాళ్లకే అప్పజెప్పా.

* ప్రస్తుతం చేస్తున్న సినిమాలేమిటి?
- త‌మిళంలో రెండు, మ‌ల‌యాళంలో రెండు సినిమాలు చేస్తున్నా.

* ఒకే ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
bangaru kodipetta review