Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Nala Damayanthi

ఈ సంచికలో >> సినిమా >>

హాలీవుడ్ సినిమాల్ని స్ఫూర్తి తీసుకోవ‌డం త‌ప్పు కాదు! - మురుగ‌దాస్‌

Interview with Murugadoss

కాపీ కొట్ట‌డానికీ, స్ఫూర్తిగా తీసుకోవ‌డానికి చాలా తేడా ఉంది. ఉన్న‌ది ఉన్న‌ట్టు కాపీ పేస్ట్ చేయ‌డానికి కంప్యూట‌ర్లు, జిరాక్స్ మిష‌న్లు చాలు. కానీ స్ఫూర్తి పొంది.. మాతృక‌ను మైమ‌ర‌పించేలా తీయ‌డంలోనే నేర్ప‌రి త‌నం ఉంది. మురుగ‌దాస్ గ‌జిని చూసి `ఇలాంటిదే హాలీవుడ్‌లోనూ ఓ సినిమా వ‌చ్చింది` అన్న‌వాళ్లూ ఉన్నారు. కానీ... వాళ్లు సైతం మురుగ‌దాస్ టేకింగ్ స్టైల్ చూసి క్లాప్స్ కొట్టారు. సెవెన్త్ సెన్స్‌, తుపాకీ సినిమాల‌కూ ఎక్క‌డి నుంచో స్ఫూర్తి పొందే ఉంటాడు. కానీ - అక్క‌డ కూడా త‌న‌దైన మార్క్ చూపించుకోగ‌లిగాడు. తుపాకీ ఇంట్రవెల్ బ్యాంగ్ చూసి - విమ‌ర్శ‌కులు సైతం వారెవ్వా మురుగా... అన్నారు. అదీ.. అత‌ని కెపాసిటీ. ఇదే గ‌జిని క‌థ‌ని బాలీవుడ్‌లో అమీర్ స్టైల్‌కీ, స్థాయికి త‌గ్గ‌ట్టుగా మ‌ల‌చి వంద కోట్ల సినిమాగా చేశాడు. ఇప్పుడు తుపాకీని కూడా అక్క‌డ రీమేక్ చేస్తున్నాడు. మ‌రోవైపు నిర్మాత‌గా కొత్త ద‌ర్శ‌కుల్ని ప్రొత్స‌హిస్తున్నాడు. మురుగదాస్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన రాజా రాణి ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ విచ్చేసిన మురుగ‌దాస్‌తో ప్ర‌త్యేక ముఖాముఖి ఇది..

* ఈమ‌ధ్య నిర్మాత‌గా బిజీ అయిన‌ట్టున్నారు...
- అవునండీ. నిర్మాత‌గా ఇది నా మూడో సినిమా. సినిమాలపై ఫ్యాష‌న్‌తోనే... ఇలా నిర్మాత‌న‌య్యా. సినిమాలు త‌ప్ప మ‌రోటి తెలీదు. ఏం చేసినా ఇక్క‌డే క‌దా..?

* ద‌ర్శ‌కుడిగా మాత్రం మ‌రో నిర్మాత చేత కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టిస్తారు... కానీ మీరు మాత్రం చిన్న సినిమాలే తీస్తారెందుక‌ని..?
- (నవ్వుతూ) కొత్త నిర్మాత‌ను క‌దండీ. అందుకు. అయినా ఇక్క‌డ మీకో విష‌యం చెప్పాలి. చిన్న సినిమాల్లోనే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే... ద‌ర్శ‌కుడు కొత్త‌వాడు. స్టార్ల‌తో పెట్టి సినిమాలు తీయ‌లేం. ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌లేం. మొద‌టి నాలుగు రోజుల్లోనే పెట్టుబ‌డి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉండ‌దు. కేవ‌లం క‌థ‌ను న‌మ్మి సినిమా తీయాలంతే. దానికి కూడా గ‌ట్స్ కావాలి.

* ఇంత‌కీ రాజా రాణి ఎలాంటి సినిమా?
- త‌మిళంలో ఇప్ప‌టికే ప్రూవ్ అయిన సినిమా. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ఉన్నాయి. ఫ్యామిలీ అంతా చూడ‌ద‌గిన సినిమా ఇది.

* త‌మిళంలో విడుద‌ల‌య్యి చాలాకాలం అయ్యింది. ఇంత లేటుగా తెలుగులోకి తీసుకొచ్చారెందుకు?
- ఈ చిత్రానికి నేనొక్క‌డినే నిర్మాత‌ను కాదు. నాతో పాటు రెండు సంస్థ‌లున్నాయి. వాళ్ల ఆలోచ‌న‌లూ కుద‌రాలి క‌దా?

* డ‌బ్బింగ్‌కాకుండా రీమేక్ చేస్తే మ‌రింత ఫ‌లితం ఉండేదేమో..?
- కొన్ని సినిమాల మ్యాజిక్ రీమేక్‌తో ర‌ప్పించ‌లేం. అందుకే డ‌బ్బింగ్ చేయాల‌ని డిసైడ్ అయ్యాం. న‌య‌న‌తార‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆర్య కూడా అంద‌రికీ ప‌రిచ‌యం ఉన్న న‌టుడే. నాకూ... ఇక్క‌డ కాస్తో కూస్తో గుర్తింపు ఉంది. అందుకే రీమేక్ చేయ‌లేదు.

* స్టాలిన్ త‌ర‌వాత తెలుగులో సినిమాలేం చేయ‌లేదు. ఎందుకు..?
- నాకూ చేయాల‌నే ఉంది. కానీ కుద‌ర‌డం లేదు. సినిమా సినిమాకీ టైం తీసుకొంటుంటా. అది నా త‌ప్పు కాదు. క‌థ కుద‌రాలి. క‌థ‌కు త‌గిన హీరో దొర‌కాలి. హీరోయిన్ల డేట్లు కావాలి. ఇన్ని త‌తంగాలుంటాయి. అందుకే త‌క్కువ సినిమాలు చేయ‌గ‌లిగా. ఈసారి మాత్రం తెలుగు సినిమాల‌పై సీరియ‌స్‌గా దృష్టి పెట్టా. మ‌హేష్ బాబు, రామ్‌చ‌ర‌ణ్‌ల‌కు త్వ‌ర‌లోనే క‌థ‌లు వినిపిస్తా.

* స్టాలిన్ నిరాశ ప‌రిచింది. మీ క‌థ‌కు చిరంజీవి ఇమేజ్ ఏమైనా అడ్డొచ్చింద‌నుకొన్నారా?
- అలాంటిదేం లేదు. క‌థ అనుకొన్న త‌ర‌వాత పెద్ద‌గా మార్పులేం చేయ‌లేదు. చాలా చిన్న చిన్న‌వే. అందువ‌ల్లే సినిమా ఆడ‌లేద‌ని అన‌ను. చాలా కార‌ణాలుంటాయి క‌దా..?

* సెవెన్త్ సెన్స్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఫ‌లితం ద‌క్క‌లేదు. ఆ సినిమా ప‌రాజ‌యానికి కార‌ణం ఏమిటి?
- ప్ర‌తి సినిమాకీ ఒకేలా క‌ష్ట‌ప‌డ‌తాం. కొన్ని వ‌ర్క‌వుట్ అవుతాయి, ఇంకొన్ని అవ్వ‌వు. అయితే ఈ సినిమాకి క్రిటిక‌ల్ అప్లాజ్ చాలా వ‌చ్చింది. అందుకే కొంత వ‌ర‌కూ హ్యాపీ.

* మొన్న గ‌జిని, ఈరోజు తుపాకీ... ద‌క్షిణాది క‌థ‌ల‌నే ఎందుకు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు?  అక్క‌డి హీరోల కోసం కొత్త క‌థ‌లు రాసుకోవ‌చ్చు క‌దా?
- నిజానికి తుపాకీ అక్ష‌య్‌కుమార్ కోసం రాసుకొన్న క‌థే. అక్క‌డ ఆయ‌న‌కు ఖాళీ లేక‌పోవ‌డంతో ముందు... విజయ్‌తో తీసేశాం. ఇప్పుడు అక్ష‌య్‌తో తెర‌కెక్కిస్తున్నా. నాకూ కొత్త క‌థ‌లు రాసుకోవాల‌ని ఉంటుంది. రీమేక్ చేయ‌డం వ‌ల్ల మ్యాజిక్ ప్ర‌తీసారి పున‌రావృతం చేయ‌లేం.

* హిందీ తుపాకీ కోసం మార్పులేమైనా చేశారా?
- చిన్న చిన్న‌వే. చెప్పుకోద‌గిన గొప్ప మార్పులేం లేవు.

* తుపాకీలో  ఇంట్రవెల్ బ్యాంగ్ గురించి ఇప్ప‌టికీ మాట్లాడుకొంటారు. ఇంత‌కీ ఆ ఆలోచ‌న ఎవ‌రిది?
- నాదే. కానీ ఇంట్రవెల్ బ్యాంగ్ అది అనుకోలేదు. వేరే.. కామెడీగా ఓ ఇంట్ర‌వెల్ బ్యాంగ్ పెట్టాం. కానీ ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర మారిపోయింది. ఎడిట‌ర్ సినిమాని వేరేలా క‌ట్ చేసి, ఇంట్రవెల్ బ్యాంగ్ వేశారు. అందుకే ఈ ఘ‌న‌తంతా ఆయ‌న‌దే.

* హాలీవుడ్ సినిమాలు మీకెంత వ‌ర‌కూ స్ఫూర్తి నిచ్చాయి?
- నిజంగానే అక్క‌డి సినిమాలంటే చాలా ఇష్టం. అయితే అవ‌న్నీ స్ఫూర్తిగా మాత్ర‌మే ప‌నికొస్తాయి. ఓ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని క‌థ రాసుకోవ‌డం త‌ప్పు కాదు. సినిమా అంతా కాక‌పోయినా ఒక్కో షాట్ చూస్తే.. అరె - మ‌న సినిమాలో ఇలాంటిది పెడితే బాగుంటుందే అనిపిస్తుంది. ఒక్కోసారి తెలియ‌కుండానే దాన్ని మ‌నం ఫాలో అయిపోతుంటాం.

* ఫ‌లానా త‌ర‌హా సినిమా చేయాల‌ని ఎప్పుడైనా అనిపించిందా?
- హిచ్‌కాచ్ సినిమాల త‌ర‌హాలో మాంచి థ్రిల్ల‌ర్ తీయాల‌ని ఉంది. నా సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెట్టాల‌ని వుంది.

* మ‌రి నిర్మాత‌గా...
- ప్ర‌తిభావంతుల‌ను ప్రోత్స‌హిస్తా. ప్ర‌తిభ ఉండి, అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్న ద‌ర్శ‌కుల‌కు ఓ మార్గం చూపించాల‌న్న‌దే నా ఆశ‌యం.

* ఆల్ ది బెస్ట్‌...
- థ్యాంక్యూ.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Nidrapattaneeyani pattapagalu