Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka!

ఈ సంచికలో >> సినిమా >>

'మూడేళ్ళ పాటు భోజనం ఒక్కపూటే వుండేది' - సాహితి

saahithi interview

ఆయన పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్ర మూర్తి.

ఆత్రేయ దగ్గిర రెండేళ్ళు శిష్యరికం చేశాడు. సాహిత్యం మీద ప్రేమ తో 'సాహితి' అనే పేరు తో రచనలు సాగించాలనుకున్నాడు.

"సాహితి ఏంటయ్యా ... అహుతి లాగ ... ఆహుతి అయిపోతావేమో చూడు ..." అన్నారు ఆత్రేయ

"సాహిత్యం కోసం ఆహుతి అయిపోయినా ఫరవాలేదండీ " అన్నాడీయన సభక్తికంగా ... అంతే ...
చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి జూమ్ అవుట్
సాహితి జూమ్ ఇన్
(ఈ జూమ్ అవుట్ , జూమ్ ఇన్ అనే సినీ పరిభాష ఎందుకంటే ...  సినీ కవిగా ఆయన కొత్త అవతారం ఎత్తారు కనుక).

జూమ్ అవుట్ అయిన  చెరుకుపల్లి శ్రీరామచంద్ర మూర్తికి  మొన్న మే 5 కి  60 ఏళ్ళు పూర్తయ్యాయి. జూమ్ ఇన్ అయిన సాహితి పాటలు రాసిన సినిమాలు దాదాపు 500 పైనే వుంటాయేమో ....

అటు అరవై .... ఇటు అర వెయ్యి...
అటు (షష్టి పూర్తి ) సందర్భం కుదిరింది ...
ఇటు (అరవై - అర వెయ్యి)  సౌండింగ్ అదిరింది ...
ఇంతకన్నా ఇంకేం కావాలి ఇంటర్ వ్యూ కి...
సన్మిత్రుడు,  సహృదయుడు కనుక వెంటనే 'ఓకే' అన్నారాయన ..

"పాటలు రాసిన మొట్టమొదటి సినిమా ఏది ?"
" మనిషి-మృగం ... నృత్య దర్శకుడు కే.యస్. రెడ్డి దర్శకుడు. నరసింహ రాజు, కవిత హీరో హీరోయిన్లు. పులిని, మనిషిని కంపేర్ చేస్తూ రాసిన పాట అది. సత్యం సంగీత దర్శకుడు. ఆ సినిమా రిలీజ్ కాలేదు. అంచేత మొదటి సినిమాగా చెప్పుకోలేను"

"మరి ఏ సినిమాని చెప్పుకోవాలి ?"
"కిలాడి కృష్ణుడు ... అది విజయశాంతి కి కూడా మొదటి సినిమా. "

"లాలూ దర్వాజా పాటకి ఈ సినిమా తో ఏర్పడిన పరిచయమే కారణమా ?"
"దానికి వేరే స్టోరీ వుంది. ఈ 'కిలాడి కృష్ణుడు' లో హీరో కృష్ణ మారు వేషం లో (కాటికాపరి వేషం)వచ్చి చెల్లెల్ని ఓదారుస్తూ 'ఏడవకు చిన్నమ్మా'  అంటూ పాడే పాట రాశాను. రమేష్ నాయుడు సంగీతం - బాలూ గానం"

"తర్వాత హిట్ ? "
"జమదగ్నిలో 'ఇది స్వాతి జల్లు - ఒణికింది ఒళ్ళు' పాట. ఇళయరాజా మ్యూజిక్. ఇందులో కూడా కృష్ణ గారే హీరో"

"అప్పట్లో మీ పాట 'ప్రేమ బృందావనం'  ...  జనాలు తెగ పాడుకునేవారు కదా?"
" కరెక్టే ... తీరా సినిమాలో ఆ పాట లేకపోయే సరికి చాలా డిసప్పాయింటయ్యారు కూడా "
" ఎంచేత సినిమాలో లేదు"
"రికార్డ్ చేశారు కానీ చిత్రీకరించలేదు ... అంచేత సినిమాలో లేదు"

(భారతీ రాజా తీసిన 'పుదియ వార్పుగళ్' అనే తమిళ సినిమా ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్టు. అందులో ఇళయరాజా చేసిన పాటలు ఇప్పటికీ హిట్టు. వాటిలో మలేషియా వాసుదేవన్, ఎస్.జానకి పాడిన 'వాన్ మేఘంగళే' మరీ మరీ  హిట్టు. 'బంగారు కానుక' సినిమాకి ఇళయరాజా చేత మ్యూజిక్ చేయించుకుందామని ఈ పాట ట్రాక్ కొనుక్కున్నారు కూడా. ఆ ట్యూన్ కే సాహితి రాసిన 'ప్రేమ బృందావనం' పాటని సుశీల, జి.ఆనంద్ పాడేరు. ట్రాక్ మిక్సింగే కనుక ఇళయరాజా రాలేదు. ఆయన అసిస్టెంట్లు వచ్చి చేశారు.

'బంగారు కానుక' సినిమాగా కార్యరూపం దాల్చే సరికి ఈక్వేషన్లు మారిపోయాయి. సత్యం సంగీత దర్శకుడు గా ఫిక్స్ అయ్యారు. ఆయన ఈ సినిమాకి సెపరేట్ గా ట్యూన్లు చేసుకున్నారు. ఈ  'ప్రేమ బృందావనం' పాటని పక్కన పడేశారు. గానీ అప్పటికే ఈ పాట పాప్యులర్ అయిపోయింది. ఎలాగూ 'బంగారు కానుక' సినిమాకి సత్యం పేరు మ్యూజిక్ డైరెక్టర్ గా బైటికొచ్చేసింది కనుక ఈ పాట కూడా సత్యం పేరు మీదే చలామణి అయిపోయింది. నిజానికి ఈ పాటకీ సత్యానికి ఏ సంబంధమూ లేదు.  

ఇప్పటికీ నెట్ లలో ఆడియో రూపం లో  ఈ పాట దొరుకుతుంది -  సంగీత దర్శకుడిగా సత్యం పేరుతో. తర్వాత కొన్నాళ్ళకి 'పుదియ వార్పుగళ్' సినిమాని  భారతీ రాజా  'కొత్త జీవితాలు' సినిమాగా రీమేక్ చేసినప్పుడు 'వాన్ మేఘంగళే' పాట ప్లేస్ లో వున్న 'పొంగి పొరలే' పాటకి మరో కొత్త ట్యూన్ చేసుకున్నారు ఇళయరాజా. 'వాన్ మేఘంగళే' , 'పొంగి పొరలే ' పాటలు యూ ట్యూబ్ లో దొరుకుతాయి చూడొచ్చు. 'ప్రేమ బృందావనం' పాట నెట్ లో దొరుకుతుంది. వినొచ్చు.)

" రియల్ బ్రేక్ 'చంటి' సినిమా తోనే వచ్చింది కదా ? "
" ఓ విధంగా అంతే "

" అంతవరకూ ఎలా గడిచేది ?"
"ట్యూషన్ లు చెప్పేవాడిని. ఇది1978 నుంచి 1985 వరకూ సాగింది. మధ్యలో డివోషనల్ ఆల్బమ్స్ కి రాసేవాడిని. దాదాపు 100 డివోషనల్ ఆల్బమ్స్ వుండి వుంటాయి. డబ్బింగ్ ఫిల్మ్ లకి రాసేవాడిని. ఎమ్మెస్సీ బోటనీ నా సబ్జెక్ట్ గనుక టుటోరియల్ కాలేజీల్లో పార్ట్ టైమ్ లెక్చరర్ గా కూడా పని చేసేవాణ్ణి. చెబితే నమ్మరు గాని కొన్ని స్క్రిప్ట్ లు ఫెయిర్ చేసి పేజీకి ఇంత అని తీసుకునే వాణ్ణి. మహానుభావుడు రాళ్ళపల్లి గారు రకరకాల నాటకాల స్క్రిప్ట్ లు పట్టుకొచ్చి నా చేత ఆ పని చేయించి డబ్బులిచ్చేవాడు. ఇలా వుంటుండగానే 'చంటి' లో రెండు పాటలు రాసే అవకాశం.... 'అన్నుల మిన్న' , 'జాబిలికీ వెన్నెలకీ'...  వీటితో కాస్త నిలదొక్కుకున్నాను"

"లాలూ దర్వాజ పాటకేదో స్టోరీ వుందన్నారు ?"
"ప్రయివేట్ ఆల్బమ్స్ కి రాసే రోజుల్లోనే  'చిక్ పక్ చిక్ బమ్ ' అనే ఆల్బమ్ కి రాసే అవకాశం వచ్చింది. రాజ్-కోటి మ్యూజిక్. తెలంగాణ శ్లాంగ్ మీద , రకరకాల మాండలికాల మీద నాకున్న పట్టు అప్పుడు అక్కరకొచ్చింది. ఆ ' చిక్ పక్ చిక్ బమ్ ' లో 'మాల్గాడి ఎక్కి గోలుకొండ చూడ వచ్చినా' పాట బంపర్ హిట్ అయి కూచుంది. ఆ పాట పాడిన శుభ 'మాల్గాడి శుభ' అయిపోయింది. ఆ అల్బమ్ 16 లక్షల క్యాసెట్లు అమ్ముడు పోయింది.  ఆ పాట విన్న విజయశాంతి 'ఇలాంటి పాట మన సినిమాలో వుండాలి.. ఆ రైటర్ ని పిలిపించి రాయించండి ' అని  అడగడం తో నాక్కబురు పెట్టారు. 'మొండి మొగుడు-పెంకి పెళ్ళాం' లో ఆవిడది తెలంగాణ శ్లాంగ్ లో మాట్లాడే పాత్ర.   అలా ఆవిడ పట్టుబట్టడం తో ఆ పాట రాయగలిగాను."

"దీనికి సంబంధించి ఇంకా మరికొంత కథ వుంది .... అది కూడా చెబితే బావుంటుంది"
"ఓహ్ ... అదా ... లాలూ దర్వాజ పాట పల్లవి ట్యూన్ నాదే ...చరణాల ట్యూన్ కీరవాణి గారు చేశారు.
 అంతర్గత సంస్కారం , ఆత్మ విమర్శ  పుష్కలంగా వున్న వ్యక్తి ఆయన . నిరంతర నిత్య సత్యాన్వేషి అయినవాడే ఆత్మవిమర్శ ఆదర్శవంతంగా చేసుకోగలడు. ఈ విషయాన్ని చాలా ప్రాధమిక దశలోనే గ్రహించిన వ్యక్తి - కీరవాణి గారు.  అందుకే ఆ పాట పల్లవి ట్యూన్ ని నేనే ఇచ్చానన్న సంగతిని ఆయన ఎటువంటి భేషజం లేకుండా ఎన్నోసార్లు ఎంతో మంది దగ్గిర చెప్పారు కూడా...

తర్వాత్తర్వాత తెలంగాణ శ్లాంగ్ పాటలు, ఫోక్ బేస్డ్ సాంగ్స్ ఎక్కువగా వచ్చేవి. అలా పూరి జగన్నాథ్, రవితేజ కాంబినేషన్ లో వచ్చే సినిమాలకు రాయడం జరిగింది - పిల్లో పిసినారి పిల్లో (ఇట్లు శ్రావణి-సుబ్రహ్మణ్యం), లంచ్ కొస్తావా మంచ్ కొస్తావా (అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి) లాంటివి. ఆ తర్వాత 'వెంకీ' సినిమాలో పాటలకి సింగిల్ కార్డ్ . అప్పుడే దేవిశ్రీ ప్రసాద్ తో పరిచయం. అక్కణ్ణించి దాదాపు దేవిశ్రీ సినిమాలన్నిటిలోనూ రాశాను - నిన్న  మొన్నటి 'గబ్బర్ సింగ్' లో 'కెవ్వు కేక' దాకా ... 'కెవ్వు కేక' ఎంత రేంజ్  కి వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు. (దానిక్కారణం నేను మాత్రమే కాదని నాకు తెలుసు) ఇప్పుడు తమన్ సినిమాలక్కూడా రాస్తున్నాను .. లేటెస్ట్ - గ్రీకు వీరుడు. దేవిశ్రీ ద్వారా పెద్ద హీరోలందరికీ రాసే అవకాశం వచ్చింది. అతను నన్నెంత బాగా చూసుకున్నాడో నేను మర్చిపోలేను. "

" ఓ పాట కి వెర్షన్లు రాస్తారు ? చిన్న హీరో పాటలకెన్ని వెర్షన్లు ? పెద్ద హీరో పాటలకెన్ని వెర్షన్లు ? "
" చాలా మంచి ప్రశ్న అడిగారు. పరిశ్రమకు వచ్చి 35 ఏళ్ళు అవుతోంది. ఇందులో చిన్న హీరోలకు 20 సంవత్సరాలు, పెద్ద హీరోలకు 15 సంవత్సరాలు పాటు రాశాను. ఎవరికి రాసినా - నేను రాసిన ప్రతి పాటా నా బిడ్డ. మన బిడ్డని పెద్దింట్లోకిచ్చినా, చిన్నింట్లోకిచ్చినా  - పెంపకంలో లోపం రానీయం కదా !? ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాం అనే పాయింట్ కన్నా అది బైటికి మన పేరుతో వెళుతోంది అనే పాయింటే ముఖ్యం నాకు. అంచేత తృప్తి కలిగే వరకూ ఎన్ని వెర్షన్లు రాయాల్సి వస్తుందో అన్నీ రాయాల్సిందే"

" బిడ్డల ప్రసక్తి వచ్చింది కనుక అడుగుతున్నాను ... ఇలా అడగడానికో కారణం వుంది ... మీ బిడ్డల పెంపకం విషయం లో మీరెలా వుంటారు ?"
" కచ్ఛప కిశోర న్యాయం గురించి విన్నారా ఎప్పుడైనా ... "
" మీరే స్వయంగా చెప్తే -  నేను వివరించిన దానికన్నా - ఇంకా గాఢంగా హత్తుకుంటుంది"
"తాబేలు పిల్లల్ని పెట్టాక స్వేచ్చగా వదిలేస్తుంది. అవి తీరం దాటుకుంటూ వెళ్ళిపోయాయా
లేక నీట్లో మరీ లోతుగా మునిగిపోతున్నాయా అని గమనిస్తూ వుంటుంది. అవి ఆపదకి దగ్గరగా వెళుతున్నాయి అని అనిపించినప్పుడు గబుక్కని వెళ్ళి కాపాడుకుంటుంది. నాదీ అదే పద్దతి"

" ఇప్పటి జనరేషన్ చెడిపోతోంది, మా టైమ్ లోనే బావుంది లాంటి కంప్లెయింట్స్ మీకు లేవా ?"
"మొత్తం ఇదంతా ఆ పై వాడి సృష్టి . వాడికి తెలీదూ వాడి సృష్టిని వాడెలా నడుపుకోవాలో ...!? మనం ఏడ్చేమని మార్చేస్తాడా ... ఆనందించాం అని అలాగే వుంచేస్తాడా ... ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో వాడికి  బాగా  తెలుసు "

" మీలో ఎంతో ఆధ్యాత్మికత వుందని తెలుసు.  అది పాఠకులకి తెలియడానికే ప్రశ్నల దారి మళ్ళించాను. లేకపోతే   'కెవ్వు కేక' లాంటి పాటలు రాసిన సాహితి గారిలో ఈ రకమైన ఆలోచనా ధోరణి వుంటుందా ఆశ్చర్యపోతారు ఇది చదివిన వాళ్ళు"

"మలయాళీ స్వామి పేరు వినే వుంటారు మీరు ... పూర్వ జన్మలో ఆయన ఆంధ్రుడు... ఈ జన్మలో మళ్ళీ ఆంధ్రదేశం వచ్చి రాసిన 'శుష్క వేదాంత తమో భాస్కరము' చదవండి. జీవితానికి సంబంధించి ఓ అవగాహన వచ్చేస్తుంది. మద్రాసు లో అవస్తలు పడుతున్నప్పుడు ఒక్క పూటే భోజనం వుండేది. అలా ఒంటి పూటే తింటూ మూడేళ్ళ పాటు 'మిస్టిసిజం' చదివాను. నా జీవితానికి సంబంధించి కూడా నాకు అవగాహన వుంది. నేను ఇంకో 16 ఏళ్ళు బ్రతుకుతాను. అంటే నా లైఫ్ 76 ఏళ్ళేనన్న మాట. "

" మీరిలా అనడం అందరికీ బాధగానే వుంటుంది. వేరే మాట్లాడుకుందాం ...

మీరు మాటలు కూడా రాయడం మొదలు పెట్టింది 'మల్లన్న' సినిమాతోనే కదూ ?"
" మల్లన్న కి మాటలు పాటలు నేనే"

"అలా రాసిన సినిమాలు ? "
" జర్నీ, పిజ్జా, సింహం పులి, ఇవి కాక రిలీజ్ అవాల్సిన వాటిలో గ్రాఫిక్స్ , ఆల్ ఈజ్ వెల్, రగులుతున్న రాష్ట్రం వున్నాయి"

"మీరు పాటలు రాసిన సినిమాలు 500 వుంటే , రాసిన పాటలు ఎన్ని వుండొచ్చు?"
" ఇంచుమించు 1200 దాకా"

"ఒక రచయితగా మీరు సంతృప్తిగా ఫీలయిన పాట (లు)?"
"చంటి సినిమాలోని పాటలు, 'అమ్మ లేని పుట్టిల్లు' సినిమాలోని 'చెదిరిన నీ కుంకుమలే' పాట"

"మరి ఒక కమర్షియల్ రైటర్ గా ....?"
"ఇంకేముంటుంది ... కెవ్వు కేకే "

రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam