Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugadu inter fail ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

దిహేను రోజులు గడిచిపోయాయి.

త్రివిక్రమ్‌ చేయని ప్రయత్నమంటూ లేదు.

మూడు లక్షలు కాదుగదా ముప్పైవేలు కూడా సాధించలేకపోయాడు. అవతల చూస్తే తండ్రి పెట్టిన కండీషన్‌ ప్రకారం గడువు మరో పక్షం రోజులకు మించిలేదు.

తన ప్రయత్నం ఫలించకపోతే

శాశ్వతంగా ఆ ఇంటికి తనకూ సంబంధం తెగిపోతుంది. అందులో ఎంతమాత్రం సందేహంలేదు. తన తండ్రి పట్టుదల ఎలాంటిదో తనకు తెలుసు. ప్రస్తుతానికి ఆయన సైలంట్‌గానే వున్నాడు.

''కాని ఆ చూపులు''

అవి భరించటం తనకు సాధ్యంకావటంలేదు.   

నువ్వు అసమర్ధుడివి.

నువ్వేమీ చేయలేవు.

నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోక తప్పదు.

నీలాంటి చేతకానివాడు నా కొడుకే కాదు. అన్నట్టు ఆయన కళ్ళలో కన్పించే అనేక భావాలు తనని చాలా చాలా ఇబ్బందిపెడుతున్నాయి. ఇంచుమించుగా తామిద్దరికీ మాటల్లేవు. రానురాను ఆయన కంటబడాలంటేనే భయం వేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తన తల్లి ప్రశాంతి నలిగిపోతోందని తనకు తెలుసు.

తండ్రికంటబడకుండా తప్పించుకుంటూ త్రివిక్రమ్‌ వేళకు ఇంటికి రావటంలేదు. భోంచేయటంలేదు. డబ్బు సమకూర్చకపోతే వాడ్ని ఇంట్లోకి రానివ్వరని ఇప్పట్నుంచే ఆమె బెంగపెట్టుకుని సరిగా భోం చేయలేకపోతోంది. కంటినిండా నిద్రపోలేకపోతోంది.

ఒక విధంగా చెప్పాలంటే

తనమీద తనకే జాలివేస్తోంది త్రివిక్రమ్‌కి.

ఈ పరిస్థితులోనే

పదహారో రోజున అతడి మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. తను ఏమైనా ఫరవాలేదు. తండ్రి దృష్టిలో తను చేతకాని వాడుగా ముద్రపడిపోకూడదు. ఏదో ఒకటిచేసి డబ్బు సాధించాలి అలా సాధిస్తేనే తమ ఇల్లు దక్కుతుంది. చెల్లాయి పెళ్ళి ఘనంగా జరుగుతుంది. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో కూడా నిర్ణయానికొచ్చేసాడు. అందుకే ఆరోజు ఉదయం తన ఫ్రెండ్స్‌ శివా చైనత్యలు ఇద్దరికీ ఫోన్‌చేసి పిలిపించాడు.

ముగ్గురూ సమీపంలో ఎవరూలేనిచోట పార్కులో సమావేశమయ్యారు.

''చెప్పరా విషయం ఏమిటి?'' త్రివిక్రమ్‌ అందించిన సిగరెట్‌ ముట్టించుకుని అడిగాడు శివా.

''నాకు డబ్బుకావాలి. మన ప్రయత్నాలు ఫలించలేదు. ఫలిస్తాయన్న నమ్మకం కూడా పోయింది'' చెప్పాడు త్రివిక్రమ్‌?

''అయితే ఏం చేయాలనుకుంటున్నావు?'' కూతూహలంగా అడిగాడు చైతన్య.

''నేనో నిర్ణయానికొచ్చాను.''

''అదేరాబాబు, ఏమిటా నిర్ణయం?''

''దొంగతనం చేయబోతున్నాను, మీ సహకారం కావాలి.''

''వాట్‌?''

మిత్రులిద్దరూ షాక్‌ తిన్నారు.

ఆ వెంటనే పెద్దగా నవ్వేసాడు చైతన్య.

''ఏరా జోక్‌ చేస్తున్నావా? దొంగతనంలో మనకి ఎ.బి.సి.డి.లు కూడా రావుబాబూ! అదంత సులువనుకుంటున్నావా?'' అనడిగాడు.

''జోక్‌ కాదురా సీరియస్సే! ఆ రోజు తమాషాకి చెప్పినా నాడారు సెల్వం సరైనమాటే చెప్పాడు. బ్యాంకు దోచుకోవాలని..... అప్పుడు మనల్ని వెక్కిరిస్తున్నాడనుకొని కోప్పడ్డాం. కానీ ఇప్పుడు వాడి మాటల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఒక బ్యాంకు దోపిడీ చేయాలని డిసైడయ్యాను''.

మిత్రులిద్దరూ పక్కనే బాంబు పడ్డట్టు అదిరిపడ్డారు, ఏం మాట్లాడాలో తెలీక అలా చూస్తుండిపోయారు.

త్రివిక్రమ్‌ సీరియస్‌గానే చెప్తున్నాడని అర్ధమైపోయింది. అయినా బ్యాంకుదోపిడి అంటే ఇదేమన్నా చిన్నపిల్లల సరదా ఆటా?

''ఏమిట్రా ఆలోచిస్తున్నారు?'' ఇద్దరి ముఖాలు చూస్తూ అడిగాడు త్రివిక్రమ్‌.

''ఏం లేదు.... ఏం లేదు నీకింత దరిద్రంగొట్టు ఆలోచన ఎలా వచ్చిందాని ఆలోచిస్తున్నాను'' అన్నాడు శివా.

''ఇది దరిద్రంగొట్టు ఆలోచనకాదురా, ధనం దొరికే ఆలోచన''

''నువ్వు పోలీసులకు దొరికిపోతే?''

''నో ప్రాబ్లం! నేను పోలీసులకు దొరికినా బాధేలేదు. డబ్బుమాత్రం ఫాదర్‌కి చేరాలి. మీరు భయపడక్కర్లేదు. దోపిడీలో మీ సాయం నాకు అక్కర్లేదు. నా అవసరం కోసం మిమ్మల్ని రిస్కులో పడేసేంత మూర్ఖుడ్నికాదు. దోచిన డబ్బు ఫాదర్‌కి చేర్చటంలోనే మీ సాయంకావాలి.''

''అంటే .... ఆల్రెడీ డిసైడయిపోయావన్నమాట! ఏ బ్యాంకు, ఎలా దోపిడీ చేస్తావ్‌?'' కుతూహలంగా అడిగాడు చైతన్య.

''ఇక్కడి బ్యాంకుకాదు. లోకల్‌గా అయితే పొరబాటున నేను పోలీసులకు పట్టుబడితే డాడీ పేరు దెబ్బతింటుంది. ఆయన ఆ డబ్బు తీసుకోరు. పక్క గ్రామానికి చెందిన బ్యాంకును నా టార్గెట్‌గా ఎంచుకున్నాను. ఈ మధ్య మూడురోజులు బయటికెళ్ళింది ఇందుకే మీ ఇద్దరూ నాతో రావాలి.''

''అసలు ఇది సాధ్యపడుతందనుకుంటున్నావా?'' అనుమానంగా అడిగాడు శివా.

''ఎలా? అక్కడ బ్యాంకు సెక్యూరిటీ వుంటుంది. కష్టమర్లు వుంటారు. సిబ్బంది వుంటారు. వీళ్ళందరి కళ్ళు గప్పి స్ట్రాంగ్‌ రూంలోకి వెళ్ళిడబ్బు దోచుకోవటం అంత సులువు అనుకుంటున్నావా? నీ దగ్గర మంత్రం వుందా, కనికట్టు వుందా?''

''అంతకుమించి తెలివి వుంది. ఆత్మవిశ్వాసం వుంది. మనసుపెట్టి ప్లాన్‌ప్రకారంచేస్తే సాధ్యంకానిదంటూ ఏమీలేదు. ఆ బ్యాంకులో స్ట్రాంగ్‌రూంలోకి వెళ్ళాల్సిన అవసరంలేదు. గ్రామం చిన్నదే అయినా చుట్టపక్కల ఇండస్ట్రీస్‌ ఎక్కువగా వున్నాయి. డిపాజిట్స్‌, విత్‌డ్రాయల్స్‌ ఈ రెండు కౌంటర్లలోనే ఎప్పుడూ అయిదారులక్షలకు తగ్గకుండా క్యాష్‌రొటేట్‌ అవుతుంటుంది. సో.... స్ట్రాంగ్‌రూంవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు'' అంటూ జేబులోంచి ఒక పేపర్‌తీసి ఆ ఇద్దరిమధ్య తెరిచాడు త్రివిక్రమ్‌.

అది ఆ వూరిప్లాన్‌ పేపర్‌.

''ఇటుచూడండి..... ఇది బ్యాంకు కట్టడం, ఇక్కడ్నుంచి సరిగా అరకిలోమీటరు దూరంలో ఇక్కడుంది పోలీస్‌స్టేషన్‌. వాళ్ళకు మెసేజ్‌ వెళ్ళి, వాళ్ళు బ్యాంకువద్దకి చేరుకోడానికి ఎంత తక్కువగా చూసినా పదినుంచి, పదిహేనునిముషాల టైం వుంది''.

నేను బుడగలు అమ్ముకునే ఓల్డ్‌మేన్‌గా వేషం మార్చుకుని బ్యాంకులోకి ఎంటరవుతాను. ఎవరూ చూడకుండా నా వెంటతెచ్చిన నాలుగు త్రాచుపాముల్ని బ్యాంకులో వదిలేస్తాను. వాటిని చూడగానే స్టాఫ్‌తోబాటు అంతా పరుగులెడతారు. ఆ సందుచూసుకుని నేను కౌంటర్స్‌లోంచి అయిదులక్షలు బేగ్‌లో వేసుకొని బయటికొచ్చేస్తాను.''

''ఒక్కమాట ..... మనకి అవసరం మూడు లక్షలేగదా?'' త్రివిక్రమ్‌ మాటలకి అడ్డంవస్తూ తన డౌటు బయటపెట్టాడు చైతన్య.

''నిజమే! కానీ అక్కడ కరక్ట్‌గా లెక్కచూడ్డం సాధ్యంకాదు. అందినంత తెచ్చేస్తాను అయిదులక్షలు మా ఫాదర్‌కి యివ్వండి. మిగిలింది మీరిద్దరూ పంచుకోండి'' వివరించాడు.

''ఓ.కె. తర్వాత పారిపోయివస్తూ నా ఓల్డ్‌ గెటప్‌ తీసేసి మామూలుగా మారిపోతాను. ఇదిగో..... బ్యాంక్‌ ఎదురుగానే ఇక్కడ గోడ వుంది చూసారా. ఈ గోడ అవతల పొదల్లో మీరిద్దరూ వుంటారు సరిగ్గా నా దగ్గరున్న బేగ్‌లాంటిదే నాలుగుజతల బట్టలతో మరో బేగ్‌ని మీరక్కడ వుంచుతారు. నేను గోడదూకగానే నా దగ్గర కేష్‌బేగ్‌ని పొదల్లోకి విసిరేసి. అక్కడుంచిన డమ్మీబ్యాగ్‌తో పారిపోతాను. మీరు పొదల్లోంచి తాపీగా బేగ్‌ కలక్ట్‌చేసుకొని వెళ్ళిపొండి. నా కోసం ఎదురుచూడొద్దు. నేను జాబ్‌కోసం దుబాయ్‌ వెళ్ళిపోయానని డబ్బు పంపించానని డాడీతో చెప్పండి చాలు''

''ఒక వేళ పోలీసులుగాని, జనంగానీ ఎవరూ నీ వెంటపడకపోతే?'' అడిగాడు శివా.

''పడకుండా ఎలా వుంటారు. చేసేది బ్యాంకుదోపిడి, మనం రేపు ఉదయం ఆ వూరు వెళతున్నాం. బుధవారం పదకొండు, పన్నెండుమధ్యన మన ప్లాన్‌ అమలుచేస్తున్నాం. ఒకవేళ నా టైం బాగోక దోపిడీకి ముందే నేను దొరికిపోవటం జరిగితే డోంట్‌వర్రీ! నాకోసం మీరు చూడకండి. వెనక్కివచ్చేయండి. ఆక్సిడెంట్‌లో నేను చనిపోయానని డాడీతో చెప్పండి'' అన్నాడు బాధగా.

వెంటనే అతడి భుజం తట్టారు మిత్రులిద్దరూ.

''అంతమాటనకురా! నువ్వు సక్ససవుతావ్‌.మేం నీ వెంటుంటాం'' అంటూ ధైర్యం చెప్పాడు చైతన్య.

***

బుధవారం

సమయం ఉదయం పదకొండు పన్నెండుగంటలమధ్య ప్రాంతం. ఆ గ్రామంలోని గ్రామీణబ్యాంకు అంతగా బిజీ వుండని సమయం అది. ఆ సమయం త్రివిక్రమ్‌కి బాగా కలిసివచ్చిందనే చెప్పాలి.

అనుకున్న ప్లాన్‌ ప్రకారమే బుడగలమ్మే ఓల్డ్‌మేన్‌ గెటప్‌లో బ్యాంకులో వెళ్ళాడు త్రివిక్రమ్‌. సిద్దంగా తెర్చుకున్న నాలుగు త్రాచుపాముల్ని వదిలాడు.

బ్యాంకులో గందరగోళం మధ్య రెండు కౌంటర్లలోంచి అందినంత బేగ్‌లో వేసుకొని వేగంగా బయటికొచ్చేసాడు. అడ్డంపడిన సెంట్రీని ఒకే దెబ్బతో తెలివి తప్పించి వీధిలోకి వచ్చేసాడు.

ఇంతవరకు అతడి అదృష్టదేవత కనికరించిందనే చెప్పాలి. కానీ వీధిలోకి రాగానే అదృష్టదేవత అతడిఖర్మకు వదిలేసి తనదారిన వెళ్ళి పోయింది. పోలీసులరూపంలో దురదృష్టం అతడ్ని వెక్కిరించింది.

నిజానికి బ్యాంక్‌లో ఏంజరిగిందో పోలీసులకు తెలీదు. ఏదోపనిమీద యస్సైతోబాటు పదిమంది పోలీసు బృందం అటుగా వచ్చింది. ఒక్కసారిగా బ్యాంక్‌లోంచి వినవచ్చినకేకలు, పారిపోయి వీధిలోకి వచ్చేసిన ఓల్డ్‌మేన్‌ని చూడగానే యస్సైకి డౌట్‌ వచ్చింది. అంతలో బ్యాంక్‌లోంచి బయటికి దూసుకొస్తూ ఎవడో అరిచాడు.... ''వాడెవడో బ్యాంక్‌ దోచుకుని పారిపోతున్నాడు. పట్టుకోండి వాడ్ని ఆపండి'' అంటూ.

అప్పటికే త్రివిక్రమ్‌ బ్యాంక్‌ ఎదురుసందులోకి ఎంటరయి శరవేగంతో పరుగు తీస్తున్నాడు. జీప్‌ వెళ్ళేంత విశాలమైన సందుకాదు అది. అందుకునే జీప్‌ వదిలేసి ఎస్సైతోబాటు పోలీసులు సందులోకి దూసుకొచ్చి త్రివిక్రమ్‌ వెంట పరుగు ఆరంభించారు.

పోలీసు విజిల్స్‌, అరుపులు, కేకలతో ఆప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాలికొద్ది పరుగుతీస్తున్నాడు త్రివిక్రమ్‌.

అతను అస్సలు వూహించని కొత్తమలుపు యిది.

ఎందుకంటే బ్యాంక్‌లో చాలా సులువుగా త్వరగా పనిజరిగిపోయింది. ఎవరన్నా ఫోన్‌ చేసినా పోలీసులు రావటానికి పావుగంట పడుతుంది. ఈ లోపల తను చాలాదూరం వెళ్ళిపోవచ్చనుకున్నాడు. కాని బేడ్‌టైమ్‌. ఇలా వీధిలో అడుగు పెట్టగానే అలా తగులుకున్నారు పోలీసులు.

వంకరటింకరగా వున్న సందువెంట పరుగుతీస్తూనే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్‌. పరుగులు తీస్తూనే తన ఓల్డ్‌మేన్‌ గెటప్‌ తీసిపడేసాడు. తల విగ్గు మీసాలు పీకిపడేసాడు. సుమారు మూడు వందల గజాల దూరంలో యమకింకరుల్లా దూసుకొస్తున్నారు పోలీసులు. క్రమంగా ఇరువర్గాలమధ్య దూరం తగ్గుతోంది.

అయిదే అయిదు నిముషాల్లో

తను ప్లాన్‌చేసిన గోడవవ్దకు వచ్చేసాడు. త్రివిక్రమ్‌ ఒకే జంప్‌తో ఎగిరి గోడపైన కూర్చుని అటు నుంచి అవతలికి దూకేసాడు.

అక్కడ సిద్దంగావుంది డమ్మీబ్యాగ్‌.

తన భుజాన క్యాష్‌బ్యాగ్‌ని వేగంగా పొదల్లోకి విసిరేసాడు. డమ్మీ బ్యాగ్‌ని భుజాన వేసుకొని తిరిగి రన్నింగ్‌ ఆరంభించాడు.

అక్కడికి సమీపంలోనే ఒక గుబురు చెట్టు వెనక రెడీగా వున్నారు. శివా, చైతన్యలు యిద్దరూ. గోడదూకిన త్రివిక్రమ్‌ను చూసారు అతడు విసిరేసిన బ్యాగ్‌ పొదలో పడిందికూడా గమనించారు. చైతన్య లేవబోతుంటే శివా వెనక్కి లాగి కూర్చోబెట్టాడు.

''పోలీస్‌ విజిల్స్‌ విన్పిస్తున్నాయి. మనవాడు రిస్క్‌లో వున్నాడు. కాసేపు వెయిట్‌చేద్దాం'' అంటూ హెచ్చరించాడు.

చూస్తుండగానే యస్సైతోపాటు పోలీసులు గోడదూకి త్రివిక్రమ్‌ని తరుముకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోగానే మితృలిద్దరూ లేచారు. వేగంగా పరుగెత్తుకెళ్ళి పొదల్లోని బ్యాగ్‌ కలక్ట్‌ చేసుకున్నారు. జిప్‌ లాగగానే లోన కట్టలు కట్టలుగా డబ్బు కళ్ళను జిగేల్‌మనిపిస్తోంది. ఆ బ్యాగ్‌ని అలాగే ఒక గుడ్డసంచిలోకి తోసేసి చేత్తో పట్టుకున్నారు.

పావుగంట  తర్వాత

అదే గ్రామీణబ్యాంకు ముందునుంచి దోపిడి సొమ్ముతో వాళ్ళిద్దరూ బస్టాండ్‌ దిశగా సాగిపోయారు. కాని ఎవరూ వాళ్ళని అనుమానించలేదు.

ఈ లోపల

పోలీసులు చాలదూరం వరకు త్రివిక్రమ్‌ని తరుముకుంటూ వెళ్ళారు. ఇక వాళ్ళనుంచి ఎస్కేప్‌ కావటం సాధ్యంకాదని త్రివిక్రమ్‌కి కూడా అర్దమైపోయింది. రైల్వేస్టేషన్‌ సమీపంలో పోలీసులకు దొరికి పోయాడు.

''మీరెందుకు నావెంటపడ్డారో అర్దంగావటంలేదు'' అన్నాడు అమాయకంగా యస్సైని చూస్తూ త్రివిక్రమ్‌.

''నువ్వెందుకు పారిపోతున్నావ్‌ బ్రదర్‌'' వెక్కిరింపుగా అడిగాడు యస్సై.

''ట్రెయిన్‌ సార్‌, రైలు మిస్సవుతుందని పరుగెత్తుకొస్తుంటే మీరు నా వెంటపడ్డారు టైమైంది. నన్నొదిలితే రైలెక్కి వెళ్ళిపోతాను''.

''అంత అర్జంటా? బ్యాంక్‌దోచుకొని పారిపోదామనే, తియ్యరా. ఆ బ్యాగ్‌ తియ్యి.

''మీరేమంటున్నారో అర్దంగావటంలేదు. బ్యాంక్‌ దోచుకోవటం ఏమిటి? నాకేం తెలీదు.''

పోలీసులు త్రివిక్రమ్‌ భుజాన బ్యాగ్‌లాగి ఓపెన్‌ చేసారు. లోపల నాలుగు జతల బట్టలు, లుంగీలు టూత్‌బ్రష్‌, పేస్ట్‌ ఇవే కన్పించాయి గాని డబ్బు కన్పించలేదు. అదే బేగ్‌... తాము వెన్నంటే తరుముకొచ్చారు. అయినా దోపిడి సొత్తు అతడి దగ్గరలేదు. ఈ మిస్టరీ ఏమిటో బుర్రచించుకున్నా యస్సైకి అర్ధంకాలేదు.

''నీపేరేమిట్రా?'' అడిగాడు.

''నా పేరు మార్కండేయుడండి.''

''ఏ వూరు?''

''నాకెవరూ లేరండి. అనాధని, పార్ట్‌టైం జాబ్‌చేసుకొని ఏదో బతికేస్తుంటాను.''

''దోపిడి సొమ్ము ఎక్కడ?''

''బతకటం తెలీనివాడ్ని, నేను దోపిడీ చేయడం ఏమిటిసార్‌. మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. నాకేం తెలీదు.''

''నువ్వు కిలాడివిరా. మనం మాట్లాడుకోవలసింది చాలా వుంది. గాని పద'' అంటూ స్టాఫ్‌కి సైగచేసాడు యస్సై.

త్రివిక్రమ్‌ ఆరెస్ట్‌ చేసారు పోలీసులు.

***

ఉదయం ఏడున్నర గంటలు

గుమ్మంలో అలికిడివిని

న్యూస్‌ పేపర్‌లోంచి తలెత్తిచూసారు గోవిందరావు, ఎదురుగా శివా, చైతన్యలు లోనకొస్తూ కన్పించారు. వాళ్ళని చూడగానే అయిష్టంగా నొసలు విరిచాడాయన. తన పెద్దకొడుకు త్రివిక్రమ్‌ ఎందుకూ పనికిరాకుండా పోడానికి కారణం వీళ్ళిద్దరేనని ఆయన అభిప్రాయం.

''ఎందుకిలా వచ్చారు? వాడు ఇల్లువదిలిపోయి నాలుగురోజులు అయింది బహుశా తిరిగిరాడనుకుంటాను'' అన్నాడు పొడిగా.

''అవునంకుల్‌, ఆమాట నిజమే, ఇప్పట్లో వాడు తిరిగిరాడు. ఎందుకంటే వాడికి దుబాయ్‌లో జాబ్‌వచ్చింది. వెళ్ళిపోయాడు'' చెప్పాడు శివా.

''దుబాయ్‌లో జాబా.. ఒరే ఒరే... ఎందుకురా అబద్దాలు చేప్తారు? వీడ్ని నమ్మి జాబ్‌ ఇచ్చేవాడు ఎవడట?''

''ఇచ్చారు అంకుల్‌. అందుకే వెళ్ళిపోయాడు. మీకు యిమ్మని ఈ బ్యాగ్‌ మాచేతికిచ్చి పంపాడు'' అంటూ చేతిలో బేగ్‌ని టీపాయ్‌మీద వుంచాడు.

''ఇందులో ఏముంది?'' అనుమానంగా అడిగాడు గోవిందరావు. డబ్బు సర్దుబాటు చేయమని మీరు కండీషన్‌ పెట్టారు. కానీ మీరు డబ్బుకి ఇబ్బంది పడకూడదని వాడు ఆరు లక్షలు ఇచ్చాడు. వాడ్ని నమ్మి ఉద్యోగం ఇచ్చిన వాడు వీడికి అడ్వాన్స్‌గా యిచ్చిన సొమ్ము. తీసుకోండి'' అన్నాడు చైతన్య.

ఆరు లక్షలు అనగానే

గోవిందరావు ముఖం ట్యూబ్‌లైట్‌లా వెలిగింది. వెంటనే జిప్పు లాగి బేగ్‌లోకి చూసాడు. కట్టలు కట్టలుగా డబ్బు.

''వాడు ఎప్పుడు వస్తాడు?'' ఆశ్చర్యంనుంచి తేరుకుంటూ అడిగాడు.

''రెండేళ్ళు... లేదా నాలుగేళ్ళ తర్వాత వస్తాడు. చెల్లెలి పెళ్ళి వరకూ వుండలేకపోయినందుకు వాడు చాలా బాధపడ్డాడు. చెల్లెలి పెళ్ళి గ్రాండ్‌గా జరిపించమని చెప్పాడు'' శివా చెప్పాడు.

''దుబాయ్‌లో వాడి అడ్రస్‌ ఏమిటి||

''తెలీదు అంకుల్‌ వాడు ఫోన్‌చేస్తే మీరు మాట్లాడొచ్చు. మాకు కూడా తన దుబాయ్‌ అడ్రస్‌గాని, కంపెనీ అడ్రస్‌గాని యివ్వలేదు. వస్తాం అంకుల్‌ సీయూ''

వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.

అంతలో పక్కన వెక్కివెక్కి పడుతున్న సౌండ్‌ విని తలతిప్పి చూసాడు. ఎప్పుడు వచ్చిందోగాని కిచెన్‌డోర్‌ ప్రక్కనే నిలబడుంది ప్రశాంతి. గోవిందరావు తనవంక చూడ్డంచూసి కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ అక్కడే కూర్చుండిపోయింది.

లేచి దగ్గరకెళ్ళాడు.

''నీ బాధ నేను  అర్ధంచేసుకోగలను. వాడు ప్రయోజకుడు అయ్యాడు. సంతోషించు, రెండేళ్ళు ఓపికపడితే దుబాయ్‌నుంచి వచ్చేస్తాడు'' అంటూ నచ్చచెప్పపోయాడు.

ఆమె ఛీత్కారంగా చూసింది.

''రాడు వాడు ఇప్పట్లో రానేరాడు. మీక్కావలసింది డబ్బు అని వాడికి అర్ధమైపోయింది. డబ్బు పంపించి తన దారి తను చూసుకున్నాడు. వాడి మనసులో ఎంత బాధలేకపోతే కనీసం వెళ్ళే ముందయినా నాకు ముఖం చూపించకుండా వుంటాడా....! బిడ్డని నాకు దూరం చేసారు. ఇప్పుడు మీకు సంతోషమేకదా?'' అంటూ ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోయిందావిడ.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్