Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

భీమవరం శాఖా గ్రంధాలయంలో ఒక బార్ ఉండేది.

బార్ అంటే తాగుబోతులు వెళ్ళే బార్ కాదు.

రెండు పొడవాటి, గుండ్రటి ఇనుపగొట్టాలు పక్కపక్కనే పొడవుగా భూమికి తగినంత ఎత్తులో పాతబడి ఉంటాయి. ఈ బార్ వ్యాసం ఎక్కడయినా ఒకేలా ఉంటుంది. బార్ హైట్ కూడా స్టాండర్డ్ గా ఉంటుంది.

వేరే ఎక్సర్ సైజులు చేస్తే బాడీ స్టాండర్డ్ గా ఉండదు. బార్ మీద చేసిన ఎక్సర్ సైజులు ద్వారా సంపాదించిన బాడీ స్టాండర్డ్ గా ఉంటుంది. (బార్ బాడీ స్టాండర్డ్ బాడీ) అని యువకుల్లో చాలా పెద్ద నమ్మకముంది. శాఖా గ్రంధాలయం బార్ కి ఒక ప్రత్యేకత ఉంది.

అది లక్కీ బారని, ఈ బార్ మీద వ్యాయామం చేస్తే చక్కటి బాడీ త్వరగా వస్తుందనీ అనుకునేవారు. ఆ బార్ కి చాలా రష్ ఉండేది. ఉదయం నాలుగు గంటలకి వెళ్తే క్యూలో నిలబడాల్సిందే... మధ్యాహ్నం మండుటెండలో కూడా ఆ బార్ మీద ఒకళ్ళిద్దరు కనబడతారు. సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఒంటిగంటవరకు పుల్ రష్ గా ఉంటుంది.

అతిశయోక్తి అనుకునే సమస్యేలేదు.

కిట్టు ఆ బార్ కి వెళ్లి, అవకాశం వచ్చినప్పుడల్లా వచ్చీరాని ఎక్సర్ సైజులు చేస్తుండేవాడు. అసలు ఆ బార్ పైకెక్కడమే కిట్టుకి కష్టంగా ఉండేది. నేలమీద బస్కీలు కూడా చేస్తుండేవాడు కిట్టు. ఇవన్నీ కొద్దిగా ఫలితం చూపించడం మొదలు పెట్టాయి.

ఇంతలో కిట్టు వాళ్ల నాన్నగారు తెలిసే ఇచ్చారో, తెలియకనే ఇచ్చారో గానీ "కాల్షియం శాండోజ్" మాత్రలు తెచ్చిచ్చారు. కిట్టుకి సుద్దముక్కలు తినాలని ఎందుకనిపించేదంటే శరీరంలో కాల్షియం లేకపోవడం వల్లనే. చాక్ పీసులు, సున్నంలలో కాల్షియం ఉంటుంది. కానీ అది డైరెక్టుగా తినడం హానికరం. ఈ "కాల్షియం శాండోజ్" బిళ్లలు కిట్టుకి కావాల్సిన "కాల్షియం" ని సమకూర్చాయి. ఇకనేం? డ్రమేటిక్ గా తక్కువకాలంలోనే, ఎవరూ గుర్తించని విధంగా కిట్టు పొడుగయ్యాడు. రోజూ కనబడే పొట్టోడిని పొట్టోడనే అంటారు. పొడుగైనా కనిపెట్టలేరు. అలాగని కిట్టు ఆరడుగుల పొడగరి అవ్వలేదు, కానీ పొట్టోడనే ముద్ర తప్పించుకునేటంత పొడుగయ్యాడు.

రకరకాల ఎక్సర్ సైజుల ఫలితంగా శరీరం ఒకమాదిరి ధృడత్వాన్ని సంతరించుకుంది.

రంగు మాత్రం గ్యారంటీ కలర్... చక్కటి నలుపు.

నిజానికి ఇదే పర్సనాలిటీ టెన్త్, ఇంటర్ లలో ఉండాలి. అప్పుడు ఆ కాలానికి తగినవాడవుతాడు.

కిట్టు విషయంలో కొంచం ఆలస్యం అయింది.

అదికూడా మంచి కోసమేనేమో...

***

కంభం.

తెల్లవారింది...

కిట్టు కాలేజీకి రెడీ అయ్యాడు.

నేరో ప్యాంటు, రెండడుగుల వెడల్పాటి గుడ్డ బెల్టు... ఆ బెల్టు ని బకిల్ మీదుగా తిప్పి, పూర్వకాలం రాజులు చిన్న కత్తిని ఎలా ధరించేవారో ఆ విధంగా దాన్ని కిందకి వదిలాడు.

లూజుగా ఉన్న హాఫ్ హ్యాండ్స్, కాటన్ చొక్కా... కండలు కనబడేలా రెండు మడతలు...

చొక్కాపై సన్నని మెరిసే చారలు... చొక్కాని టక్కుచేశాడు...

కాళ్లకి కొల్హాపూర్ చెప్పులు... కొల్హాపూర్ చెప్పులు... పెద్ద క్రేజ్... ఎవరైనా హైద్రాబాద్ వెళితే, వాళ్లని బ్రతిమిలాడి డబ్బులిచ్చి తెప్పించుకునేవారు.

ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది... 'ఎత్తు బూట్లు, వెడల్పాటి బెల్టులు, బెల్ బాటమ్ లు, హిప్పీ క్రాఫ్ లు, మేకచెవుల్లాంటి కాలర్లు... పాతబడిపోయాయి.'

నాన్నగారు కొనిచ్చిన ఆల్విన్ వాచీ, చైన్ క్లిప్పు తీసి, మణికట్టు మీదుగా వెనక్కి జరిపి, టైటుగా ముంజేతి మీద ఇరికించాడు...

ఇదెందుకంటే... ముంజేతి కండరాల్ని ప్రదర్శించడానికి...

ఈ ఐడియా ప్రసాద్ అన్నని చూసి అనుకరించినది.

ప్రసాద్ అన్న "డియ్యన్నార్" కాలేజీలో బియ్యెస్సీ చదువుతుండేవాడు. తణుకు వాస్తవ్యుడు. ప్రసాదన్న కండలు తిరిగిన కరాటేవీరుడు... కిట్టు వాళ్ల పెద్దన్నయ్య మిత్రుడు. వాచీని క్లిప్పుతీసి, ముంజేతి కండమీద బిగించి ముంజేతి కండరాలని ప్రదర్శించేవాడు. ఎప్పుడూ నల్లటి జీన్ ప్యాంటు ధరించేవాడు.

అన్నా ఈ జీన్ ప్యాంటు ని ఎక్కడకొన్నావన్నా అని అడిగితే, నవ్వుతూ చెప్పేవాడు.

ఇది జీన్ ప్యాంటు కాదు! మడత మంచం గుడ్డ..! స్టిచ్ వెల్ టైలర్ దగ్గర శిష్యరికం చేసి నేనే స్వయంగా కుట్టుకున్నాను. దానికి 40 రూపాయలిచ్చి రంగు వేయించాను... అంతే... అది జీన్ ప్యాంట్ అయిపోయింది అని. లివిన్ జీన్స్ అని తర్వాతెప్పుడో వచ్చిన "యాడ్"కు సజీవ ఉదాహరణ ప్రసాదన్న.

అన్నా... అన్నా... నాకు కూడా కరాటే నేర్పించు అంటూ వెనకాల పడేవాడు కిట్టు.

ఎప్పుడన్నా... ఏదన్నా క్లాస్ రూం ఖాళీగా ఉంటే కిట్టుతో పాటు మరో నలుగురిని చేర్చి కరాటే పాఠాలు చెప్పేవాడు ప్రసాదన్న.

కిట్టు నడుచుకుంటూ కాలేజికి బయలుదేరాడు.

రూమ్మేటు వరదకి జ్వరం... అందుకని కాలేజి డుమ్మా...

దారిలో కొత్తగా చేరిన విద్యార్ధులు కిట్టువైపు విచిత్రంగా చూస్తున్నారు. కొందరు నడిచి వెళ్తున్నారు. కొందరు అప్పటికే సైకిళ్ళు తెచ్చేసుకున్నారు. వాళ్లు సైకిళ్ళపై వెళ్తున్నారు. కిట్టు వెనకే ఒక అబ్బాయి నడుస్తున్నాడు... అతను వేగంగా అడుగులు వేసి... కిట్టుని చేరుకున్నాడు.

పాలిటెక్నిక్కేనా?... అన్నాడు.

అవునన్నాడు కిట్టు...

మీదే బ్రాంచ్?

సివిల్...

మీదే బ్రాంచ్?

ఎలక్ట్రానిక్స్...

ఇలా మాట్లాడుకుంటూ కాలేజికి చేరుకున్నారు. తర్వాత ఎవరి క్లాసుకు వాళ్లు వెళ్ళిపోయారు.

కిట్టుకి మాత్రం ఎంతో సంతోషం కలిగింది.

ఎందుకంటే...

ఎదుటి వ్యక్తి ముందుకు వచ్చి మనల్ని పలకరించాలనీ, మనతో మాట్లాడాలనీ, మనల్ని గుర్తించాలనీ, మనల్నొక స్పెషల్ గా చూడాలనీ అందరూ కోరుకుంటారు. అంతకు ముందెప్పుడూ... కిట్టుని ఈ విధంగా తమంతట తామే వచ్చి ఎవరూ పలకరించలేదు. మొదటిసారిగా ఇంకొకడు ముందుకు వచ్చి తనతో పరిచయం చేసుకుని మాట్లాడ్డం కిట్టుకి ఎంతో సంతృప్తి కలిగించింది.

తన క్లాసు ఎక్కడో కనుక్కుని అలవాటు ప్రకారం వెనక బెంచీలో కూర్చున్నాడు కిట్టు. క్లాసులో దరిదాపు అందరూ ఒకమాదిరి ఎత్తు, లావు ఉన్నారు. అంటే... పదవ తరగతి నుండి వచ్చిన వాళ్లు కాదు. ఇంటర్మీడియట్ నుండి వచ్చిన వాళ్లన్నమాట. ఒకళ్ళిద్దరు డిగ్రీ పాసయిన వాళ్లు ఉన్నారని తర్వాత తెలిసింది. టెన్త్ క్లాస్ నుండి డైరెక్ట్ గా వచ్చినవాళ్లు కూడా ఉన్నారు.

ఈలోపు బలంగా ఉండి, టైట్ ప్యాంట్, టక్ చేసుకుని, బూట్లతో టక టక శబ్దం చేసుకుంటూ ఒకడు క్లాస్ రూంలోకి వచ్చాడు.

జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు... ఒకళ్ళిద్దరు లేచి నిల్చున్నారు.

ఆ వచ్చినవాడు క్లాస్ మధ్యలో నిలబడి, రెక్ లెస్ గా అటూ ఇటూ చూసి, చివరగా ఉన్న బెంచీని ఎంచుకుని, కిట్టు పక్కకి వచ్చి కూర్చున్నాడు.

ఎవ్వూరు (ఏ ఊరు) మీది? 'గర గర' మంది వాడి కంఠం.

'భీమవరం... మీదే ఊరు...?' అన్నాడు కిట్టు.

ఒంగోలు... నాపేరు రాము...

ఈసారి గొలుసులు ఒకదానికొకటి రాసుకుంటే వచ్చే శబ్ధంలాగా ఉంది వాడి గొంతు.

వీడెవడ్రా బాబూ అనుకున్నాడు కిట్టు.

ఇంతలో మాస్టారు వచ్చారు... పాఠం మొదలైంది.

'సైలెన్స్'

***

కంభం పట్టణంలో హడావుడి మొదలైంది.

కంభంలో అంతకు ముందు కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉండేవారు. కానీ అంతా దరిదాపు లోకల్ వాళ్లే. చుట్టు పక్కల ఊళ్లవాళ్లే చేరేవాళ్ళు. కొంతమంది రూములు అద్దెకు తీసుకునేవారు, ఉండేవారు, వెళ్లేవారు...

కానీ ఇప్పటి పరిస్థితి వేరు.

విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, రాజోలు, రాజమండ్రి, అమలాపురం, ఒంగోలు, వేటపాలెం, విజయవాడ, మచిలీపట్నం, భీమవరం...

ఇలా రకరకాల ప్రదేశాల నుండి విద్యార్ధులు కంభం చేరుకున్నారు.

రూములకు అద్దెలు పెరిగాయి. టిఫిన్ లకు కొత్త దుకాణాలు తెరిచారు. మెస్ లు కూడా కొత్తవి పెట్టారు.

విద్యార్ధులంతా తెలుగువాళ్లే... కానీ రకరకాల భాషలు... ఒకడు మాట్లాడితే ఇంకొకడు నవ్వుతాడు... ఒకడు మాట్లాడితే ఇంకొకడికి వింత...

విద్యార్ధుల వేషాలు మారిపోయాయి...

"ఈకలు పీకిన" కోడి చర్మం తెల్లగా ఎలా కన్పిస్తుందో, అదేవిధంగా తమ్మెలు, చెవిదగ్గర వెంట్రుకలు. (ఇంగ్లీష్ లో విష్కర్స్) పై దాకా గొరగడం ఒక ఫ్యాషన్. "డిస్కో డ్యాన్సర్స్" సినిమాతో పేరుగడించిన "మిధున్ చక్రవర్తి" ఈ "ఈకలు పీకిన కోడి" ఫ్యాషన్ కు ఆద్యుడు మరియు ఆదర్శ పురుషుడు.

ఇంకేదో హిందీ సినిమాలో జాకీష్రాఫ్ పరిగెత్తుకుంటూ టక్కు చేసుకోవడం...సగం టక్కు చేయడం... సగం టక్కులేకుండా చేయడం... ముందు టక్కు... వెనక వదిలేయడం... వెనక టక్కు... ముందు వదిలేయడం... వంటి టక్కు టమారాలు తనవంతు కర్తవ్యంగా కుర్రకారుకి నేర్పించాడు.

తాళ్లు తాళ్లుగా 'బీసీ' నాటి కాలంలో వేసుకునే చెప్పులు, రకరకాల తోలు చెప్పులు, స్పోర్ట్స్ షూస్ ప్రచారంలో ఉన్నాయి.

కల్చర్ షాక్!

కల్చర్ షాక్ అంటే... ఒక ప్రదేశంలోని ప్రజలు కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు, అక్కడి ప్రజల ఆచారవ్యవహారాలను చూసి ఆశ్చర్యపోతారు. వాటిని అర్ధం చేసుకుని, జీర్ణించుకుని, దానికి తగినట్లుగా తమ ప్రవర్తన, భావన మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది.

కంభం వచ్చిన పిల్లకాయలకు కల్చర్ షాక్!

ఈ పిల్లకాయలను ఆహ్వానించిన కంభం పట్టణానికి కల్చర్ షాక్!

కంభం చేరుకున్న విద్యార్ధులకు కొత్త అనుభవాలు!

స్నానానికి నీళ్లు కావాలంటే బోరుపంపు దగ్గరకు వెళ్లి, హ్యాండిల్ ను కొడుతూ, నీళ్లు బకెట్ లో నింపుకోవాలి.

కంభంలో చెరువుంది. అది కంభం చెరువుగా ప్రసిద్ధి చెందింది. ఎవరో తవ్విన చెరువు కాదది.

సహజ సిద్ధంగా నాలుగువైపులా ఎత్తైన గుట్టల మధ్య ఏర్పడిందది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ చెరువు నిండి కళ కళ లాడుతుంది. కానీ ఆ చెరువు చాలా దూరం. వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం అసంభవం.

కంభం ప్రజలు బోరుపంపు నీళ్లకు అలవాటుపడిపోయారు.

కొన్ని బోర్లలో మంచి నీళ్లు వస్తాయి. డైరెక్టుగా తాగడమే...

మంచి నీళ్లురాని బోరు నీళ్లు స్నానానికో గిన్నెలు కడగడానికో వాడుకునేవారు.

ప్లాస్టిక్ బిందెలు ఎక్కువగా వాడతారు.

ఎందుకంటే వేరే బిందెలు వాడితే అవి కిందపడి సొట్టలు పడితే అవి తీయడం పెద్దపని.

ఒకటి, రెండు బిందెలయితే స్టీలు, ఇత్తడి, కంచు వాడవచ్చు.

వాడకం ఎక్కువ గనుక బరువు తక్కువగా ఉండే ప్లాస్టిక్ బిందెలు ఎన్నుకున్నారు.

ఆడపిల్లలు అలవోకగా, అలసిపోకుండా బిందెలు, బిందెల నీళ్లు బోరుపంపుతో కొట్టి తీసుకువెళ్లేవారు.

రకరకాల ప్రదేశాల నుండి వచ్చిన మహావీరులు, రెండు బిందెలకే అలసిపోయేవారు. ఎందుకంటే అలవాటు లేకపోవడం వలన.

ఈ విద్యార్ధులకు అందుబాటులో ఉండే టిఫిన్ సెంటర్లో దొరికేవి రెండే రెండు... ఇడ్లీ మరియు దోశ. దోశ వేసే పద్ధతి ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

ఒక పెద్ద ఇనుప రేకు... దాని కింద మంట... రేకు వేడెక్కిన తర్వాత ఛళ్ మని నీళ్లు జల్లి... టాయిలెట్లు కడిగే ఈనెల చీపురులాంటి చీపురుతో తుడిచి... దోసె పిండి వేసి, ఆయిల్ వేసి, దోసె తయారుచేసి, వేడివేడిగా సెనగల చట్నీతో వడ్డించేవారు.

ఈ దోశ తయారీ విధానం కంభంలోనే కాక పలు పట్టణాల్లో కూడా అమలులో ఉంది...

ఇంకా వెరైటీ టిఫిన్లు కావాలంటే చాలా దూరం వెళ్లాలి. అంత ఓపిక లేక, దగ్గర్లోని టిఫిన్ సెంటర్లో తినేసి, కాలేజికి వెళ్లిపోయేవారు విద్యార్ధులు.

ఎప్పుడైనా మెస్ భోజనం బోరు కొట్టినప్పుడు, సాయంత్రం పూట, డిన్నర్ కి కుష్కా తినేవారు.

"కుష్కా" అనేది కొత్త పేరు.

బిరియానీ రైస్ లాగా ఉండే కలర్ రైస్, దానితోపాటు శేరువా కలిపితే అదే కుష్కా.

కంభంలో హిందూ, ముస్లింలకు పడిచచ్చేది కాదు. వాళ్లు కొట్టుకుంటే, పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా రావాల్సి ఉండేదని చెప్పుకునేవారు. అటువంటి గొడవలు జరిగినప్పుడు తెలిసో, తెలియకనో మధ్యలో ఇరుక్కుంటే ఇంతే సంగతులు అని విద్యార్ధులు భయపడేవారు.

కంభంలో నాటుబాంబులు తయారు చేస్తారని చెప్పుకునేవారు.

***

కంభం యూత్...

బీటెక్ పట్టభద్రులు, డాక్టర్లు మొదలుకుని అన్నిరకాల డిగ్రీలు చేసిన వాళ్లున్నారు. టెన్త్ ఫెయిల్ అయిన వాళ్లూ ఉన్నారు. వీళ్లకి కొత్తగా వచ్చిన వాళ్లు నచ్చడం లేదు. వీళ్ల వాలకం, కథా, కమామీషు కంభం యూత్ కి కోపాన్ని కలిగిస్తున్నాయి.

అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

వీళ్లపని పట్టాలని కాచుకున్నారు.

కంభం అమ్మాయి మీద కామెంట్ చేసాడంట... పాలిటెక్నిక్ స్టూడెంట్ ఒకడు... అంతే...

నలుగురైదుగురు కంభం యూత్ వాడి రూమ్ మీద దాడి చేసి, వాణ్ణి, వాడి రూమ్ మేట్లని చితకబాదారు.

అంతేకాక అవసరమున్నప్పుడల్లా ఏటీయమ్ లో డబ్బులు తీసుకున్నట్లుగా... వారం పదిరోజులకొకసారి వాణ్ణి బాదే కార్యక్రమం పెట్టారు. ఈ ఏటీయమ్ పాలసీ భీమవరంలో లేదు. ఎవడన్నా అమ్మాయిని ఏడిపిస్తున్నాడని కంప్లైంట్ వస్తే చితకబాదే కార్యక్రమం ఒకేఒక్కసారి... అంతేకానీ ఇలా... సులువు వాయిదాల పద్ధతి లేదు.

ఈ బాధ పడలేక... బతికుంటే బలుసాకు తినవచ్చు... పాలిటెక్నిక్ లేకుంటే 'పాలు' అమ్ముకుని బతకవచ్చు... అనుకుంటూ తన్నులు తిన్న విద్యార్ధి ఊరు వదిలి పారిపోయాడు.

కంభంలో శాంతపరులు, విజ్ఞానవంతులు కూడా చాలామంది ఉన్నారు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college drop out gadi prema katha