Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Health is wealth - Health : Age

ఈ సంచికలో >> శీర్షికలు >>

అమ్మమ్మలూ, నానమ్మలూ - భమిడిపాటి ఫణిబాబు

ammammaloo-naanammaloo

ప్రపంచం లో ఆడవారికి ఎంత ఓర్పూ సహనం ఉంటుందో, ప్రత్యక్షంగా చూస్తేనే కానీ తెలియదు.అలా దగ్గరగా చూసే ముహూర్తం ఎప్పుడు వస్తుందిట,రిటైరయిన తరువాతే.అసలు భార్యలో ఉండే సుగుణాలన్నీ తెలిసికునే సమయం ఎక్కడేడిచిందీ ఉద్యోగం చేసినంత కాలం? ఏదొ సంపాదిస్తున్నాము,వండి పారేస్తోందీ,పిల్లల బాగోగులు చూసుకుంటోందీ అనే కానీ,వాళ్ళకీ ఏవెవో చిన్న చిన్న కోరికలుంటాయీ అని ఎప్పుడైనా అలోచిస్తామా?మనకైతే ప్రభుత్వం వారి ధర్మమా అని ఓ రిటైరుమెంటోటి ఉంది,మరి వాళ్ళకీ? పెళ్ళైయేదాకా,ఇంట్లో పెద్ద పిల్లైతే చెల్లెళ్ళకీ,తమ్ముళ్ళకీ సేవ చేయడం,ఆ తరువాత కట్టుకున్నవాడికీ,కన్న పిల్లలకీ చేయడం,ఆ తరువాత మనవళ్ళకీ,మనవరాళ్ళకీ చేయడం.ఈ లోపులో అత్త మామలుకూడా ఉంటే,వాళ్ళొకళ్ళు.ఆతావేతా జీవితకాలం అంతా సేవ చేయడం తోటే సరిపోతుంది. అసలు ఈ ఆడవాళ్ళకి అంత ఓపికా,సహనం ఎక్కడనుండి వస్తుందో తెలియదు.

  మనం రిటైరయ్యాక ఓ పెద్దరికం ఒకటి కట్టబెట్టేయడం తో బతికిపోయాము. లేకపోతే తెలిసేది ఇప్పటి పసిపిల్లల్ని అదీ 1-4 సంవత్సరాల  మధ్య ఉండేవాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో? వామ్మోయ్ వాళ్ళు పిల్లలా పిడుగులా!వాళ్ళవెనక్కాలే పరిగెత్తే ఓపిక లేదు. పైగా ప్రాక్టీసుకూడా తక్కువ, ఉద్యోగంలో ఉన్నప్పుడైతే ఏదో వంకుండేది. ఆఫీసులో 'సో కాల్డ్ టైరైపోయి రావడం' అనేది. టైరూ లేదూ సింగినాదం లేదూ, ఉత్తి పోజు! గవర్నమెంటు ఆఫీస్సులో పని చేసి, మగాళ్ళెవరూ టైరైపోవడం నేనైతే ఎప్పుడూ చూడలేదండోయ్.ఎప్పటి పని (ఆఫీసులో) అప్పుడు చేసేసికుంటే టైరెందుకవుతారూ? వాడితోటీ వీడితోటీ హస్కేసుకుని కూర్చుంటే చెప్పలేము. మా బాస్ అనేవారు- నో బడీ డైస్ ఆఫ్ ఓవర్ వర్క్ ఇన్ గవర్నమెంట్-అని!ఆఫిసునుండి, కొంపకి చేరడానికి ట్రాఫిక్కులో ఇరుక్కుపోవడం టైరైపోవడం అంటే చేసేదేమీ లెదు.ఆఫీసుల్లో పనిచేసే ఆడవారి సంగతేమిటి మరి?

   ఇంక ఇప్పటి నానమ్మలు/అమ్మమ్మల సంగతికొస్తే,వామ్మోయ్ మనవలతో ఎన్నెన్ని ఆసనాలూ,డాన్సులూ చేయాలో, ఏదో ముస్తాబు చేసి, ఏ ప్రామ్ లోనో కూర్చోబెడితే, బయటకి తీసికెళ్ళి తిప్పమంటే మాత్రం రెడీ! ఈ పిల్లలు పూర్తిగా నడక రాదూ,నడవాలని తాపత్రయం. మధ్యలో ఏదో చేస్తారు, బట్టలు మార్చాలి, పోనీ ఏదో సహాయం చేద్దామా అని అనుకున్నా, వాళ్ళు మనచేతిలో ఉండరూ, 'ఏమిటండీ ఒక్కసారి పట్టుకోమంటే అంత హడావిడి చేసేస్తారూ' అంటూ చివాట్లూ!ఏదో ఒక్కసారి నిద్రపోగొట్టుదామా అనుకున్నా, ఊరికే ఏడుస్తాడు. వాణ్ణి సముదాయించడం ఓ పేద్ద టాస్క్. “ఏడవకమ్మా, దాయి దాయి...'అనాలికానీ,ఊరికే వాడిమీదలా అరిస్తే వింటాడా? అని మళ్ళీ క్లాసూ.ఎందుకొచ్చిన రిటైర్మెంటయ్యా భగవంతుడా, హాయిగా ఉద్యోగంలో ఉన్నప్పుడే బావుండేది అని విసుపూ!

 రోజులో ఒక్క గంట ఆ చిన్న పిల్లల్ని సముదాయించలెని బ్రతుకూ ఓ బ్రతుకేనా అని అనుకుందామన్నా, అమ్మో రోజంతా చూడమంటే ఏదో 'మమ' అని ఒకసారి అనుకుంటే పోతుంది.లేనిపోని గొడవల్లోకి వెళ్ళకూడదు!నూటికి తొంభైతొమ్మిది మంది అమ్మమ్మలూ, నానమ్మలూ, ఎంత నడుంనొప్పివస్తున్నా సరే, ఎంతంత గూళ్ళనొప్పి వస్తున్నా సరే, ఎంతంత మోకాళ్ళ నొప్పి వస్తున్నా సరే, ఈ చిన్న పిల్లల్ని చూడ్డం మాత్రం మానరు.'నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలోయ్' అన్నా సరే

'పోనిద్దురూ, మనమేమీ రోజూ చూస్తున్నామా ఏమిటీ, ఏదో ఇలా అవసరం పడినప్పుడు అడుగుతారు పిల్లలు, వాళ్ళేం పరాయివాళ్ళా ఏమిటీ' అని మనల్ని వీటో చేసేస్తారు!చివరకి మన మాటే మిగిలిపోతుంది కానీ, వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. అదీ ఈ నానమ్మల/అమ్మమ్మల గ్రేట్ నెస్!

 నూటికి తొంభైతొమ్మిది అన్నానే, ఆ మిగిలిన ఒక పెర్సెంటు వాళ్ళనీ చూశాను. ముందరే చెప్పేస్తారు, మీ పిల్లలకి నడకా మాటా వచ్చేదాకా మేం చూళ్ళేమమ్మొయ్ అని! నడకా మాటా వస్తే, మనం చూసేదేమిటీ, వాళ్ళే మనల్ని చూస్తారు!

 

  ప్రతిఫలాపేక్ష ఏదీ లేకుండా, పసిపాపలకి సేవ చేసేది ఈ అమ్మమ్మలూ,నాన్నమ్మలే అని నా అభిప్రాయం! ఆఖరికి తల్లితండ్రులు కూడా ఆ కోవలోకి చేరరేమో, ఎందుకంటే, అందరూ కాకపోయినా కొంతమంది తల్లితండ్రులైనా, ఈ పిల్లో పిల్లాడో పెద్ద అయినతరువాత తమకి ఆసరాగా ఉంటాడని ఆశించేవారే!కొంతమందికి నా అభిప్రాయం కోపం తెప్పించొచ్చుననుకోండి, కానీ ఫాక్ట్ ఈజ్ ఎ ఫాక్ట్! అందుకేనేమో చాలామందినుండి వింటూంటాము, 'వాణ్ణి ఎంతో కష్టపడిపెంచామూ, చూశారా ఆ మాత్రం కృతజ్ఞతైనా లేకుండా, పెళ్ళాం మాటల్లో పడి, వేరింటి కాపరం పెట్టేశాడూ' అని.దీనర్ధం ఆ పిల్లల దగ్గరనుండి ప్రతిఫలం ఆశించినట్లే కదా మరి!

 ఇంక కొంతమందుంటారు, పిల్లో పిల్లాడో పెళ్ళయి వెళ్ళేదాకా, వీలున్నంతవరకూ వాళ్ళచేత ఏదో ఒకటి కొనిపించుకోవడం, రిటైరయిన తరువాత వాళ్ళు ఉద్యోగంలో ఉన్నంతకాలం చూడలేకపోయినవన్నీ,చూపించుకోవడం, పైగా ఏమైనా అంటే, 'పెళ్ళైతే ఎలాగూ మన చేతుల్లో ఉండడండీ, ఏదైనా చేయించుకుంటే ఇప్పుడే' అని ఓ సమర్ధనోటి!మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చూడమంటే, ఏవేవో కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం, పిల్లల్ని చూడూ అంటే, కాదు పెద్దాళ్ళైపోయారూ మా అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళాలీ అనడం, పోనీ ఆ పెద్దవారైన తల్లితండ్రుల్ని చూస్తారా, వాళ్ళడిగితే, మనవలూ,మనవరాళ్ళనీ చూసుకోవాలీ అనడం. ఆతావేతా జరిగేదేమిటంటే, ఏదో ఒక వంక ( సందర్భాన్ని బట్టి)చెప్పేసి, ఇద్దరికీ చేయకుండా తప్పించేసికోవడం! వీళ్ళ పనే హాయి కదూ ! ఓ కమిట్మెంటు లేదు.పైగా కోడలుతో చెప్పడం, ఏవమ్మోయ్ నీ పిల్లల్ని మామీద వదిలేసి ఉద్యోగం అంటూ వెళ్ళిపోకే,నాకూ వయస్సొచ్చేసింది, ఏదో మీ పిల్లలకి కాలూ చేయీ, మాటా వస్తే ఫరవా లేదు కానీ,పిల్లల ఉచ్చలూ,దొడ్లూ తుడిచే ఓపిక మాత్రం లేదమ్మోయ్!అని.

 ఈ రోజుల్లో భార్యా భర్తా ఉద్యోగం చేయకుండా, త్రీ బెడ్ రూం ఫ్లాట్టులూ, హోం థియేటర్లూ, ఐ-10,ఐ-20 కార్లూ, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎడ్మిషన్లూ ఎలా వస్తాయిటమ్మా? ఆ భార్య కాస్తా ఉద్యోగం మానేసిందంటే, రెండు మూడు ఈ ఎమ్ ఐ లు

గోవిందా గోవింద. తమ తమ సర్కిళ్ళలో, తమ పిల్లలు ఎంతంత పేద్ద పేద్ద ఇళ్ళల్లో ఉంటున్నారో, వాళ్ళింట్లో ఏమేమి ఉన్నాయో,వీళ్ళని వీకెండ్లకి ఎక్కడెక్కడికి తీసికెళ్ళారో, చెప్పుకోవాలీ, వారి మధ్యలో ఓ ఇమెజ్ బిల్డ్ అప్ చేసికోవాలీ, కానీ కోడలు మాత్రం ఉద్యోగానికి వెళ్ళకూడదు! ఆహా ఏం న్యాయమండీ ! నేను నిన్న చెప్పిన 99% కాక మిగిలిన 1 % లోకి  వస్తారు ఈ జనాలు! ఎవడెలా పోయినా సరే, అది కొడుకవనీయండి, కూతురవనీయండి, మనం పెంచి పెద్దచేశామూ

అందువలన వీళ్ళు బ్రతికున్నంతకాలం వీళ్ళ ఆలనా పాలనా ఆ పిల్లలే చూడాలి బస్! నో అర్గ్యుమెంట్ ! ఉన్న ఆస్థంతా పోయేటప్పుడు కట్టుకుపోతారా ఏమైనా?

 అలాటివాళ్ళ సంగతి  వదిలేయండి, పారసైట్లుంటూనే ఉంటారు.ఉత్తినే మూడ్ పాడిచేసికోవడం కంటే, అసలు సిసలైన అమ్మమ్మలూ, నాన్నమ్మలగురించీ మాట్లాడుకుందాం, పుణ్యం పురుషార్ధమూనూ!ఒకవైపు ఏదో మందులు మింగనేనా మింగుతారు కానీ, మనవళ్ళకీ మనవరాళ్ళకీ మాత్రం ఏమీ లోటు రానీయరు. వాళ్ళు పడే బాధేమిటో, భర్తలతో మాత్రమే పంచుకుంటారు. ఆ పసిపిల్లల్ని సాకుతూంటే ఏదో తను కన్న పిల్లల్నే చూసుకుంటారు. మరి అదే కన్నపేగంటే! ఈ విషయంలో మాత్రం ఇప్పటి జనరేషన్ వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే, ఏదో ప్లానింగూ, కెరీయరూ అంటూ ముఫై నలభై ఏళ్ళొచ్చేదాకా పిల్లల్ని కనడం మానెయకండి, ఎందుకంటే మీరు కనే టైముకి, మన మోస్ట్ వాల్యుబుల్ అమ్మమ్మ, నాన్నమ్మలకి మరీ అరవైఏళ్ళుదాటుతాయి. అప్పుడు వాళ్ళని శ్రమపెట్టడం భావ్యం కాదు. చెయ్యాలని ఉంటుందీ, శ్రమౌతుందీ, చెప్పుకోలేరూ అలాగని మనవల్నీ, మనవరాళ్ళనీ వదులుకోలేరూ,మరీ మంచం పడితే ఏమో కానీ, కాలూ చేయీ ఆడుతున్నంతకాలం ఈ బుడతల ధ్యాస! ఆఖరికి కట్టుకున్నవాడిని కూడా పట్టించుకోరు!

  ఇంక తాతయ్యల సంగతంటారా, వీళ్ళు చెప్పానుగాbuy one get one free  బాపతు, సండ్రీ పన్లు చేయడానికి మాత్రమే! పసిపిల్లలకి డయపర్లు మారుస్తూంటే, చూస్తూ కూర్చోడం తప్ప,ఏది ఎటువైపుపెట్టాలో కూడా తెలియని ప్ర్రాణులు!అలాగని ఏదీ తెలియనట్లు పొజెట్టఖ్ఖర్లేదు, ఆ తీసేసిన డయపర్ని, ఏ వేస్ట్ పేపర్ బాస్కెట్ లోనో పడేయొచ్చు. దీనికేమీ పేద్ద టాలెంట్ అఖ్ఖర్లేదుగా!అలాగే,బాటిల్ ఫీడ్ అయిన తరువాత, వాటిని కడిగెసి స్టెరిలైజు చేయొచ్చూ, పిల్లల బట్టలు మార్చేటప్పుడు,ఆ విప్పిన బట్టల్ని, బకెట్ లో పడేయొచ్చు, ఎండలో ఆరేసిన బట్టల్ని మడతలు పెట్టొచ్చూ, చేయాలంటే ఇలాటివి కావలిసినన్నున్నాయి. చేయాలని మనసే ఉండాలి. ఈ సండ్రీ పన్లన్నీ అమ్మమ్మల్నీ, నాన్నమ్మల్ని చేయమంటే మాత్రం, ఆ తరువాత వాళ్ళకి ఏదైనా వస్తే మనకే నష్టం!వయస్సైపోయిందని, మనల్ని ఆ పిల్లల్ని ఎత్తుకోమని మాత్రమ్ ఎవరూ అడగరు, కారణం ఆ పిల్లో పిల్లాడో మన దగ్గరకొచ్చేటప్పటికి కెవ్వుమనరుస్తాడు. మొత్తం కొంపలో ఉన్నవాళ్ళంతా పరిగెత్తుకొచ్చేస్తారు 'ఏం చేశారండి వాణ్ణి' అంటూ! వాడేం మనకు శత్రువా ఏమిటీ, మనమేం చేస్తాం.'ఏదో చేసే ఉంటారు, అందుకే ఇప్పటిదాకా ఆడుకుంటూన్నవాడు, మరీ అలా అరిచాడు'అని ఓ క్లాసూ!

ఏదో వీళ్ళు సీనియర్ సిటిజెన్లయే లోపల ఏదో మీరు చేయవలైన పనేదో కానిచ్చేశారంటే, అందరికీ సుఖం!

 

This is my humble tribute to all the Ammammas and Nannammaas of the World.

మరిన్ని శీర్షికలు
weekly horoscope March 07- March 13