Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
annamayya pada seva

ఈ సంచికలో >> శీర్షికలు >>

పాకుడు రాళ్ళు : పుస్తక సమీక్ష - సిరాశ్రీ

Book Review - Paakudu Rallu

పుస్తకం: పాకుడు రాళ్ళు

రచన: డా| రావూరి భరద్వాజ

ప్రతులకు: విశాలాంధ్ర

వెల: 290/-

నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతున్న తెలుగు రచయితలను ఒక్క సారిగా తట్టి లెపినట్టయ్యింది ఈ ఏడు. కారణం ఒక తెలుగు రచయితకు జ్ఞానపీఠం దక్కడం. అది కూడా నవలా రచయితకి. పైగా ఒక సినిమా నవలకి..ఎవరా రచయిత అంటే డా| రావూరి భరద్వాజ. ఎమిటా నవల అంటే 'పాకుడు రాళ్లు'.

తెలుగు సాహితీ పిపాస బాగా ఉన్న వారికి తప్ప రావూరి భరద్వాజ ఎవరో తెలియదు. ఎందుకంటే ఆయన విశ్వనాథ సత్యనారాయణ లాగ పండితుడూ కాదు, సి నా రె లాగ వక్తా కాదు..సినిమా రచనలు చెయ్యలేదు. కానీ సినిమా జీవితంపై రాసారు. అదే ఈ పాకుడు రాళ్ళు. దానికే జ్ఞానపీఠం.

ఈ జ్ఞానపీఠం వార్త వినగానే చాలా మంది రసజ్ఞుల్లాగానే నేను కూడా విశాలాంధ్రకి వెళ్ళి పాకుడు రాళ్ళ మీద పడ్డాను. ఎప్పుడో 1965 నాటి నేపథ్యం, 1978 లో తొలి సారి అచ్చైన నవల కదా పాత చింతకాయ వ్యవహారం లా ఉంటుందనుకున్నా.. కాని వర్తమాన సినీ ప్రపంచాన్ని అద్దం పట్టేలా ఉన్నాయి చాలా అంశాలు. అంత ఘంటాపధంగా ఎలా చెబుతున్నానంటే సినీ సమీక్షకుడిగా, గీత రచయితగా సినీ రంగాన్ని చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నాను కనుక..

పాకుడు రాళ్ళు అంటే చాలా చోట్ల ఆంగ్లానువాదం 'క్రాలింగ్ స్టోన్స్ అని రాస్తున్నారు..పాకే రాళ్ళు అనుకుని. కానీ ఇవి అడుగు వేస్తే జారిపడేలా జేసే పాకుడు కట్టిన రాళ్ళు. సినిమా రంగం అలాంటిదే. ఇక్కడ అడుగులు ఎంతో జాగ్రత్తగా వేస్తే తప్ప జారిపడకుండా పయనం సాగదు అనేది ఇతివృత్తం.

ఇది ఒక సామాన్య మహిళ  అయిన మంజరి గొప్ప నటిగా ఎదిగే పరిణామాన్ని, ఆ ఎదుగుదల వల్ల ఎదురొచ్చిన పరిస్థితుల్ని, ఆ పరిస్థితులవలన మారే గతుల్ని,అన్ని రకాల ఉత్థాన పతనాల్ని కళ్ళకు కట్టినట్టు చూపి గుండెకు పట్టుకుంటుంది ఈ నవల.

యాదృచ్చికం ఏమిటంటే ఈ మధ్య వచ్చిన ది డర్టీ పిక్చర్లోని నాయిక జీవనం గమనం ఈ నవాలా నాయిక జీవన గమనం ఇంచుమించు ఒకలాగే సాగడం. ఇంతకు మించి ఇందులోని కథాంశాన్ని నేను చర్చించదల్చుకోలేదు. తెలుగు వాడి కలం వైభవాన్ని దేశానికి చాటి చెప్పే విధంగా జ్ఞానపీఠంతో గౌరవించిన ఈ పాకుడు రాళ్ళను ప్రతి తెలుగు వాడు చదవాలి.

జ్ఞానపీఠం అంటే అందని ద్రాక్ష అని అనుకుంటున్న చాలా మంది నవలా కారులకు, కథకులకు పాకుడు రాళ్ళు నవలకి జ్ఞానపీఠం వచ్చిన ఈ తరుణం ప్రోత్సాహం అవుతుందనిపిస్తోంది. ఛందోబధ్ధ పద్యాలతో సాగే రామాయణ కల్పవృక్షం లాంటి దానికో, గంభీర జ్ఞాన తరంగ సదృశంగా సాగుతూ వచన కవితా రూపంలో ఎగసి పడే విశ్వంభరకో జ్ఞానపీఠం ఇస్తారు కాని మామూలు కథలకి, నవలలకి ఇవ్వరనే అభిప్రాయం నిన్నటి వరకు పెక్కు మందిలో ఉంది. అది నేటితో పోయింది.

మరిన్ని శీర్షికలు
ekashilanagaram-oorugallu-tourism