Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nela rojulu

ఈ సంచికలో >> కథలు >> వెయిటింగ్ ఫర్ యాద్గిరి

waiting for yadgiri

కోఠీ సెంటర్లో ఆగి ఉన్న ఆటో ఎక్కి "పోనీ" అన్నాను.

"ఎక్కడిదాన్క..?" మీటర్ వేస్తూ అడిగాడు ఆటోవాలా.

"చచ్చేదాకా" అన్నాను.

ఉలిక్కిపడ్డాడు వాడు. అయోమయంగా చూసాడు నావైపు.

"సచ్చేదాన్కనా? ఎవరు సచ్చేదాన్క...? నేనా...నువ్వా?" అడిగాడు.

"నువ్వు కాదు నేనే భాయ్. నా ముక్కులో ఊపిరున్నంతవరకూ ఆటో పోనియ్, సరేనా?" అన్నాను ఆటోలో రిలాక్స్ గా కూర్చుంటూ. వాడికి నా ఫిలాసఫీ అర్ధం అయినట్టులేదు. పైగా కోపం కూడా వచ్చినట్లుంది.

"నీ కండ్లకు నేనేమైనా పొగల్లాన్లెక్కగిన కొడుతున్నానా? లేక్పోతే లైఫ్ లాంగ్ నువ్వు సచ్చేదాకా నిన్ను మోస్కోని తిర్గనీకి నువ్ తాళికట్టిన నీ పెండ్లం లెక్కగిన కన్పడుతున్నానా? ఛల్ దిగు ఆటో... సచ్చేదాన్క తిప్పాలంట. అసలు సచ్చేదాన్క ఆటోలో తిప్పనీకి ఎన్ని పైసలయితయో ఎర్కేనా నీకు?"

"ఖచ్చితంగా తెలియదు, కానీ చాలా డబ్బే ఇవ్వాల్సి వస్తుందని మాత్రం తెల్సు. అందుకే నా ఆస్తిపాస్తులన్నీ అమ్మి ఆ డబ్బంతా బ్యాంకులో డిపాజిట్ చేసి వస్తున్నా. ఇదుగో నేను సంతకం చేసిన బ్లాంక్ చెక్. నా చివరి శ్వాస ఆగిపోయిన మరుక్షణం ఆటో ఆపేసి మీటర్ లో ఎంతయిందో చూసి ఆ ఫిగర్ ని చెక్ మీద రాసుకొని వెళ్ళి బ్యాంకులో డ్రా చేసుకో" అన్నాను చెక్ చేస్తూ.

"నీ శ్వాస గెప్పుడాగిపోవచ్చు...?" వాడట్లా అడుగుతాడని ఊహించలేకపోయాను.

"తెలీదు. ఇంకో నిమిషం తర్వాతైనా పోవచ్చు. నలభై సంవత్సరాలకు పోవచ్చు. నీకు విసుగుపుట్టి నువ్వే నా గొంతు పిసికి చంపకపోతే" నవ్వాను.

వాడు నా సెన్సాఫ్ హ్యూమర్ ని పట్టించుకోలేదు. నేనిచ్చిన బ్లాంక్ చెక్ ని అటూ ఇటూ తిప్పి చూస్తూ -

"ఇంతకీ బ్యాంకుల ఎంత డిపాజిట్ జేసిండ్రు?" అనడిగాడు.

"ఒక మనిషి తన పూర్తి జీవితకాలం ఏ బాదరబందీ లేకుండా హాయిగా గడపడానికి అవసరమైనంత" చెప్పాను.

వాడు ఆలోచనల్లో పడ్డాడు. ఇదేదో మంచి బేరంలానే ఉందనిపించింది వాడికి. ఒక ట్రిప్ లో గిరాకీ దొరికితే ఇంకో ట్రిప్ లో ఆటో ఎక్కేవాడే దొరక్క ఎదురుచూసీ చూసీ రోజూ విసిగిపోయేకన్నా కనీసం నలభై సంవత్సరాలు - అంటే ఇప్పట్నుంచి లెక్కబెడితే ఒక జీవితకాలం ఢోకాలేని గిరాకీ దొరికిందనిపించింది వాడికి. అదృష్టవశాత్తూ ఈ పాగల్గాడు మధ్యలోనే చనిపోతే అన్నేళ్ళూ వీడ్ని మోయనక్కర్లేదు కూడా - అని కూడా అనిపించింది. ఇంకేం ఆలోచించలేదు వాడు. ఆటోని స్టార్ట్ చేసి హుషారుగా ముందుకి పోనిస్తూ అడిగాడు.

"ఓకే సార్! ఈ కాంట్రాక్టుకి నేనొప్పుకుంటున్నా. అంత మంచిగనే ఉన్నది. కానీ డీజిల్ సంగతి, మన తిండి సంగతీ ఏంది..?"

"ఈ ట్విన్ సిటీస్ లోని అన్ని పెట్రోల్ బంకులకూ, అన్ని రెస్టా రెంట్లకూ కొంత ఎమౌంట్ ముందే కట్టొచ్చాను. నేను చచ్చేదాకా చచ్చినా వాళ్లెవ్వరూ మనల్ని డబ్బులు అడగరు సరేనా?"

వాడు స్థిమితపడ్డట్లున్నాడు.

"మంచిది. ఇగ జెప్పండి - ఆటోని ఏ రూట్లో పోనిద్దాం?" అడిగాడు.

"నీ ఇష్టం. నాకైతే ఓ గమ్యమంటూ ఏంలేదు. నీకు ఎటు పోవాలని పిస్తే అటుపోనీ. నిరంతరం ఆటోలో ప్రయాణిస్తుండటం మాత్రం ముఖ్యం. ముందు నీ స్టీరియోలో ఏదైనా మంచి పాతపాట పెట్టు. కిషోర్ కుమార్ పాట - "ముసాఫిర్ హుయారో" ఉందా?"

"గస్మంటివన్నీ లెవ్వుగానీ జబ్బస్తి పాటొకటి పెడ్త - ఇనండి?? అంటూ నా అంగీకారం లేకుండానే స్టీరియోలో ఏదో క్యాసెట్ పెట్టి నొక్కాడు.

"చిన్నదమ్మే చీకులు కావాలా...
నా సామిరంగా -
చీకులమ్మే చిన్నది కావాలా...?

"ఏం పాటయ్యా ఇది. తీసి ఇంకేదైనా పెట్టు" అనబోయాను కానీ ప్రయాణంలో హుషారు బీటుగానే అన్పించి ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

ఆటోలోంచి హైదరాబాద్ దృశ్యాల్ని వాసన చూస్తున్నాయి కళ్ళు. "చేయడానికి ఇక జీవితంలో ఏంలేదు. ఏ కఠోర వాస్తవం కూడా ఇకపై నా భ్రమల్ని పటాపంచలు చేయలేదు - చివరికి మృత్యువు కూడా... బాగుంది - చివరివరకూ ఇలా ప్రయాణించడం... బాగుంది - హాయిగా ఇలా ఆటోలో కూర్చొని ఎండనూ, నీడనూ, వర్షాన్నీ, కట్టడాలనీ, కదలికల్నీ, దృశ్యాల్నీ - ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని సెలబ్రేట్ అవ్వడం..." అనుకుంటున్నప్పుడు నా చీమూ, రక్తమూ, మాంసమూ, చెమటా, వెంట్రూకలూ, చర్మం, గోళ్లూ, కణాలూ, అస్తిత్వమూ - అన్నీ ఏకకాలంలో తియ్యగా మూలిగిన చిన్న జలదరింపు.

ఆటో రవీంద్రభారతిని దాటబోతున్నపుడు చూసాను. ఎవరో ముసలాయన. ఒంటరిగా రవీంద్రభారతి మెట్లెక్కుతున్నాడు. అతన్ని "సాగర సంగమం" సినిమాలో వయసుపైబడ్డ కమలహాసన్ పాత్రలా ఊహించుకున్నాను.

 టూ మిస్టేక్స్ రా... టూ మిస్టేక్స్...
స్టెప్పులయ్యా... స్టెప్పులూ...
పలికే పెదవి వణికింది ఎందుకో...?
నమస్కారమయ్యా... నమస్కారమమ్మా... -

నాద వినోదము... నాట్య విలాసము... పరమసుఖము... కె. విశ్వనాథ్. ఈ టైం లో ఏం చేస్తూ ఉండొచ్చో...?

సాగరసంగమాన్ని సినిమాగా కాకుండా నాటకంగా మార్చి - నెలలో ఒక ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో అవే పాత్రలో ప్రదర్శిస్తుంటే ఎలా ఉంటుందో కదా అన్పించింది.

కమలహాసన్ చెన్నై నుండి ప్రతినెలా హైదరాబాద్ కి ప్లయిట్లో వచ్చి నాటకంలో నటించి వెళ్తూ ఉంటాడు. శరత్ బాబు పంచె కట్టుకొని కార్లో వచ్చి నటించిపోతుంటాడు.

జయప్రద రాజకీయ బాధ్యతల్ని నెలలో ఒకరోజు పక్కనపెట్టి రవీంద్రభారతికి వచ్చి వెళ్తూంటుంది.

కొంచెంలావయినా యస్.పి. శైలజ 'ఓం నమఃశివాయః పాటకు తనే వచ్చి డాన్స్ చేసి కమలహాసన్ చేత తిట్లు తిట్టించుకొని వెళ్తుంది.

ఒక చిన్న మార్పుంటుంది. "బాలకనకమయక్ ల సృజనపరిపాల" పాటకు మంజుబార్గవి నృత్యప్రదర్శన కాకుండా ఒక్కోసారి ఒక్కో క్లాసికల్ డాన్సర్ అరంగ్రేటం ఉంటుంది.

నాటకంలో మొదటి దృశ్యం - కమలహాసన్ (బాలూ పాత్రధారి) రిక్షాలో రవీంద్రభారతికి రావడం...

ఈ నాటక ప్రదర్శన అత్యంత సహజంగా. కొంత వైవిధ్యంగా కూడా ఉంటుంది. అంటే -

కమలహాసన్ బేగంపేట ఎయిర్ పోర్టులో ఫ్లయిట్ దిగి రిక్షా ఎక్కి సరిగా నాటక ప్రదర్శన మొదలయ్యే సమయానికి రవీంద్రభారతికి చేరుకుంటాడు లాల్చీ పైజామా గడ్డం విస్కీవాసనతో.

ప్రేక్షకులు హాల్లో కాకుండా రవీంద్రభారతి మెట్ల పక్కన నిలబడి కమలహాసన్ రాకకోసం ఎదురుచూస్తుంటారు. రిక్షా రవీంద్రభారతి ఆవరణలోకి రాగానే నాటక ప్రదర్శన మొదలైనట్లు అర్ధం.

కమలహాసన్ రిక్షా దిగి రవీంద్రభారతిలోకి వెళ్లి చివరి వరుసలోని సీట్లో కూర్చుంటాడు.

ఆ తర్వాత ప్రేక్షకులంతా వచ్చి హాల్లో కూర్చుంటారు.

యస్.పి శైలజ నృత్యప్రదర్శన ఓంనమఃశివాయ పాట పూర్తయ్యాక ప్రేక్షకులంతా వెనక్కి తిరిగి చూస్తే చివరి వరుసలో కమలహాసన్ కన్పించడు. స్టేజీ వెనక్కి ఎప్పుడెల్లాడో తెలియదుకానీ పావుగంట తర్వాత నాటకంలోకి ప్రవేశిస్తాడు కమలహాసన్ పత్రికాఫీసు సీన్లో...

చెవి పక్కన్నుంచి కారొకటి వేగంగా దూసుకెళ్లిన శబ్దంతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాను.

ఆటోడ్రైవర్ స్టీరియోలోంచి వస్తోన్న మరేదో లేటెస్ట్ పాటకు అనుగుణంగా తల ఊపుతూ డ్రైవ్ చేస్తున్నాడు.

"కొంచెం సౌండ్ తగ్గించు" అన్నాను. తగ్గించాడు.

"నీ పేరేంటి?" అడిగాను.

"యాద్గిరి... పేరు బాగోలేదు. ఈ రోజునుండీ నీ పేరు సత్యానందం" అన్నాను.

"సచ్చేనందమా? గదేం పేరు సాబ్. సావడం - బతకడం" అన్నాడు యాద్గిరి ఉరఫ్ సత్యానందం నవ్వుతూ.

"ఈ సృష్టిలో నాకు తెల్సినంతవరకూ ఒకే ఒక గొప్ప సత్యముంది. ఆనందమయమై ఉన్న సత్యం - సత్యమై ఉన్న ఆనందం. కలిపితే సత్యానందం. చూసావా? ఎంత గొప్ప పేరు పెట్టానో నీకు..." అన్నాను. "అసలు వీడికిదంతా అర్ధమవుతుందా?" అని వెంటనే అనుకుంటూ.

"భలే పేరు పెట్టిండ్రు సాబ్" పగలబడి నవ్వాడు. పిట్టగూడులా అస్తవ్యస్తంగా పెరిగిన తలవెంట్రుకల కింద సన్నని మెదతో కలిసి ముందు సీట్లో స్టీరింగ్ పట్టుకుని కూర్చున్నవాడిని వెనకనుండి చూస్తోంటే నాకు ఎందుకో జాలివేసింది. వీన్నేకాదు - కొంతమందిని నిద్రపోతున్నపుడు. వెనకనుండి చూసినపుడు, అన్నం తింటున్నపుడు చూస్తే - ఎందుకో తెలీదు - జాలి కలుగుతుంది. సైకియాట్రిస్టుకి చూపించుకోవాలి.

ఆటో స్లో అయింది.

"గీడ ఓ పదినిమిషాలు వెయిట్ జేయిండ్రి సాబ్. గీన్నే మా యిల్లు. గిప్పుడనకపోతే మల్ల నేను ఇంటికొచ్చేటప్పట్కి ఎన్నేళ్ళయితదో? పండుగలకీ పబ్బాలకీ కూడా ఇంటికి రాకుండా ఎంగేజ్ చేసుకుంట్రి. ఒక్కసారి బోయి మా వోళ్లకి కన్పించి వచ్చేస్త..." అని రాజ్ భవన్ ముందు రైల్వే క్రాసింగ్ దగ్గర ఆటో ఆపి నా అంగీకారం తీసుకోకుండానే దిగాడు సత్యానందం.

వాడు ఇంటికేసి కదలబోతుండగా అన్నాను.

"సత్యానందం. త్వరగా వచ్చెయ్. కదలని ఆటోలో కూర్చోవడం చాలా బోర్ నాకు..."

సత్యానందం వెళ్లిపోయాడు రోడ్డు పక్కనున్న రైలుపట్టాల్ని దాటుకొని.

పట్టాల అవతల రోడ్డు పక్కన ఇరానీ హొటల్ 'సీరాక్' కనిపిస్తోంది. రోజంతా కురిసిన కొన్ని వర్షాదివారాల్లో దినపత్రికల అనుబంధాల్ని ముందేసుకొని కూర్చున్న చోటునుండి ఎడతెగని వర్షాన్ని ఎడతెగని ఛాయ్ ల్తో సెలబ్రేటయిన క్షణాలు గుర్తుకొచ్చి ఆ ఫ్లేవర్ లోనే చాలాసేపు ఉండిపోయాను.

ఫ్లేవర్ మొత్తం కరిగిపోయాక మనసుని నెమ్మదిగా బోర్ ఆక్రమించసాగింది.

సత్యానందం వెళ్లినవైపు చూసాను వాడేమైనా వస్తున్నాడేమోనని. పట్టాల అవతలి దృశ్యాన్ని చెరిపేస్తూ జమ్మూనుండి కన్యాకుమారిదాకా బోగీలు తగిలించుకున్న హిమాసాగర్ ఎక్స్ ప్రెస్ రైలు అడ్డంగా పరిగెడుతోంది.

"చచ్చాను. ఈ ట్రైను ఇప్పుడే రావాలా పర్యాటకుల కోసం దీన్ని హైదరాబాద్ మీదుగా నడపాలని టూరిజం డిపార్ట్ మెంటువాళ్ళు ఏ క్షణాన నిర్ణయించుకున్నారో కానీ... దేవుడా...! దీని ఇంజను కాశ్మీర్లో ఉంటే - చివరిబోగీ కన్యాకుమారిలో ఉంటుంది. ఇదెప్పుడు వెళ్లిపోవాలీ? ఆ గేట్లెప్పుడు లేవాలీ? సత్యానందం గాడు ఎప్పుడు రావాలీ? ఈ ఆటో ఎప్పుడు కదలాలీ? వీన్ని అనవసరంగా పంపినట్టయింది. ఇంకా వీడొచ్చేదాకా ఆ ఆటోలోనే చావాలి. ఆవుసు! ఆటోలో కళ్ళుమూయడమేకదా నా జీవిత పరమావధి. కావచ్చు... కానీ కదలని ఆటోలో కూర్చొని దిక్కులేని చావు చావడం మాత్రం కాదు. షీట్! సత్యానందం గాడు వచ్చి చచ్చేదాకా వెయిట్ చేయకతప్పదు... ఉష్..." మని నిట్టూర్చాను. అసహనంగా అన్పించింది. వీడొచ్చేదాకా ఎట్లా టైం పాస్ చేయాలబ్బా అనుకుంటుండగా గుర్తొచ్చింది.

వెంటనే ఆటోలో సీటు వెనుక పెట్టిన ప్లాస్టిక్ కవర్లో చెయ్యి పెట్టి దాంట్లోంచి 'త్రిపుర కథలు' పుస్తకం బయటకు తీసి "భగవంతం కోసం" కథ చదవడం మొదలుపెట్టాను.

------

టపాకాయలు పేలుతోన్న శబ్దం విని 'త్రిపుర కథలు' పుస్తకంలోంచి బయటకొచ్చి తలెత్తి ఆటోలోంచి బయటకు చూసాను.

హిమసాగర్ ఎక్స్ ప్రెస్ వెళ్లిపోయిన సందర్భంగా రైల్వే క్రాసింగ్ దగ్గర ఏదో ఉత్సవంలా జరుగుతోంది.

కొంతమంది స్వీట్లు పంచుతున్నారు.

కొంతమంది రంగులు పూసుకుంటున్నారు.

కొంతమంది నృత్యం చేస్తున్నారు.

ఒకచోట పష్టిపూర్తి కార్యక్రమం జరుగుతోంది. రిటైరైన సందర్భంలో ఎవరికో సన్మానం జరుగుతోంది ఆ పక్కనే...

అంతా సందడి చిందడిగా ఉంది.

ఒకరినొకరు ఆలింగనం చేసుకొని అభినందనలు చెప్పుకుంటున్నారు. ఒక రైలు గేటు దాటిపోయాక ఇంతగా ఆనందిస్తారా జనం అని ఆశ్చర్యపోతూ హాలులో సీరాక్ వైపు చూసాను.

అక్కడ సీరాక్ లేదు. అది ఉండేచోట వెయ్యి అంతస్థుల బహుళజాతి సంస్థ భవనమొకటి కన్పిస్తోంది. అంతస్థులు తక్కువైనా దాని చుట్టుపక్కలా అలాంటి భవంతులే కోకొల్లలుగా నిలబడి ఆకాశాన్ని చూస్తున్నాయి. నేనున్నది హైదరాబాద్ లోనా న్యూయార్క్ నగరవీధిలోనా అన్న అనుమానం కలిగింది.

ఆ వెయ్యి అంతస్థుల భవనం కట్టడానికి కనీసం యాభై సంవత్సరాల కాలమైనా పట్టి ఉంటుంది. అంత అత్యద్భుతంగా ఉందా నిర్మాణం.

యాభై సంవత్సరాలు...!

అంటే ఇప్పుడు నా వయస్సు ఎంతయి ఉంటుంది? చేతిలోని పుస్తకం జారి కిందపడింది. ముచ్చెమటలు పోసాయి ఒక్కసారిగా. నా శరీరం వైపు చూసుకున్నాను.

దేహమంతా గాలి తీసిన బెలూన్లా అయిపోయింది.

ముడుతలు పడ్డ చర్మమూ, చర్మాన్ని చీల్చుకువస్తున్న నరాలూ... ముసలివాసన. బహుశా నాకిప్పుడు ఎనభై అయిదు సంవత్సరాలు ఉండొచ్చు. ఒక పొడవాటి ప్రయాణాన్ని కూడా అనుభవించకుండానే వృద్ధాప్యం ఆటోలోకి ప్రవేశించి నన్ను కౌగలించుకుంది. అయిపోయింది. జీవితం... ఇక మిగిలిందాల్ల చివరి రోజులు...

అవును వాడేడి..? ఏడీవాడు..? నందం... ఆనందం... సత్యానందం... వాడు ఇంకారాలేదేం...? హిమసాగర్ వెళ్లిపోయిందిగా?

రావాలన్న కోరిక చచ్చిపోయుంటుందా? అవున్లే ఎలా వొస్తాడూ...? వాడికి కనీసం తొంభై అయిదేళ్లయినా వచ్చుండాలి ఇప్పటిదాకా బతికుంటే... బతికే ఉండొచ్చా? ఉన్నా రాకపోవచ్చా...?

వయసులో వాడికన్నా నేనే చిన్నవాడిని కాబట్టి నేనే వాడి దగ్గరికి వెళ్లడం సబబనిపించింది.

ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని ఆటోలోంచి దిగ బోతుండగా నా ఒళ్లో ఉన్న 'త్రిపురకథలు' పుస్తకం కింద పడింది.

భగవంతుడు ఎప్పటికీ రాడు. గోడోలాగ. సచ్చానందం కూడా అంతేనా?

ఆటోలోంచి దిగగానే ఇన్ని సంవత్సరాలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉండడంవల్ల జాయింట్లన్నీ పట్టేసినట్లనిపించింది. ఒళ్లు విరుచుకున్నాను. లేదా విరుచుకున్నట్లు భ్రమించాను. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రైలుపట్టాల్ని దాటి ఎదురుగా వస్తున్న ఒకాయన్ని ఆపి అడిగాను. "గోడో ఇల్లు ఎక్కడో చెబుతారా..??"

"గోడోనా..? ఏం చేస్తుంటాడాయన..?"

"యాభై సంవత్సరాల క్రితం ఆటోడ్రైవర్. ఇప్పుడేంటో తెలీదు."

"తెలీదు." అని వెళ్లిపోయాడాయన.

నేను చేసిన పొరపాటేమిటో తెల్సింది. వృద్ధాప్యం వల్ల మతిమరుపుకూడా వచ్చేసింది అనుకొని - ఈసారి ఆటో ఆయన్ని ఆపి అడిగాను.

భగవంతం ఇల్లెక్కడో కాస్త చెబుతారా?"

'తెలీద'ని వెళ్లిపోయాడాయన. మళ్లీ నేను చేసిన తప్పేమిటో తెల్సింది.

ఈసారి ఇంకో పెద్దమనిషిని ఆపి అడిగాను.

"సార్ ఇక్కడ సత్యానందం ఇల్లెక్కడ?" తెలీదన్నాడు. ఆయన కూడా.

మళ్లీ నేను చేసిన తప్పు తెల్సింది. నన్ను నేను తిట్టుకున్నాను.

ఈ సారి ఓ పాన్ షాప్ ని సమీపించి అందులో కూర్చున్న యువకుడిని ఒళ్లు దగ్గర పెట్టుకొని అడిగాను. "బాబూ... గోడో... ఉరఫ్ భగవంతం ఊరఫ్ సత్యానందం అనబడిన యాద్గిరి ఇల్లెక్కడ?

ఏ యాద్గిరి... బోల్డంతమంది యాద్గిరులున్నారీ ఏరియాలో..." అన్నాడా యువకుడు. చెప్పడం కన్నా చూపించడం బెటరనుకొని రైలుపట్టాల అవతల రాజ్ భవన్ కెదురుగా పెంటకుప్పల్లో తుప్పుపట్టిపోయున్న నేను దిగొచ్చిన ఆటో చూపించి "ఆ ఆటోడ్రైవర్ యాద్గిరి..." అన్నాను.

పరిశీలనగా ఆ ఆటోని షాప్ లోంచే చూసి అన్నాడా యువకుడు.

"ఓ ఆ యాద్గిరా? వాడు నిన్ననే సచ్చిపోయాడుగా" నెత్తి మీద బాంబు పడ్డట్లనిపించింది. "యాద్గిరి చనిపోయాడా? నిన్ననే..." పాడుబడ్డ బావిలోంచి వచ్చినట్లుగా ఉన్నాయి నా మాటలు.

"అవును. హిమసాగర్ ఎక్స్ ప్రెస్ ఆఫ్ వెల్లకముందు వాడు ఆ ఆటోని ఆపి ఇంటికొచ్చాడు. వాడికి అదృష్టం ఎలా పట్టిందో తెలియదు కానీ ఎక్కడ్నుంచి వచ్చాయో  లక్షలు... లక్షలు... పెంకుటిల్లు అమ్మేసి అపార్ట్ మెంట్ కొనుక్కున్నాడు. రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఓ కారు కొన్నాడు. అయితే ఈ హిమసాగర్ రైలు వల్ల పట్టాలు దాటి ఎప్పుడూ అవతలకి పోలేదు. ఇక్కడిక్కడే కార్లో తిరుగుతూ కొత్త పెళ్లాంతో భలే ఎంజాయ్ చేసేటోడు. ఈ బస్తీలో ఎవ్వరూ వాడు బతికినంత హాయిగా బతకలేదు సాబ్... మమ్మల్నందరినీ వెక్కిరిస్తూ యాద్గిరి ఎప్పుడూ ఒకమాట అంటూ ఉండేవాడు.

"పైసలు సంపాదించడం గొప్పకాదురా?? ఆ పైసల్ని ఆనందంలోకి మార్చుకోవడం గొప్ప" అని. పాపం..! నిన్నటిదాకా బాగానే ఉన్నాడు. ఏమైందో తెలీదు. నిన్న సాయంత్రం ఈ పక్క బార్ లోంచి బయటకొచ్చినపుడు నా షాఫ్ లో పాన్ కూడా కట్టించుకుని వెళ్లాడు. తెల్లారి తెల్సింది. రాత్రి ప్రాణం పోయిందని. చాలా చిన్న వయసులోనే పోయాడు పాపం."

"చిన్న వయసా..? చనిపోయేనాటికి యాద్గిరి వయస్సెంతుంటుంది?" ఆశ్చర్యంగా అడిగాను.

"నలభై ఏళ్లు ఉండొచ్చు..." చెప్పాడు పాన్ షాఫ్ యువకుడు. ఈసారి నెత్తిమీద పిడిగుపడింది.

"యాద్గిరి వయసు నలభైఏంటీ..? నా వయసు ఎనభై అయిదేళ్ళెంటీ? అంటే నా మీదా; నాలాంటి  వాళ్లమీద తప్పా యాద్గిరిలాంటి వాళ్లమీద కాలప్రభావాన్ని పడనివ్వలేదా హిమసాగర్ ఎక్స్ ప్రెస్...? ఎంతపని చేసావ్ దొంగముండా.."

"యాద్గిరి ఇంటికెళ్తారా? ఈ పక్కసందు చివర్లోనే వాళ్ళిల్లు బాడీని ఇంకా తీసేసినట్లు లేదు." అన్నాడు పాన్ షాప్ యువకుడు.

"దొంగ... కొడుకు. వాన్నేంటయ్యా చూసేది? నా ఆస్తి పాస్తులన్నీ అమ్ముకున్న సొమ్ముని ఎన్ క్యాష్ చేసుకొని చచ్చేదాకా నా పైసల్తో కులికిన నా కొడుకు. వాడింటికేంటయ్యా వెళ్లేది?" కోపంతో నేలను తన్నాను కాలితో.

నీరసం ఆవహించింది మనసుకూ... శరీరానికీ... నిస్సత్తువగా పాన్ షాఫ్ దగ్గర్నుండి కదిలాను. ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాలేదు. ఎక్కడికి వెళ్తే బాగుంటుందో తెలియదు. ఎక్కడికి వెళ్లకపోతే బాగుంటుందో తెలియదు. మిట్ట మధ్యాహ్నకావడంతో ఎండ తీవ్రమవుతోంది. తల తిరిగినట్లనిపించింది. ఎక్కడైనా కాసేపు కూర్చుంటే బాగుండుననిపించింది. కానీ ఎక్కడా నీడ కన్పించలేదు. నా నీడ కన్పించింది పక్కనే. అయితే సేదతీరడానికి ఆ నీడ సరిపోదు. కొంచెం దూరంలో రైలు పట్టాలకవతల చెత్తకుప్పల మధ్య యాద్గిరి తుప్పు అటో కన్పించింది. తొందరగా వెళ్లి అందులో కూర్చొని కాసేపు సేద తీరాలి అనుకుంటూ కాళ్లను ఈడ్చసాగాను. రైలు పట్టాల్ని సమీపిస్తున్నాయి కాళ్ళు. హఠాత్తుగా నా ముఖం మీద శబ్దం గాలి లేదా గాలి శబ్దమొకటి రివ్వున వీచినట్లనిపించింది. హిమసాగర్ ఎక్స్ ప్రెస్ డౌన్ వెంట్రుకవాసి తేడాలో నాముందు నుండి దూసుకెళ్లసాగింది.

"షీట్... ఒక్క నాలుగడుగులు వేగంగా వేస్తే ఈ పట్టాల్ని దాటి అవతలికి పోయి ఆటోలో పడేవాన్ని. ఇప్పుడీ హిమసాగర్ వచ్చి మళ్లీ అడ్డం పడింది దీని చివరి డబ్బా వెళ్లిపోవడానికి మళ్లీ యాభై సంవత్సరాలు వెయిట్ చేయాలి" అనుకొని అసహనంగా ఉన్నచోటే కూలబడిపోయాను.

పిట్టగూడులా చిందరవందరగా చెదిరిపోయిన నా తలవెంట్రుకల కింద ముడుతలు పడ్డ సన్నని మెడతో కూడిన నన్ను వెనుకనుండి చూస్తూ ఎవరో జాలి పడ్తున్నట్లనిపించింది.

***

 

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు